Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 14

                                 రసిక శృంగారంలో రమణీయ బోధనలు

    రఘునాధ నాయకుడు ఆయన కుమారుడు విజయరాఘవ నాయకుడు శృంగారానికి రాజముద్ర వేశారు. రాజానుమతో ధర్మః అన్నట్టుగా రాజుగారి బుద్ధి ఎలా నడుస్తూ ఉంటే అనుచరులు అనుయాయులు అలాగే వుంటారు. రాజు రసికుడు కావడంతో రాజస్థానంలోని కవులు 'శృంగారానికి'కే పట్టం కట్టారు. అయితే అందులోనూ కొంతమంది కవులు తమ ప్రతిభా పాటవాలని చూపించక పోలేదు. వర్ణనాత్మకంగా సాగే ప్రబంధరచనల్లో కవి తన పాండిత్యమును ప్రదర్శిస్తూ చమత్కారాన్ని రంగరిస్తూ ఎంత బాగా రచన చేయవచ్చో విజయవిలాసం చెబ్తూ అలాంటి రచనలకి విలాసం కల్పించింది. వాటి వావిలో వరుసలో వుట్టినా వన్నెచిన్నెల్లో విశిష్టతను సంపాదించుకొంది "హంసవింశతి"

    ఇందులో కధ చాలా చిన్నది. ఒక చిన్నది హేమావతి. భర్త దేశాంతరం వెళ్ళితే అతని భార్య రాజుగారితో కలయిక కోసం సింగారించుకొని బయల్దేరుతుంది. అయితే ఆ ఇంట్లో ఉన్న 'హంస' రాజుగారి కోసం తయారై వెళ్ళే హేమావతిని ఆపి 'రంకు నేర్చినమ్మ బొంకు నేర్వాలి' నీలో ఆ సామర్ధ్యం, ఆ సమయజ్ఞత ఉన్నాయా అని అడిగి - ఓ కధ చెప్పి ఆ కథలో విచ్చలవిడిగా తిరిగి తప్పించుకొనే ఓ జాణపేరు చెప్పి అంతట దానివా అని అడుగుతుంది.

    తనని తాను ప్రశ్నించుకున్న హేమావతి వెళ్ళేందుకు ధైర్యం చాలక ఆగిపోతుంది. అలా ఇరవై రోజులు గడిచిపోయాయి. అంతలో హేమావతి భర్త విష్ణుదాసు తిరిగివస్తాడు. దాంతో రాజు చిత్తభోగమహారాజు, హేమావతి 'బుద్ధి'మంతులౌతారు. కథ కంచికి మనం ఇంటికి ఓ మంచి ప్రబంధం. ఇంత వింతయిన పుస్తకం శుకసప్తతి ఉంది. కానీ హంసవింశతి అయ్యలరాజు నారాయణమాత్యుని రచనా ప్రణాళిక మరొకరికి లేదు. 'బొకావియో' కధలు ఇలాగే ఉండవచ్చు. మరోదాంట్లో ఇలాగే యుండవచ్చు. కానీ విజ్ఞాన సర్వస్వం లాగా రచన చేసింది లేదు. అందుకే హంస వింశతికి ఆ విశిష్టత. ఇందులో హంస చెప్పిన కథల్లో నాయికల అన్నీ స్త్రీ వర్ణనలే అయినప్పటికి ఒకదానితో మరొకటి పోలికరాకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన కసరత్తులా అన్పిస్తాయి. అంతేకాదు ఆయా కులాలగురించి చెబ్తున్నప్పుడు వారి వారి వేషభాషలు ఎంతో నిశిత పరిశీలన చేసి చెప్పినట్లు కన్పిస్తాయి.

    విష్ణు దాసుడు విదేశానికి బయలుదేరేటప్పుడు అతడు ఏయే వంటకాలు ఏ ఏ పదార్ధాలు తీసుకెళ్ళారో ఒక పట్టిక ఇచ్చాడు. ఇదంతా ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. 'బొరుగులు' తీసికెళ్ళాడని చెప్పడంతో మరమరాలు అప్పటికే ఉన్నాయని తెలుస్తుంది. 'దోసెలు' కూడా ఆ పట్టికలో ఉన్నాయి!

    హంస ఇంత కధ నడవడానికి కారణం ఉంది. అంత అందగత్తె అయిన భార్యని విడిచి వెళ్తున్నాడు. కాబట్టే విష్ణుదాసుడు హంసతో ఇంటిలో భద్రం అని చెప్పి వెళ్లాడు. అదీ అసలు అంతఃపుర రహస్యం.

    వెళ్ళడానికి సింగారించుకున్న అమ్మగారిని నిలేసి నీతులు చెప్పి హితువు చెప్పి - సీత దమయంతి, శచీదేవి, ద్రౌపది తమపై మొహులైన రావణ పుళీంద, నహుష, కీచకుల కోర్కెలను తిరస్కరించారో చెపుతుంది. రాజులు ఎలాంటి వారో వివసిస్తుంది. రాజులు సంగమానికి తగని వారంటుంది.


