Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 17


    ధరణికుమార్ సూసైడ్ చేసుకుంటే ఎవరికి లాభం? ఏమిటి లాభం? ఇంతకీ ధరణికుమార్ ఎవరు?

 

    మంచివాడిలా కనిపిస్తున్న ధరణికుమార్ కి, అహోబలపతికి మధ్య గొడవలున్నాయా?

 

    "రియల్ ఎస్టేట్... బిజినెస్ గొడవలు" ధరణి చెప్పిన విషయం జ్ఞాపకాని కొచ్చింది ఆదిత్యకు.

 

    అహోబలపతికి రియల్ ఎస్టేట్ బిజినెస్ వుందా? అందులో ధరణి కుమార్ పార్ట్ నరా?

 

    పదిహేను రోజుల్లో ధరణికుమార్ సూసైడ్ చేసుకునేటట్లు తను చేయకపోతే హోంమినిస్టర్ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది ఆదిత్యకు. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

    "గుర్రం పెద్దబ్బాయి నిన్ను వదుల్తాడనుకున్నావా?" మళ్ళీ ధరణిమాట జ్ఞాపకానికొచ్చింది.

 

    గుర్రం పెద్దబ్బాయి ప్రతిపక్ష నాయకుడిగానే తనకు తెలుసు... అతని గురించి ధరణికి ఎక్కువ వివరాలు తెల్సుంటాయి. అతని ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ఆదిత్య.


                            *    *    *    *    *


    పదకొండు గంటలు గడిచాయి.

 

    ప్రిజనర్స్ లంచ్ టైమ్... తమ కంచాల్ని తీసుకుని తిండి పెట్టించుకుని విశాలమయిన హాల్లోకొస్తున్నారు ఒక్కొక్కరూ.

 

    ఒక చేత్తో ఏదో పేపర్, ఇంకో చేత్తో కంచాన్ని పట్టుకుని వస్తున్న ధరణి ఆదిత్యని విష్ చేశాడు.

 

    ఆదిత్య కళ్ళు ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్లుగా వున్నాయి.

 

    "రాత్రంతా నిద్రపోలేదా?" ఆప్యాయంగా అడిగాడు ధరణి.

 

    "నిద్రెలా పడుతుంది? పగ, ప్రతీకారం రగిలిపోతుంటే?" ఆదిత్య ఆగ్రహావేశాలతో అన్నాడు.

 

    "అయితే ఏం చేస్తావ్?"

 

    "తను సి.ఎమ్. కావటం కోసం నన్ను బలిపశువును చేసి మోసం చేసిన అహోబలపతిని చంపేవరకు నిద్రపోను.

 

    చిన్నగా నవ్వాడు ధరణికుమార్.

 

    "అదే తప్పు మిత్రమా! నీ అవసరం కోసం నువ్వు అహోబలపతిని చంపటానికి ఒప్పుకున్నావు అంటే నీ తప్పూ వుందిగా? ఎవడయినా తనను చంపమని తనే డబ్బిస్తాడా? కొద్దిగానయినా ఆలోచించావా? లేదు. నీ అవసరం నిన్ను ఆలోచింపనివ్వలేదు."

 

    "కాని... మరీ ఇంత కుట్రా?"

 

    "కుట్రలు, కుతంత్రాలూ చేయకపోతే రాజకీయ నాయకులు పదవుల్లోకెలా వస్తారు?"

 

    "మీ ఉద్దేశ్యం ఇంత జరిగినా వూరుకొమ్మనా?"

 

    "ఎంతమాత్రం కాదు. ఎత్తుకు పై ఎత్తు వేయాలి... దెబ్బకు దెబ్బ తీయాలి. అదును చూసుకుని నువ్వతన్ని ట్రాప్ లోకి లాగాలి."

 

    "ఎలా?"

 

    "ఆవేశాన్ని తగ్గించుకో... ఆలోచన పెంచుకో... టైమ్ వస్తుంది వుపయోగించుకో..."

 

    "నన్నీ ట్రాప్ లో ఇరికించిన ప్రతి ఒక్కర్నీ నడిరోడ్డుమీద చంపుతాను. అహోబలపతి... హోంమినిస్టర్నీ..." అని ఆగిపోయాడతను.

 

    అతనికి చటుక్కున గుర్రం పెద్దబ్బాయి గుర్తుకొచ్చాడు.

