Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 17


    "అలసటగా ఉందమ్మా! పొద్దుటికంతా సర్దుకుంటుందిగాని నువ్వు పడుకోవే" బలవంతంగా దీప్తిని బొంతపై పరుండబెట్టింది. పసిపాపలా అక్క ఒడిలో ఒదిగిన దీప్తి నిద్రలోకి జారిందితప్ప రాజ్యం ఎలాంటి స్థితిలో ఉన్నదీ గుర్తించలేకపోయింది.

 

    అర్థరాత్రి దాటుతుండగా పైకిలేచింది రాజ్యం!

 

    అసత్యం లాంటి ప్రపంచంలో చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు సత్యం మాస్టారు.

 

    నీళ్ళు నిండిన కళ్ళతో తండ్రి పాదాలను స్పృశించింది రాజ్యం.

 

    "మాట తప్పుతున్నందుకు మన్నించు నాన్నా౧ పెళ్ళిమాట తల పెట్టకుండా మీ అందరికీ ఆసరాగా వుంటానన్న నేను యిదిగో వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని బ్రతికించుకునే శక్తి లేనినాడు నా రక్తమాంసాల్ని చనుబాలుగా మార్చుకొని మీ అందరికీ అమ్మని కావాలనుకున్నాను. కాని యిదిగో... నా రక్తమూ మకిలమై పోయింది. నన్ను అసహ్యించుకోకండి. మన ఇంటి ఆవరణలో వెలసిన తులసి మొక్కలో నన్ను చూడకపోయినా ఎప్పుడయినా వేకువజామున మెలకొవ వస్తే మీ పాదాలని తాకే చిరుగాలి అలలో నన్ను ఊహించుకోండి. అది చాలు. అంతెత్తు ఎగిసిపడతాను. మీకు ప్రాణవాయువు నేనే అని సంబరపడిపోతాను."

 

    రాజ్యం కదిలింది నెమ్మదిగా.


                                   *  *  *


    విషఖచిత ఖడ్గప్రహారాల్లా కిటికీలోనుండి దూసుకువస్తున్నాయి సూర్యకిరణాలు.

 

    తూర్పుదిక్కున గంట క్రితం జరిగిన సూర్యోదయంతో మెలకువ వచ్చిన శ్రీహర్ష ఎవరో తట్టినట్టు నిద్రలోంచి మేల్కొన్నాడు.

 

    అప్పటికి హోటల్ సందడిగా ఉంది.

 

    ఈదేశం వదలి వెళ్ళాలని రాత్రే తీర్మానించుకున్న శ్రీహర్ష ఇక బాత్ రూంలో అడుగుపెట్టేవాడే.

 

    అప్పుడు చూసాడు.

 

    హోటల్ సూట్ లో రాత్రి అతడు 'ఆఫ్' చేయని టి.విలో ఏదో ప్రోగ్రాం వస్తూంది.

 

    అలవోకగా బటన్ నొక్కబోతూ షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు.

 

    ప్రసారం మధ్య ఓ ఏడ్ ఫిల్మ్.

 

    అది "షియో" సబ్బుకి సంబంధించింది.

 

    "మమ్మీ" బాత్ రూంలో నుంచి పరుగున వస్తున్న ఆరేళ్ళ పాప తల్లితో అంటూంది. "నేను తెల్లగా అయిపోయాను చూడు."

 

    "మరేం" తల్లి పాపచేతిలో సబ్బు అందుకుంది.

 

    అప్పటికే స్వేదంతో తడిసిన శ్రీహర్ష అప్రతిభుడై చూస్తున్నాడు.

 

    ఆ ఏడ్ ఫిల్మ్ లో కనిపించిన పాప మరెవరో కాదు.

 

    తన ప్రత్యర్థి "పుజో" చేతిలో చిక్కిందని అంతకాలం అతడు అనుకుంటున్న జూలీ.

 

    శ్రీహర్ష కూతురు.

 

    అంటే...

 

    జూలీ ఇండియాలో ఉందా...

 

    అసలు ఈదేశంలో ఎలా అడుగుపెట్టింది?

 

    సాధ్యమయినంత త్వరలో భారతదేశపు పొలిమేరలు దాటి వెళ్ళిపోవాలనుకున్న శ్రీహర్ష ఆలోచనలకి పుల్ స్టాప్ పడిపోయింది.

 

    ఏడ్ ఫిల్మ్ లో కనిపించిన "జూలీ" ఆచూకీ తెలుసుకోవడం కష్టం కాదు.

