Previous Page Next Page 
అహల్య పేజి 14


    'అవును. మమ్మల్నందరినీ ఆయాసపెట్టి ఆపై గుట్టుచప్పుడు కాకుండా అహల్యణు గౌతముడికి ధారపోస్తే మిన్నకుండిపోతామా? మాకు నిజం తెలియాలి' అన్నారు మిగతా వాళ్ళందరూ.


    'శాంతం! శాంతం! ఆవేశంలో, ఆక్రోశంలో ఉచితానుచితాలు మరిచి మాట్లాడటం మహేంద్రుడికి తగదు. పరమేష్టికి పక్షపాతమెందుకుంటుంది? మాయ చేయవలసిన అవసరం, మోసం చేయవలసిన ఖర్మ ఆయనకేం పట్టింది?' అన్నాడు నారదుడు.


    'మరి ఏమిటిది?' గర్జించాడు దేవేంద్రుడు.


    'భూ ప్రదక్షిణం చేసిన వారికి కదా అహల్యనిచ్చి వివాహం జరిపిస్తానని సృష్టికర్త ప్రకటించింది. గౌతముడికి ఈ విషయం తెలిసింది. ఒక్క దేవతలే పాల్గొనాలని నియమం లేదు. సురసభకు, బ్రహ్మ సన్నిధికి ఆ సమయంలో వచ్చినవారే పందెంలో పాల్గొనాలనే నియమం లేదు. కనుక గౌతముడు తానూ సమయం ప్రకారం భూ ప్రదక్షిణం చేశాడు.'


    'నారదా! డొంక తిరుగుడు వద్దు! భూ ప్రదక్షిణం చేశాడు అని రెట్టించి చెప్పకపోతే ఎలా చేశాడో - ఎప్పుడు చేశాడో చెప్పరాదూ?'


    'చెపుతాను దేవేంద్రా! సగమీనిన గోమాతకు ప్రదక్షిణం చేస్తే అది భూప్రదక్షిణంతో సమానమని కదా ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రహ్మ ప్రకటించిన ప్రకారం సమయానికి తన ఆశ్రమంలో ఈనుతున్న కపిల ధేనువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి భూమండలం చుట్టి వచ్చిన ఫలాన్ని సాధించారు గౌతమ మహర్షి' అన్నాడు నారదుడు.


    హతాశుడైనాడు ఇంద్రుడు.


    అతనికి గౌతముని యుక్తి కంటే అహల్య వియోగమే భరింపరానిదిగా తోచింది. తన మనస్సులోని ఆవేదనని దాచుకోలేక అన్నాడు.


    అతనికి గౌతముని యుక్తి కంటే అహల్యా వియోగమే భరింపరానిదిగా తోచింది. తన మనస్సులోని ఆవేదనని దాచుకోలేక అన్నాడు. న్యాయ సమ్మతమనీ, ధర్మ సమ్మతమనీ ఏ పేరు పెట్టినా ఫర్వాలేదు. చతురాననా! నాలుగు ముఖలా నాలుగు వేదాలూ ప్రవచించినందులకు న్యాయమే చేశావు. నేను అన్యాయమైపోయాను. కాదా చెప్పండి బ్రహ్మదేవా! అహల్య సృష్టికి కారణం ఎవరు? నేను కాదా? అంతటి అందగత్తె పుట్టుకకు హేతువైన నేను ఆమెను ఆశించడం ధర్మమే కదా! సురాధిపత్య హేతువుగా, త్రిలోకాధిపత్య కారణంగా ఆమెను నాకు ధారపోస్తారని ఆశించాను. కానీ మీరు వరపరీక్ష నిర్ణయించారు. అలాగే కానిమ్మని అందులో పరుగు పరుగున వచ్చాను. ప్రప్రధమంగా వచ్చాను. ఈ రూపవతి దక్కగలదని ఆశించాను. కానీ నేనొకటి తలిస్తే మీరొకటి తలచారు!'


    'దేవేంద్రా!'


    'స్వర్గాధిపత్యం చేజారిన నాడయినా ఇంత వేదన లేదు. సృష్టికర్తా! దాన్ని మాయోపాయంతోనో, మరో ఉపాయంతోనో, మరొకరి సహాయంతోనో సాధించగలననే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు...'  


    ఇంద్రుడు పూర్తి చేయలేదు. అటు తిరిగి-అహల్యవైపు చూశాడు. పరదాలను ఫలాపేక్షతో పరీక్షించడం అతనికలవాటే!


