"నరసింవ్వ దేవర జాతర! ఆ స్వామిది మా గొప్ప సత్యం. మొక్కుకుంటే ఎట్టాంటి సిక్కులయినా ఇట్టే ఇడిపోతాయి, రండి దొరా!"
"వస్తాం!" అన్నాడు రవి. అతడికి ఇలాంటివి చూడాలంటే చాలా కుతూహలం.
"సిన్న దొరసానీ! తమరూ రావాల!" వంగి దండం పెడుతూ అన్నాడు అనుమయ్య అనిలని ఉద్దేశించి. ఆ కూలీలలో ప్రతి ఒక్కరూ అనిలని ప్రత్యక్ష దేవతలా చూడటం గమనిస్తున్నాడు రవి.
"వస్తాను!" కాస్త అయిష్టంగా అంది అనిల.
వాళ్ళు వెళ్ళగానే రవి తనూ బయలుదేరుతూ "రండి! వెళ్దాం!" అన్నాడు మిగిలిన వారితో.
త్రిసికి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎవరితో చెప్పకుండానే...
"కాలం ఎంత ముందుకు వెళ్తుందో, అంత వెనక్కూ ఊగుతోంది. స్పేస్ షిప్స్ లో గ్రహాంతరాలకు ప్రయాణాలు చేస్తున్నాం! కల్లు ముంతలు తాగుతూ, వేప మండలు పట్టుకుని, 'అల్లల్ల...' అని ఊగుతూనూ ఉంటాం..." కష్టంగా అంది అనిల.
"అదేమిటి? ఈ జాతర నృసింహస్వామిది కదూ! ఈ దేవుడి దగ్గిర కూడా కల్లు ముంతలూ వగైరా ఉంటాయా?" ఆశ్చర్యంగా అడిగాడు.
నవ్వింది "ఎంత పిచ్చివారు? దేవుడు కేవలం ద్రవ పదార్ధం. ఎవరు పూజిస్తారో వాళ్ళని బట్టి ఆ పాత్రగా మారిపోతాడు. దక్షిణాదిన శ్రీరామ చంద్రుడు పట్టు పీతాంబరాలు కట్టుకుని, విల్లమ్ములు చేత పట్టుకుంటాడు. ఉత్తరాదిన ఆ రాముడే దర్జాగా కుర్తా వేసేసుకుని జపమాల చేతిలో పట్టుకుంటారు. ఈ పల్లె ప్రజలు ఎల్లమ్మ జాతర చేసుకున్నా కల్లు తాగి గెంతులేస్తారు. నృసింహస్వామి జాతర చేసుకున్నా అంతే చేస్తారు. ఆ మాట కొస్తే నృసింహస్వామికి జాతరేమిటి? ఎక్కడైనా విన్నారా? వీళ్ళు దేవుడిగా కొలిచారంటే జాతర చెయ్యవలసిందే" అనిల మాటల్లో వ్యధ ఉంది. ఆ అమ్మాయి ఎందుకో బాధపడుతోందని తెలుస్తోంది. అదంతా ప్రజల మూర్ఖత్వానికేనా?
"దేవుడు కేవలం ద్రవపదార్థమేనా?"
"వాయు పదార్ధం కూడా! కానీ, ఆ వాయువు మానవుడి ఆత్మలో ఉంటుంది. చైతన్యమై దీపిస్తుంది. ట్రాజడీ ఎక్కడంటే, దాన్ని ఏ ఒక్కరూ చూడరు. చూడాలని కోరుకోరు కూడా. కారణం మనమంతా అతి సాధారణ జీవులం. భయమూ, బాధా, అధర్మము, అన్యాయమూ, వీటిని మించి మృత్యువూ... వీటన్నిటితో ఎప్పటికప్పుడు అయోమయంలో పడిపోతుంటాం. ఈ అనుభూతులన్నీ ఎదుర్కొంటూ చెదిరిపోకుండా స్థిరంగా ఉండటానికే ప్రయత్నిస్తాం. ఒకవేళ చెదిరినా, మళ్ళీ కూడదీసుకోవాలని చూస్తాం. కానీ ఇది మనంతట మనం చెయ్యలేం! మనకొక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనం మళ్ళీ మనలాంటిదే కావాలి! అంటే మనలో ఉన్న లోపాలు లేని మన ఆదర్శ స్వరూపం! ఏనాటికైనా ఏ జాతికైనా అదే ఆలంబనం. అందుకే ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, ఒక మహమ్మదు..."
