"తెలుస్తుందిగా! ఎక్కు!" అన్నాడు కృష్ణాజీ మోటార్ సైకిలు స్టార్ట్ చేస్తూ.
నిదానంగా, స్థిరంగా అన్నాడు రాజా-
"సాబ్! పిల్లలతో ఎప్పుడూ పేచీ పెట్టుకోకు! డేంజరు!"
కృష్ణాజీ మాట్లాడకపోవడం గమనించి, మళ్ళీ అన్నాడు రాజా. "ఎందుకని అడుగు సాబ్! పెద్దాళ్ళతో పోట్లాట పెట్టుకున్నావనుకో! వాడెవడో, ఏం చేస్తున్నాడో, వాడి పవరెంతో నీకు తెలిసే ఉంటుంది. పిల్లలతో అట్లా కాదు. పెద్దాడయ్యాక ఎవడు నీ లెవెలుకి వెళ్తాడో, ఎంత పవర్ ఫుల్ గా మారతాడో నీకు ఇప్పుడే తెలీదు! అవునా! నాతో దుష్మనీ మంచిది కాదు" అన్నాడు.
మోటార్ సైకిలు పోనిస్తూనే ఒక్కసారి వెనక్కి తిరిగి రాజా మొహంలోకి చూశాడు కృష్ణాజీ.
ఏం మాట్లాడలేదు.
అయిదు నిమిషాల తర్వాత ఒక యింటి ముందు ఆగింది కృష్ణాజీ మోటార్ సైకిలు.
మోటార్ సైకిలు దిగి, సంకెళ్ళు తీసేశాడు కృష్ణాజీ.
కిందకు దిగాడు రాజా.
కృష్ణాజీ మోటార్ సైకిలుకి స్టాండు వేశాడు.
"పద!" అన్నాడు ముక్తసరిగా.
ఆ ఇంటివైపు చూశాడు రాజా. చిన్న ఇల్లు. నీటుగా, ఒక ఆశ్రమంలా కనబడుతోంది.
లోపలికి వెళ్ళారు.
లోపల ఉన్న అరుగుమీద కూర్చుని భారతం చదువుకుంటున్నాడు ఒకాయన. ఆయనకి యాభై ఏళ్ళు ఉంటాయి. అయినా నిష్టగా, మంచి అలవాట్లతో జీవితం గడిపినవాడు కావడం వల్ల వయసు కనబడటం లేదు. ముప్ఫయ్ అయిదేళ్ళ వాడిలాగా ఉంటాడు. ప్రశాంతంగా ఉంది మొహం. నుదుట బొట్టు వుంది. ధోవతి కట్టుకుని, పైన అంగవస్త్రం కప్పుకుని ఉన్నాడు.
కృష్ణాజీని చూడగానే, "రండి! కూర్చోండి!" అన్నాడు ఆదరంగా.
ఆయనకు నమస్కారం పెట్టి అరుగుమీదే పక్కగా కూర్చున్నాడు కృష్ణాజీ.
రాజా నిలబడే వున్నాడు.
రాజా ఎవరో ఆయనకి తెలియదు.
కానీ ఆయనెవరో రాజాకి తెలుసు.
ఆయన పేరు ఆనందరావుగారు. మునిసిపల్ హైస్కూల్లో టీచరు. మంచివాడని పేరు. సంఘసేవ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పని. అమితమైన దైవభక్తి ఆయనకు.
ప్రతిరోజూ తెల్లవారుఝామున లేవగానే ముందు స్నానం చేసేసి, ఒక ప్లాస్టిక్ బక్కెట్, మగ్గూ పట్టుకుని ఆ వీధి చివరన ఉన్న వేణుగోపాలస్వామి గుడికి వెళ్తాడు ఆయన. అక్కడే వున్న కొళాయిలో నుంచి బక్కెట్ తో నీళ్ళు పట్టి, గుడి అంతా కడిగి శుభ్రం చేస్తాడు.
అలా మాధవసేవతో రోజు మొదలుపెట్టి, అనేక విధాలుగా మానవసేవ కూడా చేసిగానీ నిద్రపోడు ఆయన.
రాజావైపు ప్రసన్నంగా చూశాడు ఆయన.
