"కాదు భావుకులు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు" అంటూ నవ్వింది సింధు.
"సర్వ్ యువర్ సెల్ఫ్" అంటూ ప్లేటిచ్చాడు పెళ్ళికూతురి తండ్రి.
"నీకేం కావాలో వడ్డించుకుని తినిపో" అంటే ఇదివరకు తినేవారా? పూర్వకాలం వాళ్ళెవరైనా వింటే బుగ్గలు నొక్కుకుంటారు. ప్లేట్లో బగారా బైగన్, ఫ్రైడ్ రైస్, కోఫ్తా, తైర్ చట్నీ, స్వీటు అన్నీ ఒకదాని మీదొకటిపడి వాటి సహజ రుచులు కోల్పోయాయి. చక్కగా అరిటాకులు వేసి, కందా బచ్చలి కూర, పనసపొట్టు పులిహోర, తిరగమోత వేసిన కూర' ఇంకా వంకాయ సంతర్పణ కూర మామూలే. ఇవేకాక కందిపొడి, అప్పడాలు, వడియాలు, దోసకాయ పప్పూ, ముక్కల పులుసూ, లడ్డూలు విస్తరినిండా వడ్డించి అతిథులకు హాయిగా విందు చేసే రోజులు పోయాయి గదా! బరువైన ప్లేట్లూ, వాటిల్లో పొరల్లాంటి చెమ్చాలు వేసుకుని నిలబడి "చేతులూ, కాళ్ళూ లాగుతున్నా హి హి హీ" అంటూ నవ్వుతూ కలగాపులగంగా కలుపుకు తినడం, ఈలోపు ఎవరో పెరుగన్నం చెయ్యో లేక స్వీటో మనకి పూసేసి "సారీ!" అనడం.
అరుణ్ కి సన్నగా చిరునవ్వు పెదవులమీద మెరిసింది.
పెళ్ళినించొచ్చాక సింధు నైటీలోకి మారి ముడివిప్పేసి జుట్టుకి రబ్బర్ బ్యాండ్ బిగించింది. "పట్టుచీర చాలా బరువు, ఎక్కువసేపు భరించలేము" అంది.
"నన్ను కూడా ఈ మధ్య భరించలేకపోతున్నావు!" అర్ధయుక్తంగా చూశాడు అరుణ్.
వెనక్కి తిరిగి కోపంగా చూసింది. అంతలోనే నవ్వేసి, "ఇంకొక్క ఆర్నెల్లు ఓపిక పట్టు. అప్పుడీ సింధు ఎటువంటి బరువులూ, బాధ్యతలు అయినా అలవోకగా భరించేస్తుంది" అంటూ పుస్తకాలు తీసుకుని పక్కగదిలోకెళ్ళిపోయింది. బరువుగా నిట్టూర్చి లైటార్పేశాడు అరుణ్.
* * * *
సినిమా బాగా బోరుగా సాగుతోంది. ఉద్యోగం సద్యోగం లేకుండా వీధిలో తిరిగే పోరంబోకులాంటి హీరో, చాలా డబ్బున్న అమ్మాయి వెంటపడి ఏడిపిస్తూ పాట పాడుతున్నాడు.
"వీడికి మింగ మెతుకులేదు మీసాలకి సంపెంగనూనె" అన్నట్టు వెనకాల ఒకేరకం బట్టలేసుకుని స్టెప్పులేస్తూ ఇంతమంది అనుచరులా?" అడిగాడు శేఖర్ యమున చెవిలో గుసగుసగా.
"హుష్" అంది.
చివరికి ఆ అమ్మాయి చెప్పుదెబ్బ కొట్టింది. వెంటనే ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టుకున్నాడు.
"కుక్కకాటు తర్వాత గదా చెప్పుదెబ్బ తినాలి?" మళ్ళీ అడిగాడు.
మళ్ళీ హుష్ అంది.
ముద్దుసీన్ పదేపదే ఓ పదిసార్లు రివైండ్ చేసి చూపించి చివరకు ఆ అమ్మాయి ఘాటైన ప్రేమలో పడిందని తేల్చేశాడు డైరెక్టర్.
"ఆహా! ఎంత నీతి! బలవంతంగా ముద్దు పెట్టుకుంటే అమ్మాయిలు ప్రేమలో పడుదురు" అన్నాడు.
