"అలా అయితే నాకు కన్వినెంట్ గా వుంటుంది. కాష్ డ్రా చేసి వుంచుతాను."
"ఇదిగో మేము చెవుల్లో పూలు పెట్టుకోలేదు. రేపు డబ్బు కోసం వస్తే పోలీసులతో మూసేయించవచ్చని ప్లాన్ వేస్తున్నావు గానీ నీ ప్లాన్ మరీ 'బాలానందం' ప్లాన్! రేడియోలో పిల్లల కార్యక్రమంలో ఉపయోగించు! పిల్లలు ఎంజాయ్ చేస్తారు."
"ఓ.కే! మరీ అంత జోకులెందుగ్గానీ పోనీ ఇంకో అయిడియా ఇస్తాను."
"షటప్!"
"మిస్టర్! నేనెవరో తెలుసా? నన్ను మాట్లాడితే షటప్ అనడానికి నీకెన్ని గుండెలు? నాకింద వేలమంది పనిచేస్తున్నారు."
"ఇంకోసారి నోరు విప్పావంటే కాల్చిపారేస్తాను" రివాల్వర్ అతని నోటి దగ్గర పెట్టాడతను కోపంగా.
"అరెరె! కోపం వచ్చేసినట్లుందే. వద్దు మిత్రమా! 'కోపము హానికరము' అన్న డ్రామా నువ్వు చూళ్ళేదనుకుంటాను. అందులో హీరో మరీ కోపిష్టి. వెధవన్నమాట. వాడి కోపం వల్ల వాడి భార్యా పిల్లలు అంతా చిత్రవధ అనుభవిస్తుంటారు. అప్పుడేమవుతుందంటే..."
కారు ఆగిపోయింది.
"కమాన్! గెడౌన్"
"ఎక్కడికొచ్చాం మనం?"
"అడ్రసూ ఫోన్ నెంబర్లూ అన్నీ తర్వాత చెప్తాం. నోర్మూసుకుని కిందకు దిగు."
చిరంజీవి కిందకు దిగాడు.
"చూడు. నేను రివాల్వర్ నీ భుజానికి గుచ్చి నడుస్తుంటాను. నువ్వు నాతోపాటే తల అటూ ఇటూ తిప్పకుండా నడు. ఏమాత్రం బాలానందం తెలివి చూపించినా తల పేలిపోతుంది. ఓ.కే?"
"ఓ.కే! యాజ్ యూ విష్! కాకపోతే నా రిక్వెస్ట్ కొంచెం కన్సిడర్ చెయ్. సంగీతను కూడా కిడ్నాప్ చేసుకురా!"
"షటప్ నిన్ను మాట్లాడవద్దని ఓసారి చెప్పాను"
"ఓ.కే! మాట్లాడటం మీ పాలసీ కాకపోతే సైలెంట్ గానే ఉందాం! బహుశా మీరింతకు ముందు సైలెంట్ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అయ్యుంటారు. 'ఆలమ్ అరా' సినిమా మీరే తీశారా?"
అప్పుడు చూశాడు చిరంజీవి.
తాము వచ్చింది కృష్ణా ఓబెరాయ్ హోటల్ కి!
అతని గుండె ఆనందంతో ఎగసిపడింది.
"మైగాడ్! మనం ఇక్కడికొచ్చామా?"
"షటప్."
"వండర్ ఫుల్ బ్రదర్స్! చాలా ఆనందకరమైన విషయం! ప్రేమికులకు సహాయం చేయడం మీ హాబీ అనుకుంటాను. మీ ఇతర హాబీలేమిటి? స్టాంపులు సేకరించడమా?"
"డోంటాక్."
"అదే వద్దన్నాను! కావాలంటే కొంచెం డబ్బులెక్కువ తీసుకోండి గానీ అలా 'డోంటాక్''షటప్' అంటూ మాట్లాడితే మర్యాదగా వుండదు. ఎందుకంటే చెప్పాను కదా! నేను మామూలు మనిషిని కాదు. 'కరోర్ పతీస్ సన్!" అంటే 'మినీ కరోర్ పతి?"
"నాకింద వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు."
"హాయ్" అన్న ఆనందమైన గొంతు విని చిరంజీవితోపాటు మిగతావాళ్ళు కూడా ఉలిక్కిపడి పక్కకు తిరిగిచూశాడు.
సంగీత అప్పుడే దేవకన్యలా కారు దిగుతోంది.
ఆమెను చూసేసరికి చిరంజీవి ప్రాణం లేచివచ్చినట్లయింది.
