Previous Page Next Page 
కళ్ళు పేజి 17


    "మీరా?" అంది లేచి కూర్చోబోతూ.

 

    "పడుకోండి. మీరు పేషెంటు, లేవకూడదు" అన్నాడు కృష్ణచైతన్య.

 

    "అబ్బ! పేషెంటు అనకండి డాక్టర్! ఆ మాట ఎలాగో వుంది. నిలబడే వున్నారేం? కూర్చోండి."

 

    అతను బెడ్ దగ్గరే వున్న చిన్న కుర్చీలో కూర్చున్నాడు.

 

    "ఒక్కరే వున్నారేం? అటెండర్ ఎవరూ లేరా?" అనడిగాడు.

 

    "మమ్మీకి జ్వరంగా వుంది. కాసేపు వుండి ఎర్లీమార్నింగ్ వస్తానని చెప్పి వెళ్లిపోయింది. అందుకే ఇంకెవరినైనా పంపిస్తుందేమోనని తలుపు తీసి వుంచాను."

 

    "మీరు మెలకువగానే వున్నారేం? నిద్రపట్టటంలేదా?"

 

    "లేదు డాక్టర్!"

 

    "మా సిస్టర్ రాత్రికి డైజిపాం టాబ్లెట్స్ ఇస్తుందే?"

 

    "వేసుకున్నాను. ఐనా నిద్ర రావటంలేదు."

 

    "బహుశా ఆపరేషన్ టెన్షన్ వల్లననుకుంటాను."

 

    హేమసుధ నవ్వింది. "నిజం చెప్పాలంటే ఈ ఆపరేషన్ గురించి నేను చాలా భయపడుతున్నాను డాక్టర్! నన్ను ఆపరేషన్ టేబుల్ మీద ఎక్కించే దృశ్యం తలుచుకుంటే చాలా నెర్వస్ గా ఫీలవుతున్నాను."

 

    "నో నో! ఇది చాలా మైనర్ ఆపరేషన్. రెటీనా మీద చిన్న పిగ్ మెన్ టేషన్ ఏర్పడింది. ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో ఆ పిగ్ మెంటేషన్ చాలా సులభంగా తొలగించవచ్చు. భయపడే అవసరమే లేదు."

 

    "డాక్టర్! నేనో విషయం చెప్పాలి. మొత్తం సినిమా ఇండస్ట్రీలో నా కళ్ళంత అందమైన కళ్ళు లేవని ప్రతీతి. నేను కళ్ళిలా కదిపితే చాలు వాటిలోంచి భావాలు రంగురంగుల పువ్వుల్లా, విషాద గీతికల్లా రాలి పడతాయి. ఆ కళ్ల గురించే నాకిప్పుడు లక్షలు పలుకుతున్నాయి. హిందీ సినిమారంగం నుండి కూడా నాకు ఆఫర్ లు వస్తున్నాయి. ఈ కళ్ళు లేకపోతే నా జీవితం అంధకార బంధురమైపోతుంది. నేను ఆపరేషన్ గురించి పదిరోజులు రెస్టు తీసుకుంటాను. చెబితేనే ప్రొడ్యూసర్ ళు గగ్గోలు పెడుతున్నారు."

 

    కృష్ణచైతన్య ఆమె ముఖంవంక పరిశీలనగా చూశాడు. నిజంగా చాలా అందమైన విశాలమైన నేత్రాలు.

 

    కృష్ణచైతన్యకు ఒక్కోసారి ఆశ్చర్యంగా వుంటుంది. లోకాన్ని మైమరపించే మత్తెక్కించే కళ్ళు తనకు అత్యద్భుతమైన ఆపరేషన్ ళు చెయ్యడానికి సాధారణంగా ఉపయోగిస్తాయి. వాటి భవిష్యత్తు తన మేధస్సుమీద, మెర్సీమీద ఆధారపడి వుంటుంది.

 

    "మీ కళ్లను మీకు సురక్షితంగా అప్పజెపుతాను."

 

    "మీ ప్రొఫెషనల్ ఎఫికసీ మీద నాకు పూర్తి నమ్మకముంది" అన్నది హేమసుధ.  

 

    కృష్ణచైతన్య రిస్టువాచీ చూసుకున్నాడు. ఒకటిన్నర దాటుతోంది.

 

    "చాలా రాత్రవుతోంది. సిస్టర్ని సెడేషన్ యిమ్మని చెబుతాను. మీరు హాయిగా పడుకోండి. రేప్రొద్దుట ఎనిమిది గంటలకు ఆపరేషన్ చేస్తాను" అని కృష్ణచైతన్య లేచాడు.

