నాగమ్మ "ఎక్కడియ్యి?" అని అడిగినపుడు " అన్న తెచ్చాడు.....సరళమ్మ పెట్టారంట!" అని చెప్పేది.
నాగమ్మ నిర్ఘాంతపోయి "సరళమ్మ పెట్టిందా? ఇన్నాళ్ల బట్టీ పని సేస్తున్నాను. ఎన్నడూ నా సేతిలో ఎంగిలిసేయి యిదపనేదు. ఈడికింత యిదిగా ఎట్టా యిస్తాందో? సిత్రంగా ఉంది!" అంది.
వెంకడు ఊరుకోలేక "నే నాయమ్మకి మందిస్తున్నా పిన్నీ!" అన్నాడు.
నాగమ్మ గుండె బాదుకుంటూ "యేంటేంటీ? మందుబెట్టి మనసు మారస్తన్నావా?" అంది.
తెల్లబోయాడు వెంకడు.
"అట్టాకాదు పిన్నీ! కషాయం ఇస్తన్నా! అది...." ఆగిపోయాడు వెంకడు. తన మందు విషయం రహస్యంగా ఉంచమని సరళ అడగటం గుర్తుకొచ్చింది!
"ఓర్నాయనో" అని మరోసారి గుండె బాదుకుంది నాగమ్మ.
సారధి పరీక్షలు బాగా రాశాడు. "నీ దయవల్ల కనీసం ఈ పదోక్లాసయినా పాసైతే, ఏదైనా ఉధ్యోగం చూసుకుంటానక్కా!" అన్నాడు.
సరళ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ "నీకు ఉద్యోగం ఏం కర్మరా! నిన్ను కాలేజీలో చేర్పిస్తానుగా?" అంది.
"కాలేజీలో చేర్పిస్తావా? ఎలాగక్కా?"
"ఎలాగో! నీ అల్లుడు చదివిస్తాడులే!"
నవ్వుకుంది సరళ. తన గర్భంలో పెరుగుతోన్న ఆ శిశువు ఎన్ని అద్భుతాలయినా చెయ్యగలడనిపిస్తోంది సరళకి. ఇప్పుడా అభాగ్యురాలికి లోకమంతా నందనవనంలాగే కనిపిస్తోంది.
ఆనందంతో మెరిసిపోతున్న తన అక్క ముఖంలోకి చూస్తూ "లోకంలో ఆడవాళ్ళకి అత్యంత సాధారణమయినా మాతృత్వమే! అక్కడి ఏదో అపూర్వమయిన వరంలాతోస్తోంది. పాపం, ఆవిడ దౌర్భాగ్యం అలాంటిది" అనుకున్నాడు.
సరళది సహజంగా చాలా సాత్విక ప్రవృత్తి - దానికి తోడు తన దురదృష్టం కొద్దీ చిన్నతనం నుండే ఎప్పటికప్పుడు పరిస్థితులతో సర్దుకోవలసి రావటంతో మరింత సహనం ఏర్పడింది.
ద్విపాద పశువు అనదగిన నాదమునిని చూస్తే అందరికీ వేళాకోళమే! సరళ స్థానంలో మరే స్త్రీ ఉన్నా తన భర్తను తప్పకుండా అసహ్యించుకునేది. అలా అసహ్యించుకోవటంలో ఆశ్చర్యమూలేదు, అన్యాయమూ లేదు. కానీ, పాపం, సరళ భర్తను ఏనాడూ అసహ్యించుకోలేదు. భగవంతుడు తనకు ప్రసాదించిన దానినే సాధ్యమయినంత చక్కగా మలచుకోవటానికి అలవాటు పడిన సరళ భర్త విషయంలోనూ అదే వైఖరి అవలంబించింది. అతనికి స్నానం చేయించేది. మంచి బట్టలు తొడుక్కోమనేది. దగ్గిరుండి కడుపునిండా అన్నం పెట్టేది. ఏం చెపితే అది పసిపిల్లాడిలా చేసే నాదమునిని చూస్తే అసహ్యం కలగటానికి బదులు జాలితో కడుపు తరుక్కుపోయేది సరళకి.
ఆరోజు నాదమునికి స్నానం చేయిస్తూ "ఇంక మనకష్టాలు ఎన్నో రోజులు లేవు. మీ అబ్బాయి మీకు వైద్యం చేయిస్తాడు. మీ జబ్బు నయమయిపోతుంది. అందరిలాగా అయిపోతారు. అందరికంటే తెలివైనవారు అయిపోతారు" అంది.
నాదముని చుట్టూ చూస్తూ "ఏడి వాడు?" అన్నాడు.
