సరోజకి అంతా గారడీగా వుంది.
మూడు నాలుగేళ్ళుగా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు వెంకయ్య. ఏదీ కలిసిరాలేదు. నిన్న సాయంకాలం వెళ్ళి అడగటం, ఈ సాయంకాలానికి పెళ్ళి జరిగిపోవటం అంతా మాయగా, చిత్రంగా ఉండి ఆమెకి.
భర్తని అందరూ పొగుడుతూ ఉంటే గర్వంగానూ ఉంది ఆమెకి.
రకరకాల చీరలు తేలేదనీ, నగలు చేయించలేదనీ ఒకరిద్దరు అన్నా పట్టించుకోలేదు. వాటిదేముంది? అంతా మన చేతిలో ఉంది. ఎప్పుడంటే అప్పుడు చేయించుకోవచ్చు. కొనుక్కోవచ్చు అనుకుంది.
ఆ రాత్రి, మిగతా రెండు రోజులూ భర్త సాన్నిధ్యం సరోజకి రమణ ఆంతర్యాన్ని విప్పి చెప్పింది.
భగవంతుడు లాంటి భర్త దొరికినందుకు మురిసిపోయింది సరోజ.
మూడు రోజులు కాగానే భార్యతో సహా ఇంటికి బయలుదేరాడు రమణ.
చీరె సారె అంటూ కూతురికి వెంకయ్య ఇస్తూన్న వాటిని చూసి, 'ఎందుకివన్నీ,' అనుకున్నా 'పోనీలే. ఆయన తృప్తికోసం ఇస్తున్నాడు. అనుకున్నాడు మౌనం వహించాడు రమణ.
ఇంటికి రాగానే తల్లీ, తండ్రీ ఉన్న ఫోటోకి నమస్కరించారు ఇద్దరూ. తర్వాత వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించారు.
కూతురు వెంట వచ్చిన మహాలక్ష్మమ్మకు, వెంకయ్యకు, ఇంకా దగ్గర బంధువులకు ఆ రోజు విందుచేశాడు రమణ.
ఆ సాయంకాలం అంతా తిరిగి వెళ్ళిపోయారు.
భార్యని తీసుకుని పొలంవైపు వెళ్ళాడు రమణ.
"రోజా! ఇది మనపాలిటి దైవం ఈ భూదేవి. పండితేనే నీవూ, నేనూ, నలుగురు మనుషులమూ తినగలిగేది. మనగలిగేది. మనం పండించాలి, దేశానికి పెట్టాలి. మనం గట్టిగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.
"నీకు భర్తసేవ ఎంత ముఖ్యమో ఈ భూమాతసేవ కూడా అంతే ముఖ్యం. మన కన్నబిడ్డలా చూచుకొని అన్నీ అందిస్తే మనల్ని కన్నతల్లిలా ఆదరించి పోషిస్తుంది.
"మనం నిర్లక్ష్యం చేసినా, అశ్రద్ధ వహించినా శత్రువు కంటే బలంగా దెబ్బతీస్తుంది.
"నాకు పొలమే తిండి, పొలమే నిద్ర, పొలం తప్ప మరోధ్యాస ఉండదు. పండించాలి! పండించాలి! ఇదే నా ధ్యేయం" అన్నాడు.
ఆ పొలంలోని మట్టి చేతిలోకి తీసుకొని చిలిపిగా అతనిపై చల్లి, "మీరు ఒట్టి మట్టి మనుషులు" అంది సరోజ నవ్వుతూ.
వాళ్ళిద్దరి కిలకిలలతో భూమాత పులకరించింది.
యూనివర్శిటీ డిగ్రీ తీసుకొని గోపీ తిరిగి వచ్చేసరికి రమణ పెంకుటి యింటినల్లా పక్కా ఇల్లుగా మార్చాడు. పైన ఒక గది వేయించాడు. ఆ ఊళ్లో చంద్రానికి మేడ ఉంది. తర్వాత మేడ ఉన్న ఇల్లు రమణదే! ఇదిగో, నీకు ఎదురు తీర్చాను చూడు, అన్నట్టుగా ఉంది రమణ మేడ కట్టడం.
