Previous Page Next Page 
ఆక్రోశం పేజి 16


    ఓల్డ్ ఢిల్లీలోని చాణిక్యపురి ఏరియా.

 

    ఫైవ్ స్టార్ హోటల్లా వున్న అయిదంతస్తుల భవనంలో-

 

    అయిదో అంతస్తులో విశాలమైన ఏ.సీ. రూమ్ లో కూర్చున్నాడు ప్రమోద్.

 

    మహంత బిజినెస్ వరల్డ్ ఇండియా బ్రాంచ్ కి ప్రమోద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్.

 

    అతను ప్రస్తుతం కార్డ్ లెస్ టెలీఫోన్లో, మహంత చెప్తున్న దాన్ని శ్రద్ధగా వింటున్నాడు.

 

    "దేశ్ ముఖ్ ఇండియాలో ఎక్కడకెళ్ళినా, అతన్ని మన మనుషులు రహస్యంగా అనుసరించాలి. అతను కలిసే వ్యక్తులు, అతన్ని కలిసే వ్యక్తుల మీద నిఘా ఏర్పాటు చెయ్యాలి. ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు న్యూయార్క్ లోని మన హెడ్ ఆఫీసుకి ఇన్టిమేట్ చెయ్యాలి" సీరియస్ గా విన్పిస్తోంది మహంత గొంతు.

 

    "ఎస్ చీఫ్" ప్రమోద్ వినయంగా అన్నాడు.

 

    "బీ ఎలర్ట్ మాన్! ఐ విల్ కాల్ యూ లెటర్" మహంత ఫోను పెట్టేయడంతో దీర్ఘనిశ్వాస విడిచాడు ప్రమోద్.

 

    అకస్మాత్తుగా మహంత చూపు దేశ్ ముఖ్ మీద ఎందుకు పడింది? ఎప్పుడూ ఏ విషయమూ డైరెక్ట్ గా చెప్పని మహంత ఎందుకు ఈ విషయాన్ని తనే స్వయంగా డీల్ చేస్తున్నారు?

 

    అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు ప్రమోద్. ఎక్కడా అతనికి లంగరు అందటం లేదు.

 

    ఆటోమేటిగ్గా అతని చెయ్యి కార్డులెస్ టెలిఫోన్ ని అందుకుంది. ఎస్ టి డి. కోడ్ ని ప్రెస్ చేశాడు తర్వాత-

 

    బిజినెస్ వరల్డ్ బొంబాయి బ్రాంచ్ ఆఫీసు నెంబర్ ని ప్రెస్ చేశాడు.

 

    రెండు క్షణాల తర్వాత-

 

    బొంబాయి ఆఫీసులో ఫోను మోగింది.

 

    ఆ ఆఫీసు బొంబాయిలో ఇండియాగేట్ కు, మూడు కిలోమీటర్ల శివశక్తి నగర్లో వుంది.

 

    ఆ ఆఫీస్ లో అప్పుడే తన ఛాంబర్ లోకి ప్రవేశించిన సాకేతా పరుగు లాంటి నడకతో టేబుల్ దగ్గరకెళ్ళి-

 

    ఫోను రిసీవర్ అందుకుంది.

 

    "ఎస్! సాకేతా హియర్."

 

    ముప్పైఏళ్ళ సాకేత అరవిచ్చిన రబ్బర్ గులాబీలా అందంగా వుంటుంది. సన్నగా, పొడవుగా, నిండైన స్త్రీత్వానికి, కనువిందైన నిదర్శనంలా వుంటుంది సాకేత.

 

    "మిస్ సాకేతా! అయామ్ ప్రమోద్."

 

    "గుడ్ మార్నింగ్ బాస్! చెప్పండి."

 

    ప్రమోద్ చెప్పటం ప్రారంభించాడు.


                                                        *    *    *    *


    సరిగ్గా ఉదయం 10.50 నిమిషాలైంది.

 

    విక్టోరియా టెర్మినల్ రైల్వేస్టేషన్ నుంచి బ్లాక్ అంబాసిడర్ కారు బయలుదేరింది.

