Previous Page Next Page 
నయనతార పేజి 17

 

    "ఆహా, అదేం కుదరండి , రమన్నారండి వస్తే గాని వీలు లేదండి."
    ఆఖరికి ఈ డ్రైవరు గాడికి కూడా లోకువయ్యాడా తను. అంతా వాడిష్టం లాగే వస్తే గాని కుదరదనడం వినేసరికి సారధి తిక్క మరింత పెరిగింది.
    "నాకు పనుంది. రాను ------ రానన్నానని మీ అమ్మగారికి చెప్పు " అంటూ గదిలోకి వెళ్ళబోయాడు.
    "మీరలా అన్నా వచ్చేవరకు వుండమన్నారండి, తీసుకురాకుండా రావద్దన్నారండి, మీరు రాకపోతే అమ్మ వస్తామని చెప్పమన్నారండి-" ఆపైన మీ ఇష్టం అన్నట్టు తను చెప్పవలసింది అయిపోయినట్టు సిగరెట్టు వెలిగించుకోడానికి తీసాడు జేబులోంచి.
    సారధి కాస్త చల్లబడి "ఎందుకు ..... అంత అర్జంటు పనేమిటి ?" అన్నాడు.
    "తెలియదండి, అమ్మగారింట్లోనే వున్నారండి షూటింగ్ లేదు."
    "సరే, ఈ డ్రైవర్ మీద కోపం చూపిస్తే వాడెం చేస్తాడు! వెళ్ళి సుందరినే ఈ తమాషా ఏమిటో ఆడితే సరి,  తను వెళ్ళకపోతే నిజంగానే వస్తుందేమో ...... బాగుండదు..." అలోచించి మొహం అదీ కడుక్కుని బట్టలు మార్చుకుని బయలుదేరాడు సారధి.
    సారధి వెళ్ళేసరికి, తార పడుకుని యేవో పత్రికలు తిరిగేస్తుంది. ప్రక్కమీద ట్రాన్సిస్టర్, నెమ్మదిగా పాటలు వినిపిస్తుంది. సారధి డ్రాయింగు రూములోకి రాగానే "రా, లోపలికి పరవాలేదు" అంటూ ప్రక్క మీద లేచి కూర్చుంది.
    "అవునూ, నిన్న ఎప్పుడూ వెళ్ళిపోయావు? చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళి పోవడమేనా?"
    "నేను వెళ్ళినా , మానినా వున్నా...... నీకేం పరవాలేదని వెళ్ళిపోయాను" అక్కసుగా నిన్నటి నుంచి మనసులో వున్న కోపాన్ని కసిగా వెళ్ళకక్కాడు."
    "అదేమిటి! అలా మాట్లాడుతున్నావు?" హార్ట్ అయింది తార.
    "నీవు చాలా బిజీగా వున్నావు నాతొ మాట్టాడగలిగే స్థితిలో లేవు. చెప్పి వెడదామన్నా నీవు అందరితో చాలా బిజీగా వున్నావు. నిన్ను డిస్ట్రబ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను." ఆ గొంతులో కఠినతని ఆ మోహంలో రంగుని తార తెల్లపోయి చూసింది.
    "క్రొత్తగా మాట్లాడుతున్నావు ఏమిటి, కోపం వచ్చిందా?" అంది కాసేపటికి ఆశ్చర్యంగా.
    ఏం నటన ? ఎంతయినా నటి గదా! ఏం తెలియనట్టు, ఎంత అమాయకత నటిస్తుంది. "అందుకే అసలు రానన్నాను నాకు తెలుసు. నా అంతస్థు , నా తాహతు , పిలిచి పిలిచి వచ్చేవరకు ప్రాణాలు తీశావు. వాళ్లాలాంటి గొప్పవాళ్ళ ముందు నేను నీ కంటికి కనిపించనని తెలిసీ ఇంకా అక్కడే కూర్చోమన్నావా? నీవు పెట్టె ఫలహారం కోసం వచ్చానానుకున్నావా? సరే, అదయింది. రావడం నా బుద్ది తక్కువే. ఇప్పుడు ఎందుకు పిలిపించావు....... ఏమిటి పని? చెప్పు నేను వెళ్ళాలి తొందరగా" కారులో కూడబలుక్కున్న మాటలని పాఠం అప్పచెప్పినట్లు గడగడ అనేసి, సీరియస్ గా చూశాడు.