ఇంటికెదురుగా ఉన్న బయట స్థలం అమ్ముడవుతూ ఉంటే అదీ కొన్నాడు రమణ. అందులో పశువులకు పాక వేయించాడు. అక్కడే ఒక పంపు వేయించాడు. ఆ స్థలం చుట్టూ, తాను కాపురం ఉండే ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టించాడు.
భార్యకి నగలు చేయించాడు.
నగలు దాచడానికి మంచి బీరువా కొన్నాడు.
ఈ మధ్య కాలంలో గోపీ ఆ ఊరికే రాలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు కాగానే సౌత్ ఇండియా టూర్ వెళుతున్నానంటే డబ్బు పంపాడు రమణ. ఆ టూర్ కాగానే మళ్ళీ కాలేజీలు తెరవటంతో రావటానికే కుదరలేదు.
మధ్య సెలవులలో రావటానికి ట్యూషన్ అడ్డువచ్చింది.
రెండవఏడు సెలవులతో నార్త్ ఇండియా టూర్ వేశారు యూనివర్శిటీవాళ్ళు. డబ్బు పంపటానికి సంకోచించలేదు రమణ. మిగతా అన్ని విషయాల్లో పరమ పిసినారి రమణ. కనీ భార్య విషయంలో, పొలం విషయంలో, తమ్ముడి విషయంలో అతని చేయికి అడ్డులేదు. అది వెనక్కి పోదు.
ఫైనలియర్ లో ఊపిరి తీసుకునేంత సమయం కూడా దొరకలేదు గోపీకి. ఫస్టుక్లాస్! ఫస్టు రాంక్! అదీ అతనిధ్యేయం.
ఎప్పుడు డబ్బు పంపినా రమణ చేసే మొదటి హెచ్చరిక చదువుని గురించే. అందుకు తగ్గట్టుగానే చదివాడు గోపీ.
పరీక్షలు వ్రాసి ఇంటికి తిరిగివచ్చిన గోపీకి ఇల్లంతా మారిపోయినట్టుగా అనిపించింది క్షణకాలం. తాను పొరపాటున ఎవరింటికయినా వచ్చానా అని భ్రమపడ్డాడు.
'అదిగో, తను నాటిన అశోకాలు!' అనుకుని గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చాడు.
సరిగ్గా అదే సమయంలో చంకలో పిల్లవాడితో బయటికి వచ్చిన సరోజకి గోపీని చూడగానే ఆశ్చర్యపడింది.
బాగా ఎదిగి రంగు తేలి అందంగా తయారయ్యాడు గోపీ! మూడేళ్ళనాటి మరిదికి, ఈ మరిదికి పోలికే లేదు. కానీ వెంటనే గుర్తించింది ఆమె.
"గోపీ!" అని పిలిచింది సంతోషంగా.
చేతిలో ఉన్న సూట్ కేసు క్రిందపెట్టి. "వదినా!" అని ఆమె చేతిలో ఉన్న పిల్లవాడి కోసం చేయి చాచాడు గోపీ.
మరిది చేతికి పిల్లవాడిని అందించి, అతని సూట్ కేస్ తీసుకుని "రా! గోపీ" అని ఇంట్లోకి దారి తీసింది సరోజ.
"ఒరే! చిన్నబాబూ! నిన్ను చూడాలని ఉన్నా రాలేక పోయానురా!" అని వాడి చెక్కిలి ముద్దుపెట్టుకుని కదిలాడు. నాలుగడుగులు వేసి, "అరె రాస్కెల్ యిన్నాళ్ళనించీ రాలేదని పనిష్మెంటటరా ఇది?" అన్నాడు. అబ్బాయిని దూరంగా చేతుల్లో నిలిపి, ఆ పని పూర్తి చేయగానే తిరిగి చంక కెత్తుకుని, "దొంగవెధవ! అన్నయ్య రానీ, నీపని చెపుతా" అన్నాడు.
"వాడినిట్లాయిచ్చి కాళ్ళు కడుక్కుని, పంచ కట్టుకురావయ్యా గోపీ!" అని కాళ్ళు కడుక్కోవటానికి అతనికి నీళ్లు ఇచ్చి, పిల్లవాడిని అందుకుంది సరోజ.
విశ్రాంతిగా కూర్చుని "అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు. వదినా?" అని అడిగాడు గోపీ.
