Previous Page Next Page 
ప్లే పేజి 16


    "మరి ఏవిటీ డ్రామా..."
    
    "ఇది డ్రామాకాదు - అసలు డ్రామా ఇంకా స్టార్ట్ కాలేదు.... వస్తా మళ్ళీ కలుస్తాను".... హేండ్ బ్యాగ్ తీసుకొని, బయటికొచ్చింది ఆ అమ్మాయి.
    
                                                   *    *    *    *    *
    
    గాంధీ హాస్పిటల్...
    
    మార్చురీ శవాన్ని చూసి, సంబంధిత డాక్టర్ తో మాట్లాడి, బయటికొచ్చాడు సూర్యవంశీ.
    
    "చనిపోయిన వ్యక్తిని తెల్సుకోడానికి, ఏకైక ఆధారం.... అతని బ్లడ్ గ్రూప్..... అంతకంటే.... ఈ కేసుని సాల్వ్ చెయ్యడానికి మరే ఆధారం లభించడంలేదు..."
    
    సంబంధిత డాక్టర్ చెప్పిన విషయాలే గుర్తుకొస్తున్నాయి సూర్యవంశీకి.
    
    అక్కడ నుంచి, సుల్తాన్ బజార్ వెళ్ళాడు.
    
    ఏ.సి.పి. నిరంజనరావుని కలిసాడు.
    
    "కేసు తలా తోకా లేకుండా ఉంది కదూ...." నవ్వుతూ ప్రశ్నించాడాయన.
    
    "బాడీకి తల లేనంత మాత్రాన, కేసుకు కూడా తలా, తోకా లేదంటే నేనొప్పుకోను సార్...." సీరియస్ గా అన్నాడు సూర్యవంశీ.
    
    "అంటే..." ఎ.సి.పి. నిరంజనరావు భ్రుకుటి ముడిపడింది.
    
    "లోకల్ ట్రైన్, వికారాబాద్ లో స్టార్ట్ అవుతుంది....అంటే....వికారాబాద్ రైల్వేస్టేషన్లో.... ఆ గోనె సంచిని, ఎవరో తెచ్చి వేసుంటారు. అందుచేత మనం.....వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, మన ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తే...."
    
    అనుమానంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
    
    "వికారాబాద్ రైల్వేస్టేషన్లో ఆ గన్నీబేగ్, కంపార్ట్ మెంట్ లోకి తెచ్చారనడానికి ఆదరాలేమీ లేవు - వికారాబాద్ కి, నాంపల్లికీ మధ్యన పది స్టేషన్లున్నాయి- రిపోర్టు ప్రకారం - మర్డర్ జరిగిన ఆరు గంటల తర్వాత..... ఆ మొండాన్ని గోనె సంచిలో వేసి ఉండొచ్చని... డౌటు... అంటే.... వికారాబాద్ లో ట్రైన్ బయలు దేరిన టైమ్... ఆయా స్టేషన్లలో, ట్రైన్ ఆగిన టైమ్ తెలియాలి.... అంటే వికారాబాద్ స్టేషన్ లోనే, ఆ గన్నీ బ్యాగ్ ను లోడ్ చేసుంటారనుకుంటే.... తెల్లవారు జామున నాలుగు గంటలకు అక్కడ ట్రైన్ స్టార్టయిందనుకుంటే.... అంతకు ఆరు గంటల ముందు.... ఆ హత్య జరగడానికి అవకాశం ఉంది..."
    
    "ఎస్.... యూ ఆర్ కరెక్ట్ సర్.... ఈ పది స్టేషన్లకీ..... మన వాళ్ళను పంపితే...." సలహా ఇచ్చాడు సూర్యవంశీ.
    
