Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 16


    తల తిప్పి చూసిన జయేంద్రకి ఎదురుగా నిలబడిన ఎనిమిదేళ్ళ పసివాడు కనిపించాడు... "ఆంటీ నయం...చీర బాగా కట్టుకుంటుంది. అస్సలెప్పుడూ ఊడిపోదంకుల్" రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోకచిలుకలా నవ్వుతున్నాడు.

    హఠాత్ గా ఎక్కడినుండి వూడిపడ్డాడో తెలీని ఆ పసికందును చూస్తూ తనూ ఆ కంపేరిజానికి నవ్వకుండా వుండలేకపోయాడు.

    "నువ్వూ" జయేంద్ర మాటలింకా పూర్తికాకముందే వచ్చి ఒడిలో కూర్చుండిపోయాడు చాలాఏళ్ళ పరిచయమున్నంత చనువుగా.

    "మరేమో నానీనమ్మమాట..."

    "నానీయా..."

    "ఆ...మరేం...నాపేరు నానీ."

    "ఎవరబ్బాయివి?"

    "మా తాతయ్యకి మనవడన్నమాట."

    "తాతయ్యా?"

    "మా తాతయ్య" అదికూడా తెలీదా అన్నంత విస్మయం నానీ కళ్ళలో "విశ్వేశ్వరశాస్త్రి అన్నమాట... అవునూ...ఆంటీ లేదా"

    "బయటికి వెళ్ళింది."

    "ఎప్పుడూ అంతే...ఒక్క నిముషమైనా ఇంటిపట్టునుండదు కదా" అంటూ అమాంతం క్రిందకి దూకి వెళ్ళిపోతూంటే జయేంద్ర చేతిని పట్టుకున్నాడు.

    ఆ స్వల్ప వ్యవధిలోనే చిత్రంగా అనిపించాడు నానీ.

    నానీ పాలబుగ్గలపై ప్రమిదల్లా వున్న విశాలమైన కళ్ళల్లో ఏ జ్ఞాపకాల పొత్తిళ్లు కనిపించాయో కల్మషంలేని ఏ తాత్వికుల వెలుగుదారి స్పష్టమైందోగాని "వెళ్ళిపోతావేం నానీ" అన్నాడు ఉత్సుకతగా.

    "బోలెడన్ని పనులున్నాయన్నమాట."

    "అన్నమాటేమిటి" అబ్బురంగా అడిగాడు 'అన్నమాట'న్న పదాన్ని ఒత్తిపలుకుతూ.

    "అంటే అమ్మమాటన్న మాట" తూరీగలా పరుగెత్తి ద్వారం దగ్గర టక్కున ఆగాడు. "నువ్వు ఆంటీకి ఫ్రెండువా అంకుల్"

    ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత "మరేం" అన్నాడు.

    "నాలాగన్నమాట...నేనూ చాలామంది ఆంటీలకి ఫ్రెండుని__ ఇప్పుడు చంప ఆంటీ వుందిగా. హాస్పిటల్ నుంచి వస్తుంది. చాక్ లెట్ తెస్తుందిగా. వెళ్ళాలన్నమాట..." వేగంగా వెళ్ళిపోయాడు.

    ఒక మెరవనీ మెరుపుని చూసిన ఉద్వేగమో మోస్తున్న విషాదాన్ని కప్పిపుచ్చుకుంటూ పారాడుతున్న పసితనపు ఆరాటమోగాని ఉత్కంఠను ఆపుకోలేని జయేంద్ర ద్వారం దాకా నడిచాడు.

    కారిడార్ లో అప్పటికే నానీ ఓ యువతిని చుట్టేసి "ఆంటీ" అంటూ పలకరించాడు. నర్సులా వున్న ఆమె నానీ చెప్పిన చెంప అయి ఉంటుందని బోధపడటానికి అట్టే వ్యవధి పట్టలేదు.

    "ఏం చేస్తున్నావు నాన్నా" ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటూ అడిగింది చాక్ లెట్ నానీకి అందిస్తూ...

    "ఈ ఆంటీని చూస్తున్నానన్నమాట"

    ఎవరూలేని తన ఒంటరితనాన్ని పూడ్చే పసికందు ఈ నానీ అన్న భావమే మిగిలిందో లేక ఒకనాడు తనను మోసగించి వెళ్ళిపోయిన గోరింక చేసిన గాయమే రగిలిందో చెంప కళ్ళలో ఓ నీటిపొర_ "మరి నేను బాగున్నానా నానీ...?" అడిగింది రెప్పలార్చకుండా చూస్తూనే!

