ఇతరులు తనకి చేసిన మేలు మాత్రం మరిచిపోదు కూడా!
ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళూ?
సూరజ్ చూపులు తనకి గుచ్చుకుంటున్నట్లుగా అనిపించి, చటుక్కున తిరిగి చూసింది అరుణ.
ఒక్కక్షణం పాటు రెప్ప వేస్తే చాలు, దివ్య దృశ్యం అదృశ్యమైపోతుందేమో అన్నట్లుగా అరుణవైపు తదేకంగా చూస్తున్నాడు సూరజ్.
అతనివైపు కోపంగా చూడబోయిందిగానీ కుదరలేదు అరుణకి. ఈ 'మిస్సింగ్ శారీ' కేసు లో పాపం ఇతనే ముద్దాయి అనుకుని తిట్టుకుంది తను.
గిల్టీగా ఫీలవుతున్న అరుణకి ఆ టైంలో ఏదో ఒకటి కాస్త అపాలజెటిక్ గా మాట్లాడేయాలని అనిపించింది.
"టిఫిన్ చేశారా?" అంది.
కొన్ని మాటలకు పైకి వినబడే అర్థం వేరు. లోపల ఒదిగి ఉన్న అసలు అర్థం వేరు.
'అపార్థం చేసుకున్నాను. ఐయామ్ సారీ!' అని.
"టిఫిన్ చేశారా?" అన్న ఆమె ఆ రెండు మాటలే అతనికి బఫే బ్రేక్ ఫాస్ట్ లాగా అనిపించాయి.
కొన్ని కొన్ని పెద్ద హోటల్స్ లో రూము తీసుకుంటే బ్రేక్ ఫాస్ట్ ఫ్రీ! కాంప్లిమెంటరీ అన్నమాట!
బ్రేక్ ఫాస్ట్ బఫే స్ప్రెడ్ చేస్తారు. ఇడ్లీ, దోశా, వడా, శాండ్ విచెస్, ఛాట్ రకరకాల చెట్నీలు, సాస్ లు, ఫ్రూట్ జ్యూసెస్, కాఫీ, టీ.
మన ఇష్టం! మన ఓపిక!
అట్లాగే అరుణ పలికిన ఈ రెండు తేనె పలుకులూ, ఇంకా కాఫీ అన్నా తాగని తనకి కడుపు నిండిపోయేటట్లుగా చేశాయి.
అంతేకాదు. ఇంకా అనేక రోజులపాటు ఈ మాటలే నెమరేస్తాడు తను. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకోగానీ అరుణ కాస్త ఆపాలజెటిక్ గా చూసిన ఆ చూపు.
శాండ్ విచెస్ లో కొద్దిగా సాస్ లాగా - ఓహ్! ఎంత తియ్యటి అనుభూతి!
మారిపోతోందా అరుణ?
ఆడపిల్ల అనుకోకుండా అనేసిన ఒక్కమాటా, యధాలాపంగా చూసిన ఒక్క చూపూ కూడా ఒక్కోసారి అనుకోని అర్థాలనీ, అపార్థాలనీ, అనర్ధాలనీ కూడా సృష్టించగలవని అర్థం చేసుకోగల గ్రహింపు ఉంది అరుణకి.
అమ్మాయిల విషయంలో ప్రతి మొగవాడూ తనొక సైకో అనలిస్టుననే అనుకుంటాడు. నిజం!
అందుకని, ఇంక మరొక్క మాట కూడా మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది అరుణ.
మరునిముషంలోనే మళ్ళీ తిరిగి వచ్చి, "తీసుకోండి!" అంటూ తను ఆరోజు పొద్దున్నే చేసిన పొంగల్ ని మైసమ్మకీ, ఆమె మొగుడు నర్సింగ్ కీ పెట్టింది.
వాళ్ళిద్దరూ దానిని అక్కడే తినేసి, చెట్ల పాదులూ అవీ ఒకసారి సరిచూసి, సరిచేసి, ఇంకొక్కసారి కృతజ్ఞత ప్రకటించి వెళ్ళిపోయారు.
వెళ్తున్న మైసమ్మా నర్సింగ్ లని ఉద్దేశించి చెప్పింది అరుణ.
"వచ్చేవారం ఒకసారి కనబడండి! కొద్దిగా పనులు ఉన్నాయ్"
పని నిజంగా వున్నా లేకపోయినా కూడా, ఏదో ఒక పని కల్పించి పనివాళ్ళకి కాస్త ఆధారం కలిగిస్తూ ఉండడం అరుణకి అలవాటని ఆ తర్వాత తర్వాత అర్థం అయింది సూరజ్ కి.
తనకి ఉన్నా లేకున్నా - తను తిన్నా పస్తున్నా -
ఎదుటివాళ్ళకి పెట్టడంలో మాత్రం ఎప్పుడూ పెద్ద చెయ్యే!
* * * *
టు కట్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్.
లేదా- జరిగినదంతా ఒక్క ముక్కలో చెప్పేయాలంటే -
అరుణ చేసే ప్రతి పనీ, అరుణ పలికే ప్రతి పలుకూ, అరుణ చూసిన ప్రతి చూపూ, అరు తాలూకు ప్రతి కదలికా కూడా సూరజ్ ని మెస్మరైజ్ చేసేయడం మొదలెట్టాయి.
వాటిల్లో చాలా వాటి వెనక నిజంగానే అరుణ ఔన్నత్యం, వ్యక్తిత్వం ఇమిడి ఉండవచ్చును.
కానీ-
కొన్నిటి వెనక ఏమీ లేకపోయినా కూడా ఉన్నాయని అతను వూహించుకున్నాడు. తన వూహలకి తగినట్లుగా అన్నిటినీ అన్వయించుకున్నాడు.