 

    ఆ కారు వెనక సీట్లో-

 

    కుమారస్వామి, నర్సింహ మధ్యన వెనక్కి చేరబడి పడుకుంది లక్ష్మి. ముందు సీట్లో డ్రైవర్, ఆ పక్కన యాభైఏళ్ళ వ్యక్తి కూర్చున్నాడు.

 

    "చంపక్ లాల్ ఆషామాషీ కేసుల్ని పంపించడు. నాకప్పుడే తెల్సు" లక్ష్మి వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ అన్నాడు అతను.

 

    అతని విచిత్రమైన వేషధారణ వైపు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు నర్సింహ.

 

    "గురూ! ఈడు ఆడోడంటావా, మగోడంటావా?" సందేహంగా కుమారస్వామి చెవిలో అడిగాడు నర్సింహ.

 

    "ఈ వూళ్ళో అంతే. ఎవర్నీ వెంటనే పోల్చుకోలేం" అన్నాడు కుమారస్వామి.

 

    "స్టేషన్ దగ్గర ఈ పిల్లని నీ కప్పగించేసి, వెంటనే వెనక్కొచ్చే మన్నాడు చంపక్ లాల్. మమ్మల్నెందుకు తీసికెళ్తున్నావు?" అడిగాడు నర్సింహ.

 

    ఆ ప్రశ్న అడిగిన నర్సింహవైపు విచిత్రంగా చూశాడతను.

 

    "పిల్ల నిఖార్సయిందో, కాదో తేల్చుకోవద్దూ. ఆ తరువాత మిమ్మల్ని పంపించేది."

 

    "అంటే?" అడిగాడు నర్సింహ.

 

    "బొంబాయి సంగతి నీకు తెలీదులా వుంది. డాక్టర్ కి చూపించాల. కన్యో, కాదో తేల్చాల... గ్రేడ్ సెపరేషన్ చెయ్యాల..." చెప్పుకుపోతున్నాడతను.

 

    లక్ష్మి ఎదురుగానే ఈ బేరసారాలన్నీ జరుగుతున్నా వాటిని ఏమాత్రం తెల్సుకోలేని పరిస్థితుల్లో-

 

    మసక, మసక వెల్తురులాంటి మగత మత్తులో-

 

    తను ఎక్కడుందో, ఎటు వెళ్తుందో తెలీని స్థితిలో వుంది లక్ష్మి.


                               *    *    *    *


    అచ్యుతముని...

 

    యాభై ఆరేళ్ళ అచ్యుతముని పాలల్లోంచి తీసి, పనస తొనలతో అద్దినట్టుగా నిగనిగలాడుతుంటాడు.

 

    పట్టు లాల్చీ, పట్టు పంచ, మెడలో రుద్రాక్షలు, ఖరీదైన వుంగరాలు, నుదుటున బొట్టు, గిరజాల జుత్తు.

 

    విశాలమైన నుదురు. ఆ నుదురు మీద మెరిసే విభూతిరేఖలు, మధ్య రూపాయి బిళ్ళంత బొట్టు, బండ ముక్కు, పొడవైన పెదాలు, దృఢమైన దేహం... కళ్ళకు రేబాన్ గ్లాసులు.

 

    కలకత్తా నుంచి అప్పుడే బొంబాయి వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్ విమానంలోంచి దిగిన-

 

    అచ్యుతముని ఎయిర్ పోర్టు లాండ్ లోకి అడుగుపెట్టాడు.

 

    అచ్యుతమునిని దూరం నుంచి చూడగానే రెండు చేతుల్తో నమస్కరించి ముందుకెళ్ళాడు జనమేజయరావు.

 

    కుడి చెయ్యెత్తి ఆశీర్వదించాడు అచ్యుతముని.

 

    మరో రెండు క్షణాల్లో కారు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది.

 

    "వాట్ జనమేజయ! ఎలా వుంది బొంబాయి" ముందు సీట్లో కూర్చున్న జనమేజయరావు వైపు చూస్తూ అడిగాడు అచ్యుతముని.

 

    "కృపానంద దేశ్ ముఖ్ తో చిన్నపని పడింది. ప్రస్తుతం దేశ్ ముఖ్ బొంబాయిలోనే వున్నారు" చెప్పాడు జనమేజయరావు.

 

    "ఏంటా పని...?"

 

    చెప్పాడు జనమేజయరావు.

 Previous Page Next Page