Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 15


    "మాయిసయాలు ఎలచ్చన్లప్పుడు తప్ప ఎవరు ఆలోసిత్తారు, బాబూ! మేం ఇలాగే ఉండాల. వాళ్ళు అలాగే ఏలుతూ ఉండాల. మా బ్రతుకులింతే." నిరాశగా అన్నాడు శీనయ్య.
    "ఆఁ ఆ విషయాలన్నీ మన తలకు మించినవి కానీ, ఇంతకూ పరీక్షలెలా వ్రాశావు?" అని అడిగాడు రమణయ్య.
    "బాగా వ్రాశానన్నయ్యా! ఫస్టు రాంక్ గ్యారంటీ" అన్నాడు గోపీ.
    రమణయ్య ముఖంలో తృప్తి కనుపించింది.
    "పైర్లూ అవీ ఎలా ఉన్నాయన్నయ్యా?"
    "బాగా ఉన్నాయి, గోపీ! ఎంత పండినా ఏం లాభం? ఏదో ఒక ఖర్చు పెరిగి వస్తుంది. నిరుడు ఇల్లు కట్టించాము. అంత క్రితం స్థలం కొన్నాం. ఈ ఏడు డాబా వేశాము ఏదో ఒక ఖర్చు కాదంటే నీకు డిగ్రీ వచ్చింది. నాకు కొడుకు పుట్టాడు" అన్నాడు నవ్వుతూ కొడుకుని దగ్గరకు తీసుకుని.
    ఆ మాటలకి అంతా నవ్వారు.
    నవ్వుల గల గలలతో మార్మోగిపోయింది ఆ ఇల్లు.


