Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 15


    మాట ఎత్తగానే 'నో' అని అనటం వివేక్ మానేయటం ఒక విజయం.

    తనకు తోడుగా మరొకరు- అదీ అతని తల్లే కావటం మరో విజయం.

    మరికొన్ని మెట్లున్నాయి ఎక్కవలసినవి. అవి కూడా ఎక్కగలిగితే....? తన పెళ్ళాం బిడ్డల్ని తనకు కాకుండా చేసిన జస్వంతరావు చావు తప్పదు.

    "ఎక్కువసేపు ఇక్కడుంటే అనుమానం వస్తుంది. నువ్వు యుద్ధానికి సిద్ధపడేవరకు నేనీ కూలిపని చేయక తప్పదు. ఈ వయస్సులో నా శరీరం ఈ శ్రమని భరించలేకపోతోంది. కనీసం కన్న తల్లిమీద జాలితోనన్నా ఆయన మాట విను. విని పగ, ప్రతీకారాలు తీర్చుకుని నీ జన్మని సార్ధకం చేసుకో. చేసుకోక జైల్లోనే బుద్ధిగా ఉన్నా నీకు పడిన ఉరిశిక్ష రద్దు కాదు.

    పిచ్చిపిల్ల మనోజ్ఞకి ఈ విషయం తెలీక క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తోంది. అది అవుతుందా....? వస్తా....ఆఖరిసారి చెబుతున్నాను. ఆయన మాట వినకుంటే, ఈ జైల్లోనే నేనూ ఖైదీనయిపోతాను. నిన్ను చంపి నువ్వెక్కవలసిన ఉరికంబం నేనెక్కుతాను. ఇది ముమ్మాటికీ సత్యం. వస్తాను" అని ఆవేశంగా అంటూ స్త్రీల వార్డ్ కేసి వడివడిగా సాగిపోయింది ఆమె.

    తల్లి ప్రవర్తనకు వివేక్ నిర్ఘాంతపోయాడు. రామదాసుకి ఆ సంఘటన వెంటనే జీర్ణం కాలేదు.


                                                                   *    *    *    *


    అదేరోజు సాయంత్రం అయిదుగంటల సమయం....జైల్లో తోటలో వున్న పంపు దగ్గర రామదాసు, వివేక్ కాళ్ళూ, చేతులు కడుక్కుంటున్నారు.

    "మనోజ్ఞ ఎవరు?" మెల్లగా ప్రశ్నించాడు రామదాసు.

    జైలు గోడలు ఎత్తుగా వుండటం మూలంగా సంధ్య చీకట్లు జైలుపై పరుచుకుంటున్నాయి.

    నిస్తబ్దత, నిర్జన నిశ్శబ్ధత పేరుకున్న ఆ ప్రాంతంలో రామదాసు మాటలు వివేక్ కి స్పష్టంగా వినిపించాయి.

    "శూన్యంలో, దైన్యంలో ప్రేమని ఎలా బ్రతికించుకుంటుంది....?

    అది తెలీక అలమటిస్తున్న నా ప్రియురాలు- ప్రేమికురాలు" నైరాశ్యం నిండిన కంఠంతో అన్నాడు వివేక్.

    "ప్రపంచం శూన్యం అయినా, ప్రేమికుల గుండెలు శూన్యం కారాదు.... నువ్వెంత అదృష్టవంతుడివయ్యా! నిన్ను ప్రేమించే ఇద్దరు అమృతమూర్తులు ఇంకా మిగిలే వున్నారు. నీ ఉరిపట్ల ఆ అమ్మాయెలా రియాక్ట్ అయింది?"

    "గవర్నర్ ని, అవసరమైతే ప్రెసిడెంట్ ని కలిసయినా క్షమాభిక్ష కోరాలని విశ్వప్రయత్నం చేస్తోంది" అన్నాడు నిట్టూరుస్తూ.

    "ఆఖరి నెత్తుటిబొట్లు ఇగిరిపోయేవరకు పోరాటం అంటే అది.... నీ జీవితం చాలా విచిత్రమైంది-రా....బయటకు రా....జైలు గోడల్ని అధిగమించి బయటకొచ్చి పగతీర్చుకొని, అప్పుడే ఉరికంబం ఎక్కమని తల్లి- నువ్వేం బెంబేలు పడకు.... క్షమాభిక్ష సంపాదిస్తానని ప్రియురాలు....