ఆవేశంతో మాట్లాడుతున్న అనిలని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. అమాయకంగా పసిపిల్లలా ఉండే ఆ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందని అతడూహించలేదు.
అంతలో డేరా ముందు జీప్ ఆగింది. అందులోంచి దేవనారాయణ్ దిగాడు. అతడి ముఖం కోపంగా ఉంది. అక్కడున్న ఎవరినీ పలకరించకుండా నేరుగా అనిలని ఉద్దేశించి అన్నాడు.
"నా ప్రజల ముందు నన్ను అవమానించాలని కంకణం కట్టుకున్నావా?" అతడొక రాజయినట్లు, అక్కడి జనమంతా అతడి ప్రజలయినట్లు మాట్లాడుతున్నాడు. పాత వాసనలు?
"అలాంటిదేం లేదే?"
అమాయకత్వం ఉట్టిపడుతోంది అనిల గొంతులో, ముఖంలో... దాని వెనుక దాగిన అల్లరి అనుభవించే వాళ్లకి కానీ తెలీదు. "ఈ రోజు మన కులదైవం, నృసింహస్వామి జాతర అనీ, ఇంటికి రమ్మనీ అక్కమ్మతో కబురు పంపాను. అందిందా లేదా?"
"అందింది"
"మరి ఎందుకు రాలేదూ?"
"ఈ తవ్వకాల పని పూర్తయ్యేవరకూ డేరాలలోనే ఉంటానని చెప్పానుగా? మధ్యలో భయపడి వచ్చేస్తానని మీరు ఊహించారు"
దేవనారాయణ్ ముఖం రగిలిపోయింది. అతడితో అంత నిర్భయంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. తనకు కాబోయే భార్య అందరిముందూ తననిలా ఎదిరించి మాట్లాడటం అతడికి చాలా కష్టంగా ఉంది. ఆమెను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు రోషంగానూ ఉంది.
'కానీ పెళ్ళయ్యాక...' అనుకున్నాడు తనలో తను కసిగా....పెళ్ళి మాత్రం జరిగితీరాలి! అనిల మీద ప్రేమ కాదు, అలాంటి ప్రేమలు దేవనారాయణ్ కి లేవు. అతడి అంతఃపురంలాంటి ప్రత్యేక భవనంలో ఇప్పటికీ వందమంది వరకూ ఆడవాళ్ళున్నారు. అనేక జాతుల వాళ్ళు, కానీ అనిలని పెళ్ళిచేసుకోకపోతే...
వెంటనే ఆ ఆలోచన మళ్ళించుకున్నాడు. దేవనారాయణ్ అనుకున్నది జరగకపోవటమా? జరిగి తీరుతుంది! లోపలి ఆలోచనలు పైకి తెలియనీయని ముఖభంగిమలుండే జాతి గనుక అతడి ముఖంలో చిరునవ్వు మాత్రం అలాగే ఉంది రాతిమీద చెక్కిన నవ్వులా.
"మన కుటుంబాలు ఈ పూజలో కూర్చోవాలి. అది ఆచారం. నాతో రా" ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు. అనిల వెంటనే కదలలేదు.