    అధిపుల్ క్రూర ఫణి స్వరూపు లధరం బాసించు టే రీతి భూ
    మిధవుల్ కాళకరాళ కీలి సదృశుల్ మేన్మేన బొందించు టె
    ట్లు? ధరాధీశులు మత్తదంతి సములేలా నీకు చెర్లాట మా
    డ? ధరాభృత్కుచ యిరైరంగెరిగి వేడ్కం గోర్కు లీడేర్చికో,
    అని చెప్తుంది. ఇందుతో చమత్కారం చూద్దాం.

   
    విషంకక్కే పాములాంటి వారు రాజులు. వాళ్ళ అధరచుంబనం ఆశించొచ్చా? కాటు పడితే విషం ఎక్కదా? వాళ్ళు ప్రళయాగ్ని లాంటి వాళ్ళు. వాళ్ళతో మేనుతో మేను పొందించడం ఎలా సాధ్యం? అగ్నితో పొందు ఆఖరే కదా! వాళ్ళు ఏనుగులాంటి వారు - వాళ్ళతో తమాషాలా? ఇందులో శబ్ద చమత్కారం చూడవలసిందే?

    అలా నిలేసి అడ్డు చెబ్తూ ఉండగానే మొదట రోజు తెల్లారి పోతుంది. రెండో రోజు మళ్ళీ మామూలుగా సిద్ధమౌతుంది హేమావతి. అప్పుడు హంస తప్పుచేసిన చిన్నదాని కధను చెబ్తూ అలాంటి ధైర్యం ఉందా అని అడుగుతుంది.

    కధానుగునంగా రెండో కధలో 64 విద్యలు ఏవో వివరించాడు కవి. షోడశ కర్మలు చెప్పాడు - షోడశ మహారాజుల పట్టీ ఇచ్చాడు. కధలో ఇతరుల సొమ్ము కాశించి ఎలా చెడింది చెబుతుంది హంస. మళ్ళీ తెల్లార్తుంది. హేమావతి ఆగుతుంది. మళ్లీ మూడో రోజు కధ మామూలే. అందులో కధా నాయకుడు వీరుడు. అతని భార్య అతని కులభామ, గుణధామ, అలఘకామ, అతులితారమ అసమ రూపాభిరామ వదనజిత సోమ అధిక లావణ్య హేమరేఖ, ఆమె బిడ్డ పాపల కన్పెంచు జిడ్డులేక తిండిచే గండ మొండైన దండి కతన నెసగు నసగూటి పిస వెర్రి కటుసరేగి జారావాంఛా విహారం చేయసాగింది. ఆమె విటులకు కొంగు బంగారం. వేడుక కాండ్రకు పట్టు గొమ్మ. విట భాగ్యరేఖగా ఉన్న హేమరేఖ, ఓ వైద్యుడితో సంగతి చేస్తుంది. అక్కడ వైద్య పరిశ్రమ పట్టికిచ్చాడు కవి. ఆమె పిలిస్తే "పరోపకారిరా ఈ కలకంఠి" అనుకొని సై అంటాడు. ఇద్దరూ సై అనుకునే సమయంలో బయటకు వెళ్ళిన భర్త వస్తాడు. హేమరేఖ అబద్ధపు కడుపు నొప్పి దానికి వైద్యం చెప్పి రక్షించాడని బొంకుతుంది. అతడు నమ్మి వైద్యుడ్ని 'బహుమానం' ఇచ్చి సమ్మానిస్తాడు. అదిగో ఆ హేమరేఖ ధైర్యం ఉందా అని అడుగుతుంది హంస. అంతలో తెల్లార్తుంది.

    ఇలా ఇరవయి రోజులు గడిచిపోతాయి. అడుగడుగునా అద్భుతవర్ణనలు విజ్ఞాన సర్వస్వంలా మృగాల, పక్షుల, బాలక్రీడల, బాలికాక్రీడల, కోళ్ళ, గొర్రెమేకల పర్వతాల, ముళ్ళకంపల, ద్వీపాల పట్టీ వరుసపెట్టి ఇచ్చాడు.

    అవేకాక పండ్లురకాలు, పంటలు, కూరగాయలు, పుణ్యక్షేత్రాలు మహానదులు ఒకటేమిటి ఎక్కడ ఏ సందర్భంలో ఏది అవసరమో ఆ పట్టీ ఇచ్చాడు.

    ఎప్పుడో శృంగార గ్రంధమండలి వారిచే అచ్చైన ఈ గ్రంధాన్ని వెదికి పాఠదోష దోష పరిష్కరణ చేసి అర్ధతాత్పర్యాలు రాసి సిద్ధంచేశారు. మా గురువర్యులు శ్రీ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు దానిని 64 లో అచ్చేశారు వావిళ్ళవారు . మళ్ళీ తెలుగు అకాడమి కూడా అచ్చేసింది.

    ఫ్రౌఢ కల్పనతో లోకజ్ఞానం చెబుతూ నీతిని బోధించేది ఈ శృంగార ప్రబంధం. అన్నట్టు ఇది బూతు పుస్తకమని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వము (1871) నిషేధించింది. తిరిగి ప్రకాశం పంతులు గారి కాలంలో ఆ ఉత్తర్వులు పోయాయి.

    సాహితీ పిపాసువుల దప్పిక తీర్చే ఈ కావ్యం పరిష్కరించిన మద్దులపల్లి వారి ఋణం ఎప్పుడూ తీర్చలేనిది.


                                              ----*----
       

 Previous Page Next Page