"ఇంత అందంగా కాదు."
రుత్వి నవ్వాడు మృదువుగా.
"ఐమీన్ మీ ప్రశ్నలో క్లారిటీ వుంది."
"కానీ మీరు జవాబు చెప్పలేదు"
"చెప్పే అవకాశం కలగలేదు టైం అవడంతో."
"ఇప్పుడు తెలుసుకోవాలనుంది" అనేసింది విజూష.
తనలాంటి మరో అందమైన అమ్మాయి రుత్వితో మాట్లాడడం నచ్చని సశ్య అతడ్ని వారించాలనుకుంది.
కానీ అప్పటికే చెప్పడం మొదలుపెట్టాడు రుత్వి.
"ఆరోగ్యవంతుడైన ఒక మగాడిలో సగటున రోజుకి ఉత్పత్తి అయ్యో స్పెర్మ్ సెల్స్ పది మిలియన్లు అంటుంది సైన్సు. అంటే.. విజూష వైపు నుండి దృష్టి మరల్చుకున్నాడు.
"ఆ కణాలన్నింటికి స్త్రీ అండాలతో కలసి రూపమిస్తే ఆరునెలల్లో ప్రపంచ జనాభా అంత గర్భాధారణకి కారణం అవుతుందంటుంది విజ్ఞాన శాస్త్రం.
అతిశయోక్కిలా వున్నా ఇది నిజం."
విజూష కనురెప్పలు బడలికగా వాలిపోయాయి.
"ఇట్స్ టూ మచ్" అంది విజూష.
సశ్యతో కారులో వెళ్లిపోతున్న రుత్విని చూస్తూ అడిగింది స్పూర్తి.
"ఏమిటీ రుత్వి ఆ అమ్మాయితో కలసి కారులో వెళ్ళడమా?"
"అవును" అనలేకపోయింది విజూష. "లేదు" అనకుండా తనను తను నిభాయించుకుంది.
"ఎవరు ఎవరితో వెలితే నాకేంటి స్పూర్తీ!నేను టూ మచ్ అన్నది ఆరు నెలల్లో ప్రపంచ జనాభా అంతగా ఓ మగాడిలో స్పెర్మ్ సెల్స్ ఉత్పత్తి కాగలవని తెలుసుకున్నాక"
ఆమె చెప్పిన వాక్యాలు గుండెలో నుంచిగాక గొంతులోనుంచి రాలిపడినట్లు అనిపించాయి.
విజూషనే ఒక ఆడపిల్ల నిలిచి నిరీక్షించితే వచ్చే నీలమేఘశ్యాముడు రాక ఎంత చులకనైతిని అనుకునే రాధని తలపింపజేస్తోంది.
తొలిసారి తనంతట తాను తొందరపడి ఓ అబ్బాయి ముందుకొస్తే వయసు వేకుల చలిమంటల వెచ్చదనమంటే తెలియని శిశిరంలా వెళ్ళిపోయాడు పెద్దగా పట్టించుకోకుండా.. అదీ మరో అమ్మాయితో.
మొత్తానికి సశ్య అదృష్టవంతురాలు" అంది స్పూర్తి విజూషని ఓరగా గమనిస్తూ.
చివాలున తలతిప్పి చూసింది విజూష.
"అవును విజ్జూ! సశ్య రేపో మాపో రుత్వికి భార్యవుతుంది. ఆ తరువాత భారతదేశ జనాభా అంత పిల్లల్ని కని మదర్ ఇండియాగానే సరిపెట్టుకోక ప్రపంచ జనాభాని కని విశ్వమాత అనిపించుకుంటుంది."
"బుల్ షిట్!" ఎగతాళిగా నవ్వింది విజూష - "అసలు ఆ ఇద్దరికీ పెళ్లయితేగా?"
కొన్నిగంటల వ్యవధిలో రుత్వితో విజూష మానసికంగా ఎంత పెనవేసుకుపోయిందో బోధపడింది.
ఎన్నిసార్లు తల నరికినా నేనున్నానంటూ తిరిగి మొలకెత్తే దాని పేరే ప్రేమయితే సరిగ్గా అలాంటి సంక్లిష్టమైన ఒక భావం చాలా బలంగా విజూషలో అదీ తొలిచూపులోనే ఏర్పడటం వింతగా కాదు ఆనందంగా వుంది.
