హరికృష్ణ కనుబొమలు ముడిపడ్డాయి.
"పద్మ ఏమైనా..." హరిముఖంలోకిచూసి ముందుకు మాట్లాడలేకపోయాడు.
"ఏం లేదు! నీ చెల్లెలు మూడురోజుల్నుంచి పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు! చిన్న విషయానికే ఆలిగింది. ఆ మొండి తనాన్ని భరించలేకుండా వున్నాను. కొద్దిరోజులు నీ దగ్గరకు పంపుదామని పిలిపించాను" అన్నాడు హరికృష్ణ.
"సరోజ ఎక్కడ!" అడిగాడు సత్యనారాయణ.
"ఆ గదిలోవుంది వెళ్ళు" అన్నాడు నిర్లక్ష్యంగా హరి.
అన్నను చూడగానే చెల్లెలు భోరున ఏడ్చింది. అన్న బలవంతంమీద ఆ రాత్రి ఎలాగో భోజనం చేసింది.
వాళ్ళిద్దరిమధ్యా వచ్చిన పేచీ ఏదో ఇద్దర్లో ఏ ఒక్కరూ సత్యనారాయణకు సరిగా చెప్పలేదు.
"మొండితనం ఎక్కువ నీ చెల్లెలు మారకపోతే నేను ఎక్కువకాలం భరించలేను" విసుక్కుంటూ అన్నాడు హరికృష్ణ.
"అలా అనకు హరీ! చిన్నపిల్ల! బాధ్యతలు తెలియని వయసు."
"సత్యనారాయణ హరికి ఎన్నో విధాల నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు.
చివరికి హరి మెత్తబడ్డాడు.
రెండో రోజున సత్యనారాయణ బయలుదేరుతుంటే సరోజ సూట్ కేసుతో వచ్చి నిల్చుంది.
"నువ్వెక్కడికి?" కసురుకున్నాడు సత్యనారాయణ.
హరికృష్ణ అదోలా నవ్వాడు.
"లోపలకు వెళ్ళు" గద్దించినట్టుగా అన్నాడు సత్యం.
"నీతో వస్తాను! నేను ఇక్కడ ఉండలేను! ఏడుస్తూ అంది సరోజ.
"హరీ చూశావా నీ చెల్లెలి వాలకం?" అన్నట్టు సత్యనారాయణ ముఖంలోకి చూశాడు.
"పోనియ్ హరీ! తీసుకెళ్తాను. పదిహేను రోజుల్లో పంపిస్తాను" అన్నాడు సత్యనారాయణ మెత్తబడి.
"నీ యిష్టం!" అన్నాడు హరి ముభావంగా.
సత్యనారాయణతో వచ్చిన సరోజను చూసి పద్మ విస్మయం చెందింది అయినా ఏమీ అడగలేదు.
"రామ్మా! బాగున్నావా?" ఆప్యాయంగా పలకరించింది.
"ఏం బాగులే !" అంటూసరోజ లోపలకు వెళ్ళింది.
"ఏం జరిగిందండీ?" సత్యనారాయణను ఆత్రంగా అడిగింది పద్మ.
"ఇప్పుడు కాదు! తర్వాత చెబుతాను" అలసటతో కుర్చీలో కూలబడ్డాడు సత్యనారాయణ.
ఆ రాత్రి జరిగింది విని పద్మ "ఒక అయ్యచేతిలో పెట్టాక చిన్నచిన్న విషయాల్లో మనం కల్పించుకోవటం మంచికాదు! ఈసారికి కొత్త అని సరిపెట్టుకోవచ్చును. కానీ మీకు సరోజ స్వభావం సరిగా అంతుపట్టలేదు. అసలు ఆలోచించదు! తను చేసేది కరెక్టు అనుకుంటుంది! చీటికీ మాటికీ మొగుడితో పోట్లాడి వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అతనికి మాత్రం విసుగురాదూ? మీరు సరోజను గట్టిగా మందలించాలి" అన్నది పద్మ.
సత్యనారాయణ మౌనంగాగా కళ్ళుమూసుకొని పడుకున్నాడు.
సరోజవచ్చి నెలరోజులైనా వెళతాను అనడంలేదు! హరికృష్ణ కూడా రమ్మని రాయలేదు.
"ఏమండీ హరి ఉత్తరం రాయలేదా?"
"లేదు"
"సరోజను ఎక్కువకాలం ఇక్కడ వుంచడం మంచిది కాదు"
"ఏం చెయ్యమంటావ్? అతను ఉత్తరం రాయందే తను వెళ్ళనంటుంది! అతనేమోనా నా ఉత్తరాలకు సమాదానం కూడా రాయడంలేదు"
"మీరు సరోజను వెంటపెట్టుకుని రావటంవల్ల అతనికి కోపం వచ్చి వుంటుంది. ఆడపిల్ల వాళ్ళకుమనకుతప్పుతుందా? మీరే తీసుకెళ్ళి అప్పజెప్పిరండి"
చూద్దాం లే!" అన్నాడు ఆలోచిస్తూ.
పద్మకు వళ్ళుమండింది. మారుమాట్లాడకుండా లోపలకు వెళ్ళిపోయింది.
వారంరోజుల తర్వాత సరోజను బలవంతగా ప్రయాణం చేసి సత్యనారాయణ బయలుదేరాడు!
హరికృష్ణ యింటిదగ్గరే వున్నాడు! నవ్వుతూ ఆహ్వానించాడు ఇద్దర్నీ.
