Previous Page Next Page 
నానీ పేజి 15


    మరణ వాంగ్మూలాన్ని స్వయంగా నోట్ చేసుకున్న మేజిస్ట్రేట్ కోర్టులో దాని వివరాలు అందించిన మరుక్షణం నిజానికి కేసుకి అక్కడ శాశ్వతంగా తెరపడిపోతుంది. కానీ యాదృచ్ఛికంగా అయినా యశస్వి ఒక చిన్నతీగెను కదిపి కొత్తవిషయాన్ని తెలుసుకోగలిగాడు.

 

    "వెల్... గో ఏ హెడ్... సాధ్యమైనంత త్వరగా వివరాలన్నీ సేకరించు" అన్నాడు పచార్లు చేస్తూనే.

 

    "థాంక్యూ సర్" ఒక మరణంతో సమాధి అయిపోయిన వాస్తవాన్ని బయటకు రాబట్టే ప్రోత్సాహానికి యశస్వి కంఠంలో అస్పష్టమైన బాధ ధ్వనించింది. "కానీ చిన్న రిక్వెస్ట్ సర్."

 

    రఘునాథరావు పచార్లను ఆపి వింటున్నట్టుగా చూశాడు.

 

    "మూడు నాలుగురోజుల్లో మొత్తం వివరాల్ని సేకరించగలను. కాని, నా ఇంటరాగేషన్ లో దోషులనుకున్న వాళ్ళని పెద్దగా కంగారు పెట్టకుండా కేవలం ఈ హత్య వెనుకవున్న మోటివ్స్ మాత్రం తెలుసుకోగలిగాను."

 

    "యూ మీన్..." అర్థంకాలేదు రఘునాథరావుకు ఏ విషయం స్పష్టం చేయాలని అతడు ప్రయత్నిస్తున్నదీ.

 

    "ఇలాంటి నేరాల్లో దోషులు తెలివిమీరకుండా వుండాలీ అంటే ఇంటరాగేషన్ చాలా ఫార్మర్ గా ముగిసిపోవాలి. వాళ్ళు ప్రస్తుతం అనుకుంటున్నది పావని ఇచ్చిన మరణవాంగ్మూలంతో తమకు ప్రమాదం తప్పిపోయిందని. లెట్ దెమ్ బి అండర్ ది సేమ్ ఇంప్రెషన్ సర్! కేవలం ధైర్యంతోనే వాళ్ళు మామూలుగా కోర్టుకి వస్తారు. మనం నిజంగా ఇవ్వాల్సిన రిజల్టు అక్కడ, అంటే కోర్టులో..."

 

    రఘునాథరావు భృకుటి ముడిపడింది.

 

    "యస్సర్! నా ప్రిలిమినరీ ఎంక్వయిరీలో వాళ్ళకేమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళు ఎలా ఎవరిద్వారానో లేక తమంతట తాముగానో ఏం జవాబు చెప్పాలీ ఎలా చెప్పాలీ అన్నది ముందే ప్రిపేరైపోయే అవకాశముంది. దానితో నానీనిసైతం ఇన్ ఫ్లూయెన్స్ చేయొచ్చు. వాళ్ళమీద ఆధారపడి బ్రతికే నానీ ఈ కేసులో మనకి విట్ నెస్ కాబట్టి ఏమాత్రం మనకు ప్రతికూలంగా సాక్ష్యమిచ్చినా కేసు వీగిపోతుంది. కాబట్టి..." ఓ క్షణం ఆగాడు. "కోర్టులోనే వాళ్లని మెంటల్ గా షటర్ చేయాలి. అంటే మనం చార్జిషీట్ లో రాసిన వివరాల్నిబట్టి దోషుల్ని అక్కడే కన్ ఫ్యూజ్ చేసి అసలు నిజాన్ని యుక్తిగా కక్కించాలి. ఆఫ్ కోర్స్! మన తర్కానికి సపోర్ట్ గా నానీ ఎలాగూ వుంటాడు. సో,మిమ్మల్ని రిక్వెస్టు చేసేదేమిటంటే ఈ విషయాలన్నీ మీరు ముందుగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడమని. ఆయన సహకరిస్తే మన జాబ్ చాలా సింప్లిఫై అయిపోతుంది."

 

    సుమారు రెండు దశాబ్దాల అనుభవంగల రఘునాథరావు నేరస్థుల మానసికస్థితిని మరోకోణంలో దర్శించే ప్రయత్నం చేస్తున్న యశస్విని రెప్పవాల్చకుండా చూస్తూ వుండిపోయాడు చాలాసేపటిదాకా.

 

    ప్రతి పోలీసాఫీసరులో ఇంతలోతుగా విశ్లేషించగల శక్తే వుంటే ఎంత బావుణ్ను అన్న ఆలోచనో లేక ఒక విధిగాకాక నిజాయితీగా నిర్వర్తించాల్సిన ధర్మంకోసం యశస్వి పడుతున్న తపనపై అభిమానమో అతడ్ని సమీపించి ప్రేమగా భుజంపై పేట్ చేశాడు రఘునాథరావు. "ఐ విల్ సర్టెన్లీ స్పీక్ టు పబ్లిక్ ప్రాసిక్యూటర్... కాని నిజాన్ని ఈ పద్ధతిలో రాబట్టగలమన్న నమ్మకం నీకుందా?"

