Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 14


    "సుదారాణీయా?" కళ్ళు పెద్దవి చేసి కుతూహలంగా అడిగాడు శంకర్.


    "మరేమనుకున్నావ్? మనవాడు పెద్ద చాన్స్ కొట్టాడు. మనలాంటి వాగుడు గాళ్ళు ఎందుకూ పనికిరార్రా! ఇలాంటి ముచ్చులు ఉన్నారు చూశావ్! చాలా తెలివైనవాళ్ళు చూసి చూసి గాలం వెయ్యవలసి చోటే వేస్తారు"


    "అవునుర్రా! సుధారాణి బంగారు గుడ్లు పెట్టే బాతు"


    "నోళ్ళు ముయ్యమన్నానా?" చివ్వున లేచి కూర్చున్నాడు గౌతమ్.


    "అంతకోపం ఎందుకురా బ్రదర్. సుధారాణిని నమ్మకు. సిన్సియర్ గా ప్రేమలో పడ్డావంటే హరోం హరి...ఏదో అలా అలా..."


    గౌతమ్ ముఖం చీదరించుకున్నట్లు పెట్టుకున్నాడు.


    "లేదురా! ఆ రాణి నిజంగానే గౌతమ్ అంటే పడిచచ్చిపోతుంది"


    "నిజమైన ప్రేమ అంటావ్!"


    "అంతకు మించిందేరా! ఆరాధన. ఆరాధిస్తుంది"


    "వాళ్ళ ప్రేమ అమర ప్రేమ అని చెప్పు!"


    "అవును!"


    "వారి మధ్య తుఫాన్ రేగితే?"


    "అయినా వాళ్ళు వెలిగించిన ప్రేమజ్యోతి ఆరిపోదు"


    "ఉప్పెన వస్తే?"


    "మనవాళ్ళు పెనుగాలులై ఆ ఉప్పెనను వెనక్కు నెట్టేస్తారు"


    "మీ బొందలా ఉంది మీ సంభాషణా మీరునూ" గౌతమ్ విసుక్కున్నాడు.


    "మనవాడికీ నిజంగానే కోపం వచ్చిందిరోయ్! గప్ చుప్!" నోటిమీద వేలు వేసుకున్నాడు వేణు.


    గౌతమ్ పడుకున్నాడు.


    రేణుకను తల్చుకుంటూ పడుకున్నారు.


    రేణుకతోతాను గడపబోయే భవిష్యత్తు గురించి కలలుకంటూ పడుకున్నాడు.


                                                                     * * *


    "ఒరేయ్ గౌతమ్!"


    "ఏమిటి?" హనుమంతరావు దగ్గిరకు వచ్చాడు గౌతమ్.


    "కూర్చోరా టీ తాగుదాం"


    గౌతమ్ కూర్చున్నాడు. వేణు అప్పటికే హనుమంతరావు దగ్గిర కూర్చున్నాడు.


    వేణు హనుమంతరావుని అంటిపెట్టుకొనే ఉంటాడు. హనుమంతరావు వేణుకు బట్టలుకూడా కుట్టిస్తాడు. ఇద్దరూ సాధారణంగా ఒకే రకం బట్టలు వేసుకుంటారు. తెలియనివాళ్ళు చాలా మంది ఇద్దర్నీ అన్నదమ్ములనుకుంటారు. హనుమంతరావుకు తాళం వేస్తూ అతని అడుగులకు మడుగులొత్తుతూ తిరిగేవేణు అంటే గౌతమ్ కు అసహ్యం. ఇలాంటివాళ్ళు ఉండడంవల్లనే ధనవంతులకు బీదవాళ్ళను చూస్తే చులకనభావం అనుకుంటాడు.


    హనుమంతరావుకు గౌతమ్ అంటే ఇష్టం. వేణులా గౌతమ్ ను తనతో తిప్పుకోవాలని ఉంటుంది. కాని అది సాధ్యపడటంలేదు.


    "రేపు రాత్రి మా ఇంటికి డిన్నర్ కు రావాలిరా" అన్నాడు హనుమంతరావు.


    "ఏమిటి విశేషం?" అన్నాడు గౌతమ్.


    "మా నాన్నగారి స్నేహితుడికొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడు. మా డాడి ఆ సందర్భంగా పెద్దపార్టీ ఇస్తున్నాడు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులంతా వస్తారు.


    "ఎవరికోసమో మీ నాన్న అంత ఖర్చు చేస్తున్నాడు?" ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్.


    "అతను ఆర్కిటెక్చెర్ స్పెషలైజ్ చేసి వస్తున్నాడు"


    "అయితే!" గౌతమ్ కు అతని డిగ్రీకి పార్టీకీ ఉన్న సంబంధం ఏమిటో బోధపడలేదు.


    "ధనవంతుల ఇళ్ళలో పార్టి చాలా లావిష్ గా ఉంటాయని విన్నాను- నేను తప్పకవస్తాను" అన్నాడు వేణు.


    "నువ్వు వస్తావులేరా? గౌతమ్ ను రమ్మంటున్నాను"


    "ఏరా వస్తావా?" అన్నాడు వేణు.


    "రాను" ఖచ్చితంగా అన్నాడు గౌతమ్.


    "ఏం?"


    "నేను ధనవంతుణ్ణి కాదు"


    "నా స్నేహితుడిగా రావోయ్. మరీ అంత బెట్టు చెయ్యకు" అన్నాడు హనుమంతరావు.


    గౌతమ్ మౌనంగా టీ సిప్ చేస్తూ ఉండిపోయాడు.


    "నన్ను డిస్సపాయింట్ చెయ్యకు. తప్పక రావాలి"


    తన ఇంట్లో పార్టీలు ఎంత ఘనంగా జరుగుతాయో గౌతమ్ కు చూపించాలని హనుమంతరావుకు ఉన్నది.


    "ఏరా మాట్లాడవ్!"


    "అలాగే వస్తాను"


    "థ్యాంక్యూ!"


    "మెనూ ఏమిటి?" వేణు అడిగాడు.


    "స్కాచ్ విస్కీ....."


    "ఒకో బాటిల్ ఎంత ఉంటుంది?" వేణు కుతూహలంగా అడిగాడు.


    "రెండు వందల ఇరవై బ్లాకులో కొనాలి"


    "మొత్తం విస్కీ మీద ఎంత ఖర్చు చేస్తారు?" గౌతమ్ అడిగాడు.


    "దాదాపు నాలుగువేలు కావచ్చును"


    "బాప్ రే!" అన్నాడు వేణు.


    "మొత్తం పార్టీకి ఎంత ఖర్చు అవుతుంది!"


    "ఒక్కొక్క వ్యక్తికి డ్రింక్ కాక ఏభై రూపాయలు మెనూకు వేసుకున్నాం. మొత్తం పదివేలన్నా అవుతుంది."


    "ఒక స్నేహితుడి కొడుకు విదేశం నుంచి వచ్చినందుకు పదివేలు పెట్టి మీ నాన్న పార్టీ ఇస్తున్నాడా?" గౌతమ్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.


    "ఆడవాళ్ళు కూడా తాగుతారా?" వేణు కుతూహలంగా అడిగాడు.

 Previous Page Next Page