కీడు శంకించింది సత్యజిత్ మనసు.
దాని తల నిమిరి, బుజ్జగించి, "ఏమిటి?" అన్నాడు.
వెంటనే వెనక్కి తిరిగి మెట్లమీదగా క్రిందకి ఉరికింది స్క్వీకీ. దాని వెంట వెళ్ళాడు సత్యజిత్.
కిందకి వచ్చిన స్క్వీకీ గేటు దాటింది. గ్యారేజ్ లో నుంచి కారు బయటకు తీశాడు సత్యజిత్.
ముందు పరిగెడుతూ దారి తీస్తోంది స్క్వీకీ.
వెనకనే అనుసరిస్తున్నాడు సత్యజిత్.
రొప్పుతూ పరిగెత్తి పరిగెత్తి ఇండస్ట్రీయల్ మేగ్నేట్ బాబూజీ గేటుకి కొద్ది దూరంలో ఆగింది స్క్వీకీ.
ఆగి చూశాడు సత్యజిత్:
బాబూజీ ఎవరో అతనికి తెలుసు.
ఇక్కడికి ఎందుకు వచ్చింది తన చెల్లెలు వినీల?
కనీసం ఇంటి తలుపులన్నా మూయకుండా?
ఆమెని ఇంతదూరం అనుసరించి రావాలని స్క్వీకీ కి ఎందుకు తోచింది?
మనసు ఉగ్గబట్టుకుని, బాబూజీ బంగళా వైపు చూశాడు సత్యజిత్.
చాలా ఎత్తుగా వున్నాయి గోడలు. వాటిమీద ఎలక్ట్రిక్ వైర్లతో ఫెన్సింగ్ లాగా ఉంది.
గేటు దగ్గర గార్డ్స్. లోపల తాటిచెట్టంత ఎత్తున వాచ్ టవర్.... అందులో కూడా గార్డ్స్.
ఆ ఇంట్లో వుండే మనుషులు గురించి చాలా సమాచారం తెలుసు సత్యజిత్ కి.
ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
* * * *
"మా నాన్నకి శత్రువులు చాలా మందే వున్నారు" అన్నాడు ప్రతాప్ వినీలతో. "అందులో ఆశ్చర్యమేమీలేదు. ఆయనవల్లనష్టపోయిన వాళ్ళూ, నాశనమైపోయిన వాళ్లూ లెక్కలేనంత మంది. మా నాన్న మీది కోపం మా అమ్మ మీద తీర్చుకున్నారు. ఆ పని ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. వాణ్ణి తర్వాత నేను చంపేశాను. బికాజ్ యూ సి, ఐ గాట్ ఏ లైసెన్స్ టూ కిల్: చంపడానికి లైసెన్సు వుంది నాకు,"
"అంటే?" అంది వినీల సంభ్రమంగా.
"నేను ఇండియన్ ఏజెంట్ ని. దక్షిణ భారతదేశానికి ఆపరేషన్స్ చీఫ్ లాంటి వాడిననుకో"
"ఏజెంట్ అంటే ఏమిటి?" అంది. ఆమెకు సగం అర్థమయీ, సగం అర్థం కానట్లు ఉంది.
"సింపుల్ గా చెప్పాలంటే నేనొక గూఢచారిని స్పై:"
ఒక్కసారిగా ఉద్విగం కలిగింది వినీలకి.
స్పై:
గూఢచారి::
ఏజెంట్:::
ఇలాంటి వాళ్ళ గురించి నవలల్లో చదివింది. జేమ్స్ బాండ్ అంటే తనకి చాలా ఇష్టం.
అంతేగానీ తను నిజంగా ఒక రోజున ఒక నిజం గూఢచారిని కలుసుకుంటుందనీ, మాట్లాడుతుందనీ కలలోకూడా అనుకోలేదు.
అంతేకాదు...
ఈ గూఢచారి తనకేదో పని అప్పగించబోతున్నాడు.
తను ఆ పని చేయబోతోంది.
ఎగ్జయిట్ మెంట్ తో వినీల మెడమీద ఉన్న నూగులాంటి రోమాలు లేచి నిలబడ్డాయి.
అంతలోనే మరో అనుమానం వచ్చింది.
అసలింతకీ ఇతను చెబుతున్నది నిజమేనా? కాదా?
కానీ తనని ప్రాణాపాయంలోంచి బయట పడేసిన ఈ మనిషి అబద్ధాలు చెబుతుంటే ఎందుకో నమ్మబుద్ధి వెయ్యటంలేదు.
పైగా -
అతని మాటతీరూ అదీ చూస్తే పర్ ఫెక్టు జంటిల్మాన్ లాగా కన్పడుతున్నాడు.
ఆమె మనసులో మెదులుతున్న భావాలు బదిరిసినట్లు అన్నాడు ప్రతాప్.
"నమ్మశక్యంగా లేదు కదూ: నాతోరా:" అంటూ బండి వెనుక ఉన్న కారువేపు చూశాడు. కారులో అతను స్టీరింగ్ దగ్గర కూర్చుంటే అతని పక్కనే ఫ్రంట్ సీట్ లో కూర్చుంది వినీల.
డాష్ బోర్డ్ కింద వున్న చిన్న మీటని నొక్కాడు ప్రతాప్
వెంటనే -
వెరీ హై పవర్ వైర్ లెస్ ఒకటి యాక్టివేట్ అయింది.
తన కోడ్ చెప్పి తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు ప్రతాప్.
అవతలివైపు మనిషి కూడా తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు చేసుకున్నాడు.
"సర్: మీకు ఒక కొత్త ఏజెంట్ ని ఇంట్రడ్యూస్ చేయదల్చుకున్నాను" అన్నాడు ప్రతాప్.
ఉలిక్కిపడింది వినీల.
కొత్త ఏజెంట్: