"అవునూ. ఆ సుజాత ఎప్పుడు బయటుంటుందో ఏమిటో గమనిస్తున్నారా?" అంది రాధాప్రియ.
సత్యాదేవి ప్రశ్నార్థకంగా చూసింది.
వాళ్ళింట్లో ఆ వదినా మరదళ్ళు ఎలా కలిపేసుకున్నా చావమనండి. మనం కొన్ని పద్ధతులున్న వాళ్ళం. అలా కనిపేసుకుని తిరిగితే ఇంటికి అరిష్టం" నా గురించి నాకేం బాధలేదు. కాని ఈ ఇల్లు మీది. మీకేమన్నా అరిష్టం జరిగితే నేను భరించలేను."
"అవునండోయ్ మీరలా అంటూంటే అయిదురోజుల క్రితం జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తోంది."
"ఏమిటండీ అది?" అని అడిగింది రాధాప్రియ ఆసక్తిగా.
"ఆవిడా యింటి మీదుగా వెళుతూ, దారి ఇరుగ్గా వుండటం వల్ల నన్ను తాకింది. ఆవిడ మొహం అదీ చూస్తే ఏరియా లోడ్స్ వున్నదేమో అనుకున్నాడు. ఆరోజు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. అంతేకాదు. బజారు వెళ్ళినప్పుడు అయిదొందల రూపాయలున్న హ్యాండ్ బ్యాగ్ పోయింది_అయిదొందలు..."
చూశారా? చూశారా? ఎంత అనర్థం జరిగిందో. పెద్దలు ఊరికినే పెట్టారా? ఇలాంటి అరిష్టాలు జరక్కుండా శాస్త్రాల్లో రాసిపెట్టారు. ఆరోజు మా అమ్మాయి పెద్దమనిషయినప్పుడు పంక్తి పెడుతూంటే ఎంత అవహేళన చేసిందని? మీరేమైనా అనుకోండి. మీ మంచి కోసం చెబుతున్నా, మీరావిడితో కొంచెం స్ట్రిక్టుగా వుండాలి. ఎందుకంటే మీ మేలు కోరినదాన్ని. అంతే గాకుండా మనం మనం ఒకటి..."
"మనం మనం ఒకటి" అని నొక్కటంతో ఓ ఉద్దేశముంది. వాళ్ళిద్దరి కులాలూ ఒకటి.
దాదాపు అరగంటసేపు బ్రెయిన్ వాష్ చేసి చాలా రిలీఫ్ తో వెళ్ళిపోయింది రాధాప్రియ.
* * * *
చాలా పెద్ద తోట అది. రకరకాల వృక్షాలూ, మామిడి, జామ, కొబ్బరి...యిలా కొన్ని ఎకరాల విస్తీర్ణంతో వ్యాపించి వుంది.
ఎందరెందరో...ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, డాక్టర్లు, ప్లీడర్లు వివిధ అసోసియేషన్స్ వాళ్ళు...గుంపులు గుంపులు తోటనాక్రమించి వనభోజనానందాన్ననుభవిస్తున్నారు.
ఆ ఆనందం అనేక రకాలుగా వుంది. కొంతమంది ఆడపిల్లలు సైకిళ్ళు తొక్కుతూ కేరింతలు కొడుతున్నారు. కొంతమంది చెట్లకొమ్మలకి ఊళ్ళకట్టి ఉయ్యాలలూగుతున్నారు. కొందరు పాటలు, డ్యాన్సులు! మ్యూజిక్ చైర్స్ ఇంకా ఇలాంటి వ్యాపకాల కోసం సృష్టించిన అనేక తరహాల చెంది ఆటలు చెమ్మచెక్కలు, దాగుడుమూతలు...
"ఓహ్! కోలాహలంగా వుంది.
అంతవరకూ బాగానే వుంది. కాని...యింకో తరగతి మనుషులున్నారు."
వాళ్ళు...
పేకాట ఆడుతున్నారు _ మామూలుగా కాదు. డబ్బెట్టి విస్కీలూ, బ్రాందీలూ తాగేస్తున్నారు.