 

    "గుర్రం పెద్దబ్బాయి గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా?"

 

    "ఏం? ఆయన్ని కూడా చంపుతావా?"

 

    "లేదు."

 

    "నన్నీ ట్రాప్ లో ఇరికించడంలో ఆయన పాత్ర ఏమాత్రం ఉందో తెల్సుకుందామని..."

 

    "తెల్సుకుని?"

 

    "సి.ఎమ్. మర్డర్ వెనక ఆయన హస్తంకూడా ఉంటే... పనిలో పనిగా లేపేస్తాను."

 

    ఆదిత్య ఆవేశానికి నిట్టూర్చాడు ధరణి.

 

    "నన్ను ఏ నేరం చేసి జైల్లోకొచ్చావని అడిగావు గుర్తుందా? నేనేం నేరం చెయ్యలేదు. నా మీద నేరం మోపారు. నాకు ఈ పాలిటిక్స్, ఈ మర్డర్స్, ఈ క్రిమినాలజీ, ఇదంతా అసహ్యం. హాయిగా నా భార్యతో... ఒక్కగానొక్క బేబీతో అమెరికాలో సెటిలవుదామనుకున్నాను ఇండియా వచ్చాను. హైదరాబాద్ వచ్చాను. నేను అనుకున్నదొకటి, జరిగిందొకటి... నువ్వు అహోబలపతి కుట్రలో యిరుక్కున్నావ్. నేను గుర్రం పెద్దబ్బాయి కుట్రలో యిరుక్కున్నాను అంతే తేడా... అయిపోయింది... మరో టెన్ డేస్ లో నేను బయటికొచ్చేస్తాను. వీళ్ళందరికీ దూరంగా... హాయిగా... నన్ను ప్రేమించిన భార్యతో, బేబీతో..." ఎక్కడో చూస్తూ చెప్పుకుపోతున్నాడు ధరణి.

 

    ధరణి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య. ఆ మాటల వెనక ధరణి మనసు మృదుత్వాన్ని అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

    "గుర్రం పెద్దబ్బాయి మీ బిజినెస్ పార్ట్ నరా...?" చేతులు కడుక్కుంటూ అడిగాడు ఆదిత్య.

 

    "ఆ విషయం చెప్తే నువ్వు షాక్ తింటావ్..." చేతులు కడుక్కుంటూ అన్నాడు ధరణి.

 

    "ఫరవాలేదు చెప్పండి."

 

    "గుర్రం పెద్దబ్బాయి పెద్దకొడుకుని నేను."

 

    ఆ మాటకు నిజంగా షాక్ తిన్నాడు ఆదిత్య. ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకు యిన్నిరోజులుగా జైల్లో ఎందుకున్నాడు?

 

    "మరి?" ఆదిత్య మదిలో ఎన్నో ప్రశ్నలు. ఏ ఒక్క ప్రశ్నా బయటికి రావడం లేదు. ఏం మాట్లాడలేకపోతున్నాడు.

 

    "చూశావా! నువ్వు షాక్ తింటావని చెప్పానా?" అంటూ ముందుకెళ్ళిపోయాడు ధరణి.

 

    తల దించుకొని వరండాలో నడుస్తున్నాడు ఆదిత్య.

 

    అతని మెదడును దొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న....

 

    ధరణి సూసైడ్ చేసుకునేటట్టుగా అహోబలపతి ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? స్వంత కొడుకునే, గుర్రం పెద్దబ్బాయి ఎందుకు జైల్లో పెట్టించాడు?

 

    "దిసీజ్ ఏ విషస్ సర్కిల్!" గొణుక్కుంటూ సెల్ లోకి అడుగు పెట్టాడు ఆదిత్య.

 

    ఎడారిలో ఇనప ముళ్ళమీనుంచి పరిగెడుతున్నట్టుగా వుంది అతడి పరిస్థితి!

 

    ధరణి సూసైడ్ చేసుకునేటట్లు తను చెయ్యలేకపోతే?

 

    చెవుల పక్కన బాంబులు పేలుతున్నట్లుగా వుంది ఆ ప్రశ్న.

 

    ధరణి కుమార్ ని సూసైడ్ చేసుకునేటట్లు చేసి, తను మళ్ళీ ఇంకో ట్రాప్ లోకి యిరుక్కోలేడు.

 Previous Page Next Page