                                              *    *    *


    చంద్రయ్యగా మారిపోయాడు చంద్రం.
    రమణ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాక రాముడు అనే వాడిని పెద్ద పాలేరుగా తెచ్చుకున్నాడు చంద్రయ్య.
    చంద్రయ్య ఏదయినా తప్పుచేస్తే తమ్ముడులాగా దండించి మానిపించేవాడు రమణ.
    మరిచిపోయిన చంద్రయ్య అలవాట్లని గుర్తుచేస్తున్నాడు రాముడు.
    రమణకి ఇరవై నాలుగు గంటలూ పొలం ధ్యాస తప్పితే మరొకటి పట్టేదికాదు. రాముడికి ఎల్లవేళలా చంద్రయ్య సేవతప్ప మరొకటి అక్కర్లేదు.
    ముందు ముందు కాస్త జంకేవాడు అతను.
    పాత అలవాట్లు అలాగే ఉన్నాయో, అమ్మగారు వచ్చాక అన్నీ మరిచిపోయారో తెలియక అతను సతమతమయ్యాడు. పనికి కుదిరిన ఆరునెలల దాకా అతనికి చంద్రయ్య గుణగణాలు అంతుపట్టలేదు.
    ఒకరోజు మామిటి తోపు మీదుగా వస్తున్న రాముడిని కేకేసి పిలిచింది ఇందిర.
    "ఇదిగో, రాముడూ! ఒక క్షణం ఇలా వచ్చిపో" అన్న ఇందిర మాటలు విని చుట్టూ తిరిగి గేటుగుండా రావలసిన రాముడు కంచె ఎగిరి వచ్చాడు.
    వాడి సాహసానికి ఆశ్చర్యపోయింది ఇందిర. ఆ క్షణంలోనే కండలు తిరిగి నల్లగా మిసమిసలాడుతూన్న వాడి శరీరాన్ని పరిశీలించి చూసింది. వీడికంటే బలమైనవాడు రమణ. రమణ కోడెత్రాచు అయితే వీడు కోడెదూడ అనుకుంది ఇందిర.
    "ఏం?"
    మనిషిలాగే మొరటుగా ఉన్నవాడి సంబోధనకి కాస్త అసహ్యించుకున్నా పనిపడి పిలిచింది కాబట్టి సహించింది ఇందిర.
    "మీ అయ్యగారు ఏమంటున్నారు?"
    "తోట రాసి ఇచ్చాడు చాలదూ? ఇంకా ఏమనాల?" గుండెలో దూసినట్టుగా చూసి అన్నాడు వాడు.
    "అబ్బ! తోటరాసి ఇచ్చాడని ఏడ్చేవాళ్ళే అంతా! అసలు మీ అయ్యగారు నన్ను పెళ్ళి చేసుకుంటాననేవారు - తెలుసా? ఆ రమణ గాడు అడ్డురాకపోతే మాపెళ్ళి జరిగిపోయేది" నిరాశగా అంది.
    జవాబివ్వలేదు రాముడు.   
    "రామూ! మీ అయ్యగారిని ఒకసారిలా వచ్చిపొమ్మని కబురు చెప్తావా?"
    కస్సుమన్నాడు రాముడు.
    "ఏం, నేను తార్పుడుగాడిననుకున్నావా?"
    నొచ్చుకుంది ఇందిర.
    "నేనలా అనలేదు. రాముడూ మీ అయ్యకి నమ్మినబంటువి నువ్వు, పాత నేస్తాన్ని నేను. మళ్ళీ మా ఇద్దర్నీ కలిపితే..."
    కవ్వింపుగా చూసింది ఇందిర.
    ఒక అడుగు ముందుకు వేశాడు రాముడు.
    "ఆగు! ఆగు! అలాంటి వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. నేను కులానికి భోగందాన్నే అయినా మీ అయ్యనే భర్తగా భావించుకుని అలాగే ఉండిపోయాను. ఆయన అయితే ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడుకానీ, మా ఆడవాళ్ళకి అలాంటి అవకాశం ఎక్కడ? పెళ్ళిచేసుకుంటానని ఆశలు చూపించి, ప్రేమించి, పాతివ్రత్యం మప్పి ఆయన దూరమైపోయారు. అశోకవనంలో సీతామ్మవారిలా నేను ఈ మామిడితోటలో ఆయనకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తొలిప్రేమని ఎవరూ మరిచిపోలేరు. ఏనాటికయినా ఆయన మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తారనే ఆశతో జీవిస్తున్నాను. ఆయన దయ- నా అదృష్టం. నా బ్రతుకెలా తెల్లవారుతుందో?"
    అడుగు ముందుకు వేసిన రాముడు అలాగే నిలుచుండిపోయి ఒక్క క్షణం తేరిపార చూసి వెళ్ళిపోయాడు. ఆ తరవాత సమయం చూచి అయ్యగారి చెవిని వేశాడు ఆ మాటలు.
    యధాలాపంగా విన్న ఆ మాటలకి చంద్రం చలించలేదు. కానీ పదేపదే రాముడు అవే మాటలు చెప్పటం వలన కొద్దిగా మనస్సు కరిగింది.
    'ఏం తనేం ఘోరం చెయ్యటంలేదు. బాల్య స్నేహితురాల్ని ఒకసారి చూసివస్తాను' అనుకుని వెళ్ళాడు చంద్రం.
    సంవత్సరం తరవాత తిరిగి మామిడితోటలో అడుగుపెట్టిన చంద్రానికి ఇందిర సానికీ, సంసారికి వుండే తేడా చూపింది. శృంగారం ఒలికించిన ఇందిర చంద్రాన్ని తన కాలిమువ్వగా మార్చుకుంది.
    అలవాటుగా మారిన స్నేహం మళ్ళీ మంగమ్మకోసం పరుగులు తీసింది. జయంతిని చూసి ఇక అయ్యగారిపై ఆశపడటం వ్యర్ధం అనుకున్న మంగకు మగవాళ్ళ బుద్ధికి నిలకడ లేదని రుజువు చేశాడు చంద్రం.
    తిరిగి మార్గంలో పడిన అయ్యగారికి రకరకాల రుచులు చూపాడు రాముడు. సుఖించటం తప్పు కాదనీ, సుఖాన్ని వెతుక్కోవటంలో దోషం లేదనీ నిర్ణయించుకున్నాడు చంద్రం.
    పట్నానికి వెళ్ళి సుఖాన్ని కొనుక్కోవటం నేర్పాడు చంద్రానికి రాముడు. ఆ విలాసాలూ, ఆ విభ్రమాలూ చూసిన చంద్రం మరచిపోలేక పోయాడు. కళ్ళు మిరుమిటు గొలిపే మెరుపు శాశ్వతం కాదని తెలిసినా కాంతినిచ్చే దీపం కంటే మెరుపునే గౌరవిస్తాడు మానవుడు. తాత్కాలికమే అయినా ఆ విభ్రమాలకి లొంగిపోతాడు.
    భార్య జయంతి కన్నుగప్పి తిరగటంలో ఘనుడయ్యాడు అతను. సౌందర్యాన్ని వెలపెట్టి కొనడంలో తప్పులేదని అతని బాల్య సిద్ధాంతం. ఊరికే ఏదీ రాదుగా అనుకునేవాడతను.
    పండే పంట తగ్గిపోయింది. వ్యవసాయంపై శ్రద్ధలేక ఏదో పండుతూంది. భూమి ఉన్నందుకు, ఫలసాయం చాలని రోజుల్లో పొలాన్ని అమ్మటానికి సంశయించలేదు చంద్రయ్య.


