పద్మజ రాయిలా కూర్చునుంది ఆమెకంతా శూన్యంగా ఉంది.శేఖరం చివరి మాటలు ఆమె చెవిలో గింగుర్లెత్తుతున్నాయి.
"ఏమో సాగర్! ఇదంతా ఒక కలయితే బాగుండు ననిపిస్తోంది. శేఖరాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది ?"
"శేఖరం ఏదో కేసు యిన్వెస్టిగేట్ చేసి రావడానికి వెళ్ళాడన్నారు గదా. అతన్ని ఎవరైనా ఫాలోచేసి రావడానికి అవకాశ ఉందేమో ?"
"ఏమో తెలియదు, అతను ఊర్నించి వచ్చాక చూడడం అదే మొదలు."
"ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు వస్తే ఏమయినా తెలుస్తుందేమో !"
"ఇనస్పెక్టర్ ఫోన్ చేసి చెపుతానన్నాడు, ఎంత రాత్రయినా" అంది పద్మజ.
"కాఫీ తీసుకో అక్కా!" అందించింది హిమజ.
"వద్దు. నేను వెళ్ళి మాత్రలు వేసుకుని పడుకుంటాను" లేచి పైకి వెళ్ళిపోయింది పద్మజ.
హిమా, సాగర్ మిగిలారు గదిలో.
"సాగర్!" అతని దగ్గరగా వచ్చింది హిమజ. ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి.
"అసలు నీమీద అనుమానం ఎలా వచ్చిందో నాకే అర్ధం కావడంలేదు. ఆ క్షణంలో శేఖరం చచ్చిపోయాడనే బాధ నాలో అలాంటి ఆలోచన తెప్పించిందేమో! నేనూ అందరు ఆడవాళ్ళలా అంత త్వరగా ఎలా అపార్ధం చేసుకోగలిగాను? నన్ను క్షమించగలవా?"
"ఇందులో క్షమాపణల ప్రసక్తి ఎందుకు హిమా? అకస్మాత్తుగా మన కళ్ళెదుట ఒక మనిషి గిలగిలా కొట్టుకు చచ్చిపోతే అన్ని రకాల ఆలోచనలూ వస్తాయి. కాకపోతే మా ఇన్వెస్టిగేటివ్ డిపార్టుమెంటులో పని చేసే వాళ్ళు తమ ఉద్యోగ విషయం బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది యిప్పుడు కాకపోయినా మరోసారైనా నీకు చెప్పేవాణ్ననుకో. నీ దగ్గర నుంచి దాచాలని కాదుగాని తెలిసినప్పటి నుంచీ అదొక వర్రీ. నేనేదయినా ఊరెళ్ళితే ఎందుకు వెళ్ళానో ఏమిటో తెలియక కాస్త ఆలస్యం అయితే దిగులుపడతావు. అందుకే మీ యింట్లో కూడా అందరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాను."
"ఏమో అనాలోచితంగా నేను చేసిన పనితో ఒకవేళ వాళ్ళు నిన్ను అరెస్టుచేసి తీసికెళ్ళుంటే ఎంత ఘోరం జరిగుండేది! ఇప్పుడు తలచుకుంటే భయం వేస్తోంది."
"ఫోను రింగయింది. సాగర్ వెళ్ళి మాట్లాడివచ్చాడు."
"పిస్టల్ మీద ఉన్నవి శేఖరం వేలి ముద్రలేనట. ఆత్మహత్యే అయి ఉండవచ్చు నంటున్నాడు ఇనస్పెక్టర్! ఫైలు తొందరలోనే క్లోజ్ అయిపోవచ్చు. ఈ విషయంలో మీరిక వర్రీ అయ్యే అవసరంలేదు."
"శేఖరం అలా చేయకుండా ఉంటే బాగుండేది" బాధగా అంది హిమజ.
అవును. శేఖరం అలా చేయకుండా ఉంటే కథ మరోలాగుండేది.
ట్రాజెడీలన్నీ మరణంతోనూ, కామెడీలన్నీ పెళ్ళితోనూ పూర్తవుతాయి.
రెంటికీ తేడాలేదు.
6
"పోనీ కొన్నాళ్ళకి పెళ్ళి పోస్టుపోన్ చేసుకుందాం పద్మా! అన్నీ సర్దుకున్నాక డేటు ఫిక్స్ చేసుకోవచ్చు' అన్నాడు గిరి. అతనా రోజే ఊర్నించి తిరిగి వచ్చాడు. విషయం తెలియగానే అతనికి మతిపోయినంత పనయింది.
"వద్దు గిరీ! మీ అక్కయ్య వాళ్ళు రావడానికి అంతా ఫిక్స్ చేసుకున్నారు. ప్రకాశరావు అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. కొందరి యిన్విటేషన్స్ పంపించేశాం కూడా. ఇప్పుడు కాన్సిల్ చేసుకోవడం బాగుండదు."
"కాని మనసు బాగోలేనప్పుడు మిగతావేవీ అంత ముఖ్యం కాదు పద్మజా!"
"ఫరవాలేదు. ఐ విల్ బి ఆల్ రైట్! కాస్త అప్ సెట్ అయ్యానంతే! నాలుగు రోజుల్లో సర్దుకుంటాను."
"పద్మా!" ఆమె దగ్గరగా వచ్చాడు గిరి. ఒక్కక్షణం సందేహించి మరుక్షణం అతని చేతుల్లో వాలిపోయింది పద్మజ.
జీవితంలో మొదటిసారి పురుషస్పర్శకి స్పందించిన క్షణం ఆ క్షణం. అలాగే ఆగిపోయినట్లు, కాలం స్తంభించి పోయినట్లు, తెలియని పదాలకు అర్ధం యిప్పుడే తెలిసినట్లు, మరో కొత్త ప్రపంచాన్ని కనుగొన్నట్లు ఏవేవో భావనలు.
ఐ.ఏ.ఎస్. నీ, ఆఫీసర్ పోస్టునీ శాసించగలిగే అధికారాన్ని మర్చిపోయి గువ్వలా ఒక గుండెకు దగ్గరగా ఒరిగిపోయి అందులో ఆనందాన్ని అనుభవించిన క్షణం. ఇలాంటి అనుభూతి ఒకటుందని పుస్తకాల్లో చదవడం తప్ప అనుభవించలేని భావానికి జీవం పోసుకున్న క్షణం.
'ప్రియతమా! నీ ప్రేమ అనే చల్లని అగ్నిలో కాలిపోతూ నేను ఓడిపోయాను' అన్న కవి సూక్తి ప్రాణం పోసుకున్నది ఆ క్షణం.
"గిరీ! ఇక ఆలస్యం చెయ్యొద్దు మన పెళ్ళి అనుకున్న సమయానికి జరిగిపోవాలి. నేనిలా సమస్తమూ మర్చిపోయి, పోగొట్టుకున్న ఆనందాన్ని రెండింతలుగా అనుభవించాలి. నాకు కావలసిందేమిటో యిప్పుడే అర్ధం అయింది నాకు. ఈ క్షణాలను జారిపోనీకు" బేలగా అంది.
"అలాగే పద్మా! నీకేది సంతోషమో అది చెయ్యడానికి నేను సిద్ధం. నీకోసం యిలాంటి క్షణాలన్నింటినీ చేర్చి పట్టుకుంటాను. ఆ క్షణాల్లోనే నీకు ఆభరణాలు చేయిస్తాను - సరేనా?"
గిరిలో వుండే గొప్పతనం అదే స్పాంటేనియిటీ!