మరికాస్త లోతుకు వెళితేచాలు ఒక్కతల మాత్రమే కాదు మొత్తం శరీరాన్ని కణాలు చీల్చినా అలాంటి శిక్షని ప్రేమగా స్వీకరించేటంత ప్రేమ రహదారిలో విజూష అడుగుపెట్టినట్టుందిప్పుడు.
అభ్యంగనస్నానం చేసి కొత్త చిగురు కోసం ఎదురుచూస్తే సిశిర ఋతువులాంటి విజూష వ్యక్తిగా మరింత వికసించాలీ అంటే గున్నమామిడి గుబురులోని కూసే కోయిలమ్మల వసంతం కావాలి.
కారు వెళుతుంటే నడుపుతున్న విజూషని చూస్తూ అంది స్పూర్తి.
"ఇందాక నేను అన్నమాట మరింత ఆలోచిస్తున్నావనుకుంటాను."
"లేదు."
అలాంటి ఓ ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నట్టు ఠక్కున అంది విజూష.
"సశ్య అతడికి బార్య అయ్యే ఛాన్సులేదు."
"వాళ్లిద్దరి మధ్యనున్న చనువేంటో మనకి తెలీదు విజ్జూ."
"కానీ పోటీలో రుత్వి ఓడిపోతేనే ఆమెను పెళ్లాడేది."
"అలాంటి ఆకతాయి పందేల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆగత్యం లేదు" స్పూర్తి కేజువల్ గా అంది.
"కానీ రుత్వి చేసుకుంటాడనిపిస్తోంది."
"మనిషికున్న ప్రకృతి సహజమైన గుణం ఏమిటో తెలుసా విజ్జూ?" నవ్వుతూ అంది స్పూర్తి.
"ఏదన్నాగానీ తన స్వబావానికి స్థితినిబట్టి ఇలా మాట్లాడుతున్నానంటావ్."
"కోపం తెచ్చుకోకు విజ్జూ" వాతావరణాన్ని తేలికపరుస్తూ అంది స్పూర్తి.
"ఒకవేళ రేప మళ్ళీ క్విజ్ పోటీ జరిగినా రుత్వి ఓడిపోడని గ్యారంటీ ఏమిటి?"
"ఓడిపోడు" ఏనాడూ తలుపులు తెరవని మనసు గదిలో ఇంత కాలమూ దాచుకున్న ఏ ఆలోచనల పుస్తకాన్నో ఈ క్షణంలో తెరిచేసింది విజ్జూ.
"ఎందుకంటే నాకు ఓటమి అన్నది తెలీదు గాబట్టి.
గెలిచిన అతడిమీద గెలుపు సాధించాలని నేను ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి."
అరక్షణం విరామం తర్వాత మళ్లీ విజూష అంది "ఎస్ నేను గెలుస్తాను. లేదు నేను మాత్రమే గెలవాలి."
అడవిలో యవ్వనపు వెన్నెల జల్లుతో ఇంతకాలమూ ఎంత వ్యర్దమైందో తెలిసినట్టు విజూష ఉన్మాదం ప్రకోపిస్తుంటే అభిప్రాయం రాని అభిప్రాయం కాకుండా వుండాలని కోరుకుంది స్పూర్తి.
ఒక కోటీశ్వరుడికి ఒకే ఒక బిడ్డగా చాలవన్న విజూష ఎవరికీ దక్కని పారిజాత పుష్పం.
దానికి అవసరమైన సౌరభం ఇద్దరి ప్రేమే అయితే విజూష అలాంటి వలయంలో అడుగుపెట్టి అందరిలాంటి ఆడపిల్ల కావాలి.
అలాంటి తన చిరకాల వాంఛకు ఇదిగో ఈరోజు అంకురం పడింది రేపేం జరిగేది తెలియకపోయినా.
* * * *
రాత్రి తొమ్మిదిన్నర సమయం.
జూబ్లీ హిల్స్ లోని ఓ ఖరీదైన ఇంటి పోర్టికోలో అగింది సిలో.
అయిదు నిమిషాలక్రితం స్పూర్తిని హాస్టల్ దగ్గర విడిచిపెట్టిన విజూష చాలా అసహనంగా ఇంటికి వచ్చింది.
రోమన్ ఆర్కిటెక్చర్ తో నగరంలోని అరుదైన భవంతుల్లో ఒకటైన తన ఇంటిలో అడుగుపెడుతూ చాలా గర్వంగా పరిసరాల్ని గమనించడం విజూషకు అలవాటు.