Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 15


    "మోహన్ రాజ్!" ఇల్లెగిరిపోయేట్లు అరచాడు జగన్నాథం. ఆ అరుపుకి సీలింగ్ తాలూకు ఓ సిమెంటు పెళ్ళ విరిగి కింద పడింది.
    మోహన్ రాజ్ భయంగా లేచి జగన్నాథం దగ్గరకొచ్చాడు. "ఏమిటి సార్?" అడిగాడు అతని వెనుక నిలబడ్డ యువతులందరినీ ఆశ్చర్యంగా చూస్తూ.
    "వాటీజ్ దిస్?" న్యూస్ పేపర్ ని అతని ముఖం మీద విసిరాడు జగన్నాథం" ఎవరిచ్చారా ప్రకటన?"
    మోహన్ రాజ్ కి సంగతి అర్థమయిపోయింది. "ఆ ప్రకటన భవానీశంకర్ గారిచ్చారండీ"
    జగన్నాథానికి ఆ జవాబుతో కోపం నషాళాని కంటింది.
    ప్రతిమ ఆందోళనగా భవానీశంకర్ దగ్గరకొచ్చి నిలబడింది.
    "ఆ ప్రకటన ఎందుకిచ్చావ్ భవానీ?"
    "అది వ్యాపార ప్రకటన మైడియర్ ప్రతిమా! మనదేశంలో వ్యాపార ప్రకటనలు అన్నీ యిలాగే వుంటాయి."
    "నాన్సెన్స్!" అంటూ బిగ్గరగా అరిచాడు జగన్నాథం.
    భవానీశంకర్ చిరునవ్వుతో అతని దగ్గరకొచ్చి నిలబడ్డాడు "వాటీజ్ ది ప్రాబ్లెమ్ మైడియర్ ఫాదరిన్లా? ఎందుకలా అరచారు? ఈ యువతీ సమూహం ఎవరు?"
    "డోంటాక్! ఇంకోసారి ఫాదరిన్లా అన్నావంటే ముఖం చట్నీ అయిపోతుంది" ఆవేశంతో వూగిపోతూ అన్నాడు.
    "ఆల్ రైట్! పరిస్థితి అంతవరకూ వచ్చిందనుకుంటే ఆ పిలుపుని ప్రస్తుతానికి పెండింగ్ లో పెడదాం."
    "ఎందుకిచ్చావా ప్రకటన? త్వరగా చెప్పు"
    "ఎందుకేమిటి మై డియర్ ఫాదరి...నో! నాట్ ఫాదరిన్లా! అది సేల్స్ ప్రమోషన్ కి సంబంధించిన మొదటి డ్రాస్టిక్ యాక్షన్. మీరే కదా వార్నింగిచ్చింది ఎలాగయినా పుస్తకాలు అమ్మాలని."
    భవానీశంకర్ జవాబు వినగానే ఝాన్సీలక్ష్మి మళ్ళీ స్లోగన్ ప్రారంభించింది.
    "ముర్దాబాద్- అబద్ధాల కోరు జగన్నాథం!"
    జగన్నాథానికి చెమటలు పట్టేసినాయి. ప్రతిమవైపు కోపంగా చూశాడు.
    "సైలెన్స్" అరిచాడు భవానీశంకర్.
    "ఎవరిప్పుడు కేకలు వేయించింది?" ఝాన్సీలక్ష్మి వైపు చూస్తూ అడిగాడు.
    "నేను" అంటూ ముందుకి వచ్చింది.
    "నేను అంటూ ముందుకి అడుగులు వేస్తే చాలదు మైడియర్ యాంగ్ వుమెన్! నీ పేరేమిటి? నీ బయోడేటా ఏమిటి? ఇలాంటి భయంకరమయిన స్లొగన్స్ ఇవ్వటానికి వెనుక గల కారణాలేమిటి? ఇవన్నీ క్లుప్తంగా చెప్పాలి."
    "షటప్! ముందీ సంగతి చెప్పు! ఈ బూతు పుస్తకాలు మనకెక్కడి నుంచి వచ్చాయి?" మండి పడుతూ అడిగాడు జగన్నాథం.
    "వాట్? బూతు పుస్తకాలా?"
    "అవును! ఈ ప్రకటన తాలూకు బూతు పుస్తకాలు" తనూ బిగ్గరగా అరిచింది ఝాన్సీలక్ష్మీ.
    భవానీశంకర్ వాళ్ళిద్దరి వేపు జాలిగా చూశాడు "అవి బూతు పుస్తకాలని ఎవరు చెప్పారు?"
    "కాకపోతే ఏమిటవి?"
