కారు దగ్గరకు ఆ అమ్మాయి వెళ్ళింది.
కారు ఫ్రంట్ డోర్ తీస్తూ, వెనక డోరు తీసి కూర్చోమన్నట్టుగా సైగ చేసింది ఆ అమ్మాయి.
ఇద్దరూ నిశ్శబ్దంగా కారులోకెక్కి కూర్చున్నారు.
ఆ అమ్మాయి స్టీరింగు ముందు కూర్చుని కారు స్టార్టు చేసింది.
కారు అక్కడ నుంచి మరుక్షణం మాయమైంది.
* * *
ఆ అమ్మాయి ఏవైనా మాట్లాడుతుందేమో అనుకున్నాడు భరత్.
ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు.
కారు రడీగా వున్న జనప్రవాహంలోంచి విశాలంగా ఖాళీగా వున్న రోడ్డుమీదకొచ్చింది.
"మనమెక్కడకు వెళుతున్నాం" శుక్రాచార్య అడిగాడు.
"చూస్తారుగా" ఆ అమ్మాయి మరేం మాట్లాడలేదు.
మరో పది నిమిషాలలో ఆ కారు ఊరికి దూరంగా వచ్చింది. అక్కడకు దూరంగా ఏదో పాడయిన పాత కోట ఉంది. ఆ కోటకు కొంచెం దూరంలో ఒక కొత్త భవనం సిమెంట్ కోటలా వుంది.
ఆ సిమెంట్ కోటముందు ఎతైన అశోకపు చెట్లు రాక్షస సైనికుల్లా నిలబడి వున్నాయి.
ఆ కోట సిమెంటు గోడ నిలువెత్తున ఆశ్చర్యంగా వుంది.
కారు గేటుముందుకిరావడం గేటు తలుపులు తెరుచుకోవడం మళ్ళీ వెంటనే మూసుకోవడం కారులోపలికి వెళ్ళిపోవడం క్షణంలో జరిగిపోయింది.
కారు పోర్టికోలోకొచ్చి ఆగింది.
ముగ్గురూ కారులోంచి బయటికొచ్చారు "ఏమిటిది" అడిగాడు భరత్.
ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. లోనికి నడిచింది. ఆమె వెనకే ఆ ఇద్దరూ నడిచారు.
విశాలమైన హాలు....ఆ హాల్లో నాలుగువేపులా నాలుగు సోపాలున్నాయి.
"కూర్చోండి"
మారుమాట్టాడకుండా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. నిమిషాలు గడిచాయి. ఈ పది నిమిషాల్లో శుక్రాచార్య, భరత్ కు కొన్ని విషయాలు చెప్పాడు.
ఇదేనా శశాంక భవనం" భరత్ అడిగాడు.
"కాదు"
"ఈ అమ్మాయి శశాంక కూతురా" ఆ ప్రశ్నకు శుక్రాచార్య నవ్వి....
"తెలియదు" అన్నాడు.
"మరి"
"ఇది గెస్టుహౌస్ కావచ్చు. మనం ఈ అమ్మాయి అతిదులం కొన్ని గంటల సేపు లేదా ఒక రోజు. ఆ తరువాతే మనకు శశాంక దర్శనం" "అదెలా" భరత్ ఆశ్చర్యంగా అడిగాడు. శుక్రాచార్య తన అనుభవ రహస్యం చెపుదామని అనుకుంటుండగానే_ ఆ అమ్మాయి లోనించి హంసలా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.
ఇంతలో సర్వెంట్ ఓ ఫుల్ బాటిల్ స్కాచ్ విస్కీ సరంజామా తీసుకొచ్చి __
టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.
టీపాయ్ మీద మూడు గ్లాసులున్నాయి.
ఆ అమ్మాయి__
ఆ మూడు గ్లాసుల్లో విస్కీ పోస్తూ, ఐన్ క్యూబ్స్ వేసి__
వాళ్ళ ముందుంచింది.
రేపుదయం ఆయనతో మీ ఇంటర్వ్యూ....అంతవరకు నా గెస్ట్స్. మీరిక్కడ చాలా స్వేచ్చగా వుండొచ్చు. అయినా ఈ బిల్డింగ్ దాటి బయటికి వెళ్ళకూడదు."
శుక్రాచార్యకు అసలు ఉద్దేశం అర్ధమవుతోంది. ఇలాంటివెన్నో అతను చూశాడు. ముందు తాము ఎలాంటివాళ్ళో తెల్సుకోడానికిది తమ బలహీనతలు తెల్సుకోడానికి ఏవైనా రహస్యాలుంటే తెల్సుకోడానికి!