కోపంగా చూసి నోటిమీద వేలేసుకుని చూపించింది యమున.
మళ్ళీ పాట, ఈసారి ఓ వందమంది అమ్మాయిలూ, అబ్బాయిలూ వీళ్ళని ఫాలో అవుతూ స్టెప్పులేస్తున్నారు. "ఈ పాటలో పదాలెవరైనా చెప్పగలిగితే వంద రూపాయల పందెం అని ప్రకటిస్తే ఒక్కోడు వందసార్లు విన్నా చెప్పలేడు. కావలిస్తే పందెం" అన్నాడు కాస్త గట్టిగానే.
"వెళ్ళిపోదామా?" అడిగింది.
అవునన్నట్టు తలూపేడు. ఇద్దరూ బయటికొచ్చేశారు. రయ్యిమని చలిగాలి వీచింది. యమున కొంగు నిండా ముసుగుదీసుకుని కప్పుకుంది.
"ఇంకా ఎన్ని చలికాలాలు ఒంటరిగా వెళ్ళదీయాలి?" అడిగేశాడు డైరెక్టుగా.
"శేఖర్" చిరుకోపంగా అంది.
"నువ్విలా నన్ను ఆపుతూ వుండు. ఈలోగా మా అమ్మ ఏ నరసమాంబనో లేక వెంకట వీర వరాహలక్ష్మీ శ్యామల అచ్యుత నాగవల్లీ కనకదుర్గ సాయి ప్రసన్న జయదుర్గ హరివీర సత్యసుబ్బలక్ష్మినో తెచ్చి కట్టబెట్టేస్తుంది" అని వూపిరి తీసుకున్నాడు.
నవ్వేసింది యమున.
"హాస్యానికి కాదు నిజంగా అమ్మ తొందరపడ్తోంది" చెప్పాడు.
"నీకు నా పరిస్థితి తెలుసు" తలక్రిందకు వాల్చి సమాధానం చెప్పింది.
"నీకూ నా పరిస్థితి తెలుసు" ఆమె నడుంచుట్టూ చెయ్యేశాడు.
"ప్లీజ్" అంటూ సున్నితంగా వదిలించుకుంది.
ఆట నడుస్తోంది. థియేటర్ నిశ్శబ్దంగా వుంది. "బయట లాన్ లో కూర్చుందామా" అడిగాడు. తలూపి కూర్చుంది యమున. తనూ కూర్చున్నాడు.
"అసలోసారి "ధనంపేట' పెళ్ళిచూపులకెళ్ళినప్పటి విశేషాలు నీకు చెప్పలేదు కదూ!" అడిగాడు.
"ఎప్పుడెళ్ళావు?" ఆతృతగా అడిగింది.
"నీతో పరిచయం కానప్పుడులే! అసలప్పుడు వాళ్ళు పెట్టిన జంతికలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాననుకో"
"ఏ అంత బావున్నాయా?" యమున ముక్కు చివర ఎర్రబడింది రోషంతో.
"బహుశా! పెళ్ళికొడుకు దంతాలూ, వాటి నిర్మాణమూ పటిష్టంగా వుందా లేదా? అని తెలుసుకోవడం కోసం పెట్టినట్టున్నారు. నెల తక్కువ కుంక మా పేరయ్య తొందరపడి తిన్నాడు. అంతే పటుకూ, పటుకూ విరిగిపోయాయి."
"ఏమిటి జంతికలా?"
"అయితే బానే వుండేది. అవి ఆయన దంతాలు"
చిన్నగా నవ్వి "అయితే నువ్వు వరపరీక్షలో నెగ్గలేదన్నమాట" అంది.
"అలా జరిగినా బానే వుండేది. కానీ నేను నెగ్గానే!"
"ఎలా? అంత గట్టివి నువ్వు మాత్రం ఎలా తిన్నావు? నీవేమన్నా ఇనప దంతాలా?"
"నేనేం తక్కువవాడినా! నానపెట్టుకుని రోజున్నర కూర్చుని మరీ తిన్నాను"
"గొప్పేలే!" మూతి తిప్పింది నవ్వాపుకుంటూ.
"అసలు విషయం చెప్పనీ! ఇంతలో పెళ్ళికూతుర్ని తీసుకొచ్చారు"
"బావుందా?"