    "నో మిస్టర్ వంశీ.... బబ్లూ సిటీకి చెందిన రౌడీ షీటర్.... అతన్ని దారుణంగా మర్డర్ చేసి, సిటీకి పంపించారంటే...ఎవరు పంపించి ఉంటారు..... ఎందుకు పంపించి ఉంటారు..... వాటీజ్ దైర్ మోటివ్.... సమ్ థింగ్ ఈజ్ బి హైండ్ ఇట్.... పది స్టేషన్లకూ, పోలీసుల్ని పంపడం వల్ల.... హంతకులు జాగ్రత్తపడే అవకాశంఉంది.....ఎనదర్ పాయింట్.... బబ్లూ.... ఏ పొలిటికల్ సర్కిల్ కి చెందినవాడో తెలుసా...." ఆ మాట అంటున్నప్పుడు ఏ.సి.పి. నిరంజనరావు స్వరం తగ్గించి మాట్లాడడాన్ని స్పష్టంగా గమనించాడు సూర్యవంశీ.
    
    ఏ.సి.పి. నిరంజనరావు ఒక్కక్షణం మెయిన్ డోర్ వేపు చూసి -
    
    "సీ... మిస్టర్ వంశీ.... బబ్లూ... భూ కబ్జా.... జనార్ధన్ ఠాగూర్ మనిషి.....భూ కబ్జా జనార్ధన్ ఠాగూర్ అంటే ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు...." చెప్పడం ఆపాడు నిరంజనరావు.
    
    భూకబ్జా జనార్ధన్ ఠాగూర్ అంటే.... రాష్ట్ర హోంమినిస్టర్.....జనార్ధన్ ఠాగూర్.....సిటీలోని పవర్ ఫుల్ వ్యక్తి......తన స్వార్ధం కోసం, ఏమైనా చెయ్యగలిగే వ్యక్తి. ఎంతటి విధ్వంసాన్నయినా సృష్టించగలిగే వ్యక్తి..... పవర్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ నే, తన అంగబలాన్ని, అర్ధబలాన్ని చూపించి, బెదిరించగలిగే వ్యక్తి...సి.ఎమ్.....పదవి కోసం.... గత అయిదేళ్ళ నుంచీ ప్రయత్నిస్తున్న వ్యక్తి..... ఒక్కసారి జనార్ధన్ ఠాగూర్ ఆకారం కళ్ళముందు కదలాడింది సూర్యవంశీకి!
    
    "బబ్లూ..... భూకబ్జా జనార్ధన్ మనిషా? ఈ విషయం, నాకింత వరకూ ఎందుకు చెప్పలేదు...." ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
    
    "ఎస్.... ఆ విషయం.... ఒక గంట క్రితమే కన్ ఫర్మ్ అయింది.... ఆ ఇన్ ఫర్ మేషన్, స్వయంగా నేనే సంపాదించాను..... బబ్లూ..... భూకబ్జా జనార్ధన్ ఠాగూర్ మనిషన్న సంగతి.....డిపార్ట్ మెంట్లో కూడా అతి తక్కువ మందికి తెల్సు....
    
    డి.ఐ.జి. కూడా, ఈ కేసుని పొడిగించడానికి.....సుముఖంగా లేడు...."
    
    "ఈ కేసు విషయం....డి.ఐ.జి. మాట్లాడారా..." ఆసక్తిగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
    
    "ఎవడో రౌడీషీటర్....మర్డర్ అయితే...దానిమీద ఎంక్వయిరీ ఏంటని కొట్టిపారేసాడు డి.ఐ.జి..... పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు..... సో...." మరో అయిదు నిమిషాలసేపు ఏ.సి.పి. నిరంజనరావు ఏం మాట్లాడలేదు.
    
    "జనార్ధన ఠాగూర్ మనిషిని ఎవరు హత్యా చేసుంటారు....అందులోనూ హోం మినిస్టర్..." ఆలోచనలతో, సూర్యవంశీ తల వేడెక్కిపోయింది.
    
