Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 16


    "మాదిరెడ్డి సులోచనరాణి..."  

 

    అందరూ ఘోల్లున నవ్వారు.

 

    "అయ్యా! నవ్వకండి! ఇది మన పదోతరగతి హిందీ పుస్తకం. తయారుచేసిన వారి అభిప్రాయం! మన తెలుగు ప్రభుత్వం వారు చెప్తోన్న నగ్నసత్యం! శ్రీమతి మాదిరెడ్డి సులోచన మన తెలుగు భాషలో ఉన్న కొన్ని వందలమంది రచయిత(తు)లలో ఒకరు. వ్యాపార సరళిలో రచనలు చేయటం తప్ప తెలుగు సాహిత్యానికి గానీ, సంస్కృతికి గానీ చేసిన మేలేమీ లేదు. పైపెచ్చు అంతకంటె ఎన్నో విధాలుగా గొప్ప రచనలు చేసిన వారెంతో మంది ఉన్నారు. అయినా మన సిలబస్ కమిటీకి, ప్రభుత్వానికీ ఆ పుస్తకం ఎడిటరు గారికీ ఆవిడ రచనలే ఉత్తమ సాహిత్యం అనిపించింది. ఆమె పేరు కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావ్ ల స్థాయికి తీసుకెళ్ళారు"

 

    "షేమ్ షేమ్-" అరచారెవరో.

 

    హఠాత్తుగా విప్లవజ్యోతి మళ్లీ అందరినీ పక్కకు తోసి మైక్ దగ్గరకు చేరుకున్నాడు.

 

    "అమ్మలారా, అయ్యలారా! ఇప్పుడయినా అన్నగారి అవకతవకల భాగోతం తెలుసుకున్నారా? తెలుగు సంస్కృతీ, తెలుగుభాష, తెలుగు ఆత్మగౌరవం- అహ్హహ్హహ్హ- మాదిరెడ్డి సులోచనరాణి అన్నట్లు మర్చిపోయాను- ఆవిడ పేరు కూడా ప్రభుత్వానికి, పాఠ్యపుస్తకం ఎడిటర్స్ కి తెలీదు- 'సులోచన' అని ఉండాల్సింది- సులోచనరాణి అయిపోయింది. పేరు కూడా ఎవరికీ సరిగ్గా తెలీని రచయిత్రి జీవిత చరిత్ర గురించి మన తెలుగు బాలబాలికలందరూ నేర్చుకుని తరించాలిట! కేవలం నాలుగు డబ్బులు సంపాదించటం కోసమే వ్యాపారం చేస్తున్న పబ్లిషర్లు కొంతమందికి ఆమె సేవ జేసి ఉండవచ్చు - అంతమాత్రాన ఆ సాహిత్యాన్నంతా గొప్ప సాహిత్యంగా భావించి- మన చిన్నారి బాలల మనసులను కలుషితం చేయటం అక్రమం- దారుణం! ఇది మీ ఎన్ టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరగటం ఇంకా ఘోరం- మనందరికీ అవమానం-"

 

    ఈసారి ఎవ్వరూ అతనిని హేళన చేయలేదు.

 

    "హా! తెలుగుజాతి- తెలుగుభాష తెలుగు- ఆత్మగౌరవం- ధూ! నీయవ్వ" అనేసి మైక్ దగ్గర్నుంచి హడావుడిగా వెళ్ళిపోయాడు.

 

    అంతా నిశ్శబ్దం అయిపోయారు.

 

    శాయిరామ్ నెమ్మదిగా మైక్ ముందుకొచ్చాడు.

 

    "సోదర సోదరీమణులారా! ఈ తెలుగు వాచకాలు మన పిల్లలందరినీ ఎంతగా హింసిస్తున్నాయో ఇప్పుడు అర్థమయింది. మనకాలనీవాసి యాదగిరి వాళ్ళబ్బాయ్ పిచ్చి మాటలు కూడా కేవలం తెలుగువాచకాల వల్లనే జరిగిందని నా అనుమానం-"

 

    "అనుమానం కాద్సార్- నిజమే అది" ఓ ముసలాయన జనంలోంచి మైక్ దగ్గరకొచ్చాడు.

 

    "నాపేరు దశరథరామయ్యండీ! నేను యాదగిరి వాళ్ళ అబ్బాయి చదివే స్కూల్లో తెలుగు టీచర్ని. యాదగిరి వాళ్ళబ్బాయి పిచ్చి మాటలు మాట్లాడడం కేవలం నా పొరపాటు వల్ల జరిగిందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. జరిగిందేమిటంటే యాదగిరి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలూ యించుమించుగా ఒకే పోలికలతో ఉంటారు. అంచేత పొరబాటున యాదగిరి రెండో కొడుకుని వాళ్ళ పెద్దబ్బాయి అనుకుని వేరే క్లాస్ కి బలవంతంగా లాక్కెళ్ళి ఆ క్లాసు తెలుగువాచకం చదివించాను, మరి ఇంత లేత పిల్లలు అలా రెండు తెగులు వాచకాలు చూసేసరికి కొంచెం మతిచలించడం సహజమే! ఇందుకు ప్రాయశ్చిత్తంగా నేనే నా ఖర్చు మీద ఆ కుర్రాడిని మంచి సైకాలిజిస్ట్ కి చూపించి నయం చేయగలనని మనవి చేస్తున్నాను."

 

    అతను యాదగిరి కుర్రాడిని రిక్షాలో తీసుకువెళ్ళిపోయాడు.

 

    శాయిరామ్ ఉత్సాహంగా మళ్ళీ మైక్ దగ్గరకు వచ్చాడు.

 

    "సోదర సోదరీమణులారా! మన పిల్లలందరి క్షేమం కోసమని మన కాలనీ సభ్యులు కొంతమందితో ఓ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కమిటీవారు తెలుగు వాచకాల్లోని తప్పులను గురించి, ప్రభుత్వానికి తెలుగులో తమ రిపోర్ట్ ను సమర్పిస్తారు" అంతా తప్పట్లుకొట్టారు.


                                *  *  *  *  *

 Previous Page Next Page