Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 16


    అరగంటసేపు అతనితో స్పెండ్ చేశాక కిల్లర్ ని కలసిన టెన్షన్ తగ్గింది. తిరిగి వచ్చాడు తను.

    మర్నాడు మరో చిత్రమైన సంఘటన జరిగింది.

    మర్నాడు సాయంత్రానికి తన కిచెన్ డ్యూటీ పూర్తయ్యింది. నెత్తి మీద పేపర్ క్యాప్ తీసేసి సెల్లార్ వైపు నడుస్తూ ఉండగా యముడిలాగా మేనేజర్ కనబడ్డాడు.

    "డ్యూటీ అయిపోయిందా?" అన్నాడు కరుస్తున్నట్టు.

    అయిపోయిందన్నట్లు అస్పష్టంగా గొణిగాడు తను.

    "అయితే కాన్ఫరెన్స్ హాల్లో కన్ వెన్షన్ ఒకటి మొదలవుతుంది. ఆ తర్వాత డిన్నర్ వుంటుంది. వెళ్ళి ప్లేట్లూ అవి సరిగా సర్దారో లేదో ఓసారి చూడు" అన్నాడు.

    నిజానికి అది తన పనికాదు!

    అయినా తప్పదు.

    మనసులోనే పళ్ళు కొరుక్కుని ఈ విషయాన్ని కూడా తన ఫిర్యాదుల చిట్టాలోకి ఎక్కించాడు తను.

    గ్రీవెన్స్ లిస్టు రోజురోజుకీ పెరిగిపోతోంది.

    తనకి పేరుకి మాత్రం పొద్దున పావుగంట రెస్టు. మధ్యాహ్నం నలభై అయిదు నిమిషాలు రెస్టు. సాయంత్రం పావుగంట రెస్టు.

    కానీ మూడు రెస్టులు ఒకే రోజున దొరికిన సందర్భాలు అతి తక్కువ. ఎవరికి కంప్లయిన్ చెయ్యాలో తెలియదు. ఎవరూ వినరు. పట్టించుకోరు. తనకి సెల్లార్ లో ఒక ఇరుకు రూం. అందులో పాడెలాంటి మంచం ఒకటి. గూడులాంటి కిటికీ.

    చిరాకుని అణుచుకుంటూ పైకి వెళ్ళాడు తను.

    హాలు ఖాళీగా వుంది. ఇంకా గెస్టులు ఎవరూ రాలేదు. ఒకవైపు పొడుగాటి కౌంటర్ మీద చిన్న చిన్న స్టౌలు పెట్టి వున్నాయి. వాటిమీద తళతళలాడే డిషెస్ పేర్చి వున్నాయి. ఇంకోవేపు ప్లేట్లు పెట్టి వున్నాయి.

    అయితే అక్కడ కత్తులు, ఫోర్కులు లేవు. మిస్సింగ్.

    గబగబా కిందకి వెళ్ళిపోయి కత్తులు, ఫోర్కులు తెచ్చి అక్కడ పెట్టాడు.

    ఆ కత్తుల్లో ఒకటి కాస్త పెద్దదిగా వుంది. తక్కిన వాటితో కలవడంలేదు.

    ఆ కత్తిని విడిగా తీసుకుని చేతిలో పట్టుకుని వెనక్కి తిరిగి తలుపు దగ్గరకి వచ్చాడు.

    అదే టైంకి ఠక్కున తలుపు తెరుచుకుంది.

    ఎదురుగా నిలబడి వుంది.

    అమ్మ తల్లిలాగా.... మరిడీ మహలక్ష్మిలాగా.

    దుర్గేష్ కూతురు! దీని పేరు....

    ఎస్! సుధ. డాక్టర్ సుధారాణి.

    ఈవిడెందుకు వచ్చిందీ ఇక్కడికి? ఓహో! ఇప్పుడు ఇక్కడ జరగబోయేది డాక్టర్స్ కాన్ఫరెన్స్ కదూ? అటెండ్ కావడానికి షోగ్గా దిగబడి వుంటుంది.

    తనని చూడగానే సుధకూడా స్టన్ అయిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. తన చేతిలోని కత్తిని చూసింది. తక్షణం భయభ్రాంతురాలయిపోయి, వెర్రికేక వేయబోయింది సుధ.

