Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 17

                                 


                                  పెగ్ నెంబర్ త్రీ


                            


    ముందు హైద్రాబాద్ తరువాత- విజయవాడ- పోలీసులతో పేచీపడ్డాక కాలనీ వాళ్ళందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక నుంచీ ఎవ్వరం రాజకీయాల జోలికీ, పోలీస్ లతో పేచీ వచ్చే వ్యవహారాల జోలికీ పోకూడదని నిర్ణయించుకున్నాం.

 

    "నేనొప్పుకోను!" ఎదురు తిరిగాడు శాయిరామ్ "మనం వాటి జోలికి వెళ్ళకపోయినా అవే మన కాలనీ లైఫ్ లోకి జొరబడుతూంటే మనమేం చేస్తాం? గాజులు తొడుక్కుని కూర్చుంటామా?" అన్నాడు ఆవేశంగా.

 

    "కూర్చోకపోతే జైలుకు పోతారు! లేదా మనవాళ్ళందరినీ శ్రీకాకుళం ప్రాంతానికి బదిలీ చేసి పారేస్తారు. అదీ కాకపోతే రోడ్లు విశాలం చేసే స్కీమ్స్ లో మన కాలనీ కూల్చి పారేస్తారు" అంటూ బెదిరించాడు గోపాల్రావ్.

 

    ఇళ్ళు కూల్చడం అనగానే శాయిరామ్ భయపడిపోయాడు. హైద్రాబాద్ లో ఇళ్ళు దొరకటం ఎంత కష్టమో, ఇళ్ళ అద్దెలు ఎంత భయంకరంగా ఉన్నాయో- ఆ మధ్య వాళ్ళ బంధువుల కోసం ఇల్లు వెదికినప్పుడు అనుభవమయింది మా అందరికీ.

 

    "సరే! మీరు చెప్పిందే కరెక్ట్" అన్నాడు రాజీకొస్తూ.

 

    అదే అవకాశమని నేను మరో క్లాజ్ కూడా అప్పుడే ప్రవేశపెట్టాను.

 

    "కొన్ని వారాల వరకూ కాలనీ మీటింగ్ ళు కూడా ఉండటానికి వీల్లేదు" అన్నాను శాయిరామ్ వంక చూస్తూ.

 

    శాయిరామ్ బాధతో విలవిలలాడిపోయాడు.

 

    "అదేమిటి? మీటింగ్ లు ఎందుకు పెట్టకూడదు?" అన్నాడు ఉక్రోషంగా.

 

    "నువ్వు పెట్టే మీటింగ్ ల వల్లే గొడవలు జరుగుతున్నయ్-" అని సపోర్ట్ కోసం మిగతావారివేపు చూశాను.


    
    "అవ్! నో మీటింగ్స్" అన్నాడు వివిన్ పాల్.

 

    "అవును మీటింగ్ లొద్దు!" అన్నారు రాజేశ్వరి, పార్వతీదేవిలు.

 

    దాంతో శాయిరామ్ ఇంక మాట్లాడలేకపోయాడు.

 

    ఆ రోజు రాత్రి చాలా హాయిగా, ప్రశాంతంగా నిద్రపోయారు కాలనీలో వాళ్ళందరూ. ఉదయం ఎనిమిదిగంటలయినా చాలామంది నిద్రపోతూనే వున్నారు. నిజంగా ఆ ఒక్కరోజు కాలనీ చరిత్రలో "స్వర్ణయుగం" అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 

    నా మటుకు నేను అంత ఎక్కువ ఆనందం కాలనీలోకొచ్చాక ఏనాడూ అనుభవించలేదు.

 

    రెండోరోజు కూడా ఆ తీయని నిద్రలో మునిగితేలుతూంటే- తలుపు కొట్టిన చప్పుడయింది.

 

    భయంగా లేచి కూర్చుని టైమ్ పీస్ వైపు చూశాను. రాత్రి పన్నెండవుతోందప్పుడే!

