Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 14


    "ఊ...నిజంగా నన్నంత మిస్ అయ్యావా...హాయిగా కాశ్మీర్ లో ఎన్ జాయ్ చేస్తూ నేనెక్కడ జ్ఞాపకం వచ్చివుంటాను నీకు" గీతని ముందుకి లాక్కుంటూ అన్నాడు కృష్ణమోహన్.
    "నీవు లేకుండా ఎలా ఎన్ జాయ్ చేస్తాను. ఎందుకు వెళ్ళాడా అని రోజూ సణిగేదాన్ని డాడీదగ్గర. కావలిస్తే అడుగు మోహన్. మనం - మనం ఇద్దరం కలిసి అక్కడికి వెడితే ఎంత బాగుంటుందో తెలుసా..."
    "ఓ యస్, హనీమూన్ కి తప్పకుండా వెడదాం.....అని సరేకాని కాశ్మీర్ నించి నాకేం తెచ్చావు.....ఏమిటా పేకట్టు.....?" కుతూహలంగా గీత చేతిలో ప్యాకెట్టుచూస్తూ అన్నాడు.
    "చెప్పుకో చూద్దాం......కళ్ళు మూసుకో.....యిప్పుడు తెరు.....ఎలా వుంది?" గీత కాశ్మీర్ నగిషీలు చెక్కిన దంతం పెట్టె ఒకటి చూపించింది. "మార్వలెస్, సింప్లీ మార్వలస్, బాగుంది కానీ యిదెందుకు?--"
    "ఎందుకా అబ్బాయిగారు బుద్దావతారం--నే రాసే ఉత్తరాలన్నీ యీ దంతం పెట్టిలో దాచుకుంటావని--యిదిగో నెక్ టైపిన్ను, యిదెలా వుంది---"అంటూ పెట్టి తెరిచి చూపింది గీత. "థ్యాంక్స్ చాలా బాగుంది గీతా." మనస్ఫూర్తిగా మెచ్చుకుమ్తూనే అన్నాడు కృష్ణమోహన్. "యింకా ఏదో వుంది. అదేమిటి?"
    "ఏదో మాఅమ్మ మీఅమ్మగారి కోసం కాశ్మీర్ షాల్ కొంది. ఆవిడ కొని నేను కొన్నట్టు చెప్పి యీయమంటుంది. కాబోయే అత్తగారిని సంతోషపెట్టాలట---" వేళాకోళంగా అంది గీత గీత మొహంలో కన్పించే హేళనకి కృష్ణమోహన్ మొహం ఒక్క క్షణం ముడుచుకుంది. "నిజమే, నీవు మర్చిపోయినా ఆవిడ జ్ఞాపకం పెట్టుకున్నారు. కూతురు అత్తగారిచేత మాట పడకూడదని. అయినా గీతా అమ్మకి ఏమన్నా తేవలసింది నీవే---ఆవిడ ఎంత సంతోషిస్తుంది. నీవు ఆవిడని జ్ఞాపకం పెట్టుకొని కొన్నావంటే--" అన్నాడు కృష్ణమోహన్ కాస్త నవ్వి గీత చాలా తెలివిగా "ఇది ఇచ్చేస్తాను నేనే కొన్నానని-ఆ.....యిందాక నేను వచ్చేసరికి మీ అమ్మగారితో మాట్లాడుతూ ఎవరో అమ్మాయి వుంది. బంధువులెవరన్నా వచ్చారా ఏమిటి?"
    "అమ్మతో మాట్లాడుతూనా......సరోజ అయి వుంటుంది. అమ్మ చెప్పలేదా, పరిచయం చెయ్యలేదా?"
    "నేనావిడితో మాట్లాడానా ఏమిటి, తిన్నగా పైకి వచ్చేశాను." గీత అద్దంలో తన సొగసు చూసుకుంటూ నిర్లక్ష్యంగా అంది. కృష్ణమోహన్ మొహం మరొక సారి నల్లబడింది.
    "క్రింద అమ్మని చూసి పలకరించకుండా వచ్చేశానా? ఆవిడ ఏమనుకుంటుంది. నీకీమాత్రం కూడా తట్టదేం...ఒక్క క్షణం పెద్దావిడని పలకరించి వస్తే, నీ సొమ్మేం పోతుంది." అప్రయత్నంగా అన్నాడు కృష్ణమోహన్.