    ఆమె గనక అరిచిందంటే, ఇంక తనకి ఈ హోటల్లో భవిష్యత్తు వుండదు.


                      *    *    *    *


    తనని అక్కడ చూసి షాక్ అయిపోయిన సుధ అరవకుండా చెయ్యాలంటే ఒక పద్ధతి వుంది.

    క్షణంలో సగంలో ఒక నిర్ణయానికి వచ్చేసి, ఆమెని అరవొద్దని హెచ్చరిస్తూ, ఉత్తుత్తి బెదిరింపుగా కత్తి పైకెత్తాడు తను.

    ఆ లోగానే కేక పెట్టేసింది డాక్టర్ సుధ. వెర్రికేక!

    సరిగ్గా అదే క్షణంలో__

    తన వెనకనుంచి భళ్ళుమని శబ్దం.

    గిరుక్కున తిరిగి చూశాడు.

    ఒక పిల్లి - బఫె టేబుల్ మీద అమర్చిన ప్లేట్లమీదికి దూకింది. ప్లేట్లు కిందపడ్డాయి. పిల్లి కాలికి టేబుల్ క్లాత్ తగులుకుంది. టేబుల్ క్లాత్ జరగడంతో డిషెస్ లో ఉన్న వేడి వేడి వంటకాలు నేలపాలయ్యాయి.

    ఆ శబ్దాలలో కలిసిపోయింది డాక్టర్ సుధ పెట్టిన పెనుకేక. 

    ఈ గందరగోళంలోనే చటుక్కున వెనుతిరిగి, పరుగులాంటి నడకతో అక్కడినుంచి వెళ్ళిపోయింది డాక్టర్ సుధ.

    ప్రమాదం తప్పిపోయినందుకు తను గాఢంగా ఊపిరి తీసుకొనే లోపలే యముడికి మొగుడులాంటి చెఫ్ ఆదుర్దాగా అటు రావటం కనబడింది.

    ఆ తర్వాత కల్లు తాగిన కోతి కథాకళి ఆడినట్లు అగిరిపడ్డాడు చెఫ్. పగిలిన ప్లేట్లకీ వాటికీ బదులుగా తన జీతం తెగ్గోయిస్తానన్నాడు.

    అసలు జీతమే రావట్లేదు. దానికప్పుడు కోతకూడాట.

    ఇంక తిరగబడాలనిపించింది తనకి.

    అయినా తమాయించుకున్నాడు అతి కష్టంమీద. అప్పటికి.

    కానీ, తిరగబడక తప్పని అతి రంజైన పరిస్థితి ఆ తర్వాత వచ్చేసింది. అతి కొద్దిరోజుల్లోనే.

    గుళ్ళో పూజారుల్లాంటి ఇలాంటి ఉద్యోగస్తులతో కాదు.

    గర్భగుడిలోని కాళికా అమ్మవారిలాంటి నీర్జాతోనే.

    నీర్జాతోనే లడాయి పడింది తనకి.

    మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేసినంత లెవెల్లో.


                      *    *    *    *


    సమీపంలోనుంచి పెద్ద మూలుగు వినబడటంతో, ఆలోచనల్లో నుంచి ఒక్కసారిగా బయటపడ్డాడు అఖిల్.

    ఇందాక విమానంలో తన పక్కన కూర్చున్న దంపతుల్లోని షేర్వాణీ, ఫెజ్ క్యాప్ పెద్దమనిషి గుండెను చేత్తో పట్టుకొని బాధతో కొంకర్లు తిరిగిపోతున్నాడు. ఆయన పక్కనే నిలబడి చూస్తోంది ఆయన భార్య.

    చటుక్కున లేచాడు అఖిల్. ఆయన దగ్గరకు వెళ్ళాడు.

    అప్పటికే ఆయన్ని చేరుకుంది డాక్టర్ సుధ. త్వరత్వరగా పరీక్ష చేసి తన మెడికల్ ఛెస్టు తీసి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చింది. తర్వాత ఆ పెద్దమనిషి భార్యవేపు తిరిగింది.

    వణికే కంఠంతో చెప్పింది ఆ స్త్రీ.

    "ఆయనకి అనారోగ్యం! చాలా కంప్లయింట్స్ వున్నాయి" అంది ఆ స్త్రీ విచారంగా. అని "మళ్ళీ మరేం ప్రమాదం లేదుకదా ఇప్పుడు?" అంది ఆదుర్దాగా.