    "ఇక్కడ పాయింట్ అది కాదు... ఎందుకు హత్య చేశారన్నది? హత్య ఎందుకు జరిగిందో తెల్సుకోగలిగితే... చిక్కుముడి పూర్తిగా విడిపోతుంది. కానీ.....ఆ మిస్టరీ ఛేధించడం... చాలా కష్టం.... ఇట్స్ ఏ రిస్కీ జాబ్.... అవసరమైతే.... ప్రాణాలు, కోల్పోడానిక్కూడా సిద్దంగా ఉండాలి. అందుకే... నాకూ ఏం చేయాలో తోచటం లేదు..."
    
    "అందుకే... ఏమిటి- అందుకే... చెప్పండి సార్.... మీరు నన్ను కేసు టేకప్ చెయ్యమంటారా... చచ్చింది బబ్లూగాడో కాదో...చచ్చింది వాడే అయితే...ఎవరు చంపారో... తెల్సుకుంటాను-ఎస్... ఈ సూర్యవంశీ మేధస్సుమీద, పట్టుదలమీద, ఆత్మ విశ్వాసంమ్మీద మీకు నమ్మకం ఉందనుకుంటాను...."సూర్యవంశీ మాటలు వెనకున్న ఎమోషన్ ను వెంటనే గుర్తుపట్టాడు ఎ.సి.పి. నిరంజనరావు. అయినా వెంటనే ఆయన బదులివ్వలేదు.
    
    "దిసీజ్ నాట్ ఆర్డినరీ కేస్.... ఈ కేస్ ని డీల్ చేసి, నేరస్తుడెవరో తెల్సుకున్నంత మాత్రాన, నీకు గానీ, నాకు గానీ,  పేరురాదని నాకు తెలుసు.....కోరి కష్టాలను తెచ్చుకోవడం.....
    
    నీ బతుకుతో నేను ఆడుకోవడం అవుతుందేమో...?"
    
    ఆ మాటలకు, సూర్యవంశీలో ఒక్కసారిగా ఆవేశం పైకుబికింది.....
    
    "మీరు నాకు పిరికితనాన్ని నూరిపోస్తారని నేనెప్పుడూ అనుకోలేదు.....సర్.... నా గురించి మీకు తెలుసు, నేను పోలీసును కాను... సామాజిక బాధ్యతను సిన్సియర్ గా ఫీలయ్యే జర్నలిస్ట్ ని - సమాజంలో జరిగే ప్రతి అన్యాయంమ్మీద, తిరగబడే హక్కు నాకుంది.... నాలాంటి యువతరానికుంది.... అన్నీ తెలిసిన మీలాంటివారే, మా యువతరాన్ని మిస్ గైడ్ చేస్తున్నారు సర్- మీలాంటి సిన్సియర్ వ్యక్తులు... మా లాంటి వారికి గైడ్ చెయ్యాలి సర్... సమాజంలోని చెడుని ఎవరో వచ్చి తుడుస్తారంటే, నాకు నమ్మకం లేదు.... ఎన్ని కష్టాలొచ్చినా, దుర్మార్గానికి, అవినీతికి, కుళ్ళు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం ఈనాటి యువత లక్ష్యం, ధ్యేయం కావాలి...."
    
    "మిస్టర్ సూర్యవంశీ! ఉపన్యాసం వేరు.... ప్రాక్టికల్ లైఫ్ వేరు...
    
    నేను నీ వయసులో నీకన్నా రెట్టింపు ఆవేశంతో ఉండే వాడ్ని.... నా ఆవేశానికి నేను వేసుకున్న పోలీసు దుస్తులు మరింత కారణమయ్యాయి....నేను ఏం కోల్పోయానో నాకు తెలుసు.... ప్రాణ ప్రదంగా నన్ను ప్రేమించిన నా భార్యను నేను కోల్పోయాను.... తల్లి జ్ఞాపకం రాకుండా పిల్లల్ని పెంచడం...ఎంత కష్టమో నీకు తెలీదు వంశీ...." అంతటి గంభీరమైన వ్యక్తి నిరంజనరావు గొంతు అకస్మాత్తుగా గాద్గదికమైపోయింది.

 Previous Page Next Page