చికెన్ బిర్యానీలూ, గుడ్లూ, చేపలు, ఖైమా ఉండలు తినిపారేస్తున్నారు.
విజయ్ కుమార్ వాళ్ళంతా ఓ చెట్టుక్రింద సెటిలయి జంబుఖానా పరుచుకుని కూర్చున్నారు.
విజయ్ కుమార్ తనవెంట తెచ్చుకున్న టేప్ రికార్డరులో పరివన్ సుల్తానా హిందూస్థానీ సంగీతం, చిట్టిబాబు వీణా...ఇలాంటివి ఆలకిస్తున్నాడు.
కొంచెం సేపటికి మాధురి ధైర్యం చేసి అడిగింది. "ఆ పాటలు నాకు బోర్ కొడుతున్నాయన్నయ్యా...కాసేపు సినిమా పాటలు పెట్టుకుందాం."
విజయ్ నవ్వి టేప్ రికార్డర్ ఇచ్చేశాడు.
మాధురి అందులో వున్న క్యాసెట్ తీసి తను తెచ్చుకున్న మరో క్యాసెట్ అమర్చింది.
"ఏక్ దో తీన్" అన్న పాట శ్రావ్యంగా వినిపిస్తూండగా మైమరపుతో కళ్ళు మూసుకుంది.
"వొరేయ్ బ్రదరూ" అంది సుశీలమ్మగారు.
"కార్తీకమాసంలో వనభోజనమంటే ఉసిరిచెట్టు క్రింద చెయ్యాలి కదరా ఉసిరి చెట్టేది?"
"అవన్నీ పూర్వకాలమక్కయ్యా. కార్తీకమాసంలో మనం ఏ చెట్టు క్రింద కూర్చుని భోజనం చేస్తే అదే ఉసిరి చెట్టు"
"అంతేనంటావా?"
"అంతే మరి."
"సరే. అలాగే సరిపెట్టుకుందాంగాని, కార్తీక మాసంలో నిష్టగా వుండి ఫుడ్ విషయంలో కూడా పవిత్రత పాటించాలి కదరా. మరి ఈ మాంసాలూ అవి తింటున్నారేమిట్రా?"
రామేశానికి కూడా చుట్టుప్రక్కల వాళ్ళు అవన్నీ తింటూంటే నోరూరుతోంది. అతనికప్పుడు, అవకాశమొచ్చినప్పుడు చికెన్. మటన్ వగైరాలన్నీ తినడం అలవాటే.
"అదీ...యిప్పటి రోజుల్లో ఫ్యాషనక్కయ్యా. అవన్నీ వుంటేనేగానీ వనభోజనం క్రింద లెక్కరాదు."
"అలాగా?" అంది సుశీలమ్మగారు. "సరే అదికూడా సరిపెట్టుకుందామనుకో. కాని...ఆ సీసాలూ, సోడాలు ఈ న్యూసెన్సంతా ఏమిట్రా?"
రామేశానికి అదేమీ న్యూసెన్సనిపించటం లేదు. అలా మందుకొట్టే వాళ్ళని చూస్తే అసూయగా వుంది. అప్పుడప్పుడు చుక్కేసుకోవటం అతని కలవాటే మరీ ఇంత డ్రై మనుషులతో వనభోజనానికి రావటం అతనికి మహ విసుగ్గా వుంది.
"ఇవీ...ఓ మాదిరి పిక్నిక్ లాంటిదక్కయ్యా. విదేశాల్లో అయితే వీక్ ఎండ్స్ అవి వుండి హాయిగా రిలాక్స్ అవుతారు. మనకలాంటి సంప్రదాయం లేదు కాబట్టి, కార్తీకమాసం పేరు చెప్పుకుని చికెన్సూ అవీ ఏర్పాటు చేసేసుకుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రిళ్ళు కూడా మకాం వేసి, గానా బజానా...ఎందుకులే..." అన్నాడు విజయ్ తన మాటలు వింటున్నాడని గ్రహించి.