 

    తర్వాత దాదాపు పావుగంట గడిచివుంటుంది. తలుపు తెరిచిన శబ్దమైన హేమసుధ తల త్రిప్పి చూసింది. సిస్టర్ కాదు, లోపలకు ఓ యువకుడు వస్తూ కనిపించాడు. చేతిలో సిరంజి వగైరాలున్నాయి. ఎత్తుగా, దృఢంగా చాలా బలంగా వున్నాడు.

 

    అతని కళ్ళలోకి చూసింది... ఎందుకో ఉలికిపడినట్లయింది. తాను ఒక సినిమా తార. తన అంతస్థుకు క్రిందనున్నవారిని చాలా నిర్లక్ష్యంగా చూడటం అలవాటు చేసుకుంది. అసలు వాళ్లగురించి పట్టించుకోనుకూడా పట్టించుకోదు. అలాంటిది ఆ కళ్ళని చూసి ఎందుకో ఒళ్ళు జలదరించినట్లయింది. వాటిలో ఏదో శక్తి. కౄరత్వంతో కూడిన ఆకర్షణ.

 

    "నేను కృష్ణచైతన్యగారి అసిస్టెంట్ ను. మీకు ఇంజక్షన్ చెయ్యమని పంపించారు" అన్నాడతను ఆమె తనవంక చూస్తూ వుండటం చూసి.

 

    "సిస్టర్ని పంపిస్తానన్నారుగా?"

 

    "ఆమె పనిలో వుంది."

 

    "ఇంజక్షన్ ఇవ్వడం తప్పనిసరి అంటారా?" అంది. ఎందుకో ఆమెకతన్ని చూస్తే భయంగా వుంది.

 

    "తప్పకుండా ఇమ్మన్నారు. లేకపోతే మీకు...."

 

    నిద్రపట్టదు. తనకు నిద్ర పట్టకపోతే కళ్ళు ఎర్రబారతాయి. కళ్ళలో కాంతి తగ్గుతుంది. కళ్ళు ఎర్రబడితే ఆపరేషన్ చేస్తారో చెయ్యరో...మళ్ళీ వాయిదా పడితే అవతల బోలెడు కాల్ షీట్స్.

 

    "చెయ్యండి!" అంది చేతిని ముందుకు చాచి, కొంచెం ప్రక్కకి ఒత్తిగిలుతూ.

 

    అతను క్రిందకు వంగి సిరంజి ఆమె జబ్బకి గుచ్చాడు.

 

    "అబ్బా!" అంది. ఆమె కొంచెం బాధకు కూడా తట్టుకోలేని సుకుమారి.

 

    "అయిపోయింది" అంటూ సిరంజి వెనక్కి తీసేసుకున్నాడు.

 

    ఆమె అతనివంక అలాగే నిలబడ్డాడు.

 

    వెళ్ళడేం? ఇక్కడే నిలబడి ఏమిటి చూస్తున్నాడు?

 

    హఠాత్తుగా ఆమెకు తాను గదిలో ఒంటరిగా వున్నానన్న సంగతి గుర్తొచ్చింది. తాను అందాల సినిమాతార. తనతో మాట్లాడటమే అపూర్వమైన సంఘటన అనుకుంటారెంతోమంది. ఇప్పుడతను...తనకు...మత్తు ఇంజక్షన్ కూడా ఇవ్వబడింది. ఒకవేళ అతనిలో ఏదయినా...దుర్భుద్ధి...ఆమె ఒంట్లోకి వణుకు ప్రవేశించింది. కళ్ళార్పకుండా తనవంక చూస్తున్నాడు.

 

    ఎందుకలా చూస్తాడు? ఆ చూపులో ఏముంది? గట్టిగా అరుద్దామనుకుంది. గొంతు రాలేదు. హఠాత్తుగా మెదడంతా మొద్దుబారిపోతున్నట్లనిపించింది. తల తిరుగుతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతాన కనురెప్పలు తెరచి అతనివంక చూసింది. ఏం జరుగుతోంది? ఎం...దు...క...లా... మె...ద..ల..కుం...డా...ని...ల...బ...డ్డా...డు...?

 

    "...మీకు...ఏం...కావాలి?..." అడగలేదు, అడగాలని అనుకుంటోంది.. మాట పెదవులు దాటి బయటకు రావటంలేదు.

 Previous Page Next Page