సర్వస్వం మర్చిపోయి "హాయ్ సంగీతా" అంటూ కిడ్నాపర్ చేయి ఒక్క విదిలింపుతో విదిలించుకుని ఆమె దగ్గరకు చేరుకున్నాడు.
"మీరు ఈ డ్రస్ లో నిజంగానే దేవకన్యలాగున్నారు" అన్నాడతను.
"ఓహో నిజంగానా?" తబ్బిబ్బయిపోతూ అందామె.
"ప్రామిస్!"
"దేవకన్యలు ఇదే డ్రస్ వేసుకుంటారా? అయ్ మీన్ గార్డెన్ వరేలీడ్రస్ లే వాడతారా?"
"కరెక్ట్ గా తెలీదుగానీ ఈ క్వాలిటీ డ్రస్ లే వుంటాయి మరి."
"మీరు పంపిన కార్లన్నీ ఎంతో బావున్నాయి, అవన్నీ మీవేనా?"
"అవన్నీ నావే! అంటే నా సొంతం అన్నమాట! అంటే మా డాడీ కార్లు వేరే అన్నమాట. అంటే మా ఆఫీస్ కార్లు కాక అన్నమాట. అంటే మా స్టాఫ్ కార్లు లెక్కపెట్టకుండా అన్నమాట. అంటే..." కిడ్నాపర్ అతని భుజం తట్టాడు.
"ఏయ్ మిస్టర్."
చిరంజీవికి పానకంలో పుడకలా ఎవడో తన భుజం తట్టడం నచ్చలేదు. ఆ చేతిని విసిరికొట్టి మళ్ళీ సంగీతతో ముచ్చటలాడేయసాగాడు.
"మా సెకండ్ డాడీ కూడా కార్లున్నాయి గానీ ఇంత బాగోవు. చాలా పాతవి. పైగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటాయి."
"మీ సెకండ్ డాడీయా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"అవును! మా మమ్మీది సెకండ్ మ్యారేజ్ కదా! అందుకని నాకు సెకండ్ డాడీ వున్నారన్నమాట! మా సెకండ్ డాడీ మినిస్టరన్నమాట."
"ఓ! ఫెంటాస్టిక్. పదండి! అలా బేస్ మెంట్ లోకి వెళ్దాం" ఆమె చేయి పట్టుకుని నడవబోతూంటే కిడ్నాపర్ చేయి అతనిని ఆపేసింది మళ్ళీ.
"ఏయ్ మిస్టర్ ఇటు."
"కాదు! బేస్ మెంట్ ఇటే."
"నువ్వు రావలసింది ఇటు" రివాల్వర్ భుజానికి గట్టిగా గుచ్చుకునేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది తన పక్కనున్నవాడు కిడ్నాపర్ అని!
"ఓ! నువ్వా!"
"మళ్ళీ 'బాలానందం' తెలివి చూపించకు. నేనెవర్నో మర్చిపోయినట్లు, ఇప్పుడే గుర్తుకొచ్చినట్లు."
"నిజంగానే మర్చిపోయాను బ్రదర్! ముందే చెప్పాను కదా! ప్రేమలో పడటం అంటే అలా వుంటుందన్నమాట! మనకెంతో ప్రియమైన కిడ్నాపర్ ని కూడా మర్చిపోతాం మనం. నువ్వెప్పుడయినా ప్రేమలో పడితే నీకు తెలుసుండేది. అన్నట్లు అమ్మాయితో ప్రేమలో పడకపోయినా కనీసం నీ రివాల్వర్ తో నయినా ప్రేమలో పడి వుంటావు కదా! అప్పట్లో నీకెలాంటి ఫీలింగ్ కలిగినాయో గుర్తు లేదా?"
"షటప్!" కోపంగా రహస్యంగా అన్నాడతను.
"ఆయనెవరో నాకు పరిచయం చేయలేదు" అంది సంగీత వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవటం చూసి.
"ఓ! అయామ్ సారీ! మర్చిపోయాను ఈ దేవత పేరు సంగీత. నా జీవితాన్ని సంగీమయంలో రసమయం వేద విరచిత విస్తారమకర మత్త చిత్తసంకుల సజల సజల" ఆ తర్వాత ఏమనాలో, అసలు అంతవరకూ తను మాట్లాడిన పదాలేమిటో తెలీక ఆగిపోయి 'ఇహి' అని నవ్వి "నా జీవిత భాగస్వామిని. బ్రాకెట్లో 'కాబోయే'" అన్నాడు ఆయాసంతో వగరుస్తూ.
"నమస్తే!" అందామె.