Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 15


    కిల్లర్ మొహం కనబడలేదు తనకి.

    అయినా అతన్ని వెనకనుంచి చూసే గుర్తు పట్టేశాడతను!

    కానీ కిల్లర్ ఇంకా తనని చూసినట్లుగా లేదు.

    అతను తనని చూసేలోగా తను వెనక్కి తిరిగెళ్ళిపోవడం ఉత్తమం.

    గిరుక్కున వెనక్కి తిరిగాడు తను. త్వరత్వరగా నడుస్తూ హోటల్ కి తిరిగి వచ్చేశాడు.

    అలా తిరిగి వచ్చేయడమే మంచిదయ్యింది!

    హోటల్ లాబీలోనే కనబడింది నీర్జా, నెలల తరబడి తను ప్రయత్నించినా కలవలేకపోయిన నీర్జా! తన బాస్!

    అప్రయత్నంగానే తనవేపు చూసింది నీర్జా. అదే అదననుకుని ఆమెకి విష్ చేశాడు తను.

    తన అభివాదం అందుకుంటున్నట్లు తల పంకించింది నీర్జా. తనని ఆమె దగ్గరికి రమ్మని పిలవడమో లేదా ఆమే తన దగ్గరికి రావడమో చేస్తుందని ఊహించాడు తను.

    అలాంటిదేమీ జరగలేదు. తనని పిలువలేదు నీర్జా. ఫ్లోర్ మేనేజర్ ని పిలిచింది. అతనితో సీరియస్ గా రెండు నిమిషాలసేపు మాట్లాడింది. తర్వాత రిసెప్షనిస్టుని పిలిచింది. ఆ అమ్మాయికి ఏవో ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది.

    ఇంక నెక్ట్స్ తన టర్న్ వస్తుంది.

    ఈలోగా నీర్జాతో ఏం మాట్లాడాలో మనసులోనే రిహార్సల్ చేసుకున్నాడు తను. తను రాకముందు చెఫ్ దగ్గర అప్రెంటిస్ లుగా యింకో ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. తను వచ్చాక వాళ్ళిద్దరినీ ఇంకెక్కడికో టాన్స్ ఫర్ చేశారు. వాళ్ళ ప్లేస్ లో ఇంకెవ్వరినీ ఇక్కడ వేయలేదు. ముగ్గురి పని తనే చేస్తున్నాడు. కొద్ది రోజులు అలా చెయ్యగలడు. ఎల్లకాలం అలాగే చెయ్యడం అసాధ్యం. తనకి ఇంతవరకూ జీతం యివ్వలేదు. కనీసం జీతం ఫిక్స్ చెయ్యలేదు కూడా.

    ఇలా మనసులోనే రిహార్సల్ చేసుకుంటూ ఉన్నాడు తను. ఈలోగా నీర్జా రిసెప్షనిస్టుతో మాట్లాడం పూర్తయ్యింది. పూర్తయిన మరుక్షణంలోనే రెండు అంగల్లో లిఫ్టుని చేరుకుని అందులో ఎక్కేసింది నీర్జా. నీర్జా తెలాంగ్.

    పుష్పకవిమానం అంటే యిలాగే వుంటుంది. అనిపించేలా రెండు రెక్కలూ బంగారుపూతతో వున్న ఆ లిఫ్టు నెమ్మదిగా పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. లిఫ్టుకి వున్న అద్దాల తలుపులోంచి నీర్జా కనబడుతూనే వుంది. తనవైపు చూడడంలేదు ఆమె. మొహం అటుకేసి తిప్పి నిలబడి వుంది.

    అవమానంతో గుండె మండిపోయినట్టనిపించింది తనకి. కిచెన్ నైఫ్ బెల్టుతోనే వుంది. పదునుగా వున్న ఆ నైఫ్ తో ఆమెని పొడిచి పారెయ్యాలన్నంత కోపం వచ్చింది తనకి. అతి కష్టంమ్మీద ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుని కాసేపు సెల్లార్ లో కాలక్షేపం చేసి తర్వాత మెల్లగా హోటల్ వెనుక ఎంట్రన్స్ లో నుంచి బయటకి వచ్చాడు.

    ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర కిల్లర్ తన కోసం కాచుకుని ఉంటాడని తెలుసు తనకి.

    బయటికి రాగానే అటూ యిటూ చూశాడు తను. పక్కనే పొంచి వున్న ప్రమాదమేమీ కనబడలేదు.