"ఈ పిల్లాడు ఎవరు?" అన్నాడు చిరునవ్వుతో.
కృష్ణాజీ నవ్వాడు.
"వీడి కథంతా చెప్పాలంటే ఇంకో భారతం అవుతుంది. వినే టైం వుందా?"
"ఫర్వాలేదు! చెప్పండి" అన్నాడు ఆనందరావు.
చెప్పడం మొదలెట్టాడు కృష్ణాజీ.
"నన్ను మీరు గుర్తుపట్టే వుంటారనుకుంటాను. మీ స్కూలుకి చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేసింది నేనే! అప్పుడు కలిశాం మనం."
"ఎంత మాట! మిమ్మల్నెలా మర్చిపోతానూ? మీరు "టైగర్ కృష్ణాజీ"ట కదా! మా పిల్లలు చెప్పారు."
నవ్వాడు కృష్ణాజీ.
"దుర్మార్గులందరికీ మీరంటే సింహస్వప్నం అని అంటారు."
తనని గురించిన పొగడ్తలు వినడం ఇష్టం లేనట్లు మాట మార్చేశాడు కృష్ణాజీ.
"ఈ ఊళ్ళో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా రికార్డ్ అయిన వాళ్ళలో ఈ కుర్రాడు ఒకడు. పన్నెండేళ్ళ పిల్లాడు వీడేం చెయ్యగలడని అనుకోకండి! పాతికేళ్ళ వాళ్ళకి ఉండే శక్తీ, యుక్తీ వీడికి ఉన్నాయి. పిల్లవాడయినా పోలీసు డిపార్ట్ మెంట్ ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఇంక తప్పనిసరై నేనే రంగంలోకి దిగి వీణ్ణి పట్టుకోవలసి వచ్చింది."
శ్రద్ధగా వింటున్నాడు ఆనందరావు.
కృష్ణాజీ అన్నాడు "తీరా పట్టుకున్న తర్వాత వీడు ఆఫ్టరాల్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కాడనీ - కాకపోతే ఒక చిన్న సైజు రాబిన్ హుడ్ లాంటి వాడనీ గ్రహించాను. వీడి వయసుకి వీడు చేస్తున్న పనులూ, దానధర్మాలూ, వీడి మంచితనం చూస్తుంటే మామూలు పిల్లాడు కాదనీ, అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్నవాడనీ అర్థం అయ్యింది.
"అయితే?" అన్నట్లు చూశాడు ఆనందరావు.
"వీడి మొహం వైపు చూడండి! జీనియస్ అనిపించడం లేదూ? ఇంత టాలెంట్ రాంగ్ ట్రాక్ లో పడి వేస్టయి పోతోంది. సరైన దారిలో పెడితే నిజంగా సొసైటీకి పనికొచ్చే మనిషిగా మారతాడు వీడు! ఐ యామ్ వెరీ ష్యూర్!"
రాజా ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నాడు కృష్ణాజీ చెప్పేదాన్ని.
కృష్ణాజీ అన్నాడు -
"సార్! నేను చాలా ఖడక్ మనిషిని అని డిపార్ట్ మెంట్ లో పేరు! ఈ రోజుల్లో అది చెడ్డ పేరు కిందే లెఖ్ఖ అనుకోండి! అయినా ఎవరేమన్నా పట్టించుకోను నేను! నేను నా మనస్సాక్షికి మాత్రమే జవాబుదారీ. నాకు నా డ్యూటీ తర్వాతే ఇంకేదైనా కూడా. అయినా సార్! నాలాగా నూటికొకడూ, కోటికొకడూ అక్కడక్కడా ఉంటే పరిస్థితులు మారవు. స్ట్రిక్టుగా ఉండదలుచుకున్న ప్రతివాడూ తనలాంటి శిష్యులను పదిమందినైనా తయారు చెయ్యగలిగితేనే చెడుకీ, మంచికీ జరిగే యుద్ధంలో బాలెన్స్ ఆఫ్ పవర్ మెయిన్ టెయిన్ అవుతుంది. లేదా మంచివాళ్ళు మరీ మైనారిటీ అయిపోయి, మొరటు మృగాల మెజారిటీ ఎక్కువైపోతుంది.