Previous Page Next Page 
పిపాసి పేజి 16


    "రాధీ.... ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఏ తల్లీ తండ్రీ కూడా, తమ బిడ్డల్ని అసహ్యించుకోరు. లోకం అంతా కాదన్నా సరే, వారు తమ బిడ్డలకి రక్షణ కల్పించుకుంటారు. ఈ సంగతి నీకు నువ్వు తల్లివైనప్పుడే అర్థమవుతుంది."


    "మధన్...."


    "అవును రాధీ.... పుత్రవాత్సల్యం తెంచుకోవటం సులభం కాదులే..... ఏడవకు..... వారం రోజుల్లో వస్తారుగా అమ్మా నాన్నా..... అంతదాకా ఓపిక పట్టు" కళ్ళు తుడుస్తూ లాలించాడు మధన్.


    "మధన్ రేణుక పెళ్ళికి మీతోపాటు నేనూ వస్తాను. నా చెల్లెలి పెళ్ళి కళ్లారా చూసి ఆశీర్వదించే హక్కు నాకుంది. అమ్మా నాన్నల అనురాగానికి నోచుకుని. పెళ్ళి చేసుకుంటూన్న దాని అదృష్టాన్ని కళ్ళారా చూసి, మనసారా ఆశీర్వదించాలి. అదే నా కోరిక."


    "అలాగేలే కళ్ళు తుడుచుకో..... నవ్వాలి మరి..... ఏదీ...." రాధిక నవ్వుకుంది.


    "గుడ్ గరల్."


    "మధన్ ఏదయినా మంచి బొమ్మగీయకూడదూ" "ఓ.... యస్.... నవ్వు కంటతడి పెట్టకుండా, నా దగ్గిర కూర్చుని కబుర్లు చెబుతూ వుంటే, ఎన్నైనా గీస్తాను బొమ్మలు పద...." అంటూ తనగదిలోకి తీసికెళ్లాడు.


    "ఏం చెయ్యమంటావ్?"


    "మీకు తోచినది."


    "సరే....."


    ఓ రెండు నిమిషాలు ఆలోచించి, కుంచె తీసుకుని, రంగులు కలిపి వెయ్యటం మొదలెట్టాడు. పదిహేను నిమిషాలకల్లా చక్కని చిత్రం తయారయింది. పల్లెసీమ దృశ్యం.


    సూర్యాస్తమయసమయం. ఎఱ్ఱని సాయంసంధ్య పలుకరిస్తున్నట్టుంది. మరోవైపు కొండలు, కోనలు, చిన్నతటకం, ఉదయించే సంధ్య సింధూరంలా మెరిసిపోతూ ప్రశాంతతని సృష్టిస్తుంది. రెండూ ఒకే పటంలో వుండటంవల్ల రాధికకి అయోమయంగా తోచి" మధన్ ఉభయ సంధ్యలని ఒకే పటంలో చిత్రించావు నీ ఉద్దేశం" అంది.


    "జీవన్మరణాలకి ప్రతీకలు, ఉభయసంధ్యలు పటం, మనిషి జీవితం," అన్నాడు, వాటికేసి చూస్తూ మధన్.


    "మధన్.... ఏమిటో అనుకున్నాను. నీలో ఇంత ఫిలాసఫీ దాగివుందే?" అంది రాధిక ఆశ్చర్యపోతూ.


    "రాధీ.... ఫిలాసఫీ జీవితానికి వెన్నెముకలాంటిది. అయితే, దీని ప్రాముఖ్యత జీవితంలో కొందరు ముందుగా తెలుసుకుంటారు, కొందరు ఆలస్యంగా తెలుసుకుంటారు. అంతేతేడా," అన్నాడు నవ్వుతూ.  


    అంతలో భోజనానికి రమ్మని పిలవటానికి అక్కడికొచ్చింది రాజేశ్వరమ్మ.


    ఇరువురూ లేచి ఆమె వెనకాలే వెళ్లారు.


    రాజేశ్వరమ్మ వడ్డిస్తోంది. నలుగురూ టేబిల్ దగ్గర కూర్చున్నారు భోజనానికి.


    "శ్రీహరిగారు పెళ్ళికి తప్పకుండా రమ్మనమని రాశారు. వెళ్ళకపోతే ఏమనుకుంటారో, నాకు బొత్తిగా ఓపిక లేదు వెళ్ళడానికి. నువ్వెళ్ళు రాజా, అబ్బాయిని తీసుకుని" అన్నారు సాంబశివరావుగారు.   


    "మీరులేనిదే నేనెందుకూ? నేవెళ్ళిపోతే మీకు వండి పెట్టేదెవరు? హోటలు భోజనం పడదాయె. అబ్బాయిని పంపిస్తేసరి. వెళ్ళి చక్కావొస్తాడు. అంది రాజేశ్వరమ్మ.


    "నాకు సెలవెక్కడుందే" అన్నాడు మధన్.


    "బాగుంది ఒక్కరమయినా వెళ్ళిరాకపోతే బాగుండదు. ఎవరమూ వెళ్ళకపోతే ఏమనుకుంటారు" అంది.


    "సరేలే" అన్నాడు మధన్.


    "రేణుక చిన్నప్పుడు బొద్దుగా, చామన చాయగా వుండేది వాళ్ళమ్మలాగే రాధికంతా తండ్రిపోలిక. ఆ సన్నం, తెలుపు అంతా అచ్చం వాళ్ళ నాన్నే" అంటూ రాజేశ్వరమ్మగారు చిన్నతనం గురించి చెబుతూవుంటే సంతోషంతో ఎంతో ఆసక్తిగా వింటూ భోజనం పూర్తి చేసింది రాధిక!


    సాంబశివరావుగారు తన గదిలోకి వెళ్ళిపోయారు.


    రాజేశ్వరమ్మ టేబిల్ సర్దుతోంది.


    "అత్తయ్యా చెల్లాయి పెళ్ళికి నేనూ వెళతాను" అంది రాధిక.


    ఏం జవాబు చెప్పాలో తెలీక ఆమె రాధిక మొహంలోకి చూస్తూ వుండిపోయింది.


    ఈ సంగతి గ్రహించిన మధన్ "పోనీలే, రానీ అమ్మా, చెల్లెలి పెళ్ళి చూడాలన్న కోరిక వుంది కాబోలు రాధికకి అన్నాడు.  


    "అదికాదురా, శ్రీహరిగారు అలా రాశారు కదా..... మరి......"


    'ఫరవాలేదులే అమ్మా! ఏదో అలా భయపడిరాశారుగానీ రాధిక రావాలని వాళ్ళకి మాత్రం వుండదేమిటి?"     


    "సరే తీసికెళ్ళు. మనుషులు దూరమయినంత మాత్రాన మమతలు మాసిపోతాయా?" రక్తసంబంధం అలాంటిది" అంది రాజేశ్వరమ్మ చేతులు తుడుచుకుంటూ.    


    "అత్తయ్యా, ఏనాటి ఋణానుబంధమోకానీ, మీ కుటుంబంతో నా అనుబంధం అన్నింటికీ అతీతమయినది. లేకపోతే ఏమిటిదంతా? నావల్ల మీకింతశ్రమ" నేల చూపులు చూస్తూ తలుపు కానుకునుంచుంది రాధిక.

 Previous Page Next Page