    మధ్యలో ఎటూ తేల్చుకోలేని పుట్టుకతో వృద్ధుడిగా నువ్వు.... ఇదేనయ్యా హ్యూమన్ డ్రామా అంటే.... పగతీర్చుకోవాలని వున్నా, అందుకు తగ్గ ఆర్ధిక స్తోమత, ఆయుధబలం వున్నా తీర్చుకోలేని నిస్సహాయత నాది- ప్చ్....పద.... మనం ఇలాగే ఏమీ సాధించకుండానే రాలిపోతాం" అన్నాడు రామదాసు నిర్లిప్తంగా.

    ఇద్దరూ డైనింగ్ హాల్ కేసి నడుస్తున్నారు.

    అప్పుడే గంటకూడా మోగింది.

    డైనింగ్ హాల్ కి దగ్గరవుతుండగా హఠాత్తుగా ఎదురుపడ్డ జస్పాల్ ఒకింత తడబడి "నమస్తేన్నా!" అన్నాడు వినయంగా పక్కకి తప్పుకుంటూ వివేక్ ని ఉద్దేశించి.

    తిరిగి ఆలోచనల్లో పడ్డాడు వివేక్.


                                                                *    *    *    *


    "మనోజ్ఞని ఎందుకు కాదనుకున్నావ్?" రాత్రి ఎనిమిది గంటలకు యోగా ముగించుకొని లేస్తూ అడిగాడు రామదాసు హఠాత్తుగా.

    అప్పటివరకు రామదాసు కేసి చూస్తూ యోగ నిద్రలో వున్నట్లున్న అతను వులిక్కిపడి తేరుకున్నాడు.

    కొద్దిక్షణాలు మౌనంగా వున్నాడు.

    "చెప్పకూడనిదా?" తిరిగి ప్రశ్నించాడు రామదాసు. అన్ని కోణాల నుంచి అతడిని శోధించి ఆఖరి పోరాటానికి సిద్ధం చేయాలనే చూస్తున్నాడు రామదాసు.

    "చెప్పకూడనిదేం కాదు....చెప్పుకొని సిగ్గుపడవలసిన విషయంగా మిగిలిపోతుందేమోనన్న బాధ, వ్యధ, ఒకప్పటి మాట....మనోజ్ఞ, నేను బెంగుళూరులో కలిసి చదువుకున్నాం. ఆమె నన్ను ప్రేమించింది. చాలా ధైర్యంగా ప్రేమించింది. ఆమె నల్లగా వుంటుందని, నేను తెల్లగా వుంటానని, మీ ఇద్దరి మధ్య ప్రేమేమిటని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.

    నలుపులో అంత ఆకర్షణ....అందం....గ్రేస్ వుంటుందని తెలీని అమాయకులు అలాగే అనుకుంటారు.

    ఆమె ప్రేమిస్తోందని తెలిసి, నాకు నేను చాలా ఆనందించాను. ఆమెకు బాగా ఆస్థి వుంది. నేనామెను ప్రేమించానని బయటకు చెప్పుకోటానికి అది నాకు అడ్డుగా నిలిచింది. అదే కాదేమో- ఏదో బెరుకు, బెదురు.

    లోలోపల ప్రేమించేవాడినే కాని, బయటకు చెప్పుకోలేక కుమిలిపోయేవాడిని. కాలం గడిచిపోతుంటే.... ఆమె తనది ఒన్ వే లవ్వేమోనని బాధపడింది. 

    రెండు సంవత్సరాలూ ఆమె ఒక అడుగు ముందుకేస్తే, నేనో అడుగు వెనక్కేసేవాడ్ని- అలా మా మధ్య గేప్ పెరిగిపోయింది.

    చదువు ముగించుకొని వెళ్ళేముందు ఓ రోజు....ఆఖరిరోజు రైల్వేస్టేషన్ లో అందరూ చూస్తుండగానే మెరుపులా నామీద దాడిచేసి నా పెదవుల మీద సుతారంగా ముద్దుపెట్టి, దానికి సమాధానం రాయమని అడ్రస్ యిచ్చి అదృశ్యమైపోయింది.

    మధురమైన పెదవులమీద మొలిచిన ప్రశ్నకు సమాధానం ఏం ఇవ్వాలి? ప్రేమించానని, నేనూ ప్రేమించానని-    I love you అని ఎలుగెత్తి చాటాలి. ఎగిరి ఆమె ముందు వాలాలి.... నాకు రెక్కలు లేవు....

