Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 14


    అందరూ మళ్ళీ సైలెంటయిపోయారు.
    "అయితే ఓ పని చేద్దాం" అన్నాడు జాకబ్.
    "ఏమిటది?"
    "చిరంజీవిని కిడ్నాప్ చేద్దాం"
    అందరూ ఉలిక్కిపడ్డారు.
    "కిడ్నాపా?"
    "అవును. మనం ఏర్పాటుచేసిన మనుషులు చిరంజీవిని కిడ్నాప్ చేసుకెళ్ళి డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్లు నాటకమాడి రాత్రి పది గంటలకు వదిలేస్తారు. దాంతో ఆ పిల్లకి, చిరంజీవికి చెడిపోతుంది."
    ఈశ్వరరావు ఆనందం భరించలేక తప్పట్లు కొట్టాడు.
    చిరంజీవి అద్దం ముందు నిలబడి స్విట్జర్లాండ్ నుంచి తెప్పించిన పెర్ ఫ్యూమ్ కొట్టుకుని, హాంకాంగ్ నుంచి తెప్పించిన మేకప్ కిట్ ని ఉపయోగించి, జర్మనీ నుంచి తెప్పించిన లెదర్ జాకెట్ వేసుకుని, ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన చేతి రుమాలు జేబులో పెట్టుకుని అప్పుడు హోటల్ కృష్ణా ఓబరాయ్ కెళ్ళడానికి బయలుదేరాడు.
    డ్రైవర్ సెల్యూట్ కొట్టి కారు డోర్ తెరచి పట్టుకున్నాడు. కార్లో కూర్చుని టైమ్ చూశాడు చిరంజీవి. ఆరయింది.
    తను ఓ గంట ముందుగానే అక్కడికి చేరుకోవటం మంచిదనిపించిందతనికి. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఏమాత్రం రిస్క్ తీసుకూడదని 'లవ్ గైడ్' అనే జెకోస్లోవేకియా రచయిత రాసిన పుస్తకంలో చదివాడతను. అలా రిక్స్ తీసుకోవటం వల్లే సెకోమకారోవో అనే అతను దేవకన్య లాంటి ప్రియురాలిని పోగొట్టుకుని ప్రస్తుతం బీసీవరోనెకో అనే అంద హీనురాలితో అతి భయంకరమైన జీవితం గడుపుతున్న ఉదాహరణ కూడా ఇచ్చాడతను. చిరంజీవి లోలోపలే భగవంతుడిని ప్రార్థించుకున్నాడు.
    "భగవంతుడా! నన్ను 'సెకోమకారోవ్'గా చేయకు. నాకు సంగీత లభించేట్లు చూడు. జీవితాంతం నీకు ఋణపడి వుంటాను" అన్నాడు.  
    కారు సడెన్ బ్రేక్స్ తో ఆగిపోయింది. రోడ్డుకి అడ్డంగా లారీ ఆగి వుంది. డ్రైవర్ గట్టిగా లారీ వేపు చూసి అరుస్తోంటే ఓ వ్యక్తి డ్రైవర్ దగ్గరకోచి చిరునవ్వు నవ్వాడు.
    మరుక్షణం అతని చేతిలోని రివాల్వర్ డ్రైవర్ భుజానికి తగిలింది.
    "ఎక్కువ మాట్లాడకుండా డోర్ లాక్ తియ్. అవతలివేపు మా మనిషున్నాడు" అన్నాడతను.
    డ్రైవర్ మాట్లాడకుండా డోర్ తెరిచాడు.
    వెంటనే ఇద్దరు వ్యక్తులు వెనుక ఒకరు, ముందు ఒకరు కార్లోకొచ్చి కూర్చున్నారు. ఇద్దరి చేతిలోనూ రివాల్వర్స్ ఉన్నాయి.
    "హలో! గుడ్ మార్నింగ్! మీరే డిపార్ట్ మెంట్? పోలీసా, ఇన్ కమ్ టాక్సా, నక్సలైట్సా? లేక టెర్రరిస్ట్ లా? ఎక్సైజ్ డిపార్ట్ మెంటా, లేక టైమ్ పాస్ గ్యాంగ్ మెంబర్సా?" అడిగాడు చిరంజీవి.
    "షటప్" అన్నాడొకడు సీరియస్ గా.
    "ఎవరు మీరు?" అడిగాడు చిరంజీవి మళ్ళీ.
    "కనబడటంలా? కిడ్నాపర్స్."
    "మైగాడ్! నన్ను కిడ్నాప్ చేస్తున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "లేకపోతే సరదాకి రివాల్వర్స్ పట్టుకొచ్చామా?"
    "కానీ నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నట్లు? నేనేం రాజకీయ నాయకుడిని కాదే."
    "నిన్ను రేప్ చేద్దామని. లేకపోతే ఏమిటా వెధవ ప్రశ్నలు? ఓ డబ్బున్న వాడి కొడుకుని ఎవరయినా ఎందుకు కిడ్నాప్ చేస్తారు?"
    "డబ్బు కోసం."
    "కరెక్ట్."
    చిరంజీవి గుండె ఝల్లుమంది. అతనికి ఠక్కున తనకోసం ఎదురుచూస్తున్న సంగీత ముఖం కనిపించింది.
    "బాబ్బాబు! అలా సడెన్ గా చేయకండి! అవతల నాకు అపాయింట్ మెంట్ వుంది."
    "అంటే నీ అపాయింట్ మెంట్ లన్నీ పూర్తయ్యాక అప్పుడు కిడ్నాప్ చేయాలంటావా?"
    "మిగతా వాటి గురించయితే నేనంత పట్టించుకునేవాడిని కాదుగానీ, ఇది చాలా ముఖ్యమైంది"
    "ఏమిటది?"
    "నేనో అమ్మాయిని ప్రేమించాను."
    అతను చిరంజీవిని ఓ వెర్రివాడిని చూసినట్లు చూశాడు.
    "నేను నీ ముఖ్యమైన అపాయింట్ మెంట్ గురించి అడుగుతూంటే నువ్వు చెప్పేదేమిటి? నీకేమైనా తెలివుందా?"
    "అదే చెప్తున్నాను. అసలు సంగతేమిటంటే నేనో అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందనే అనిపిస్తోంది. ఎందుకంటే నా విజిటింగ్ కార్డ్ చూసినప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు కనిపించింది."
    "అదిగో...మళ్ళీ సొద మొదలెట్టావ్."
    "సారీ! జరిగిందేమిటంటే నేనో అమ్మాయిని ప్రేమించాను."
    "మళ్ళీ మొదట్నుంచీ చెప్పావంటే కాల్చి పారేస్తాను. తరువాత కథేడు."
    "ఆల్ రైట్. ఆల్ రైట్. నేను ప్రేమించినమ్మాయిని ఇవాళ డిన్నర్ కి ఆహ్వానించాను సరిగ్గా ఏడింటికి. ఆ అమ్మాయిని కలుసుకోవాలి లేకపోతే ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుంటుంది."
    "అయితే నీ ప్రేమ కలాపాలన్నీ పూర్తయ్యాక కిడ్నాప్ చేయమంటావ్?"
    "అవును! అలా అయితే ఎవరికీ ప్రాబ్లెమ్ వుండదు."
    "ఇంకా నయం మీ ఇద్దరికీ పెళ్ళి ఏర్పాటు కూడా చేసి, పెళ్ళీ, ఫస్ట్ నైట్ అయ్యాక అప్పుడు కిడ్నాప్ చేయమన్నావ్ కాదు. నోర్మూసుకుని కూర్చో."
    చిరంజీవికేం చేయాలో తోచటం లేదు.
    "పోనీ ఇంకో పని చేద్దాం!"
    "ఏమిటది?"
    "మీకెంత డబ్బు కావాలో అంతా నేనిచ్చేస్తాను."
    కిడ్నాపర్ ఆశగా చూశాడు.
    "నిజంగానా?"
    "ప్రామిస్!"
    "అయితే యాభై వేలివ్వు."
    "ఇప్పుడా?"
    "లేకపోతే ఇంకెప్పుడు? రేపు మీ ఆఫీస్ కొచ్చి తీసుకోమంటావా?"

 Previous Page Next Page