 

    ఒక ముఖ్యమయిన సమస్య ఇంత సులభంగా పరిష్కారమవుతుందని అతడూహించలేకపోవడంతో ఉద్విగ్నంగా బయటికి నడవబోతుంటే...

 

    హఠాత్తుగా లోపలికి దూసుకొచ్చారు పోలీసులు.

 

    "ఆగక్కడ" టక్కున లాఠీని శ్రీహర్షకి అడ్డం పెట్టాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజారెడ్డి. "ఎక్కడికి ఉడాయించబోతున్నావ్?"

 

    అర్థంకానట్టు చూసాడు శ్రీహర్ష.

 

    ముందు తోడేలులా నవ్వినా రాజారెడ్డి ఆ తర్వాత సాధికారంగా అన్నాడు. "నా జూరీస్ డిక్షన్ లో ఏ నేరస్తుడు తప్పించుకోలేడని నా రికార్డు చెబుతుంటే ఇక నువ్వెలా తప్పించుకోగలవు."

 

    అప్పటికే అయిదుగురు కానిస్టేబుల్స్ శ్రీహర్షని ఒడిసిపట్టుకున్నారు.

 

    "మీరు పొరపాటు పడుతున్నారు" శ్రీహర్ష నచ్చచెప్పబోతుంటే అర్థోక్తిగా ఖండించాడు రాజారెడ్డి.

 

    "కుక్కలు పొరపాటుపడతాయి. కాని నేను కాదు. అలా తెల్ల మొహం వేయకు. నేను చెబుతున్నది మా పోలీస్ డిపార్టుమెంటులోని ట్రైన్డ్  డాగ్స్ గురించి."

 

    "నేను వెళ్ళాలి" శ్రీహర్షలో సహనం నశించిపోతూంది.

 

    "ప్లీజ్"

 

    "అసలే నేను చాలా నిక్కచ్చిగా ఉండే పోలీసాఫిసర్ని. నేరస్థుడ్ని ఎలా విడిచిపెడతాను? అంచేత ముందు స్టేషన్ కి నడువు... లాఠీతో నెట్టాడు.

 

    "ఇట్స్ నాన్సెన్స్"

 

    "ఏది" కసుక్కున నవ్వాడు రాజారెడ్డి, చేతికి చిక్కిన నేరస్థులతో ఎడాపెడా ఆడుకోవడం రాజారెడ్డికి అలవాటు. "నిన్ను నెట్టడమా, నిలదీయడమా?"

 

    "చేసిన నేరం చెప్పకుండా నన్నిలా నిర్భందించాలనుకోవడం."

 

    "నన్నిలా ప్రశ్నించడం నా రికార్డులో తొలిసారి."

 

    "గోటు హెల్ విత్ యువర్ రికార్డ్ రాజారెడ్డి."

 

    "ఏటి... నన్నే..." కోపంతో ఊగిపోయాడు రాజారెడ్డి.

 

    "నిన్నే మిస్టర్ రాజారెడ్డి నా టైం వేస్ట్ చేయకు."

 

    "నా పేరు కూడా తెలిసిపోయిందన్నమాట."

 

    "మూర్ఛరోగి మెడలో బిళ్ళలా నీ షర్టుమీద ఉందిగా."

 

    రాజారెడ్డికి తిక్కరేగిపోయింది "నా పేరు తెలిసినోడివి మరి నాకెంతపేరుందో తెలుసుకోవాలిగా."

 

    చికాగ్గా ముందుకు నడవబోయాడు శ్రీహర్ష.

 

    ఇక్కడ రాజారెడ్డి చేసిన పొరపాటు శ్రీహర్షని ఒక మామూలు నేరస్థుడిగా భావించడం. అంతే, కసిగా లాఠీతో పొట్టలో గుచ్చబోయాడు.

 

    రెప్పపాటులో లాఠీని లాక్కున్న శ్రీహర్ష అంతే సులభంగా విరిచేయడం ఎంత ఆందోళనపరిచిందీ అంటే నిజంగా అతడి సర్వీసులో తొలిసారి అలాంటి సంఘటన్ని ఎదుర్కోవడం.

 

    "అమ్మనీయమ్మ" ఉద్విగ్నంగా పక్కనున్న కానిస్టేబుల్ చేతిలోని లాఠీని అందుకుని మొహంమీద మోదబోతూ క్షణం ఆగాడు.

 Previous Page Next Page