    "అబ్బబ్బ మొదలెట్టావు సాధింపు అప్పుడే. నిన్ను చూడాలని ఆరాటపడి నేను పరిగెత్తి వస్తే సంతోషించడం పోయి, అమ్మని చూడలేదు, మాట్లాడలేదు అంటూ సాధిస్తానేం. ఆ ముసలావిడ పట్టుకుంటే ఓ పట్టున వదలదని ముందు నీ దగ్గరికి వచ్చా-" గీత చిరాగ్గా అంది. కృష్ణ మోహన్ ఆ మాటలకి ఏం అనలేక, ఏం అనాలీ తెలియక ఒక్క క్షణం నిస్సహాయంగా నిలబడి ఆ తరువాత నిట్టూర్చి 'రా! క్రిందికి వెడదాం. ఆ షాల్ తీసుకురా అమ్మకి యీయి.' అంటూ మాట మార్చి క్రిందికి దారి తీశాడు. విధి లేనట్లు గీత మొహం ముడుచుకొని క్రిందికి దారి తీసింది.
    గీతకు చూస్తూ సరస్వతమ్మగారు "ఎప్పుడొచ్చావమ్మా గీతా, చూడనే లేదు" అంది ప్రసన్నంగా. హాలులో కూర్చున్న తల్లి గీతని చూసే వుంటుందని కృష్ణమోహన్ కి తెలుసు అయినా ఏ విషయంలోనూ నిష్ఠూరంగా మాట్లాడలేని ఆమె సౌహార్ద్రత అతనికి తెలుసు గీత జవాబిచ్చి లేవగానే "అమ్మా చూడు, గీత నీ కోసం ఏం తెచ్చిందో, అమ్మ కియ్యి గీతా" అన్నాడు మొహంనిండా నవ్వు పులుముకుని, "ఇదిగో యిది మీ కోసం తెచ్చాను" ముభావంగా అంటూ అందించి ప్రక్కన కూర్చున్న సరోజ వంక అదోలా చూసింది. "నా కెందుకమ్మా అనవసరంగా తెచ్చావు బాగుంది చాలా బాగుంది. అమ్మా సరోజా యిది నా బీరువాలో పెట్టు తల్లీ!" అంటూ షాల్ అందించింది సరస్వతమ్మ. "అమ్మా సరోజా, యిందాక అడిగితే చెప్పాను కదూ - గీత అంటే యీమే అంది - సరోజ గీత వంక చిరునవ్వుతో చూస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ "చాలా సంతోషంగా వుంది మిమ్ములని కలుసుకోడం" అంది గీత అప్రయత్నంగానే ప్రతి నమస్కారంచేసి "మీరు...మీరు....యీవిడ ఎవరు" అంది కృష్ణమోహన్ ని చూస్తూ.
    "ఆమెపేరు సరోజ-నెలరోజులుగా మా యింట్లో వుంటుంది. యింకా వుంటుంది. మా అమ్మకి కూతురు లాంటిది. లాంటిదేమిటి కూతురే, కదమ్మా" అన్నాడు నవ్వుతూ గీత అర్ధం కాక అయోమయంగా చూసింది. సరస్వతమ్మ నవ్వి క్లుప్తంగా సరోజ వచ్చిన పరిస్థితి అంతా వివరించింది..."ఆహా, అలాగా" ముభావంగా అంటూ సరోజ వంక ఒక్క చూపు విసిరింది. ఆ చూపులో నిర్లక్ష్యానికి సరోజ మనసు చివుక్కుమంది. వారిద్దరి మొహాలమీద భావాలు కృష్ణమోహన్ గుర్తించకపోలేదు.
    "మోహన్ ఆర్ యూ రెడీ, వెడదామా" అంది గీత అసహనంగా ఒక్కక్షణం పోయాక.
    "ఎక్కడికి అప్పుడే ఏదన్నా పోగ్రాం పెట్టావేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్.
    "ఊ....మంచి పిక్చర్ వుంది, టిక్కెట్లు తెప్పించాను..."
    "పిక్చర్ కయితే యిప్పటినించి ఎందుకు. యింకా ఐదే అయింది. ఓ అరగంట పేషంట్లని చూసి పంపివస్తా అందాక అమ్మవల్లతో మాట్లాడుతూండు" కృష్ణమోహన్ వెళ్ళబోయాడు.

 Previous Page Next Page