Previous Page Next Page 
కళ్ళు పేజి 14


    మనోజ్ఞ నవ్వింది. "శబ్దాన్ని బట్టి గ్రహిస్తాను. కళ్ళులేవు కాబట్టి చెవులే కళ్ళుగా పనిచేస్తాయి."

 

    "కాని చిన్న చిన్న శబ్దాలు, నిశ్శబ్దంగా వచ్చే సైకిళ్ళు అలాంటివి..."

 

    "ఆరోగ్యంగా వుండే కళ్ళు అతి సూక్ష్మమైన సూదిమొనని ఎలా చూడగలవో, అతి చిన్న శబ్దాన్ని కూడా నా చెవులు పసిగట్టగలవు."

 

    "మీ ఇంట్లో వంటా అదీ..."

 

    "నేనే చేసుకుంటాను. మా ఇంటికి రండి. నా కార్యకలాపాలు చూద్దురు గాని."

 

    "వీలు చూసుకొని వస్తాను. ఇంకా ఒక్క ప్రశ్న. మీరు పుట్టినప్పట్నుంచీ, లేక మధ్యలో..."

 

    "నేను అంధురాలిగానే జన్మించాను."

 

    ఆ విషయం గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడటానికి రంజితకు ఇష్టం లేకపోయింది.

 

    మనోజ్ఞ ఆమె దగ్గరకు నడిచి వచ్చింది. చేతిని సాచి రంజిత చెయ్యి పట్టుకుంది. తర్వాత ఆ చేతిని అలా పైకి ప్రాకనిస్తూ రంజిత భుజం, మెడ, చెంపలూ తడిమింది.

 

    "అబ్బ! మీరెంత అందంగా వున్నారు!" అంది.

 

    ఆమె మనోనేత్రంలో రంజిత సుందరమైన రూపం ఆమె ఊహించుకున్న రీతిలో ప్రతిబింబిస్తోంది.

 

    "మీరు కూడా చాలా అందంగా వున్నారు."

 

    "అవునా?" అంటూ నవ్వింది మనోజ్ఞ.

 

    "నేను ముఖస్తుతికి అనటంలేదు. మనస్పూర్తిగా మాట్లాడుతున్నాను"

 

    "మీరు... ఎలాంటి రంగు చీరె కట్టుకున్నారు?"

 

    "లేత గులాబీరంగు. దానిమీద నల్లని పువ్వులు."

 

    "గులాబీరంగు నాకెంతో ఇష్టం."

 

    "మీకు రంగులు తెలుసునా? అంటే ఏ రంగు ఎలా వుంటుందో..."

 

    "నా మనసులో మెదిలే రంగులు, మీరు చూసే రంగులు ఒకటి కాక పోవచ్చు. మీరు కళ్ళు మూసుకుంటే ఆ చీకట్లో కూడా కొన్ని రూపాలు, మీకు గుర్తొచ్చిన అంశాలు అనేక ఆకృతుల్లో ఎలా కనిపిస్తూ ఉంటాయో, సరైన పద్ధతిలో నేను ఊహించుకునే రంగులుగా మెదుల్తూ ఉంటాయి. ఆకాశం నీలంగా ఉంటుంది. నేనిప్పుడు కట్టుకున్న చీరె నీలంగా వుంది. నా మనస్సులో నాకోసం సృష్టించుకున్న రూపాలున్నాయి."

 

    కళ్ళులేని జీవితం అబ్బ! రంజిత శరీరం జలదరిస్తోంది.


                                                           *  *  *


    రాత్రి ఎనిమిదవుతోంది. సన్నగా తుంపర పడుతూండడంవల్ల రోడ్డుమీద జనసంచార మెక్కువగా లేదు.

 

    మనోజ్ఞ తన ఇంటివైపు మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది.

 

    ఆమె ఇంటికి వెళ్ళాలంటే రెండు మూడు మలుపులు తిరగాలి. ఆ మలుపు ఎక్కడ ఉందో, ఎన్ని అడుగులు ఎటుకేసి తిరగాలో ఆమెకు ఖచ్చితంగా తెలుసు.

 

    మొదటి సందులోకి మళ్ళింది.

 

    ఉన్నట్లుండి ఆమె చెవులు ఏదో శబ్దాన్ని పసిగట్టాయి. ఎవరో ఆమెననుసరిస్తున్నారు. తమదారిన తాము నడవటం వేరు, కావాలని అనుసరించటం వేరు. ఈ తేడా ఆమెకు బాగా తెలుసు.

 

    ఏం జరుగుతుందో చూద్దామని ఆమె నడవటం మాని నిలబడింది.