అతని భావావేశం ఎప్పటికప్పుడు ఎగిసిపడేలా ఎగదోస్తూ ఉండేవి భావన మాటలు.
వైజాగ్ నుంచి ప్రతిరోజూ ఫోన్ చేస్తుంది భావన తన సెల్ కి. ఇక్కడి విషయాలు తెలుసుకుంటుంది. అక్కడి విషయాలు చెబుతుంది. లతీఫ్ గురించి అడుగుతుంది.
సర్వసాధారణంగా ఆమె మాటల సారాంశం ఒక్కటే అయి వుంటుంది.
అరుణది అసాధారణమైన వ్యక్తిత్వం! ఆమెని వదులుకోకు! నీదానిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు! నీకు అన్నివేళలా, అన్నిరకాలా తోడుగా ఉంటాడు మన లతీఫ్!
చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడం అంటారే - ఆల్ మోస్ట్ అట్లాంటిదే!
భావన తనకి ఎంత దగ్గరో అరుణకీ అంతే దగ్గర! తమ ఇద్దరినీ దగ్గర చేయడానికి తన దగ్గర వున్న ట్రిక్కులన్నీ ఉపయోగిస్తూ వుంటుంది ఆమె.
అట్లాగే - భావన అరుణకి రాసే ఉత్తరాల్లో ప్రతిసారీ కూడా "పాపం నీకు ఫోను లేదు కదా! అందుకే వుత్తరం రాయడం..." అన్నట్లుగా మొదలెట్టేది. "అవసరం వస్తే సూరజ్ ఫోను నిరభ్యంతరంగా వాడేస్తూ వుండు. వాడు మనవాడే!" అని రాసేది.. మొగవాడు, అందులోనూ సూరజ్ లాంటి మంచివాడి తోడు ఎంత అవసరమో అని ఉద్బోధ!
లెటర్ ఆఫ్టర్ లెటర్ ఆఫ్టర్ లెటర్!
ప్రతి ఉత్తరం చివర్లో -
"కరెంటు బిల్స్ కడుతున్నావా! ఫ్యాన్ కి కొత్త రిపెయిర్లు ఏవైనా వచ్చాయా?" లాంటి ప్రశ్నలు -
ఉత్తుత్తి సానుభూతి!
ఆ పరిస్థితిలో నుంచి బయట పడమని అన్యాపదేశంగా హితవు!
నిజంగానే ఇవాళ ఇంట్లో గ్యాస్ బుక్ చేస్తే వెంటనే వచ్చేస్తుందేమోనని భయం!
తన దగ్గర డబ్బు లేదు.
ఇంట్లో అమ్మకూడా లేదు.
'ఇంట్లో అమ్మకూడా లేదు' అని అనుకోగానే అరుణకి చటుక్కున ఒక ఆలోచన తట్టింది.
తక్షణం వెళ్ళి సూరజ్ గది తలుపు తట్టింది.
కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తీశాడు సూరజ్.
అక్కడ నిలబడి వున్న అరుణని చూడగానే, తన కళ్ళని తనే నమ్మలేనట్లుగా మళ్ళీ కళ్ళు నులుముకుని చూశాడు.
"అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే!" అన్నాడు ఉద్వేగంగా.
చిన్నగా నవ్వింది అరుణ.
"ఒక విషయం అడగడానికి వచ్చాను"
"వంద విషయాలు అడగండి."
"ఇవాళ మీరు ఫ్రీగా వున్నారా."
"మీరు చెబితే పనులన్నీ ఎక్కడివక్కడ వదిలేయడానికి ఎల్లప్పుడూ సిద్ధం!"
"సినిమాకు వెళ్తే ఎలా వుంటుందీ?"
"ఎవరు?...మీరూ..నేనూ"
"మనం..సినిమాకే!" అన్నాడు అపనమ్మకంగా.
"ఏ సినిమా అని అడగరేం?"
"ఏ సినిమా అన్నది నాకు అనవసరం! మీ పక్కన కూర్చోగలిగితే చాలు!"
"పక్కనే కూర్చున్నా పెద్దమనిషి తరహా మాత్రం మారదనే ఆశిస్తున్నాను."
ఒక్క గుటక మింగి, "నా దేవత నన్ను కరుణించినట్లుగా ఉంది అరుణా!" అన్నాడు ఎంతో సిన్సియర్ గా.
"ఇట్లాంటి డైలాగులు సినిమాలో ఎట్లాగూ వింటాంగా! మ్యాట్నీకి వెళదాం" అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది అరుణ.
* * * *
మధ్యాహ్నం ఇద్దరూ కలిసి మ్యాట్నీకి వెళ్ళారు. "ఈ సినిమా నేను ఇదివరకే చూసేశాను" అనేసి, అంతలోనే తప్పు దిద్దుకుంటున్నట్లుగా, "అయినా సరే - మీతో కలిసి ఇంకో అయిదొందల సార్లు చూడడానికి నేను రెడీ!" అన్నాడు.
"అయిదు వందల సార్లు అనవసరంగానీ, మరొక్కమారు చూస్తే చాలు!" అంది అరుణ.
అతనికి హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది.
"ఈ సినిమా టైటిలు 'హమ్ దిల్ దేచుకే సనమ్' అంటే, 'నా హృదయాన్ని ఇచ్చేశాను' అని కదా అర్థం! అంటే కొంపదీసి ఇప్పటికే మీరు మీ హృదయాన్ని...?"
"హృదయమా?" అని నిరసనగా నవ్వి, "నరమానవుడి కెవ్వరికీ ఇవ్వలేదు" అంది అరుణ.
సూరజ్ టిక్కెట్లు కొన్నాడు.