"భలే ప్రశ్న అడిగారు! మన దూరదర్శన్ గురించి మీరు మరీ తక్కువగా అంచనా వేస్తున్నారు? కేవలం పందులూ, పక్షులూ, బట్టవన్నె మేక పిట్టలూ, దున్నపోతులూ వాటికి వీర్య వృద్ధి కలిగించే చిట్కాలు.. ఇవే దూరదర్శన్ వారు ప్రసారం చేస్తారని మీరనుకుంటే మీరంతా పొరపాటు పడ్డట్లే! ఈ రోజున దూరదర్శన్ రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ ఒక్కసారయినా తనను తాను టీవీలో చూసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంత అద్భుతమయిన ప్రక్రియ కేవలం మన దేశంలోనే ప్రప్రథమంగా ప్రారంభించారని నేను మనవి చేస్తున్నాను. మన ప్రజలందరూ కూడా గొర్రెలకు ఏమాత్రం తీసిపోరని మన దూరదర్శన్ అధికారులు ఈ రోజున గమనించారు. అదీగాక 'చార్ సౌ' అనే కార్యక్రమం మీద ఏ అడ్డమయిన చెత్త అయినా సరే ప్రసారం కావాలని వారికి స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు." హఠాత్తుగా చప్పట్లు మార్మోగిపోయినయ్.
అప్పటికప్పుడే 'నాలుగొందలేళ్ళ అందమయిన సుందర నగరోత్సవం" అనే పేరుతో అద్భుతమయిన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిపోయింది. ఆ రోజు రానే వచ్చేసింది.
కాలనీ జనమంతా వేదిక దగ్గర ముందు నుంచే గుమిగూడిపోయారు.
శాయిరామ్ తను దీపావళి కోసం కుట్టించుకున్న కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకుని మైక్ ముందుకొచ్చేశాడు.
"సోదర సోదరీమణులారా౧ ఇవాళ నిజంగా గొప్పరోజు! ఎందుకంటే ఇవాళ నిన్న కాదు! నిన్న రేపు కాదు కనుక! ఏనాటి నాలుగొందలేళ్ళ నగరమిది? ఎంత సుందరమయిన భాగ్యనగరమిది?" అంటూ కవిత్వం ధోరణిలోకి దిగగానే జనం అరుపులు మొదలెట్టారు.
"ఇక చాల్లే- ఆపు!"
సరిగ్గా అప్పుడే మంత్రిగారు వేదికకు సమీపంలో కారు దిగారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర్మెన్, పోలీస్ అధికారులు-
రంగారెడ్డి వెంటనే పూలదండ తీసుకెళ్ళి మినిస్టర్ గారి మెడలో వేశాడు.
అంతా తప్పట్లు మారుమ్రోగిపోయినయ్.
అందరూ వేదిక మీదకెళ్ళారు.
కార్యక్రమం ప్రారంభమైంది.
మినిష్టర్ గారు లేచి మైక్ ముందుకొచ్చారు.
"సోదర సోదరీమణులారా! నిజంగా. ఈ భాగ్యనగరానికి నాలుగొందలేళ్ళొచ్చాయంటే నాకెంత ఆనందంగా వుందో చెప్పలేను. మా తాత వంద సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా నేనింత ఆనందించలేదు-"
"తెలుసులే- తాత ఇంకా బ్రతికుతే తిండి పెట్టాల్సి వస్తుందని ఆనందించలే" ఎవరో స్టూడెంట్స్ అరిచారు.
రంగారెడ్డి వారివైపు కోపంగా చూశాడు.
"సైలెన్స్" అన్నాడు గట్టిగా.
వాళ్ళు సైలెన్స్ అయిపోయారు.
"మన నగరానికి భాగ్యనగరమనే పేరెలా వచ్చిందో మీకందరికీ తెలుసు. మొహమ్మది కులీ అనే గొప్ప మహారాజు భాగ్ మతీ అనే బీదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అందుకే ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు వచ్చింది"
"అష్టా-అభష్షం' అన్న గావుకేక జనంలోనుంచి వినిపించేసరికి అందరం ఉలిక్కిపడి చూశాం.