భరత్ కి అర్ధంకావడంలేదు.
ఆలోచిస్తున్నాడు శుక్రాచార్య.
* * *
కరక్టుగా 12.30కి శశాంక తేజదత్త ఎస్టేట్ తో సెంట్రల్ హాల్లో కూర్చున్నాడు శుక్రాచార్య భరత్.
భరత్ పధకాన్ని మరికాస్త ముందుకు జరపబోతున్నాడని శుక్రాచార్య ఏమాత్రం ఊహించలేకపోయాడు.
వీళ్ళిద్దరూ కూర్చున్న పదినిమిషాలకి శశాంక వచ్చాడు. వెనుకే ఐదుగురు సిబ్బంది.
శశాంక ఇద్దరివేపు దీక్షగా చూసాడు.
ఒకరు కురువృద్దుడు. మరొకడు నూనూగు మీసాల యువకుడు.... ఎందుకో వారిమీద నమ్మకం కలగలేదు శశాంకకు.
"చెప్పండి....ఎలా ప్రొసీడ్ అవుతారు? నా నుంచి మీకేం కావాలి?
సోఫాలో జారిగిలపడ్డాడు శశాంక.
"నాకు వయస్సయిపోయింది. నావాడి ద్వారా మీ కొడుకును చట్టపరంగానే విడిపిస్తాను. మీరు చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఆ పనిని మా చేతుల్లోకి తీసుకుంటున్నాం...."
శుక్రాచార్య మాటల్ని మధ్యలోనే త్రుంచేస్తూ అన్నాడు శశాంక. "మీ ప్రాణాలకి నా డబ్బు అడ్డేస్తాను. నా పలుకుబడి అడ్డేస్తాను. మీకు ఎప్పుడు, ఏది ఎలాంటిది కావాలన్నా క్షణాల్లో సమకూర్చిపెట్టమని ఇప్పుడే ఆర్డర్స్ వేస్తాను. కాని...."
"చెప్పండి" అన్నాడు భరత్ శశాంకకు అంచనా వేస్తూ. మీ మీద నాకు నమ్మకం కలగటం లేదు. ఎలా...."
"మీ కొడుకును విడిపించుకోటానికి మీకు ఏ సైడు నుంచి నమ్మకములేదు. మమ్మల్ని నమ్మక తప్పదు. నమ్మినా వచ్చే నష్టంలేదు. అవునా....," నిర్భయంగా ప్రశ్నించాడు భరత్.
ఏ గుర్రాన్ని ఎక్కడ హీప్ (సెన్సిటివ్ పార్ట్ లో వేగంగా పరిగెత్తెందుకు కొట్టడం) చేస్తే గాలప్ అందుకుంటోందో, ఎక్కడ హిప్ చేస్తే ఇరిటేట్ అవుతుందో, విన్ పోస్ట్ దూరాన్ని హార్స్ కాళ్ళ కదలికను క్షణ్ణంగా అర్ధం చేసుకున్న భరత్, అవతల మనిషి సైకాలజీ కూడా అర్ధం చేసుకోగల స్థాయికి ఎదుగుతాడని శుక్రాచార్య ఊహించలేదు.
శశాంక ఇద్దరివేపు మవునంగా చూసాడు.
"చెప్పండి....ఇప్పుడిక చెప్పవలసింది మీరే నన్ను ఏం చేయమన్నా చేయటానికి సిద్ధంగా వున్నాను...." అన్నాడు శశాంక.
బలహీనపడ్డాడు శశాంక_ఇప్పుడే ఇక దెబ్బవేయవల్సింది.
శుక్రాచార్య భరత్ వేపు చూసాడు.
"మీ కొడుకుని ఎల్లుండి కోర్టులో హాజరుపర్చవలసి వుంది అవునా....?"
"అవును...."
"మరో ఇరవై రోజులపాటు దాన్ని ఆపాలి" నిర్భయంగా మాట్లాడుతున్నాడు భరత్.
మెరుపు వేగంతో పరుగెత్తే పొగురుబోతూ హార్సెస్ ని కంట్రోల్ చేయగల నేర్పరికి శశాంక లెక్కలో లేకపోవడం శుక్రాచార్యకు ఆశ్చర్యం కల్గించకపోయినా, శశాంక సిబ్బందికి మాత్రం వీడికెంత పొగరు అని అనిపించింది.
"ఎందుకు....? ఎలా?"