    "ఓ...బోలెడంత బాగా వున్నావు"

    "బా...గానా?"

    "మరేం..."

    "ఎంత బా...గా మంచి బాబువిగా చెప్పాలి" తొందర చేసింది.

    "మరేమో...అమ్మలా వున్నావన్నమాట" ఆ మాట చెబుతున్న నానీ గొంతులో లేత ప్రాణాలకి అడుగున వున్న సుతారపు తీగల చిరు కదలిక. తను చూడని యిక చూడలేని అమ్మను గుర్తుచేసుకొనే నానీ కళ్ళలో అందరి ఆడవాళ్ళు అమ్మలే అని చెప్పే నిగూఢమై కదిలే నల్లని నీడ "అవునాంటీ" ఇప్పుడు చాక్ లెట్ తింటున్నాడు ఏకాగ్రతగా.

    అప్పుడెప్పుడో పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచిన ధనంలా అందించి అమ్మ అయీ కాకుండా పోయిన చంప కళ్ళ నుంచిప్పుడు నీళ్ళు గట్లు తెంచుకుని స్రవిస్తున్నాయి.

    "మంచి అమ్మలు ఏడుస్తారేమిటీ" చాక్ లెట్ జిగటని కళ్ళకు రాస్తూ తుడిచాడు నానీ.

    చెప్పలేకపోయింది ఎప్పుడో తన కడుపులో ఆకృతి పోసుకున్న ఓ పసి పిండం అమ్మా అని పిలవకుండానే సంఘానికి భయపడి అక్కడే కరిగి నెత్తుటి కాలవయ్యిందని.

    నానీ పైకి వంగి చెంపల మీద, కళ్ళ మీద ముద్దు పెట్టుకుంది.

    ముప్పై ఆరేళ్ళ బ్రతుకు ముడతలు కదిలినట్టు ఉద్విగ్నంగా ఇంటిలోకి నడిచింది.

    నానీ మరో ఇంటి వైపుకి నడుస్తున్నాడు.

    అప్పుడు బోధపడింది జయేంద్రకి అమ్మలేని నానీ ఆ ఫ్లాట్స్ లో అందరికీ బిడ్డడే అని, అందరి ఇంతా పూచిన జాజిపూల అత్తరు దీపమనీ...

    ఇక్కడే జయేంద్ర మనసు కదిలింది. పొద్దుగూకిన బ్రతుకు సంజెలనీడేదో కదిలి కలవరపరచింది.

    జయేంద్ర ఒంటరిగా ఉండలేకపోయాడు...మరో అయిదు నిముషాలలో రోడ్డుపై వున్నాడు.


                        *    *    *    *


    సరిగ్గా అయిదూ పదిహేను నిముషాలకి శృతి ప్రసన్నతోబాటు తన ఫ్లాట్స్ చేరుకుంది. ద్వారానికున్న తాళం చూసేసరికి ఆమె అవాక్కయ్యింది. తన దగ్గరున్న కీతో తలుపు తీసి లోపలికివెళ్ళి ఏదన్నా కమ్యూనికేషను దొరుకుతుందేమోనని చూసింది. కాని జయేంద్ర ఎక్కడికి వెళ్తున్నదీ రాయలేదు.

    అప్పటికే ప్రసన్న ముఖం చెమట బిందువులతో నిండిపోయింది. జయేంద్ర ప్రస్తుతం శృతితో బాటు వుంటున్న విషయం ప్రసన్నకీ తెలియదు.

    అతడ్ని గాలించమని తన సిబ్బందిని పురమాయించి తనూ వెదకాలని రోడ్డుపైకి వస్తుంటే బషీరాబాగ్ దగ్గర పోలీస్ జీప్ లో శృతి కనిపించింది.

    ఆమె ఒక డాక్టరుగా తన సర్వీసేస్ ని ఉపయోగించే ప్రయత్నంలోనే ఆ ప్రాంతంలో జీప్ లో తిరుగుతున్న నిజం తెలిసిన ప్రసన్న కేజువల్ గా జయేంద్ర గురించి అడిగాడు...అవసరం గురించి తెలియపరచాడు.

