Previous Page Next Page 
అహల్య పేజి 16


    'గోప్రదక్షిణం భూప్రదక్షిణ తుల్యమనీ, అందునా ఈనుతున్న ఆవుకి అంగ ప్రదక్షిణం చేస్తే సంపూర్ణ ఫలం అని శాస్త్రం చెప్పి ఒప్పించి అహల్యణు అర్ధాంగిగా పొందాడట గౌతముడు.'


    'మంచి ఎన్నిక! తగిన సంబంధం! యోగ్యుడైన భర్త లభించాడు అహల్యాదేవికి! ఒక గొప్ప వేదాంతి ప్రపంచానికి లభించబోతున్నాడు!'


    ప్రహస్తుడు చెప్పాడు 'జడను, ముడినీ చూడగానే చలించిపోయే మహేంద్రుడి కంటే జడముడి అయిన గౌతముడు సర్వ విధాలా తగినవాడు ప్రహస్తా!'


    'అందరూ మనసులో అదే అనుకున్నారట ప్రభూ....'


    'మనస్సులోని మాట ఎలా తెలిసిందయ్యా!' నవ్వుతూ అడిగాడు రావణుడు.


    'మనస్సులోని మర్మం అపుడు కాకపోయిన తర్వాత అయినా ఎవరితోనో ఒకరితో వెల్లడిస్తారు కదా ప్రభూ!'


    'ఔనౌను!'


    'ఇంకో వార్త ప్రభూ...'


    'ఏమదీ?'


    'జనక రాజర్షి కూడా ఏదో యాగాన్ని ప్రారంభించాలని సంకల్పించి ముహుర్తాన్వేషణలో ఉన్నారట ప్రభూ!'


    'ఎందుకు?'


    'వంశాంకురం కోసమేమో ప్రభూ....'


    రావణుడు జవాబివ్వలేదు.


    'శాంతాదేవినిచ్చి రోమపాద మహర్షి ఋష్యశృంగుల వారిని అల్లుడిగా చేసుకున్నారట ప్రభూ!'


    'అన్నీ కళ్యాణ వార్తలే వినవస్తున్నాయే...' నవ్వుతూ అన్నాడు రావణుడు.


                                                                      9


    అసదృశంగా వుంది ఆశ్రమ శోభ.


    పిల్లగాలులే వెళ్ళి చెవిలో ఊదాయో, గాలి పిల్లలే వెళ్ళి కబురందించాయో కానీ పరమ నైష్టికుడు గౌతమ మహర్షి అహల్యా ద్వీతీయుడై తన ఆశ్రమానికి విచ్చేస్తున్నారనే వార్త అంతటా వ్యాపించింది.


    గౌతమమహర్షి ఆశ్రమానికి సమీపంలో మరి కొన్ని ఆశ్రమాలున్నాయి. ఆ ఋషులందరూ గార్హస్య జీవితం గడుపుతున్నవారే! నియమంగా, నిష్ఠతో మితంగా, సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తూ, జప తపాలతో యజ్ఞ యాగాదులతో, అతిథి సేవలతో జీవనం సాగిస్తూ ఉన్నవారే!    


    వారందరూ- భార్యాసమేతంగా, శిష్య పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చారు. ఆశ్రమాన్ని అందంగా అలంకార శోభితంగా తీర్చిదిద్దారు. కుటీరాల ముందు కల్లాపి చల్లించి రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. ద్వారాలకు తోరణాలు కట్టారు. తలుపులకు ఎర్రమట్టితో అలంకారం చేసి వాటి మీద శుభస్కరమైన శ్రీకారాలు, స్వస్తి కాకారాలు దిద్దారు.


    పూల తోరణాలు అడుగడుగునా స్వాగతమిస్తున్నాయి. పూపరిమళాలు అంతటా వ్యాపిస్తున్నాయి.


    కోయిలలు కుహూ కుహూ రాగాలు పలుకుతున్నాయి. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. గృహ ప్రవేశం సమయంలో నిర్వహించవలసిన యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఒకచోట జరుగుతున్నాయి.

 

    ప్రవేశ సమయంలో సువాసినీ పూజకు కావలసిన వివిధ సంభారాలన్నీ ఒకచోట సమకూర్చబడినాయి. గౌతమమహర్షి శిష్యులు, సహాధ్యాయులు, అతిథులను యధావిధి అర్ఘ్యపాద్యాదులతో అర్పించి వారి వారికి తగినట్టుగా కుటీరాల్లో విడిది ఏర్పాట్లు చేసి మధుర పానీయాలూ, మధుర ఫలాలూ, మృదు మధురమైన తేనె ఆరగింపులు పెట్టారు. తృప్తోస్మి అనుకున్న మునిగణం మధుదాతా సుఖీభవా అని దీవించారు. మనస్సునిండా తృప్తి నింపుకున్న ఆ మునిజనం ఆర్భాటం లేకుండా, ఆడంబరం లేకుండా శాంత చిత్తంతో ప్రశాంత వదనాలతో గౌతమ మహర్షుల కోసం ఎదురు చూడసాగారు.


    ఆ సమయం రానే వచ్చింది. మహర్షి గౌతములు, జగదేక సుందరి అహల్యా ద్వీతీయులై ఆశ్రమ ప్రాంతానికి విచ్చేశారు. ఒక్కసారిగా వేదగానం నలుదిక్కులా ప్రతిధ్వనించింది. స్వాగత మంత్రాలతో ఆశ్రమం పవిత్రమైంది.


    ముత్తయిదువులు, మహర్షులు పూర్ణ కుంభంలో స్వాగతం పలికారు. మునిపత్నులు హారతిచ్చి పసుపూ, సున్నమూ కలిపిన పారాణి నీళ్ళు దిష్టి తీసి స్వాగతం పలికారు.


    'కుడి కాలు ముందు మోపి లోపలికి దయచేయండి.'


    గౌతములు చిరునవ్వు నవ్వారు. కుడి కాలును ఆశ్రమ ద్వారం దాటి లోపలపెట్టి లోపలకు ప్రవేశించారు. అహల్య కూడా కుడికాలును ముందు మోపి ఆపై లోపలకు ప్రవేశించింది.


    ఆ సమయంలో పరమేష్టి పైనుంచి పూలజల్లు కురిపించాడు. సరస్వతీ చతుర్ముఖులు ఇద్దరూ దీవిస్తూ సేసలు చల్లారు. ఆపై వృద్ధ దంపతులు కొత్త జంటని దీవించి పూలు, సేసలు శిరస్సున చల్లారు.


    అహల్య గౌతముల ఆశ్రమ ప్రవేశం జరిగిపోయింది.


    ఆపై ఇద్దరూ యజ్ఞ సంబరాలు సమకూర్చిన కుటీరం చేరారు. వేదిక వద్దకు చేరి కృష్ణాజినాలపై ఆశీనులయ్యారు.


    వేదోక్తంగా హోమం ప్రజ్వలింపజేశారు. గౌతముల సాటి మునులు, శిష్యులు గొంతులు కలిపి వేద మంత్రాలు పఠిస్తూ స్వాహాకారాలు పలుకుతూ ఉండగా గౌతమ మహర్షులు గార్హస్త్య జీవనానికి నాందిగా గృహప్రవేశ హోమం చేశారు. ఆ మీద పరిసర మునివాటికల నుంచి వచ్చిన మునులకు, ముని పత్నులకూ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు గ్రహించారు.

 Previous Page Next Page