మధ్యనుంచి యాదగిరి లేచి నిలబడ్డాడు. యాదగిరితోపాటు జనార్ధన్ కూడా లేవడానికి ప్రయత్నించి తూలిపడబోయి నిలదొక్కుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఆసరాగా తీసుకొని వేదిక దగ్గరకు నడిచారు. వాళ్ళను ఆపటానికి నేనూ, రంగారెడ్డి హడావుడిగా పరుగెత్తాం గానీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడి దిగిపోతామని ప్రామిస్ చెయ్యడంతో ఊరుకోవాల్సి వచ్చింది.
యాదగిరి వేదిక ఎక్కి తూలిపడకుండా మైక్ ని పట్టుకున్నాడు. "మినిష్టర్ సాబ్ భాగ్యనగరం గురించి గలత్ జెప్పిన్రు! ఎందుకంటే ఇస్లామ్ నాలుగో ఖలీఫ్ లేడా? గా పెద్దమడిసికొక బిరుదున్నది. ఆ బిరుదు మీకెరుకనా? 'హజ్రత్ అలీ'! అగో! ఆ హజ్రత్ అలీ పేరు దిక్కుకెళ్ళి ఈ సిటీకి హైదరాబాద్ అన్న పేరు వచ్చింది నామాట కరెక్ట్ కాదని ఎవడ్నయినా జెప్పమను- చెప్పుతోటి కొడతా!"
మినిష్టర్ ముఖంలో రంగులు మారినయ్
"సోదరీ సోదరీమణులారా! ఇతను చెప్పినట్లు అది కూడా నిజమే అయుండవచ్చు. అదంతా చరిత్రకారులకు సంబంధించిన విషయం గనుక నేను ఆ టాపిక్ వదిలేస్తున్నాను" అన్నాడతను.
వెంటనే యాదగిరిని వేదిక దింపేశాము మేము.
మినిష్టర్ మళ్ళీ ఉపన్యాసం ప్రారంభించాడు.
"సోదరులారా! భాగ్యనగరం గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు. ఈ నగరంలోకి ఎవరు వచ్చినా ఆరోగైశ్వర్యాలతో తులతూగేవారు ఈ నగరంలోని ప్రజలు నాలుగొందలేళ్ళనుంచి అద్భుతమయిన, ఆనందకరమైన జీవితం గడిపారు. ఇక్కడ భూకంపాలులేవు, వరదలు లేవు"
"అష్షా అభష్షం" మళ్ళీ అరిచాడు యాదగిరి.
మేము వాళ్ళకి అడ్డుపడే లోపలే యాదగిరి, జనార్ధన్ మళ్ళీ మైక్ దగ్గరకొచ్చారు.
"భాయియో! బెహనో! మినిస్టర్ సాబ్ మళ్ళా గలత్ మాట్లాడిండు. హైదరాబాద్ గొప్ప నగరం అని మినిస్టర్ అన్నాడుగాని సచ్ చెప్పాల్నంటే ఇది ఫాల్తూ సిటీ! 1908 సంవత్సరం వరకూ ఈడ ఎన్ని సార్లు వరదలు వచ్చినయో! ఎంతమంది పబ్లిగ్గా చనిపోయిన్రో మినిస్టర్ సాబ్ కి ఎరుకలేదు. అంతెందుకు భాయ్! నిన్నగాక మొన్నటి నెలలో మూసీ సడెన్ గా నదిలోనికెళ్ళి వర్షం నీళ్ళు ఛుఠాయించిన్రు. యాదున్నదా? అప్పుడేమాయె? ఆడ బట్టలుతుక్కునేటోళ్ళు ఆ వరదలో బడి చచ్చిన్రు! మరి మినిస్టర్ సాబ్ గట్ల మాట్లాడతాడేమి? తాగివున్నాడా?"
గోపాల్రావు వాళ్ళిద్దర్నీ బలవంతంగా మళ్ళీ వేదిక దించాడు.
