దేవుడా? ఏమిటీ మాయ?
తను చనిపోయాడా? లేకపోతే తనకు పిచ్చెక్కిందా? లేకపోతే, తనను తనే ఎట్లా చూడగలడు? అయినా ఆ డ్రెస్సేమిటీ? ఆ పక్కన ఉన్నవాళ్ళంతా ఎవరు? తన కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుపు గొంతుతో మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరు?
మళ్ళీ కళ్ళు చిట్లించి చూశాడు కాశీ...
అతని గుండె మళ్ళీ ఆగిపోయినట్లయింది.
ఆ అమ్మాయి... ఇక్కడ...
తోటలో ఇటువైపున...
కేకలు ఆకాశాన్ని అందుకుంటున్నాయ్.
"సారా నిషేధ ఉద్యమం వర్థిల్లాలి! సారా తయారీకి ఒప్పుకోం ఒప్పుకోం!"
"ప్రాణాలైనా అర్పిస్తాం"
"సారా తయారీ ఆపేస్తాం"
లక్కీ ఐశ్వర్య చెవిలో చెప్పింది.
"శ్రీ! నువ్వు వాళ్ళని టాకిల్ చెయ్! రెచ్చిపోకు! నెమ్మదిగా నచ్చచెప్పు! నేను ఇంకో రూట్ లో వస్తా"
'సరే!' అన్నట్లుగా చూసింది శ్రీ.
ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళింది.
స్త్రీలు - వేలమంది. వాళ్ళలో బాగా చదువుకుని, తమ హక్కులూ, బాధ్యతలూ ఏమిటో తెలిసినవాళ్ళు అతి కొద్దిమంది. అట్టే చదువుకోని జనం ఎక్కువమంది. కానీ అందరూ ఆడవాళ్ళూ, అందరివీ ఆడకష్టాలు.
అవును! ఆడకష్టాలే.
మొగవాళ్ళకి ఉండే కష్టనష్టాలన్నీ ఆడవాళ్ళకి కూడా ఉంటాయి. డబ్బు ఇబ్బందులు - ఆకలి - అవమానాలు - కూలి పని అయినా, ఉద్యోగమయినా కూడా శారీరక శ్రమ, అలసట, రోగాలు రొస్టులూ - ఇవన్నీ కాక చాలా ఉన్నాయ్. నెలనెలా ఒక చికాకు. నెలతప్పితే తొమ్మిది నెలల గర్భం, ఆ తర్వాత ప్రసవవేదన, మొగుడు తాగితే తనకి తన్నులు, మొగుడు జూదం మరిగితే తను జీవితంలో ఓడిపోవడం...!
అంతెందుకూ?
మొగుడు హింసిస్తే బావిలోపడి చచ్చేది ఆడదే కాదూ?
మొగాడి చేత చెడగొట్టబడి వ్యభిచారం మొదలెడితే, దొరికినప్పుడు చలాన్ కట్టేదీ, జైలు కెళ్ళేదీ ఆడదే! కాదూ?
ఎవరో... అక్కడొక ఐశ్వర్య... ఇక్కడొక లక్కీ... తప్ప ఆడబతుకులు ఇంతేగా! అందరూ అంత లక్కీకాదుగా!
కల్లు సీసా ఖరీదు రెండ్రూపాయల అరవై పైసలన్నాడు ఈ మధ్య ఓ కలెక్టరు, అందులో ఉంది వాళ్ళ అవగాహనా రాహిత్యం! కల్లుసీసా ఆర్రూపాయలనీ, తాగేవాళ్ళకి తెలుసు. ఆర్రూపాయలుంటే, ఆరోజు గడిచిపోతుందనీ వాళ్ళ భార్యలకి తెలుసు.
అంతః కరణలేని ప్రభుత్వం, అవగాహన లేని అధికార్లూ ఆడదాని బతుకులతో ఇంకోసారి ఆడుకోబోతుంటే...
వాళ్ళ ఆక్రోశం ఇలా బద్దలవుతోంది.
ఒకామె శాంతంగా చెబుతోంది. "చూడు అమ్మాయ్! ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో, ఏ జన్మలో ఎందరికి మేలు చేశావో తెలియదుగానీ మొత్తానికి పెట్టిపుట్టావని తెలుస్తూనే ఉంది. నీ పేరుకు తగినట్లే నీకు ఐశ్వర్యం పేరుకుపోయి ఉంది. ఈ సారా అమ్మి ఇంకాస్త పాపిష్టి సొమ్ము సంపాదించకపోతేనేం అమ్మా! సారా అంటే సారో! చుక్క విషం ఓ మనిషి ప్రాణాలు తీస్తుంది. కానీ చుక్క సారా ఓ కుటుంబాన్ని కుప్పకూల్చేస్తుందమ్మా! పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉండాల్సిన దానివి! ఇంతమంది ఉసురు ఎందుకు కట్టుకుంటావు? పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటావు. ఇంత ఐశ్వర్యం వచ్చింది. ఈ అహంకారంతో పాపం మూటగట్టుకుని వచ్చే జన్మలో ఓ కుక్కలాగా, కోడిలాగా పుట్టాలని ఉందా?"
ఆమె అలా అంటూ ఉండగానే అక్కడే చెట్టుమీద ఉన్న కోతి కిచకిచలాడింది.
కోపాన్ని అతిప్రయత్నం మీద ఉగ్గబట్టుకుంది ఐశ్వర్య.
ఈలోగా...
ఇంకో స్త్రీ విసురుగా ముందుకు వచ్చి అంది.
"జన్మలేదు. పునర్జన్మలేదు. సారా ఉద్యమం అంటే చేతులు కలిపాం. ఈ మతం మైకంలోకి మమ్మల్ని లాగకండి! అది సారా మైకం కంటే దారుణం!"
వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య. ఆమెది చాలా అలర్ట్ బ్రెయిన్.
"చాలా కరెక్టుగా చెప్పారు. నా భావాలు అలాగే ఉంటాయి. నేను నాస్తికురాలిని. నా పేరు చెబితే దేవుడు దయ్యం పట్టినట్లు పారిపోతాడు. మీరు కొంచెం నేను చెప్పేది వింటారా? ఇక్కడ ఉన్నవాళ్ళలో నేను చెప్పేది మీకు ఒక్కళ్ళకే అర్థం అవుతుందేమో అనిపిస్తోంది!"
అవతలి ఆమె ఐశ్వర్యవైపు పరీక్షగా చూసింది.
"ఇందులో చెప్పడానికీ ఏమీ లేదు - వినడానికీ ఏమీ లేదు. చెయ్యవలసినది ఒక్కటే ఉంది. అది సారా చెయ్యడం మానేయడం. అంతే!" అంది ఖచ్చితంగా.
"ఒకవేళ తయారు చేసిన సారా ఒక్క చుక్క కూడా ఇండియాలో అమ్మకపోతేనో?" అంది ఐశ్వర్య.
"ఏమిటీ?" అందామె ఆశ్చర్యంగా.