అతడి ముఖం చూస్తూ అలాగే నిలబడింది. కాస్త బెదిరాడు దేవనారాయణ్. ఈ మొండిపిల్ల గనుక రానని భీష్మిస్తే తను చెయ్యగలిగిందేమీ లేదు. నలుగురిలో నవ్వులపాలు! బంధువర్గమంతా కుతూహలంతో ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఇప్పటికే అనిల కారణంగా తను చాలా సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నాడు. వ్యవహారం ముదరనియ్యకూడదు. ఈ అల్లరికంతా ఒకటికి పదింతలుగా శిక్షించే రోజులు దగ్గిర్లోనే ఉన్నాయి.
"ఆలస్యం చెయ్యకు. ఇప్పటికే అమ్మ, పిన్ని ఇంకా మిగిలిన ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు. తొందరగా రా ప్లీజ్!"
అప్పుడు కదిలింది అనిల. వెళుతూ వెళుతూ కళ్ళతో రవికి వీడ్కోలు చెప్పింది. దేవనారాయణ్ పక్కన కూర్చుంది. జీప్ కదిలింది.
"చూశారా! ఎంత పొగరో! మనలో ఒకర్ని కూడా పలకరించలేదు" కష్టంగా అన్నాడు విష్ణు.
"ఆ....?"
అతడి మాటలు తనకు వినపడని మరేదో లోకంలో ఉన్నట్లు పరాగ్గా అన్నాడు రవి.
అనిల వెళ్ళి దేవనారాయణ్ పక్కన కూచోగానే, రవికి మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు అయింది. జీప్ కదలగానే ఒక క్షణం సెన్సేషన్ పోగొట్టుకున్నవాడిలా అయిపోయాడు. ఛీ! ఛీ! తనెందుకిలా అయిపోతున్నాడు? ఆ అమ్మాయిని గురించి మరోలా ఆలోచించే అధికారం తనకేం ఉందీ?
"వెళ్దాం రండి" అన్నాడు.
నృసింహస్వామి దేవాలయం కూడా రెండు గ్రామాలకు మధ్యలోనే ఉంది. నగ్న భైరవస్వామి ఆలయం కొండమీద ఉంటే, నృసింహస్వామి ఆలయం లోయలో ఉంది. అక్కడక్కడ పచ్చని దుబ్బులు ఏపుగా పెరిగి దేవదారు వృక్షాలు, ఆ రాతి కొండల మధ్య ఈ పచ్చని దుబ్బులు ఇంత గుబురుగా ఎలా పెరిగాయా అని ఆశ్చర్యం కలిగింది రవికి. చుట్టుపక్కల ఎక్కడా నదికాని, కాలువ కాని లేదు.
కొంత వెడల్పుగా ఉన్న కాలిబాట. అటూ ఇటూ కాపలా సైనికుల్లా ఉన్న దేవదారు వృక్షాలు. ఎలాంటి పరిస్థితుల్లోను మానవ హృదయాల్లో చావని ఆశలా రాతిబండల మధ్య మట్టిలోంచి తలెత్తి విరగబడుతోన్న ఆ పచ్చదనాలు.
కోలాహలంగా డప్పుల చప్పుళ్ళు. వాటికి లయగా అడుగులు వేస్తూ గెంతుతున్న మొగవాళ్ళు. ముఖాలకు మందంగా పసుపు రాసుకుని పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకున్న ఆడవాళ్ళు. చేతిలో పూజా సామాగ్రి ఉన్న వెదురు తట్టలు పట్టుకుని నడుస్తున్నారు. రవికలు లేని వాళ్ళ అంగసౌష్ఠవం మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాడు రవి.
"టూ బార్బరస్" అంది జెన్నిఫర్ చీదరించుకుంటూ. మండి పోయింది రవికి. "నువ్వూ మా వాళ్లకి బార్బరస్ గానే కనిపిస్తున్నావు" అందామనుకున్నాడు. కాని సహజంగా అతడు సాత్వికుడు. గభాలున ఒకరి మనసు నొప్పించలేడు.
నృసింహస్వామి ఆలయం ముందు మరింత కోలాహలంగా ఉంది. బలికి కాబోలు రెండు గొర్రె పోతులు సిద్ధంగా ఉన్నాయి.