"మీ అన్నయ్యకి ఇల్లు తప్పితే ఇంకొకటేముంది, పొలం తప్ప, అలా చూసిరావటానికి వెళ్ళారు."
"మా అన్నయ్య నిజమైన రైతుబిడ్డ, వదినా, ఆయనకి పొలం తప్ప మరొకటి అక్కర్లేదు. రాత్రింబవళ్ళు అలా నిద్రాహారాలు అక్కర్లేకుండా కష్టపడినవారికే భూమి పండుతుంది. నిజానికి ఈ ఊళ్లో మా అన్నయ్యలాగా పండించే వాళ్ళెవ్వరు?"
నవ్వింది జవాబుగా, ఆమె ఇచ్చిన కాఫీగ్లాసు అందుకుని, "కాఫీ నేర్పించావా వదినా, అన్నయ్యకి?" అని అడిగాడు గోపీ.
"అయ్యోరామ! నాచేతనే కాఫీ మానిపించారాయన. ఇదిగో నీవువస్తే ఉండాలని తెప్పించారు మొన్ననే.
నవ్వాడు గోపీ. "ఆదర్శ పత్నివన్నమాట వదినా నువ్వు. ఆయన మటుక్కు ఆయన అన్నీ వదిలేసి డబ్బు మిగిలిస్తున్నాడు ఇంత వరకూ! నీవు వచ్చావు ఇకనయినా సుఖపడతాడులే అనుకుంటే నీవూ ఆయన తానా అంటే తందానా అనేట్టుగా ఉన్నావు."
"ఎంత కష్టపడ్డా ఏం మిగులుతుంది, గోపీ! ఎంత మిగిలినా అదంతా నీకూ, వీడికే కదా" అంది కొడుకుని ముద్దాడుతూ.
"బంగారు బొమ్మలా ఉన్నాడు రాస్కెల్!" అని కాఫీగ్లాసు క్రిందపెట్టి మళ్ళీ పిల్లవాడిని అందుకున్నాడు గోపీ.
"అరరే! ఎప్పుడొచ్చావ్ గోపీ" అని ఆశ్చర్యంగా అడిగాడు రమణయ్య. స్వంతఇల్లు కట్టుకుని, స్వంత పొలం సంపాదించుకుని, ఒక ఇంటి వాడయ్యాక రమణల్లా రమణయ్యగా మారిపోయాడు ఊరి వారి దృష్టిలో, కాసులు గలవాడే రాజు గదరా సుమతీ అన్న లోకం ఇది మరి.
"ఇప్పుడే అన్నయ్య!" అన్నాడు కుర్చీలోంచి లేచిన గోపీ.
"బాగా సదుకున్నావా గోపయ్యా" అని అడిగాడు శీనయ్య.
"బాగా కుండాను శీనయ్యా" గోపీ వెక్కిరింతకు అందరూ నవ్వారు శీనయ్యతో సహా.
"ఒరే! పల్లెటూరి వాళ్ళు అలాగ మాట్లాడక ఎలా మాట్లాడతార్రా?"
రమణ అన్నదానికి జవాబుగా గోపీ "శ్రద్ధవుండి నాలుగురోజులు కష్టపడితే మనలాగే మాట్లాడవచ్చు. ఒక నెల రోజులు రాత్రి పాఠశాలకు వెళ్ళితే రాయటం, చదవటం నేర్చుకోవచ్చు అన్నాడు.
'ఈ మాటలన్నీ కడుపు నిండినవాళ్ళు చెప్పే మాటలురా గోపీ! వేకువను లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రెక్కలు ముక్కలయ్యేలాగా కష్టపడితే కానీ సరిగా తిండీ బట్టా అమరటం లేదు జనానికి. ఇక చదువుకునే తీరిక ఎక్కడ? వీళ్ళకి ఎలాగూ లేదు. వీళ్ళ పిల్లలకయినా చదువు రావాలంటే వాళ్ళూ మట్టి పిసుక్కుంటేనే కానీ తిండి గింజలు దొరకటం లేదు. ఎన్ని ఫ్రీ హాస్టల్సు పెట్టినా వీళ్ళ సమస్య ఇలాగే ఉండిపోతోంది." అన్నాడు రమణయ్య.