    చకచకా ముందుకి నడిచాడు.

    వంద అడుగులు వేశాక-

    తన సిక్స్ త్ సెన్స్ కి తోచింది.

    తనని ఎవరో ఫాలో చేస్తున్నారని.

    ఎవరు?

    ఇంకెవరు?

    కిల్లరే!

    తల తిప్పకుండా కంటికొసల నుంచి చూశాడు. కిల్లరే అనుమానం లేదు.

    కిల్లర్ వంటి వాసన కూడా తనకి సోకుతున్నట్లు అనిపించింది.

    ఇప్పుడేం చేయాలి తను. ఏం చెయ్యాలి?   

    నడక వేగం తగ్గించకుండా చకచకా ముందుకెళ్ళిపోతూనే వున్నాడు తను.

    అదే వేగంతో తనని వెంటాడుతూ వస్తున్నాడు కిల్లర్.

    కిల్లర్ దయాదాక్షిణ్యాలు లేనివాడు. అతని క్రౌర్యాన్ని గురించి అనేకమైన కథలు ప్రచారంలో వున్నాయి. వాటిలో మరీ భయంకరమైన కథ ఒకటి వుంది. చిత్రహింసలు పెట్టి చంపడంలో ఎక్స్ ఫర్ట్ ఈ కిల్లర్. చిత్రహింసలో కొత్త పద్ధతుల కోసం అతను నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా చిత్రవధ చేస్తాడు.

    ప్రాచీన కాలంలో పెరూ దేశంలో నేరస్తులని చంపే పద్ధతి ఒకటి ఉండేది. ఒక కేసులో దాన్ని అడాప్ట్ చేశాడు కిల్లర్. విరోధి ఒకడు తనవాత బడ్డప్పుడు అతన్ని చెట్టుకు కట్టేశాడు కిల్లర్. అతని మొహం మీద ఉన్న చర్మం వలిచేసి వెళ్ళిపోయాడు. రక్తం ముద్దలా వున్న అతని మొహాన్ని చూసి రివ్వుమని వచ్చింది ఒక గద్ద. అది ఆ అభాగ్యుడి మొహం మీద వాలి అతను బతికి ఉండగానే కళ్ళని పీక్కుతినడం మొదలుపెట్టింది. ఆ షాక్ కి అతను గుండె ఆగి చచ్చిపోయాడు.

    ఇంకొంత దూరం నడిస్తే కుడిచేత వైపుకి చీకటి ఇరుకుగల్లీ ఒకటి వస్తుంది. పరమ దుర్వాసన భరితంగా ఉంటుంది ఆ గల్లీ. యూరినల్స్ కి వెళ్ళవలసినవాళ్ళూ, చెత్తా చెదారం పడెయ్యదల్చుకున్నవాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఆ గల్లీలోకి అడుగుపెట్టరు.

    ఆ గల్లీ దగ్గరకు రాగానే కిల్లర్ ఏదో ఒకటి చేస్తాడని తెలుసు తనకి.

    క్షణాల్లోనే దగ్గరికి వచ్చేసింది గల్లీ. ఇంక పది అడుగులు కూడా లేదు.

    తొమ్మిది....

    ఎనిమిది....

    ఏడు....ఆరు....నాలుగు....రెండు....ఒకటి....

    ఊహాతీతమైన వేగంతో వెనక్కి తిరిగాడు తను. తిరిగి తిరగడంతోనే కిల్లర్ మెడ పట్టేసుకున్నాడు. క్షణంలో గల్లీలోకి లాగేశాడు కిల్లర్ ని.

    అక్కడున్న వాళ్ళలో చాలామంది ఆ సంఘటనని చూశారు. కొందరు అది కేవలం పరాచకమనుకున్నారు. కొంతమంది బెదిరిపారిపోయారు. చాలామంది అది చూసి కూడా మనకెందుకులే అని ముందుకెళ్ళిపోయారు.

    అంతేగానీ ఇదేమిటని అడిగి ఇన్ వాల్వ్ అయినవాళ్ళు ఒక్కరూ లేరు.

    కిల్లర్ మెడని పట్టేసుకుని గల్లీలోకి లాగేస్తుంటే ఊపిరందక విలవిల్లాడిపోయాడు కిల్లర్. రెండు చేతులతో తన పట్టు సడలించుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు.