    జయేంద్ర తన దగ్గరే వున్నాడన్న ఆమె మాట విని ఎంత సంతృప్తి చెందాడూ అంటే సగం సమస్య పరిష్కారమైనట్టు భావించాడు కాని-మళ్ళీ సమస్య మొదటికొచ్చింది.

    శృతికి బోధపడిపోయింది ప్రసన్న ఎంత టెన్షన్ తో నలిగిపోతున్నదీ...ఏ తండ్రీ చేయని సాహసానికి సిద్ధపడుతున్న ప్రసన్న విషయంలో ఇప్పుడు నిజంగా సహకరించగల వ్యక్తి జయేంద్ర.

    ఒప్పించడం తనకే సమస్యా కాదు. కాని ఇప్పుడు జయేంద్ర కలుసుకునేదెలా__సాలోచనగా నిలబడి శృతి తనూ వెదికే ప్రయత్నంగా బయలుదేరుతుంటే అన్నాడు ప్రసన్న...

    "డాక్టర్ శృతీ...మిగిలింది మరో గంటన్నర గడువు మాత్రమే...ఈ లోగా జయేంద్రని కలవటం ఒక్కటే కాదు. మా అమ్మాయి లల్లీని నేను ఒప్పించగలగాలి...తండ్రిగా నేను రిస్క్ తీసుకోడానికి సిద్ధపడ్డ పరిస్థితులు అనుకూలించడంలేదు. ఒకవేళ అన్న టైంకి లల్లీని నేను పంపకపోతే ప్రత్యర్ధి ఎంత విజృంభించేది అంచనా వేయలేం..."

    "అవసరమైతే మరో గంట గడువు కోరచ్చుగా" శృతి అంది అమాయకంగా.

    "లేదు శృతీ ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరోపక్క టెర్రరిజంతో మనుషుల ప్రాణాల్ని సునాయాసంగా తియ్యగలుగుతున్నవాడు తప్పనిసరిగా ఆ పసిపిల్లనే చంపాలని ఖచ్చితమైన ఆంక్ష పెట్టిన అలాంటి వాడికి మన సమస్యలు ఇబ్బందులు అక్కర్లేదు. మానవతా విలువలు అసలు లేని ఆ రాక్షసుడ్నిక ఒప్పించలేను. ఒకపక్క జయేంద్ర కోసం మా సిబ్బంది వెతుకుతున్నారు...వీలయితే మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. అదృష్టవశాత్తూ కలిస్తే విషయాన్ని చెప్పి ప్రిపేర్ చేయండి. ఈలోగా నేను పాపని లాలించి, బుజ్జగించయినా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఇదే జరుగని నాడు "ఓ క్షణం ఆగాడు. "జంటనగరాలకే రాత్రి ఓ కాళరాత్రి కాబోతూంది శృతి. దట్స్ వాట్ మై సిక్త్ సెన్స్ సేస్."

    కదిలాడు వేగంగా...

    అప్పుడు సమయం అయిదుగంటల ఇరవయిరెండు నిముషాలు కావొస్తూంది. అంటే మిగిలింది సరిగా గంటా ముప్పయి ఎనిమిది నిముషాలు.

    ఈ రాత్రికే కాదు మరికొన్ని క్షణాల్లోనే ఏదో జరగబోతోందన్నట్టు ప్రసన్న కంపించిపోతున్నాడు.


                        *    *    *    *


    నగరంలోని చార్మినార్ చౌరస్తాలోని ఓ థియేటరు...

    మ్యాట్నీ మరో పదిహేను నిముషాల్లో పూర్తికాబోతున్న సమయం...

    తెరపై ప్రదర్శింపబడుతున్న ఓ సినిమాలో 'పాము' పగబట్టినట్టు విలన్ డెన్ వైపు దూసుకుపోతోంది. అది జరజరా పాకుతుంటే గుండెలదిరేలా నేపధ్య సంగీతం వినిపిస్తూంది.

    సుమారు ఆరడుగుల పొడవుగల విషనాగు ఆగడంలేదు. చెట్లని పుట్టని దాటుకుంటూ చివరగా ఓ గుట్టని సమీపించింది.

    ఆ ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. దూరంగా ఓ ఆర్తనాదం వినిపించడంతో ఆగిన పాము బుస్ మంటూ పైకి లేచింది. ఇప్పుడు సర్పం పడగ విప్పి అటూ ఇటూ చూస్తూ కోరలు చాచింది, తెరనంతా ఆక్రమించి.

 Previous Page Next Page