Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 16


    ఇంక లాభం లేదని యాదగిరిని అందరం లాక్కెళ్ళటానికి ప్రయత్నించాం.
    కానీ యాదగిరి మళ్ళీ ఒక విదలింపుతో మమ్మల్ని వదిలించుకొని మైక్ దగ్గరకి పరుగెత్తాడు.
    అదే! ఇంకొక ముచ్చట యాదుకొచ్చినాది. 1969లో ఎవళ్ళువయ్యా తెలంగాణా మూమెంట్ లేవదీసిండు? ఏ బాడుకవయ్యా తెలుగోండ్లకు తెలుగోండ్లకి పుల్లలెట్టిండు? ఆంధ్రోళ్ళందరినీ బొక్కలిరగతనని తెలంగాణాకెళ్ళి భగాయించి, ఆళ్ళ ఆస్థులన్నీ తోడ్ ఫోడ్ జేయించిన సంగతి ఈ సాలెగాళ్ళు గింతల్నే మరిచిన్రా? గీడ మతసామరస్యం ఏడున్నదివయ్యా- మతసామరస్యం ఇడిసిపెట్టు! ప్రాంతీయ సామరస్యమే లేదాయె! గిసంటి హిస్టరీ ఉన్న ఫాల్తూసిటీని చార్ సౌ శహర్ హమారా అని శరమ్ లేకుండా షాన్ తోటి ఫంక్షన్స్ జేస్తున్రు"
    జనమంతా యాదగిరి స్విచ్ కి తప్పట్లు కొట్టడంతో మినిస్టర్ గారి మొహం పాలిపోయింది. "యాదగిరి సచ్చా, మినిస్టర్ జూటా" అంటూ అరిచారు స్టూడెంట్స్. తమాషా ఏమిటంటే మాకు తెలీకుండానే మేమూ తప్పట్లు కొట్టేశాం.
    కొద్ది క్షణాల తర్వాత రంగారెడ్డి మేలుకొని యాదగిరిని మైక్ ముందు నుంచి పక్కకు లాగేశాడు.