    'గత జల సేతు బంధనంగా జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు. కానీ పరీక్షకు అంగీకరించిన తర్వాత ప్రకటించిన ఫలితానికి శిరస్సు వంచవలసిందే!' అన్నాడు విశ్వామిత్రుడు.


    దానితో సర్వం సద్దుమణిగింది. ఇంద్రాది దేవతలు తమతమ నివాసాలకు వెళ్ళారు. విశ్వామిత్రాది మహర్షులు తమతమ నెలవులకు వెళ్ళారు. పరమేష్టికి, సరస్వతికి ప్రణమిల్లి గౌతముడు అహల్యాద్వితీయుడై తన ఆశ్రమానికి బయలుదేరాడు. వెళ్తోన్న ఇద్దరినీ చూస్తూ నిట్టూర్చాడు నారదమహర్షి.


                                                                    8


    గూఢచారి తెచ్చిన వర్తమానం అంతా రావణుడికి నివేదించాడు ప్రహస్తుడు. అతని మాటలు విన్న రావణుడు పకపక నవ్వాడు.


    'ఏమిటేమిటీ? అయోధ్య నగర పాలకుడు దశరధుడు కొడుకుల కోసం పుత్రకామేష్టి చేయాలనుకుంటున్నాడా! చక్కగా ఉంది ఆలోచన! దేవతలంతా వెళ్ళి శ్రీమహావిష్ణువును మొరపెట్టుకున్నారా? ఆపన్నివారకుడు పరమేశ్వరుడు. పరమశివుని ప్రార్ధించిన వారికి ఆపదలు ఆమడ దూరం తొలగిపోతాయి.


    శుభాన్ని కలిగించేవాడు శివుడొక్కడే! సర్వమంగళ అనే పేరుగల జగజ్జనని పార్వతీదేవికే చెల్లుతుంది.


    లక్ష్మి సంపదనిస్తుందే గానీ సర్వమంగళమైన మాంగల్యాన్ని ఇవ్వలేదు. ఎందుకీ దేవగణం విష్ణువుని ఆశ్రయిస్తుందో గదా! శంభుడు అసుర పక్షపాతి అని ప్రసిద్ధి. మనం ఆశ్రయించిన గిరిజా నాధుని కాదనడం వల్లే సురపక్షపాతి అయిన విష్ణువుని ఆశ్రయిస్తున్నారేమో! సరి! సరి! ఎవరి ఇష్టదైవం వారిది. ఎందుకు కాదనాలి మనం? ఆ మహా విష్ణువు తను అవతరించడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడటనా!'


    తలూపేడు ప్రహస్తుడు.


    'ఇంకేం వార్తలు'


    'ఒక తమాషా జరిగింది పౌలస్యా!'


    'ఏమది?'


    'మూడు లోకాలను పాలించమని అధికారం అప్పగిస్తే అమరలోకాన్ని దక్కించుకుని తీరిగ్గా కూచుని అమృతం తాగుతూ, అప్సరసల నాట్యం తిలకిస్తూ గానపానాలతో కాలక్షేపం చేసే ఇంద్రుడికి లోకంలో అందరికంటే అందగత్తె ఎవరా అన్న సందేహం వచ్చింది. కట్టుకున్న ఇల్లాలు శచీదేవి చక్కదనాల చుక్క. అయినా అతడి కళ్ళు ఎప్పుడూ పర స్త్రీని పరివేష్టించి ఉంటాయి కదా ప్రభూ!'


    'ఔనౌను. కొంగు చూస్తే కోటి విధాలా చలిస్తాడు ఇంద్రుడు. అచ్చెరల మధ్య తిరుగాడుతూ ఉండటంతో అతనికెప్పుడూ ఆడవారి ధ్యాసే!'


    'అదొక్కటేనా ప్రభూ! ముక్కు మూసుకుని ఏ ముని కుమారుడు జపం ప్రారంభించినా, ఆ తపస్సు తన పదవిని ఆశించే అని ఆరాటపడతాడు. ఏ రాజయినా, ఋషి అయినా యజ్ఞం ప్రారంభిస్తే అది నూరు యజ్ఞాలకు శ్రీకారమని అతడెప్పుడు నూరు పూర్తి చేసి, శతముఖి అయి తన ఇంద్రత్వాన్ని పొంది తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడోనని భయం ప్రభూ!'

 Previous Page Next Page