 

    వెనుక అడుగుల చప్పుడు కూడా ఆగిపోయాయి.

 

    ఓ క్షణం అలా నిలబడి ఆమె మళ్ళీ నడకసాగించింది. వెనుక అడుగుల చప్పుడు కూడా మొదలయినాయి.

 

    ఆమె గుండె దడదడమని కొట్టుకుంది. ఎన్నో సంవత్సరాలబట్టీ ఆమె ఈ దార్న వస్తోంది. వెడుతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు.

 

    పరీక్ష చేద్దామని ఆమె మళ్ళీ నడక ఆపింది. వెనక పాదాలచప్పుడు కూడా ఆగింది.

 

    ఈవేళ ఏదో ఉపద్రవం జరగబోతోంది. తానా ఒంటరి జీవితం గడుపుతోంది. వయసులో వుంది. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఎప్పటికైనా లేకపోలేదు.

 

    ఆమె మళ్ళీ కదిలి సాధ్యమైనంత త్వరగా నడవసాగింది.

 

    ఆమె చేతిలో ఓ హ్యాండ్ బేగ్ వుంది. అందులో చిన్న అవసరాల కోసం వాడుకునే చాకొకటి వుంది. ఆమె నడుస్తూనే హ్యాండ్ బ్యాగ్ లోంచి చాకు బయటకు తీసి, దాన్ని విడదీసి కుడిచేత్తో పట్టుకుంది. ఆ చెయ్యి చిన్నగా ఒణుకుతోంది.

 

    అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. ఆమెకు చేరువకి చాలా సమీపంగా వచ్చేస్తోంది.

 

    చాకుని పట్టుకున్న ఆమె పిడికిలి గట్టిగా బిగుసుకుంటోంది.

 

    మరీ దగ్గరగా వచ్చేశాయి. ఆమె అవతల మనిషి ఎక్కడవున్నాడో వూహించి కుడిచేతిని గాల్లోకి విసరటానికి సిద్ధంగా వుంది.

 

    భుజంమీద బరువైన చెయ్యిపడింది.

 

    మనోజ్ఞ చాలా తెలివిగలది. బహుశా పుట్టినప్పట్నించీ అంధురాలై వుండటం వల్లనే ఆ తెలివితేటలు వచ్చివుంటాయి. తన మెళ్ళో ఆభరణాలేమీ లేవు. తన దగ్గరవున్న ఆకర్షణ ఒకటే- వయసు. అందమంటే వుండి వుండవచ్చు. వెనుకనుంచి ఆ వ్యక్తి ఎవరో ఎందుకు వెంటాడుతున్నాడో తెలీనంతటి అమాయకురాలేమీ కాదు.

 

    ఆ వ్యక్తి చెయ్యి తన భుజంమీద పడీపడగానే విసురుగా వెనక్కి తిరిగి తన చేతిలోని చాకుతో అతని గుండెమీద బలంగా పొడిచింది. ఆ మనిషి ఎక్కడ నిలబడి వున్నాడో, అతని గుండెకు గురిపెట్టాలంటే ఎటుకేసి తిరగాలో ఆమె మనోనేత్రానికి స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె చేసిందల్లా ఒకే ఒక్క పొరపాటు. ఒక్కక్షణం ఆమెలోవున్న మానవత్వం వల్ల ఆలస్యం చెయ్యటం. ఆ ఒక్కక్షణమే ఆ వ్యక్తిని వెనక్కి జరగనిచ్చి గాయం బలంగా తగులకుండా కాపాడింది. ఆ చిన్న గాయాన్ని అతను లెక్కచెయ్యలేదు. పైగా ఛాతిలోంచి ఉబుకుతోన్న రక్తంతోపాటు అతన్లోని రాక్షసత్వం బయటకు పొంగినట్లయింది.

 

    ఆమె కుడిచేతిని గట్టిగా పట్టుకుని మెలిత్రిప్పాడు. "అబ్బా" అని మూలిగి బాధకు తట్టుకోలేక చాకు క్రిందకు వదిలేసింది. ఆమె చెవులకు ఒక వికటమైన నవ్వు వినబడింది. రెండు బలిష్టమైన చేతులు ఆమె భుజాలను గట్టిగా చుట్టుకున్నాయి. విధిలేక గట్టిగా అరవబోయింది. ఆ విషయాన్ని ముందే ఊహించినట్లు ఆమె పెదవులు విడివడకముందే ఒక చెయ్యి ఆమె భుజాన్ని విడిచి నోటిని గట్టిగా మూసింది. వేయదలుచుకున్న కేక లోలోపలే వుండి పోయింది.

 Previous Page Next Page