    "ఇవిగో ఇవి" అంటూ అందరూ ప్యాకింగ్ చేస్తున్న కొన్ని పుస్తకాలు తీసి ఝాన్సీరాణికిచ్చాడతను.
    "ఆ పుస్తకం చూస్తూనే ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. "వంటలు-పిండి వంటలు" అనే పుస్తకం అది. లోపల రకరకాల వంటకాలు ఎలా తయారుచేయాలో రజనీబాల అనే ఆవిడ రాసింది.
    జగన్నాథం ముఖంలో కోపం క్షణాల్లో మాయమయిపోయింది.
    వీర విప్లవ నారీ సమితి సభ్యురాండ్రందరూ ఆ పుస్తకం వరుసగా చూసి తరువాత దిక్కులు చూడసాగారు.
    ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ముందు ప్రతిమే నవ్వింది "దాంపత్య సౌఖ్యాలంటే వంటల పుస్తకాలా?"
    "ఎస్ డార్లింగ్! పెళ్ళి కావలసిన ఆడపిల్లలు వాళ్ళు చేయబోయే దాంపత్యం సుఖంగా వుండాలంటే ఏం తెలుసుకోవాలి? అద్భుతంగా వంటలు చేయటం, కాలీఫ్లవర్ మసాలా, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, జింజర్ చికెన్, వెజిటబుల్ కైమా, టమాటో ఆమ్లెట్, అండాబుర్జ్ ఇలాంటివి 64 రకాలు వండుతుంటే ఆ భర్త భార్యను ఎంతగా ప్రేమిస్తాడు? ఆ ఇంటి అత్తమామలు కోడల్ని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారు? అందరూ ఉదయమే లేచిన దగ్గరనుండి కోడలు వంటింట్లో చేయబోతున్న రకరకాల కూరలను తల్చుకుంటూ, ఎప్పుడెప్పుడు కోడలు భోజనానికి పిలుస్తుందా అని తహతాహలాడుతూ- ఆ దాంపత్యాన్ని ఏమంటారు మరి? సుఖ దాంపత్యం అంటారా అనరా?"
    యువతులందరూ సిగ్గుపడిపోయారతని మాటలకు.
    "ఓ! మీ ప్రకటన అర్థం అదా?" అంది ఝాన్సీలక్ష్మి నొచ్చుకుంటూ.
    "ఎస్ మైడియర్ మిస్ ఎస్! మీ మనసులన్నీ ఇంక్లూడింగ్ మా ఫాదరిన్లా జగన్నాథంలా కలుషితం అయిపోవటం చేత ఎవరేం మాట్లాడినా అందులో బూతు కోసమే వెతికి మిమ్మల్ని మీరు అవమానపరచుకుని మొత్తం భారతదేశాన్నంతా గందరగోళ పరుస్తున్నారు. అంచేత మీ మనసుల్లోని కలుషితాన్ని ముందు తొలగించండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డువారు మీకు తప్పక సహాయపడతారని నా నమ్మకం"
    "చూశారా మైడియర్ ఫాదరిన్లా! కేవలం ప్రకటనల్ని నాలుగు రోజులు గుప్పించేసరికి చూశారా ఎంతమంది పెళ్ళికావలసిన యువతులు డ్రాఫ్టులు పంపించేశారో. మీరు గత ఆరేళ్ళుగా అమ్మలేకపోయిన వంటలు పిండివంటలు కాపీలు ఆరువేలు ఈ నాలుగురోజుల్లో అమ్ముడయిపోయాయి. ఇకముందు వచ్చే డ్రాఫ్ట్ లను బట్టిరీప్రింట్ కూడా చేయాల్సివస్తుంది."
    జగన్నాథం లోలోపల ఆనందపడిపోయాడుగానీ పైకి అది కనిపించనీయలేదు.
    "ఐసీ" అన్నాడు జేబుల్లో చేతులుంచుకుని బయటకు నడుస్తూ.
    ప్రతిమ భవానీశంకర్ చేయి పట్టుకుని బరబరా ఆ ప్రక్క కాబిన్ లోకి లాక్కెళ్ళింది "యూ ఆర్ ఎ జీనియస్ భవానీ!" అంది ఆరాధనగా అతని కళ్ళల్లోకి చూస్తూ.
    భవానీశంకర్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఆనందంగా "ఆ మాట ప్రపంచానికంతా తెలుసు డియర్. కానీ ఏం లాభం? మీ డాడీకి తెలీదు."
    "డాడీ కూడా ఏదొకరోజు తప్పకుండా తెలుసుకుంటారు."

 Previous Page Next Page