                                              *    *    *


    ఒకరోజు మాణిక్యమ్మ కొడుకుని నిలవేసింది.
    "ఒరే చంద్రం! ఈ ఇంటినుంచి వెళుతూ వాడు తీసుకెళ్ళింది పదివేలు. ఆ సవతితల్లి కొంత ఇచ్చింది దానితో పొలం కొన్నాడు, ఇల్లు కట్టాడు, పెళ్ళి చేసుకున్నాడు, తమ్ముడిని చదివిస్తున్నాడు, నగలు చేయిస్తున్నాడు భార్యకి. సంసారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంది. బికారి రమణ అనుకున్న వాడల్లా మోతుబరి రమణయ్య అయ్యాడీ రోజు.
    మీ నాన్నగారు పోయేనాటికి మూడు నాలుగు తరాలు కాలుపై కాలు వేసుకుని తింటూ బ్రతికినా తరగనంత ఆస్తి పెట్టిపోయారు. కష్టపడ నక్కర్లేదు. ఊరికే అజమాయిషీ చేసుకుంటే చాలు. దర్జాగా బ్రతకవచ్చు.
    అలాంటి సంసారాన్ని ఈ అయిదారేళ్ళలో నీవు ఎండిన చెరువులా చేశావు, పొలాలు ఎక్కడికక్కడ బీళ్ళయి పోయాయి. తోటలు అమ్ముతున్నావ్. ఏమంటే-ఖర్చులంటావ్.
    నీవు చేసిన ఖర్చల్లా ఏముంది? చెల్లిలి పెళ్ళి, అంతేనా?
    అసలు దాని విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది.
    ఆ రోజు అది వాడిని చేసుకుంటానంది నీవూ, నేనూ నీతులు చెప్పి దాని తలవంచాము. తరవాత వాడూ ఒక మనిషయ్యాడు, ఆనాడయినా మనం తల ఊపవలసింది. మళ్ళీ దాన్ని బలిపశువుని చేశాము. ఫలితంగా దాని కాపురాన్ని మంటగలిపాం. దిక్కులేనిదై ఇల్లుచేరింది.
    ఒక పండుగా, పబ్బమా? సుఖమా? సంతోషమా? ఏముంది దాని బ్రతుకులో? అన్నీ కన్నీళ్ళే ..."
    "అమ్మా! నేనేం చేశాను? ఏం చేస్తున్నాను? నాకు ఒక దురలవాటుందని అనగలవా? సంసారం ఖర్చుకి ఎంత చాలటంలేదు. అదేం ఖర్మో పంటలు పండటం లేదు. ధాన్యలక్ష్మి వాడితోనే వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉంది." 

 Previous Page Next Page