    తార విస్తుపోతూ కాసేపు చూసి, తరువాత గలగల నవ్వి, ప్రక్క మీద నించి లేచి, సారధి కూర్చున్న సోఫాలో ప్రక్కన కూర్చుంది. 'అబ్బ, కోపంలో ఎంత బాగున్నావో తెలుసా!" చిలిపిగా అంది.
    సారధి మొహం కోపంతో , సిగ్గుతో మరింత కందింది. 'చాలించు నీ నటన' అని అనాలనుకున్న మాటను తార మొహం చూస్తూ పైకి అనలేకపోయాడు. "నన్నెందుకు పిలిపించావు , ఏమిటి పని?" అన్నాడు దానికి బదులుగా సీరియస్ గా.
    "అది సరే యింతకీ తమరి ఈ అలక ఎందుకో నా కర్ధం కాలేదు దేనీకీ కోపం?" సారధి కోపానికి బెదరనట్టు నవ్వులాట క్రింద జమకట్టి మాట్లాడే తారని చూస్తుంటే సారధికి ఏమనాలో తోచలేదు. చటుక్కున నిల్చున్నాడు. "నేను వెడుతున్నాను. పని వుంది" రెండడుగులు వేసాడు. తార చటుక్కున లేచి "అరె రె..... అయితే ఇదంతా నిజం కోపమే నన్నమాట" అంటూ చేయి పట్టుకుంది. సారధి తెల్లపోయాడు. తార అంత చనువు తీసుకుంటుందని అతనూహించలేదు. ఆమె పట్టుకున్న చేయి వేపు చూశాడు. అది చూసినా తార అతని చేయి విడిచి పెట్టలేదు. అతని చేయి పట్టి లాగి , నడిపించి భుజం పొట్టి సోఫాలో కూర్చోపెట్టింది. 'అరె , ఏమిటా కోపం, చిన్నపిల్లాడిలా ఆ అలక ఏమిటి? సరే, అసలు కోపం దేనికి వచ్చిందో ముందు చెప్పు. తరువాత బ్రతిమాలించుకొందువు గాని." అతని ప్రక్కన కూర్చుని చనువుగా నవ్వి అంది.
    ఆమె తీసుకుంటున్న చనువుకీ, చొరవకి కాసేపు సారధి మాట్లాడలేకపోయాడు. తార అతని ఎర్ర బడ్డ మొహాన్ని కాసేపు వింతగా, వినోదంగా, చూసి , "నిన్న నీతో సరిగా మాట్లాడలేదనా కోపం వచ్చింది. బాగుంది, పార్టీలో, అందరి మధ్య నీ ఒక్కడితోనే మాట్లాడుతూ కూర్చుంటే, అందరూ ఏమనుకుంటారు?" గెస్టులందరినీ పలకరించకుండా ఒక్కనీతోనే మాట్లాడితే బాగుంటుందా!"
    "నాతో కూర్చోమనలేదు..... అసలు తిన్నగా పలకరించావా?" ఒక్క నిమిషం అన్నా కూర్చున్నావా నా దగ్గిర ఆఖరికి నేనేం బహుమతి తెచ్చానో అన్నా చూశావా. నీకోసం కష్టపడి ఏం తెచ్చానో " చిన్నపిల్లాడిలా కంప్లయింట్ చేశాడు.
    తార నవ్వుతూనే "అదిగో........ అటు చూడు " అంటూ వేలితో చూపెట్టింది. అక్కడ రేడియో గ్రాం మీద ఉన్న సారధి కొని తెచ్చిన నిర్మల్ పెయింటింగ్ వుంది. సారధి కళ్ళల్లో ఆశ్చర్యానందాలు మిళితమావుతుండగా తార వేపు చూశాడు. "అదిగో ఇప్పటికయినా నమ్మకం కుదిరిందా, నిన్ను నేనేం అలక్ష్యం చేయలేదని..... వందల కొద్ది వచ్చిన బహుమతులలో ఇదొక్కటే ఈ గదిలోకి రాగలిగింది. తక్కినవి ఏమి వచ్చాయో కూడా నేను చూడలేదు తెలుసా. ప్రత్యేకం అడిగి నీవిచ్చింది తీసుకు రమ్మన్నాను అయాని. నీ కసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది. నిన్నేదో నేను ఇన్సల్ట్ చేస్తానని ఎలా అనుకోగలిగావు. నీకు తెలీదు నీ మీద నాకెంత గౌరవం, సదభిప్రాయం వుందో నీకు తెలీదు. ఎలా చెపితే నీకర్ధం అవుతుంది! ఎలా, యేమని చెప్పాలి. నాకు తెలియడం లేదు."

 Previous Page Next Page