    మినిస్టర్ మళ్ళీ స్పీచ్ ప్రారంభించాడు.
    "ఆ వ్యక్తి ఏవో కొన్ని చిన్న చిన్న అల్లర్ల గురించి మాట్లాడుతున్నాడు. కనుక మనం వాటిని పట్టించుకోనక్కర్లేదు- మన నాలుగొందలేళ్ళ మహానగరానికి స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ఆనాది నుంచీ ఉందనీ మరే నగరంలో కూడా స్త్రీలకు ఇంతటి స్వేచ్చా స్వాతంత్రాలు లేవనీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. టావెర్నియర్, థివెనాట్, బెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికులు పదిహేడవ శతాబ్దంలో ఈనగరాన్ని సందర్శించి ఆ రోజుల్లో స్త్రీలకు వివాహ సమయంలో భర్త ఒక ప్రామిస్ చేయాల్సి వచ్చేదని రాశాడు. ఆ ప్రామిస్ ఏమిటంటే స్త్రీకి ఎక్కడయినా తిరిగే స్వేచ్చను ఇస్తానని, ఆమె కల్లు తాగటానికి కూడా అనుమతి ఇస్తాననీ అందరి ముందూ చెప్పేవాడన్నమాట- స్త్రీకి ఇంతటి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్న నగరం మన చార్ సౌ శహర్ హమారా!"
    యాదగిరి జనార్ధన్ పగలబడి నవ్వారు హేళనగా. మేము వారిని నిశ్శబ్దంగా ఉండమని కోరడానికి ప్రయత్నించాం గానీ జనమంతా అతనిని మాట్లాడనివ్వాలని గొడవ చేయడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.
    యాదగిరి మళ్ళీ మైక్ అందుకున్నాడు.
    "అహ్హా! చార్ సౌ శహర్ హమారా!! మినిష్టర్ సాబ్ జెప్పిండు ఆ ఫ్రెంచోళ్ళు ఎవళ్ళో పదిహేడు శతాబ్దంల 'లేడీస్'కి ఎంత ఇజ్జత్, ఎంత ఆజాది ఉన్నాది రాసిన్రని! కానీ మినిష్టర్ సాబ్ ఆళ్ళు రాసింది పూరా సదవలేదన్నట్లు! ఆ జమానాల హైదరాబాద్ నగరంల ఇరవైవేల మంచి వ్యభిచారిణులుండె! అది గూడా ఆళ్ళేరాసిన్రు! అది మినిష్టర్ సాబ్ కెరుకలే! పోనీ, అదిడిసి పెట్టండ్రి! హైదరాబాద్ కెళ్ళి పెండ్లికాని పోరీలను అరబ్ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేసెడిదందా గురించి మినిష్టర్ సాబ్ ఏం జెప్తడు? దినాం న్యూస్ పేపర్ ల జదువుతూనే ఉన్నాం! ఓల్డ్ సిటీల ఎనిమిదేండ్ల పోరీలను డెబ్బయ్ ఏండ్ల ముసలిబాడుకవ్ లు పైసలిచ్చి అరబ్ దేశాలకు తీస్కపోతున్రు! ఒక్కొక్కనికి ఇద్దరు ముగ్గురు పెండ్లాలుండిన నగరం కూడా ఈ చార్ సౌ బీస్ నగరమేనన్న సంగతి మీకు భీ ఎరుక!"
    మళ్ళీ తప్పట్లు మార్మోగిపోయినయ్.
    "మినిష్టర్ వాపస్ జావ్- యాదగిరి స్పీచ్ దేవ్" అని అరవటం ప్రారంభించారు స్టూడెంట్స్!
    మినిష్టర్ కి కూడా చిరాకు పుట్టుకొచ్చింది.
    "నేనిక మాట్లాడదల్చుకోలేదు. మన నగరాన్ని మనందరం కలసి పొగడాలని ప్రభుత్వం హైలెవల్లో డెసిషన్ తీసుకుంది. కనుక మనం పొగడక తప్పదు. నగరం మీలో ఎవరికయినా నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలిగానీ ఇలా నిజాలు బయట పెట్టకూడదు. మన జాతీయ గీతం కంపల్సరీ చేసినట్లు, చార్ సౌ శహర్ హైదరాబాద్ ని పొగుడుతూ కూడా ఓ గీతం తయారు చేయించి అన్ని ఫంక్షన్స్ కి కంపల్సరీ చేయాలని నేను ముఖ్యమంత్రిగారికి సూచన చేయదల్చుకున్నాను-" అనేసి కుర్చీలో కూర్చున్నాడు కోపంగా.
    శాయిరామ్ అదే అవకాశం అని మైక్ అందుకున్నాడు.
    నాలుగొందలేళ్ళ నగరం- నాలుగొందలేళ్ళ వైభవం!
    నాలుగొందలేళ్ళ నగరం- నాలుగొందదేళ్ళ తరం తరం
    ఇప్పుడు కార్యక్రమంలో తరువాతి అంశం మన మునిసిపల్ చైర్మెన్ గారు నాలుగొందలేళ్ళ సుందర నగరం అనే అంశం గురించి మాట్లాడతారు" అనగానే చైర్మన్ లేచి మైక్ ముందుకొచ్చాడు.
    "సోదర సోదరీమణులారా! నిజంగా మనది అందమయిన నగరం సుందరమయిన నగరం. ఈడున్నన్ని సౌలత్ ళు పూరా దునియాల ఏడచూసినాగానీ లేవన్నట్లు! నా ఈ స్పీచ్ షురూ జేసెడి ముందు మన సుందర నగరం లోపటున్న మెయిన్ రోడ్ డ్రైనేజ్ గోతుల్లోపట స్కూటర్లతో సహాపడి చచ్చినోండ్ల గురించి జరమౌనంగా ఉండి సంతాపం పాటించాలె!
    అందరం లేచి డ్రైనేజీ విక్టిమ్స్ గురించి మౌనం పాటించాం!
    చైర్మెన్ మళ్ళీ స్పీచ్ మొదలుపెట్టాడు.
    "గిప్పుడు స్పీడ్ బ్రేకర్లకు, రోడ్డు డివైడర్లకు తగిలి రోడ్డుమీద పడీ గోతుల్లోపడి చీకట్లో కొట్టుకొని చచ్చినోండ్ల గురించి రెండు నిమిషాలు సంతాపం చూపాలి-"
    అందరూ మరోసారి నిశ్శబ్దం పాటించారు.
    "గిప్పుడు మన సుందరమయిన నగరంల ఇండస్ట్రియల్ పొల్యూషన్ దిక్కుకెళ్ళి సచ్చినోండ్ల గురించి సంతాపం పాటించాలె!"
    అందరూ మరోసారి నిశ్శబ్దం పాటించారు.
    "గిప్పుడు మన కార్పొరేషన్ సప్లయ్ చేసే మంచినీళ్ళల్లో డ్రైనేజీ వాటర్ కలిసినప్పుడు చచ్చినోళ్ళ ఆత్మశాంతికి ఇంకో రెండు నిమిషాలు మౌనం"
    మళ్ళీ అందరం లేచి రెండు నిమిషాలు మౌనంగా పాటించాం.
    "గిప్పుడు పోలీసోండ్లు నగ్జలైత్స్ ని కాల్చబోతే గల్తీల గోలీలు తగిలి చచ్చిన పబ్లిక్ గురించి రెండు నిమిషాలు మౌనం నడిపించాలె!"
    మళ్ళీ రెండు నిమిషాలయింది.
    "సోదర సోదరీమణులారా! గిసంటి అందమయిన నగరానికి నాలుగొందలేళ్ళొచ్చి నంక మనం ఖామోషుండానికి ఏడకెళ్లవుతది? ధూమ్ మచాయించాలె! ధూమ్ మచాయింలాల్నంటే పైసలుగావలె! పైసలేడికెళ్ళొస్తయ్! గవర్నమెంట్ కెళ్లిరావాలె! మన నగరంలో అన్నీ మంచిగున్నయ్. కులీ కుతుబ్ షా సాబ్ మంచిగ అన్నీ సోంచాయించి ఈ నగరం కట్టిండు!"
    అతని మాట పూర్తికాకుండానే 'తూనీయవ్వ' అంటూ అరచి లేచి మైక్ ముందుకొచ్చారు యాదగిరి జనార్ధన్ లు.

 Previous Page Next Page