 

    "సర్..." అటెన్షన్ లో నిలబడే అన్నాడు. "థియరీ ఆఫ్ ఎక్స్పయిర్డ్ కేరక్టరిస్టిక్స్ అన్నది లామార్కు సిద్దాంతం. ప్రతి ప్రాణి తన పరిసరాలలోని మార్పులకి అనుగుణంగా తనను తాను సంస్కరించుకోవాలి, మార్పుచెందాలి. లేనినాడు ఆ ప్రదేశం నశించిపోతుంది... ఈ సృష్టిలో పరిణామానికి ముఖ్య కారణం జీవితేచ్ఛ. ఏ విల్ టు లివ్... దాన్ని నాశనంచేసే హక్కు మరో ప్రాణికి వుండకూడదన్న ప్రాతిపదిక పైనే ఇంతటి క్రియేటివ్ ఎవల్యూషన్ జరిగింది కూడా. ఆనాటి ఆటవిక వ్యవస్థనుంచి ఇంతవరకూ మనం ఎదిగాకకూడా ఇంకా సాటిమనిషిని ముఖ్యంగా నిస్సహాయురాలైన ఓ ఇంటికోడల్ని అంతం చేయడమన్నది ఇప్పుడొక సాంప్రదాయంగా మారిందీ అంటే అది మన సంఘానికి పట్టిన ఓ రాచపుండు. దాన్ని వీలైనంత వరకూ సమూలంగా సర్జరీచేస్తే తప్ప ఈ బార్బేరియన్ ఏక్ట్స్ కి అంతముండదు. పావని అనే యువతి నాకు తోబుట్టువుకాదు. కాని ఈ సంఘంలో నాలాగే పుట్టి మనుషుల మధ్య బ్రతకాలనుకున్నది. నన్ హెజ్ గాట్ ది రైట్ టు డిస్ట్రోయ్ దట్ రైటాఫ్ లివింగ్" ఎమోషనల్ గా జవాబిచ్చిన యశస్వి ఓ లిప్తపాటు తాను అవసరానికి మించి మాట్లాడినట్టు అర్థంచేసుకుని తలవంచుకున్నాడు.

 

    అదే... సరిగ్గా యశస్విలో ఆ ఉద్రేకపూరితమైన తర్కమే రఘునాథరావుని ఎక్కువ ఆకట్టుకునేది.

 

    "హాట్ బ్లడ్" అనుకున్నాడు నవ్వుకుంటూ "ప్రొసీడ్" అంటూ కరచాలనం చేశాడు.

 

    శాల్యూట్ చేసి రెండడుగులు వెనక్కువేసి గిరుక్కున మరలి బుల్లెట్ లా ముందుకు సాగిపోతున్న యశస్విని చూస్తూ వుండిపోయాడు రఘునాథరావు.

 

    వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కభిముఖంగా ఓ మారుతీకారు ఆగింది.

 

    అందులోనుంచి దిగిన పద్ధెనిమిదేళ్ళ హరిత సహజంగా ఓ వయసులోవున్న ఆడపిల్ల పోలీస్స్టేషన్ లో అడుగుపెట్టేటప్పుడు ఎంత అణకువనీ భయాన్నీ ప్రదర్శిస్తుందో అలా రాలేదు.

 

    హఠాత్తుగా ఇన్ స్పెక్షన్ కి వచ్చిన లేడీ కమీషనర్ లా లోపలికి దూసుకొచ్చి ఎస్సై కుర్చీలో కూర్చుని గట్టిగా బెల్ కొట్టింది.

 

    ఎప్పుడూ జేబులు కొట్టేవాళ్ళు, అప్పుడప్పుడూ వాళ్లని విడిపించాలని వచ్చే రాజకీయనాయకుల్ని తప్ప అలాంటి అందమైన అమ్మాయి స్టేషన్ లో అడుగుపెట్టడం తెలీని కానిస్టేబుల్స్ అప్పటికే తేరుకున్నారు.

 

    తేరుకున్నాక దూకుడుగా ముందుకొచ్చాడు హెడ్ కానిస్టేబుల్ గుర్నాధం.

 

    "ఎక్కడ మీ ఇన్ చార్జి" సీరియస్ గా అడిగింది.

 

    "బాబులకేటి బోలెడు పనులుంటాయిగాని తమరెవరు చెప్పండి తల్లీ" అన్నాడు. ఎందుకన్నా మంచిది కాస్త ఒద్దిగ్గా వుండడమే ఆరోగ్యమన్నట్టుగా.

 

    "తల్లీ" హరిత భృకుటి ముడిపడింది. "నేను నీకు పిల్లలతల్లిలా కనిపిస్తున్నానా... ఇలా తల్లీ అన్న నేరానికి నిన్ను డిఫమేషన్ కేస్ వేసి లోపల వేయించీగల్ను."

 

    "అదికాదమ్మా" అమ్మయేదో పెద్దింటిబిడ్డని గ్రహించేసి వినయంగా సర్దిచెప్పబోయాడు.

 

    "అమ్మా" కోపాన్ని ప్రదర్శిస్తూ "నేను అమ్మలా కనిపిస్తున్నానా" అంది వణికిపోతున్న భారీకాయాన్ని చూస్తూ.                

 Previous Page Next Page