    ఒక చేతిని కిల్లర్ చుట్టూ వేసి అదే చేత్తో కిల్లర్ గొంతుమీద పట్టు బిగించి రెండోచేత్తో బెల్టుతో ఉన్న కిచెన్ నైఫ్ తీశాడు తను. కత్తిని కిల్లర్ గొంతుకి ఆనించి అప్పుడు గొంతు మీద పట్టు సడలించాడు.

    రోదనలాంటి శబ్దంతో ఒక్కసారిగా ఊపిరి లోపలికి తీసుకున్నాడు కిల్లర్. కొద్ది సెకండ్లపాటు రొప్పుతూ ఉండిపోయి తర్వాత అన్నాడు-

    "ఇంకాసేపు అట్లాగే గొంతు నొక్కేస్తే చచ్చిపోయి వుండేవాడ్ని చిన్నబాబూ."

    "అది నీకు అర్ధం కావాలనే అలా చేశాను. చెప్పు పాండూ ఎందుకొచ్చావ్ ఇక్కడికి?"

    ఊపిరందక అన్నాడు పాండు ఉరఫ్ కిల్లర్.

    "నువ్వెక్కడున్నా వెదికి ఆచూకీ తెలుసుకు రమ్మన్నాడు బాస్. దేశమంతా నీ కోసం తిరిగాను. చివరికి ఇక్కడ కనబడ్డావు. చిన్నబాబూ! మరిడేశ్వరరావు కొడుకివి! మాకు బాస్ తర్వాత బాస్ అంతటివాడివి. ఈ హోటల్లో వంటవాడిగా పనిచేసే గతి నీకేమిటి పద! మన ఊరికి వెళ్ళిపోదాం" అన్నాడు కిల్లర్ నచ్చచెబుతున్నట్లు.

    కిల్లర్ పాండు గొంతుమీద కత్తి ప్రెజర్ ఇంకొంచెం ఎక్కువ చేశాడు అఖిల్.

    "ఇంకొక్కమాట అన్నావంటే గొంతు కోసేస్తా అర్ధమయ్యిందా."   

    నెమ్మదిగా తన చేతిని గొంతుమీద నుంచి తొలగించాడు పాండు. గొంతుని రుద్దుకుని తర్వాత అన్నాడు.

    "నీ చేతుల్లో ఇంత బలం వుంది. ఎక్సర్ సైజ్ బాడీ! సల్మాన్ ఖాన్ లా వున్నావ్. ఇంత కండబలం, బుద్ధిబలం వున్న నువ్వే కనుక గ్యాంగు వ్యవహారాలు చూసుకుంటూ వుంటే ఈపాటికి" అని ఫోర్స్ కోసం ఒక బూతు మాట ఉచ్చరించి, "మనం దుర్గేష్ గ్యాంగుని స్మాష్ చేసేసి వుండేవాళ్ళం" అన్నాడు.

    శక్తికొద్దీ కిల్లర్ దవడ మీద కొట్టాడు తను.

    "బద్మాష్! నన్ను గ్యాంగ్ స్టర్ ని చేస్తావా? నీ పేగులు పీకేస్తా" అన్నాడు.

    దవడ తడుముకుంటూ కొద్ది క్షణాలపాటు నిర్నిమేషంగా తనవైపు చూశాడు పాండు.

    పాండుని గురించి విన్న ఇంకో విషయం గుర్తొచ్చింది తనకి హఠాత్తుగా.

    పాండు పాములాంటివాడు.

    తన మీదకి ఎవరన్నా కత్తి ఎత్తారంటే వాళ్ళని మళ్ళీ ఎప్పుడో పొడిచేదాకా ఆ విషయం మర్చిపోడు.

    తన మీదకి ఎవరన్నా చెయ్యి ఎత్తితే ఆ చేతిని విరిచేదాకా ఊరుకోడు.

    పాండు మొహంలోకి క్రమంగా చిత్రమైన నవ్వు వచ్చింది.

    అలా నవ్వుతూనే తల పంకించి అక్కడినుంచి కదిలి జనంలో కలిసిపోయాడు కిల్లర్.


                                                       *    *    *    *


    కిల్లర్ వెళ్ళిపోయాక తన సర్దార్జీ ఫ్రెండ్ ఉత్తమ్ సింగ్ ఛెడ్డా దగ్గరకి వెళ్ళాడు తను. సింగ్ తో మాట్లాడుతుంటే టైమ్ తెలీదు. జోకుల మీద జోకులు చెబుతాడు ఉత్తమ్ సింగ్. తెగ నవ్విస్తాడు. 

 Previous Page Next Page