    మా అమ్మ తన తమ్ముడి కూతుర్ని నాకిచ్చి చేయాలని ప్రపోజ్ చేస్తే, ఆత్మహత్య చేసుకోవాలనిపించిందే తప్ప, అడ్డు చెప్పలేకపోయాను.

    లోలోపల ఆక్రోశించానే తప్ప మనోజ్ఞకు అండగా నిలవలేకపోయాను.

    ఆ తర్వాత రోజులు నిర్లిప్తతతో ముడివేసుకుపోయాయి. నాకు మా మేనమామ సత్యమూర్తి కూతురితో పెళ్ళి జరిగిపోయింది.

    అప్పటికి ఆమె నాకు రాసిన వుత్తరాలతో నా గది నిండిపోయింది. నా గుండె ఖాళీ అయిపోయింది. నాకు పెళ్ళయిన సంగతి ఆమెకు తెలీదు- అంత పిరిగ్గా పెళ్ళి చేసుకున్నాను.

    నా పెళ్ళి తరువాత కూడా నాకు నా 'మనూ' నుంచి ఎన్నో వుత్తరాలు వచ్చేవి- కొన్నాళ్ళకు వున్నట్లుండి ఆగిపోయాయి. ఆ తరువాత నాకు తెలిసింది. ఆమె నా కోసం హైదరాబాద్ వచ్చినట్లు- నాకు పెళ్ళయినట్లు తెలుసుకొని మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయినట్లు.

    బాధపడ్డాను....ఏడ్చాను....

    నాకేం కావాలో నాకు తెలిసినట్లే వుంటుంది. ఏమీ తెలీకుండా పోతుంది. ఏం వద్దో అర్ధమయింట్లే వుంటుంది. అర్ధం లేకుండానే మిగిలిపోతుంది.

    ఆమె నన్ను శపించి వుండదు....కానామె వుసురు నాకు తగిలింది.

    అందుకే నాకీ శిక్షేమో....?

    మనోజ్ఞ మైసూర్ లో లెక్చరర్ గా జాబ్ సంపాదించుకుంది. అక్కడే సెటిలయిపోయింది. ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కూతురు. పెళ్ళి చేసుకోలేడు. కారణం నాకూ తెలుసు, ఆమె తల్లిదండ్రులకూ తెలుసు.

    హఠాత్తుగా ఓ రోజు మనోజ్ఞ హైదరాబాద్ వచ్చింది. అందుకు కారణం నా ఘనత బెంగుళూరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పడటమే.... అదామె చూడటమే.

    అప్పటికి నా కేసు ట్రైల్ అయిపోయింది.

    జడ్జిమెంట్ రిజర్వ్ డ్....

    గతం మర్చిపోయి, నన్ను రక్షించాలని విశ్వప్రయత్నం చేసింది- అయినా ఫలితం లేకపోయింది.

    నాకు కేపిటల్ పనిష్ మెంట్....

    ఆమెకు వ్యధ....

    ఎందుకంటే.... ఆమె నన్ను ప్రేమించినంతగా, నేను ఆమెను ప్రేమించలేకపోయాను.

    ఆమె నాకోసం తను మకాం మైసూర్ నుంచి హైదరాబాద్ కి మార్చుకుంది. జూబ్లీహిల్స్ ఎక్స్ టెన్షన్ లో వున్న మాదాపూర్ సూర్యా ఎన్ క్లేవ్ లో ఇల్లు అద్దెకు తీసుకుంది.

    నా కేసుని తిరగదోడాలని, వీలుకాకపోతే క్షమాభిక్షను అర్ధించాలని సర్వం మర్చిపోయి పిచ్చిదానిలా ప్రయత్నిస్తోంది. అందుకోసం తన యావదాస్థినైనా ధారపోయటానికి సిద్ధమైపోయింది. ఇప్పుడా ప్రయత్నంలోనే వుంది.

    ఉరికి రోజుల్ని నేను లెక్కిస్తున్నాను.

    నా జీవించే రోజుల్ని కొనాలని ఆమె చూస్తోంది...." చెప్పటం ఆపాడు వివేక్.

    అతని కళ్ళవెంట నీళ్ళు బొట్లు బొట్లుగా.... నిశ్శబ్దంగా వుబుకుతున్నాయి.

    కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

    మరి మాట్లాడాలని వున్నా, ఏదో చెప్పుకోవాలని వున్నా నిస్సహాయుడైపోయాడు.

    దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు రామదాసు.

                          *    *    *    *

 Previous Page Next Page