హృదయం మంచు ముద్దల్లో కూరుకుపోయినట్లు నలిగిపోయింది!
ఊపిరి పీల్చుకొనే ప్రయత్నం తాలూకు సంఘర్షణలోని రాపిడికి మంచుముద్ద వెచ్చని కన్నీరై బయటికొచ్చింది!
పిల్లలనుండి మొహం చాటుచేసుకొంటూ వంటింట్లోకి పరిగెట్టింది!
ఘనీభవించిన మంచుపర్వతం కరిగినట్లు ధారాపాతంగా ప్రవహిస్తున్న కన్నీటికి పైటకొంగు అడ్డం వచ్చి, గోడనానుకుని వెక్కి వెక్కి ఏడ్చింది!
* * * *
ఖాదర్ ఏడుస్తున్నాడు. డొక్కలు ఎగెరిగిరి పడేలా పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.
అరచేత్తో కండువా కళ్ళకి అడ్డం పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.
మంచంమ్మీద నిద్రిస్తున్న బాబు.... పరామర్శకు పరలోకానికి వచ్చి ప్రమాదంలో చిక్కిన దేవదూతలా ఉన్నాడు.
అతని పసిమొహం బాధని భరించ... భరించీ అలసిపోయి విశ్రాంతి తీసికొంటున్నట్లు వడలిపోయి ఉంది! బాబు ప్రక్కనే మంచంలో కూర్చున్న తల్లి పరిస్థితి దయనీయముగా ఉంది!
అప్పుడు సమయం సాయంత్రి అయిదున్నర దాటింది బాబు ఎలా ఉన్నాడో.... డాక్టర్స్ ఏమన్నారో..... చూద్దామని అప్పుడే గదిలోకొచ్చింది చలపతిరావు భార్య సత్యవతి, ఆమె ఆమె భర్త బావున్నాడని అప్పుడప్పుడే ఆమెకు నమ్మకం కలుగుతోంది! ఆ గదిలో పరిస్థితి చూసి కంగారుపడిపోయి.
"ఏ జరిగింది ఖాదర్ బాబాయ్?" అంటూ ఖాదర్ ప్రక్కకొచ్చి నిలబడింది.
అతను మాట్లాడలేదు! దుఃఖం మాట్లాడనివ్వడం లేదు. ఆమె కెందుకో భయమేసింది.
అతని భుజమ్మీద చెయ్యివేసి ఆప్యాయంగా నొక్కుతూ "ఏం జరిగింది బాబాయ్?" అని మళ్ళీ అడిగింది. బలవంతంగా దుఃఖాన్ని మింగి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.
"బాబుకి ఆపరేషన్ చెయ్యాలని ప్రొద్దున చెప్పారమ్మా డాక్టర్లు. ఉన్నదంతా తాకట్టు పెట్టయినా వాణ్ణి బ్రతికించుకోడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు.... ఇప్పుడు.... ఏం జరిగిందో మరి ఆపరేషన్ చెయ్యడం లేదు. ఇంటికి వెళ్ళిపోయి రెండేళ్ళు ఆగిరమ్మని డాక్టరొచ్చి చెప్పాడమ్మా!
"రెండేళ్ళు.... రెండేళ్ళు ఆగే పరిస్థితా వాడిది? ఆ నరకం అనుభవిస్తూ ఇంకా రెండేళ్ళు బ్రతుకుతాడంటావా వాడు? అంటుండగానే మళ్ళీ దుఃఖపు పొర అడ్డొచ్చింది.
అసలు చెయ్యడం కుదరదని ముందు చెప్పివుంటే ఎలా వుండేదో అతని పరిస్థితి? కానీ, చేస్తానని ఒకసారి చెప్పిన తర్వాత.... చావో, బ్రతుకో.... ఈ ఊపిరాడని నరకంనుండీ మనవడు విముక్తమవుతాడని ఆశ కలిగింతర్వాత.... కుదరదనడం అతన్ని మరీ బాధిస్తోంది!
పదే పదే.... ఊపిరాడక గిల గిల కొట్టుకుంటున్న మనవడి మొహం కళ్ళముందు కదిలి.... ఆ నరకయాతన యింకా రెండేళ్ళు కొనసాగాలన్న విషయం తట్టుకోలేకపోతున్నాడు.
"ముందు చేస్తానని తర్వాత కుదరదన్నారా బాబాయ్? ఏమైందట?" ఓదారుస్తున్నట్లున్న గొంతుతోనే కుతూహలంగా అడిగింది.
"తెలియదు తల్లీ! మాకేమీ చెప్పలేదు, హాస్పిటల్ ఫీజెంతవుతుందో చెప్పారు. సరేనన్నాను. సాయంత్రానికి.... ఆపరేషన్ కుదరదు. వెళ్ళిపొమ్మంటే నేనేమైపోను?