    "మీరేం వర్రీ కాకండి. ఏం ఫర్వాలేదు!" అంది డాక్టర్ సుధ. అంటూనే తన వెనకనే అఖిల్ నిలబడి వున్నాడని అప్పడే గ్రహించినట్లు చటుక్కున పక్కకి జరిగిపోయి, పమిట భుజం చుట్టూ లాక్కుంది.

    ముక్కుకోసి, కారం అంటించినట్లు భగ్గుమని మండింది అఖిల్ కి.

    ఏమిటి? ఈవిడగార్ని తాకడానికి తహతహలాడి పోతున్నాడా తను? ఆవిడగారి కొంగు తగిల్తే చాలు తన బతుకు బంగారమైపోతుందని తపించిపోతున్నాడా? అలా అని ఈమెగారు భయపడుతుందా ఏమిటి?

    సర్రున ఎలా పక్కకి జరిగిందో! తాచుపాములాగా!

    వెధవ్వేషాలు!

    అఖిల్ అలా మనసులోనే తిట్టుకొంటూ వుండగా, ఆ ముస్లిం మహిళ అతనితో అంది-

    "బాబూ! నువ్వూ హైద్రాబాద్ వస్తున్నావుగా?"

    "జీ!" అన్నాడు అఖిల్.

    "నువ్వు చూడబోతే చాలా మంచివాడివిలా వున్నావు. మాకు కాస్త సాయంగా వుండాలి. అల్లా తుమ్ కో దువా దేగా!"

    "ఎంతమాట! నేను మీ సేవకి ఎప్పుడూ సిద్ధమే" అన్నాడు అఖిల్, పాతకాలపు హైదరాబాద్ మర్యాదని పలికిస్తూ.

    "అమ్మాయి డాక్టరు. అమ్మాయీ, నువ్వు మా పక్కన వుంటే మా కింక దిగులుండదు" అందామె మళ్ళీ.

    అది వింటున్న సుధ పెదిమలు బిగుసుకున్నాయి.

    "నేను డాక్టర్ నే! కానీ ఇతను కసాయివాడు. కసాయివాడ్ని నమ్ముతారేం వెర్రి గొర్రెల్లాగా" అనుకుంది డాక్టర్ సుధ చిరాగ్గా.

    "భగవాన్ తుమ్ దోనోంకో భలా కరేగా" అంది ఆవిడ దీవిస్తున్నట్లు.

    తననీ, సుధనీ ఆమె ఒకే వాక్యంలో కట్టిపడెయ్యడం అఖిల్ కి అసహనాన్ని కల్గించింది.

    చిరాకును అణుచుకుంటూ మౌనంగా వుండిపోయాడు.

    తన భర్తకు తక్షణ ప్రమాదం తప్పడంతో చాలా రిలీఫ్ గా ఫీలయి, ఏదేదో మాట్లాడేస్తోంది ఆవిడ. "మా నవాబ్ సాబ్ పేరు వినే వుంటారు" అంది తన భర్త వైపు చూపిస్తూ.... "వికారుద్దీన్ జంగ్! వెయ్యి కుక్కల నవాబంటే ఎవరికన్నా తెలుస్తుంది. హైదరాబాద్ దగ్గరే మా దేవిడీ"

    "వెయ్యి కుక్కల నవాబా?" అంటూ ప్రశ్నార్ధకంగా చూశాడు అఖిల్.

    "మొన్న మొన్నటిదాకా వెయ్యి కుక్కల్ని, ఇరవయి రేసుగుర్రాలనీ, నాలుగు ఏనుగుల్నీ మెయిన్ టెయిన్ చేసేవారాయన. అవే ఆయనకి జీవితం. వాటి ఆలనా పాలనా చూడడంలోనే ఆయనకి రోజంతా గడిచిపోయేది.

    ఇప్పుడేమయింది....అంతాపోయింది అన్నీ పోయాయి. చివరికి మిగిలింది ఒకే ఒక్క పోమెరియన్ కుక్కపిల్ల. మాకే రోజు గడవని స్థితి వచ్చింది. ఇంక అన్ని మూగజీవాల్ని ఏం పెంచుతాం?" అందామె నిట్టూరుస్తూ.

 Previous Page Next Page