పాపం, ఆ వెర్రిబాగుల భర్త దగ్గిరే సిగ్గుపడుతూ ఇంకా నాలోనే ఉన్నాడు" అంది సరళ.
"ఇలా ఇయ్యి - ఎత్తుకుంటాను....." అని చేతులు జాపాడు నాదముని.
అతనివైపు జాలిగా చూసి తల దించుకుని వచ్చేసింది సరళ.
వారంరోజుల కొకసారి రహస్యంగా సందులో కషాయం సరళకందిస్తున్నాడు వెంకడు. గర్భం వచ్చాక కూడా ఆరు నెలల వరకూ కషాయం తాగించేవాడు వెంకడి తాత. అంచేత వెంకడు సరళని కూడా అలాగే తాగమన్నాడు. ఆ కషాయం ఏమిటో కాని, దానివల్ల తనకేమీ బాధలు లేకపోగా, ఏదో బలం చేకూరినట్లు అనిపించటంతో సరళ సంతోషంగానే ఆ కషాయం తీసుకోసాగింది.
ఆరోజు సంధ్య చీకట్లో వెంకడి దగ్గిర నుంచి కషాయం అందుకుని వాడికి ఇంట్లో చేసిన లడ్లు అందిస్తోంది సరళ.
ఆ సమయంలో వాళ్ళిద్దర్నీ చూశాడు వరదాచారి.
"ఏమిటది? ఏంచేస్తున్నారు?" అని గర్జించాడు వరదాచారి.
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఇద్దరూ ఏ తప్పూ చేయకపోవడం వల్ల, తప్పు చేస్తున్నామనే భావన ఇద్దరి మనసుల్లోనూ లేకపోవడం వల్ల ఇద్దరూ పెద్దగా భయపడలేదు.
"నేను వెంకడి దగ్గర మందు తీసుకుంటున్నాను. బావగారూ!" అని ధైర్యంగా సమాధానం చెప్పింది సరళ.
"వెంకడి దగ్గరమందు తీసుకుంటున్నావా? ఈ సందులో..... ఈ చీకట్లో..... ఇంత రహస్యంగా...."
"అవును. రహస్యంగానే తీసుకుంటున్నాను. ఈ ఇంట్లో నన్ను డాక్టర్ కి చూపించి నాకు మందూ మాకూ కొనిచ్చేవారెవరు? చిన్నతనం నుంచీ నెలకొకసారి కాక పదిహేను రోజులకొకసారి విషయం పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు! వెంకడి కషాయంతో గర్భకోశం బాగుపడి కడుపు పండుతుందేమోనని ఆశపడ్డాను. ఏ డాక్టర్లకూ లొంగని అక్కయ్యగారి తలనొప్పి వీడి పసరుతో తగ్గిపోవడంతో నాకూ ఆశకలిగింది. నా అదృష్టం బాగుండి వీడి కషాయం పనిచేసి నేనూ తల్లిని కాబోతున్నాను."
"నోర్ముయ్! మంత్రాలకు చింతకాయలు రాలతాయా? కషాయాలకు కడుపులొస్తాయా? మీ భాగవతం నేను చూడలేదనుకుంటున్నావా? ఈ సందులో దూరి మాకళ్ళలో దమ్ముకొట్టి మా ఎదుటే ఇంత ఘోరానికి తలపడతావా? ఎంత నికృష్టపుదానివే! ఈ సంకర సంతానాన్ని పవిత్రమైన మా వంశంలో కలుపుదామనుకున్నావా? నడు!..... ముందు బయటికి నడు!"
వరదాచారి అరుపులకు ఇంటిల్లిపాదీ అక్కడ చేరారు..... అందరూ వెంకణ్నీ, సరళనూ వింతగా చూడసాగారు.
"బావగారూ! నేను అరక్షణం క్రిందటివరకూ వంటింట్లోనే మగ్గుతున్నాను! ఇప్పుడే ఇక్కడికొచ్చి కషాయం తీసుకుంటున్నాను. ఈ క్షణకాలంలో నేను ఏ ఘోరాలు చేస్తానండీ?"
"ఇవాళ క్షణ కాలంలోనే నా కంట పడ్డావు. రోజూ ఎన్నెన్ని గంటలు ఎలా గడుతున్నావో?"
"గంటలు! గంట కాదు; ఘడియకాలం వంటిల్లు వదలి వెళ్ళటానికి నాకు కుదురుతుందా? గంటలు గంటలు నేను ఇంట్లో కనపడకుండా పోతే, ఇన్నాళ్ళు ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందా?"