 

    ఇంత రాత్రివేళ ఎవరు పిలుస్తున్నారో అర్థం కాలేదు.

 

    లేచి తలుపు తీయబోయేసరికి మా శ్రీమతి కూడా లేచి కూర్చుని "వద్దు! తీయకండి!" అంది గాబరాగా.

 

    "ఎందుకని?"

 

    "వచ్చింది దొంగలేమో- తలుపు తీశాక తీరా మీకేమయినా అయితే- నా సంగతేమిటి? అందుకే మీ ఇన్సూరెన్స్ మొత్తం కొంచెం పెంచమని మొత్తుకుంటుంటే వినిపించుకోరు-" అంది గొణుగుథూ.

 

    దానికి నామీదకంటె నా ఇన్సూరెన్స్ పాలసీ మీద ప్రేమ ఎక్కువవటం చూసి నాకు వళ్ళు మండిపోయింది గానీ అది దానొక్కదాని తప్పుకాదు. కాలనీలో ఆడాళ్ళందరూ ఈ మధ్య మగాళ్ళను ఇన్సూరెన్స్ మొత్తం పెంచమని గొడవ చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో దొంగలు మా కాలనీకి బయట ఉన్న ఓ డాబా ఇంటతనని చంపిన దగ్గర్నుంచీ వాళ్ళకా ఆలోచన కలిగింది. అతని ఇన్సూరెన్స్ పాలసీ చాలా చిన్న మొత్తం అవటం వల్ల అతని కుటుంబం చాలా అవస్తలు పడటం గమనించారుట!

 

    "ఎవరు?" అంటూ అరచాను తలుపు దగ్గర చెవిపెట్టి.

 

    "ఎవరా? ఎవరేమిటి గురూ! నేనే జనార్ధన్ ని..." అంటూ జనార్ధన్ గొంతు వినిపించాక ధైర్యంగా తలుపు తెరచాను.

 

    బ్రాందీ వాసన గుప్పుమంటూ జొరబడింది లోపలకు.

 

    "ఏమిటింత రాత్రప్పుడు వచ్చావ్?" అడిగాను ఆశ్చర్యంగా.

 

    జనార్ధన్ కంటి వెంబడి కన్నీళ్ళు రాలిపోయినయ్ "గురూ! నన్ను ష...ష...మించుగురూ" అంటూ నా చేతులు పట్టుకున్నాడు.

 

    నా కతనిమాటలు అర్థం కాలేదు "ఏమిటి? నేనేం చేయాలి?"

 

    "నన్ను షమించాలి గురూ! ముందు 'ష' అను?" అన్నాడు కన్నీళ్ళు తుడిచేసుకుని.

 

    'ష' అన్నాన్నేను.

 

    "మిం-"

 

    "మిం-"

 

    "చు-"

 

    "చు-"

 

    "ష..మిం..చు"

 

    "ష..మిం...చు"

 

    "అది- అదే గురూ! నన్ను షమించానని చెప్పు!"

 

    "ఎందుకు? నువ్వేం చేశావని?"

 

    జనార్ధన్ గుండెలు కొట్టుకోసాగాడు. అ"అమ్మో- అమ్మో- ఏం చేశానేమిషి గురూ- దోహం షేశాను-"

 

    "షారీ! దోహం కాదు దో...దో- ద్రోహం- ద్రోహం షేషాను గురూ! నీకు తీరని ద్రోహం షేశాను-"

 

    "ఏం చేశావ్?"

 

    "ముందు షమించానను-ష...మిం...చా అను గురూ"

 

    మా ఆవిడకు జనార్ధన్ గొడవ అర్థం అయినట్లు లేదు. "ఏమిటిలా ఏడుస్తున్నాడు?" వాళ్ళ వాళ్ళెవరికయినా సీరియస్ గా ఉందేమో?"

 Previous Page Next Page