మహాకవీ శ్రీశ్రీ
గంటేడ గౌరునాయుడు
మహాకవీ శ్రీశ్రీ ఓ మార్గదర్శీ
మా జోహార్లందుకో ఓ క్రాంతి దర్శీ !
మరువలేము నీ మార్గం
విడువలేము నీ వాక్యం
నువ్వు నాటిన కవన వనం
మాకు సాహితీ స్వర్గం... !
తెలుగు అక్షరాలకు / నేర్పావు తిరుగుబాటు
బడుగు జనావళికి / చూపావు జరుగుబాటు
కష్టజీవికి ఇరువైపుల / కలంపట్టి నిలిచిన...ఓ
కవీ ప్రజల గుండెల్లో
పదిలమోయి నీచోటు..!
కలల లోకమున బ్రతికే
కడుదీనులను మేల్కొలిపి
నిష్ఠుర సత్యాలుచెప్పి నేలమీదనే నిలిపి
ఎర్రపూలదారిలో ఏకతాటిపై నడిపి
కవీ కలం దూసినావు
శ్రమశక్తిని కదిపి...!
అక్షరమా...కాదది
ఆరిపోని అగ్నికణం
రక్తాన్ని సలసలమని
మరిగించును క్షణక్షణం
నీ పిలుపే ప్రభంజనం
చూపా అరుణారుణం
ఓ కవీ...నీ పాట...మా
నవజాతికి రక్షణం...!!
* సమాప్తం *