డాక్టరుకేమైనా డబ్బు కావాలేమో? నా మొహం చూస్తే ఇచ్చుకోలేనివాడిలా కనబడుతున్నానేమో....? కానీ దానిక్కూడా నేను సిద్ధమే తల్లీ! నా మనవడిని ఆ నరకంనుండీ తప్పించడంకన్నా నాకేదీ ఎక్కువ కాదు" అన్నాడు. అతని బాధ చూసి సత్యవతికి కడుపులో మెలితిప్పింది. కానీ, డాక్టర్ని గురించి అన్నమాట ఆమెకి నమ్మబుద్ధి కాలేదు.
"ఆ డాక్టరు అట్లా అనిపించలేదు బాబాయ్!" అంటూ అక్కడి నుండి కదిలింది.
* * * *
సాయంత్రం అయిదున్నర అవుతోంది.
థోరాసిక్ రికవరీ రూమ్ లో ఆ నిశ్శబ్దం తమాషాగా ఉంది. మానిటర్ల "కీక్....కీక్...." మనే సన్నని శబ్దం..... అర్ధరాత్రి నిశ్శబ్ధంలో అక్కడొక్కటీ, అక్కడొక్కటీ అరుస్తున్న కీచురాళ్ళ శబ్దంలా వుంది.
అటూ ఇటూ తిరుగుతున్న నర్సుల కాన్వాస్ మాస్ మెత్తని కదలికలు..... మబ్బుల్లో దేవకన్యలు నడుస్తున్నట్లు మృదువుగా, హాయిగా అనిపిస్తున్నాయి!
ఆరోజు ఆపరేషన్ చేసిన రోగి బెడ్ ప్రక్కన కుర్చీలో రిలాక్స్ డుగా కూర్చుని భగవంతం! అతనింకా థియేటర్ డ్రస్ లోనే వున్నాడు.
"సార్! శరత్ చంద్ర సార్ బేబీకి ఆపరేషన్ చెయ్యడం లేదట!" రహస్యం చెబుతున్నట్లు చెప్పాడు అక్కడే తచ్చాడుతున్న శంకరం. అతడా విషయం ఎవరికి వినిపించనంత రహస్యంగా చెప్పాలనేం అనుకోలేదు.
ఈ గది వాతావరణం అలాంటిది. ఉచ్ఛస్వరంతో మాట్లాడుతూ ఆ గదిలోకి అడుగుపెట్టిన కొత్తవాళ్ళు కూడా, ఒక్కసారిగా టి.వి. వాల్యూమ్ తగ్గించేసినట్లు తగ్గించి మాట్లాడుతారు.
ఆ గది నిశ్శబ్ధానికి తమకి తెలియకుండానే అడాప్టయిపోతారు. శంకర్ మాట వింటూనే సన్నని నవ్వు కదిలింది. భగవంతం మొహంలో.
"ఏం?" అన్నాడు మామూలుగా.
"డైరెక్టర్ వద్దన్నారట సార్!" వినయాన్ని సూచిస్తున్నట్లు కొద్దిగా వంగి అన్నాడు.
కుర్చీలో కొద్దిగా కదిలాడు భగవంతం. అతనికది పెద్ద విషయమే! మొహంలో కదిలిన సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ -
"చెయ్యమని ఎవడంటాడయా? 'కత్తిపిచ్చి' ఒక్కటే ఉంటే సరపోదు. తల్లో కాస్త మెదడుకూడా ఉండాలి!" అన్నాడు. అతని గొంతులో 'నామాట నిజమైంది చూడు' అన్న గర్వం తొణికిసలాడింది.
ప్రొఫెసర్ ని సంతోషపెట్టాలనే తప్ప శరత్ చంద్రని కించపరచాలని శంకర్ కి లేదు అసాధారణమైన శరత్ చంద్ర తెలివినీ, ధైర్యాన్నీ భగవంతం తేలిగ్గా మాట్లాడటం అతనికి బాధనిపించింది.
"శరత్ చంద్ర సార్ బాగా తెలివైనవాడు సార్! కాకపోతే కొంచెం తొందర అంతే!" అన్నాడు సమర్ధిస్తున్నట్లు.
"ఆహా.... అలాగా!" అంటూ అదోలా అతన్ని చూశాడు భగవంతం. నాలుక్కరుచుకున్నాడు శంకర్?
"సార్! మీకు నోటీసు వచ్చింది. సైన్ చెయ్యాలి!" అంటూ మల్లెపువ్వు కదిలినట్లు వచ్చింది నర్సు.
ఆమె చేతిలో ఫైల్ అందుకొని చదువుతూనే ఉలిక్కిపడ్డాడతను.
"వ్వాట్?" అంటూ అతని నోటినుండి వచ్చినమాట అతనికొక్కడికే వినిపించింది.