"భాయియో, బెహనో! మన చార్ సౌ బీచ్ శహర్ ని నాలుగొందలేళ్ళకు ముంగట సిర్ఫ్ నాలుగు లక్షల జనాభా గురించి ప్లాన్ ఇచ్చిన్రు! కాని ఈ దినం మన శహర్ జనాభా ఎంత? నీయవ్వ- యాభై లక్షలు! అయినాగానీ ఆ నాలుగు లక్షల జనాభాకున్న సౌలత్ లోనే యాభైలక్షల మందిగ్గూడ నడిపిస్తున్రు! అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గందుకే రోడ్లమీదకెళ్ళి బహాయిస్తున్నది. నాల్గుదినాలు గట్టిగ ఎండలొస్తే తాగనికి నీళ్ళుండవ్, బోర్ వేల్ నీళ్ళు తాగుదాం అంటే ఇండస్ట్రీల పొల్యూషన్ తోటి ఖరాబయిపోయె! ఇంక రోడ్లు జూస్తే పాకిస్తాన్ మిలటరీ వాండ్లు హైదరాబాద్ మీద దాడిజేస్తే వాండ్ల ఆ రోడ్ల మీదే ఖతమ్ గావాల్నన్నట్లుంటయ్. రోడ్లు మన దుష్మన్ ల కోసం వేసినట్లు వేసిన్రు!"
"శభాష్ బిడ్డ! నడవనీ" తూలిపోతూ అరచాడు జనార్ధన్ మధ్యలో.
అంతా తప్పట్లు- కొంతమంది మినిస్టర్ సాబ్ కేయాల్సిన దండలు తెచ్చి యాదగిరి మెడలో వేశారు. మేమందరం యాదగిరికి మళ్ళీ నచ్చజెప్పి మైక్ నుంచి తప్పించాం.
చైర్మెన్ మాడిపోయిన మొఖంతో మైక్ లో మాట్లాడాడు.
"ఈ కాలనీ కమిటీ వాళ్ళెవరోగాని గిసంటి ఫాల్తూ మాటలు మాటాడేటోళ్ళను నజ్ దిక్ రానీకుండ జూడాలె!"
ఆ మాట అనగానే టమాటోళు ఎగిరివచ్చి స్టేజిమీద పడినయ్.
దాంతో మేము వేదిక ఎక్కక తప్పలేదు.
"సోదర సోదరీమణులారా! అతిథుల మీదకు టమాటోలు, కోడిగుడ్లు విసిరే సాంప్రదాయం మంచిదికాదని ఈ కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీనయిన శాయిరామ్ అనే నేను అందరికీ సవియనంగా మనవి జేస్తున్నాను.
"అయితే ఆ మినిష్టర్ ని, చైర్మన్ నీ మైక్ దగ్గరకు రానీద్దు" అరచారు వెనుకనుంచి.
"మీ అందరి కోరిక ప్రకారం కార్యక్రమంలో తరువాతి అంశం- మన కాలనీ గేయకవి, రచయిత అయిన చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ గారు తను ప్రత్యేకంగా రాసిన గేయాలు చదువుతారు-
అంతా తప్పట్లు మార్మోగిపోయినయ్ చంద్రకాంత్ మైక్ ముందు కొచ్చాడు.
"అహా నాలుగొందలేళ్ళ నగరం!
ఓహో చార్ సౌబీస్ నగరం!
అటు చూస్తే నాల్గుగంటల ట్రాఫిక్ జామ్
ఇటు చూస్తే ట్రాఫిక్ రూల్స్ లేని
లారీల మధ్య మనం గులాబ్ జామ్.
ఈ డ్రయినేజ్ గోతి వయసు నాలుగొందలేళ్ళు
ఈ కర్ఫ్యూ బ్రతుకు భయం వయసు నాలుగొందలేళ్ళు. రోజంతా కార్పొరేషన్ మురికి రాత్రికి ఫ్యాక్టరీల పొల్యూషన్ ఊపిరి.
నగరం నడిబొడ్డులో మురికి కూపాల 'సాగర్'లు-
నగరం శివార్లలో బందిపోట్ల 'డేగర్'లు -
జనమంతా ఈలలు, కేకలు, తప్పట్లతో ఆనందంగా మొదటి చరణం కలసిపాడారు.
ఆహా నాలుగొందలేళ్ళ నగరం -
ఓహో చార్ సౌబీస్ నగరం -
యాదగిరి హఠాత్తుగా మైక్ ముందుకొచ్చాడు.
"భాయియో, బెహనో, ఈ చార్ సౌ శహర్' ఉత్సవాలు ఎందుకు తీసిన్రో నాకెరుక! మీకెరుకనా?" అడిగాడు.
"తెలుసు- తెలుసు" అరిచారందరూ.
"తెలుస్తే జెప్పండి మళ్ళా!"
"ఈ ఉత్సవాల పేరుతోటి ప్రభుత్వం పైసలు తిననికి" అరచాడొకతను.
"సెంటర్లో కూడా దూరదర్శన్ వాళ్ళు 'నాలుగొందలేళ్ళ హైదరాబాద్ నగరం గురించి ఫిల్మ్ తీయమని లక్షల రూపాయలు ప్రైవేట్ పార్టీలకిచ్చారు. రాష్ట్రంలో లక్షల రూపాయలు ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు లేక మురిగి పోతున్న నగరానికి ఒక్క పైసా కూడా ఎవడూ ఖర్చుచేయటం లేదు- థూ నీయవ్వ" అరచాడు జనార్ధన్.
దాంతో ఇంక భరించలేక మినిష్టరూ, చైర్మనూ లేచి కోపంగా కారువేపు వెళ్ళిపోయారు.
మర్నాడు దూరదర్శన్ లో మా కాలనీ ప్రోగ్రాం చాలా ఘనంగా చూపించారు. ఎటొచ్చీ యాదగిరి, జనార్ధన్, మిగతా కాలనీ వాళ్ళ స్పీచ్ లు మాత్రం లేవు. కేవలం మినిష్టరూ, చైర్మెన్ నాలుగొందలేళ్ళ హైదరాబాద్ గురించి పొగడటం కన్పించింది.
* * * * *