"ఎందుకు అన్నది మీకనవసరం. ఎలా అన్నది నేను చెబుతాను. వెంటనే చిన్న సిరంజి ఒకటి తెప్పించండి...." అన్నాడు కాలుక్యులేటెడ్ గా మాట్లాడుతూ వున్న భరత్ ను చూస్తూన్న శశాంకకి నమ్మకం కల్గుతోంది.
శశాంక తెప్పించమన్నట్లుగా చూట్టం సిబ్బందిలో ఇద్దరు ఆఘమేఘాలమీద పరిగెత్తటం జరిగింది.
"భరత్....నువ్వు చేస్తున్నది గతంలో ఇండియన్ జైళ్ళలోనే ఓసారి ఓ ఖైదీ చేసాడు, అది పేపరులో కూడా వచ్చింది. దాన్ని ప్రతి ఇండియన్ పోలీసు చదివే ఉంటాడు. అలాంటప్పుడు నీ పధకం బెడిసికొట్టవచ్చేమో?" భరత్ కి మాత్రమే వినబడేంత చిన్నగా అన్నాడు శుక్రాచార్య.
భరత్ చిరునవ్వు నవ్వాడు నిశ్శబ్దంగా.
"ఇండియన్ పోలీసు స్టేషన్స్ అంత వీక్ గా జైళ్ళంతా దుర్బలంగా పోలీసులంత మూర్ఖంగా మరేదేశంలోనూ ఉండరు. ఆ నమ్మకం వుంది గనుకే ది ఓల్డెస్ట్ మెథక్ వుపయోగిస్తున్నాను.
ప్రభుత్వ వుద్యోగాల్లో చేరాక కూడా మీ బుర్రల్ని వుపయోగించాలని, మారుతున్న క్రైమ్ కి తగ్గట్టుగా మీ మెదళ్ళు షార్ప్ కావాలని కండిషన్ పెడితే ఒక్క శాతమే వుద్యోగాల్లో వుంటారు నేటి పోలీసులు.
వుద్యోగాల్లో చేరేముందు విధించిన శరీరపు కొలతలు చేరిన సంవత్సరానికి, ఎత్తు తప్ప మిగతావి డబుల్ అవుతాయి. కనీసం చిన్నపిల్లాడ్ని కూడా పట్టుకోలేనంతగా బొజ్జలు పెరుగుతాయి. మెదళ్ళు తుప్పు పడతాయి. అయినా పనికిరావని వుద్యోగాల్లోంచి తీసెయ్యటంలేదే! అదీ మనపోలీసు వ్యవస్థ. చూస్తుండండి నా పని సుళువుగా అయిపోతుంది." అన్నాడు శుక్రాచార్యకే వినిపించేంత నెమ్మదిగా.
భరత్ లాజిక్ ని కాదనలేకపోయాడు శుక్రాచార్య. పదిహేను నిమిషాల్లో సిరంజి వచ్చింది.
"మీ పలుకుబడి వుపయోగించి ఈ సిరంజి సెల్ లో వున్న మీ కొడుక్కి అందించాలి. నేను చేయమనే పనికి అతను ఒప్పుకోకపోవచ్చు, మీరు చెపితే నమ్మవచ్చు, మీ మాటగా నా పధకం అతనికి చేరాలి...." ఏమంటారు అన్నట్లుగా చూసాడు భరత్.
శశాంకకి భరత్ మీద నమ్మకం కుదిరింది. శశాంకకి చెందిన నమ్మకస్తుడయిన ఓ మనిషిని పిలిచి తన పథకం చెప్పాడు. అతడు తలూపిన మరుక్షణమే అక్కడలేడు.
శుక్రాచార్య, భరత్ లేచారు.
"మీమీద నమ్మకం కుదిరింది. నానుండి మీకేం కావాలో అడగండి అన్నాడు శశాంక.
"ప్రస్తుతానికి చిన్న సహాయమే. మావాడు మంచి జాకీ, పదిరోజుల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ లో మొదలవ్వబోయే రేస్ లో మీ హార్సెస్ కీ మావాడ్ని జాకీగా తీసుకోవాలి...."
ఇంత చిన్న కోర్కా అన్నట్లు చూశాడు శశాంక.
"ఇది చిన్న కోర్కే అయినా చిన్న ఇబ్బంది వుంది. నేను రేస్ కి హార్సెస్ ను పంపించానంటే స్టేక్ కంటే విన్ ముఖ్యం. నా ఐదో ప్రాణం నా కొడుకు. ఆరో ప్రాణం రేసెస్ లో గెలవటం. ఈ కుర్రాడు మంచి జాకి కాకపోతే నా ప్రెస్టేజ్....?" సందేహించాడు శశాంక.