"సోదర సోదరీమణులారా! ఆ మిత్రులిద్దరూ కొంచెం మందుకొట్టి ఉండడం వల్ల అతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు పట్టించుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను"
అప్పుడే గుప్ మని మురుగువాసన ఆ ప్రాంతమంతా ఆవహించేసరికి అందరూ గాబరాగా ముక్కులు మూసేసుకున్నారు.
"ఏమిటా వాసన?" తనూ ముక్కు మూసుకొంటూ అడిగాడు మినిస్టర్.
"అది మామూలే సార్! మెయిన్ రోడ్డుమీద డ్రయినేజ్ చోక్ అయి మురుగు రోడ్డంతా ప్రవహిస్తుంటుంది" చెప్పాడు రంగారెడ్డి.
మినిస్టర్ తేలికగా గాలి పీల్చుకున్నాడు "ఓశ్! అంతేనా?" అన్నాడు సంతృప్తిగా.
"కనక సోదర సోదరీమణులారా! అందమైన మన సుందరనగరానికి నాలుగొందలేళ్ళు నిండిన సందర్భంలో మనల్ని మనం అభినందించుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే విభిన్న భాషలున్నా, విభిన్న మతాలున్నా, అద్భుతమైన మత సామరస్యంతో మెలిగిన నగరమిది. మతసామరస్యం అనేది నాలుగువందల ఏళ్ళనుంచీ ప్రజలు ఈ నగరంలో పాటించటం నిజంగా ఒక గీటురాయి- కలికితురాయి, శాంతి హృదయాలకు పరాకాష్ట"
హఠాత్ గా యాదగిరి, జనార్ధన్ మళ్ళీ మైక్ ముందుకొచ్చారు.
"అగు- అదిభీ గలత్ మాటనే! ఈ సిటీల జరిగినన్ని మారణహోమాలు ఇంకే సిటీలోనూ జరగలే! ఈడ హిందువులు జనాభా ఆ జమానలోనే అరవైశాతం వుండెడిది. ఐనా గానీ ఈడ ప్రజలు ఏ జబాన్ ల మాట్లాడిన్రు? ఉర్దూలోనే నిజాం కార్ బాయ్ నడుస్తుండే! మరీడ మెజారిటీ రూలేడున్నది వయ్యా?
అదిడిసెయ్! ఈ మినిస్టర్ సాబ్ జెపుతుండు ఈడ మతసామరస్యం జబర్ధస్త్ గా ఉండెడిదని! ఈయనకేమైనా దమాకున్నదా? ఈడ జరిగినన్ని మతకల్లోలాలు దేశంలో ఏడా జరగలే! గిసంటి స్టేట్ మెంట్లిచ్చే సాలెగాండ్లు న్యూస్ పేపర్ జదవరా? హిస్టరీ కితాబ్ ళు జదవరా? నీయవ్వ పోలీస్ యాక్షన్ ముందే గదవయ్యా రజాకార్లు హిందువులందర్నీ ఎతికి ఎతికి చంపబోయిన్రు! ఆడకెళ్ళి మతకల్లోలాల్లో ఎంతమంది సచిన్రో పోలీస్ రికార్డులులెవ్వా? బైగన్ కీ మత సామరస్యం ఏడున్నదివయ్యా? మా చెల్లెలు ఆమె భర్తా ఓల్డు సిటీలో ఉంటుండె!కమ్యూనల్ గూండాలు ఆళ్ళను సంపి ఇల్లు తగలబెట్టనికి కోషిస్ చేస్తుంటే ఆళ్ళు ఓల్డుసిటీ ఇడిసిపెట్టి న్యూ సిటీకి ఉరికి వచ్చిన్రు! వాళ్ళ ఇల్లూపాయె, ఇంటిలో సామానూపాయె! గిసంటి కమ్యూనల్ రైట్స్ ని ఈ రాజకీయ లీడర్ లే శురూ జేయించి- సచ్చేటోడు సచ్చినాక" సార్ సౌ శహర్ దందాలు శురూ జేస్తున్రు!"