సత్యనారాయణకు హరికృష్ణ ప్రవర్తన అర్థం కాలేదు.
"ఏమిటోయ్ నా ఉత్తరాలకు సమాధానం రాయలేదు. నా మీద కోపం వచ్చిందా?" సత్యనారాయణ అడిగాడు.
కోపంలేదూ ఏమీలేదు. అలా రాయకుండా వుంటే నన్నా సరోజ ఆత్మ విమర్శ చేసుకుంటుందోమోనని నా ఆశ!
సరోజ లోపలకు వెళ్ళిపోయింది.
"ఏమంటోంది నీ చెల్లెలు సంతోషంగానే వచ్చిందా."
"ఆ" అని మాత్రం అనగలిగాడు సత్యం!
ఆ రాత్రి భార్యభర్తల నవ్వులు పక్కగదిలో పడుకున్న సత్యనారాయణకు విన్పించి తేలిగ్గా నిట్టూర్చాడు.
తిరిగివచ్చి అదే విషయం పద్మకు చెప్పి నవ్వాడు!
పద్మకూడా మనసారా నవ్వింది!
12
పెళ్ళయి నాలుగేళ్ళు అయినా సరోజ చీటికిమాటికి భర్తతో పోట్లాడి అన్న దగ్గరకు వస్తూనే వుంటుంది.
వచ్చినప్పుడల్లా నెల రోజులకు తక్కువ కాకుండా మకాం పెడ్తుంది.
వెళ్తూ వెళ్తూ "ఇంట్లో అవి లేవు ఇవి లేవు" అంటూ ఏదేదో పట్టు కెళుతూనే వుంటుంది!
సరోజకు ఒక్కడే కొడుకు! వాడికి రెండేళ్ళు నిండాయి.
పద్మకు సరోజ మీద అసహ్యం ఏర్పడింది!
భర్త దగ్గిర వున్నప్పుడు కూడా సత్యనారాయణను శాంతంగా వుండనివ్వదు! సత్యనారాయణ పద్మమీద విసుక్కుంటాడు!
లేని బాధల్ని ఊహించుకుంటూ అన్నకు ఉత్తరాలు రాస్తుంది! ఆ ఉత్తరాలు చదువుతూ సత్యనారాయణ బాధ పడ్తాడు! హరికృష్ణ మీద సత్యనారాయణకు మొదట వున్న సదభిప్రాయం పోయింది! భార్యను కాల్చుకు తినే పరమ దుర్మార్గుడుగా సత్యనారాయణ దృష్టిలో నిల్చిపోయాడు హరికృష్ణ!
సత్యనారాయణ చెల్లెలు మరీ బాధగా వుత్తరాలు రాస్తుంటే వెళ్ళిచూసి వుంటాడు. పద్మకు సత్యనారాయణ మాటిమాటికి వెళ్ళటం ఇష్టంలేదు!
"ఎవరి కాపరాలు వాళ్ళకు అయాక ఇదేం విడ్డూరం బాబూ! ఆ చెల్లెలు రాయడం ఈ అన్న పరుగులు తీయటం" విసుక్కుంటూ ఉంటుంది పద్మ.
ఈసారి సరోజ వచ్చి వెళుతూ "అన్నయ్య! నాకు ఈసారి కంచి పట్టుచీర కొనిపెట్టవా? ఎంత కాలం అయింది నువ్వు చీర కొనిపెట్టి?" అని అడిగింది చెల్లెలు అన్నను.
"అలాగే కొంటాలే!" పైకి బింకంగా అన్నాడు కానీ లోపల దిగులు పట్టుకుంది. రోజురోజుకూ పిల్లలు పెద్ద వాళ్ళవుతుంటే ఖర్చు పెరుగుతోంది.
"ఆయన్న అడిగితే ఏమన్నారో తెలుసా?" అంది చెల్లెలు.
"ఏమన్నాడేమిటి? సానుభూతిగా అడిగాడు అన్న.
"నీ ముఖానికి అదొక్కటే తక్కువ! పుట్టింటి నుంచి మూటలు తెచ్చావుగా ? కొనిపెట్టకపోతే ఎట్లా" అంటూ ఎద్దేనా చేశాడు!
"అలా అన్నాడా?" సాలోచనగా అన్నాడు సత్యం!
"అంతవరకే అని ఊరుకున్నారా నీ అన్నయ్య వున్నాడుగా? అన్నా అన్నా అంటూ కలవరిస్తావ్! ఆ అన్నయ్యనే అడుగు! ఆమాత్రం కొనిపెట్టలేడా ఏం? అన్నారురా అన్నయ్యా!" దాదాపు ఏడుస్తున్నటే ముఖం పెట్టింది సరోజ.
సత్యనారాయణకు బావమరిదిమీద కోపం వచ్చింది. దిగమింగుకున్నాడు ఏం చేస్తాడు! చెల్లెలి మొగుడాయె!
పద్మ అన్నా చెల్లెళ్ళను మార్చి మార్చి చూస్తూ వారి సంభాషణ వింటూ కూర్చుంది.
"వచ్చేనెలలో మా బావగారి కూతురి పెళ్ళట. పెళ్ళికి వెళ్ళాలన్నారు అందుకే పట్టుచీర అడిగాను! ఒక్కటి కూడా పెళ్లిలో కట్టుకోవటానికి అనువైన చీరలేదు అన్నది సరోజ గుణుస్తూ.