Previous Page Next Page 
గోరింటాకు పేజి 14


    వాళ్ళలో ఒక్కరికీ ప్రాణం లేదు. ఇహ తలుపులు మూసివెయ్యడానికి ఎవరున్నారు?

 

    ఆమె నీడలా అలా కదిలి వెళ్ళిపోవటం, పెరటి తలుపు చప్పుడు కాకుండా తీయటం, మరో మానవాకారం లోపలకు చొచ్చుకు రావటం. ఇద్దరూ కలిసి ఎడమవైపు మూలనున్న గదిలోకి అంతర్థానం కావటం వాళ్ళ శవాల తాలూకు కళ్ళకు కనిపిస్తూనే వుంది.     

 

    ఉన్నట్టుండి బిగ్గరగా కేకపెట్టాడు బ్రహ్మానందం. కోలుకుని 'ఇడియట్!' అంటూ అతని నోరు నొక్కి, పాణి 'తలుపుముయ్యి' అన్నాడు తొందరగా. చక్రపాణికి ముచ్చెమటలు పడుతున్నాయి. తలుపులు ఎలా మూశాడో తెలియదుకాని, తన పక్కమీదకు దూకి వణకసాగాడు.

 

                                            * * *

 

    వీళ్ళని శివుడూ, ఆమెను అల్లా కరుణించారు. ఆ కేక ప్రేయసీ ప్రియులకు మాత్రమే కొంత అలజడి కలిగించివుంటుంది కానీ, ఇంట్లో యేమీ తుఫాన్ లేవదియ్యలేదని మరునాటి నిశ్శబ్ద వాతావరణాన్నిబట్టి గ్రహించి కుదుటపడ్డారు. యధాప్రకారం సాయిబుగారి గేదెలు పాలిచ్చాయి. యధాప్రకారం కుర్రాళ్ళు వాటిని తీసుకొనిపోయి ఇళ్ళలో పోసేశారు. యధాప్రకారం ముగ్గురూ కాఫీలు త్రాగేసి 'హమ్మయ్య' అనుకుని ఊరడిల్లారు.

 

    "ఎంత ఆశ్చర్యం! తప్పు చేస్తున్నవాడికన్నా ఆ తప్పు చూస్తున్న వాడికి ఎక్కువ వళ్ళు వణుకుతుంది. అబ్బా!" అన్నాడు ముకుందం సాయంత్రం పబ్లిక్ గార్డెన్ లో.

 

    "కాబట్టి...!" అన్నాడు బ్రహ్మానందం. "మనం చెడిపోతే మనమీద మనకన్నా మనని చూసినవాళ్ళకి మనమంటే భయంగా వుంటుంది."     

 

    "అంతేగా" అన్నాడు చక్రపాణి. వాళ్ళలాగా ఒక కొత్త సత్యం కనిపెట్టడం చేతకాక.

 

    ముకుందం, చక్రపాణి ఇంకా రాత్రి విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. బ్రహ్మానందం వీటికి అతీతుడైనట్లు 'అబ్బాయిలూ!' అన్నాడు గంభీరంగా. "ఆలోచించకుండా చప్పున సమాధానం చెప్పండి. చప్పున. చెడిపోవాలంటే మార్గాలేవి?"    

 

    చక్రపాణికి నూతన చైతన్యం వచ్చింది. "మగువ, మద్యం" అన్నాడు ఉత్సాహంగా.

 

    "భేష్" అని బ్రహ్మానందం అతని భుజం చరిచాడు. "పాణీ! నీ బుద్ధి అతిచురుకైనది సుమా! అప్పుడే వికసించబోతూన్న మొగ్గలాంటిది నీ గుణం. మనం ఈ ఊళ్ళో ఉండటంకూడా ఓ అదృష్టమే! ఇక్కడ పానీయానికి నిషేధం లేదు. ఇవాళ రాత్రి పదిగంటల వేళకు మందు సేవిద్దాం."

 

    చప్పున ముకుందం ముఖంలో చాలా మార్పు కనబడింది. భయంతో లేచి నిలబడ్డాడు. "బ్రదర్స్! వద్దు. ఈ మనస్తత్వాలు నాకు నచ్చటంలేదు. మనకు విముక్తి ఇదా? ఒకసారి మీ మీ కుటుంబాలలోని వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. నాకయితే గుర్తుకొస్తున్నారు మా ఇంట్లోవాళ్ళు. కన్నీళ్ళతో నా భార్యా, వృద్ధాప్యంతో వణుకుతూ నా తల్లీ, విధి అనే గానుగలో నువ్వు గింజలాగా నలిగిపోయే పిచ్చిపిల్ల నా చెల్లి. నా కడుపు తరుక్కుపోతుంది. లోతుకు పోయినకొద్దీ ఈ బరువు భరించలేనేమో అనిపిస్తోంది. ఈ కొత్తజీవితం మనకు వద్దు. మిమ్మల్ని వేడుకుంటాను. మనం మామూలుగా బ్రతుకుదాం" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.

 

    "అబ్బా, గోల" అంటూ బ్రహ్మానందం కోపంగా చూశాడు. అది కోపంకంటే ఈసడింపు అంటే బాగుంటుంది. అలా చూసి "ఏమిటి?" మామూలుగానా? ఆ ఎడారి జీవితమా?" అన్నాడు.

 

    "అబ్బే, చవట జీవితం" అన్నాడు చక్రపాణి.

 

    "పోనీ నన్ను వదిలెయ్యండి" అన్నాడు ముకుందం జాలిగా.

 

    బ్రహ్మానందం ఒక్క నిమిషం మాత్రం ఆలోచించి, "ఓ ఎస్. ఇందులో బలవంతం ఏమీలేదు. ఉత్సాహవంతులకు మాత్రమే ఈ గోరింటాకు." అన్నాడు.

 

    ముకుందం క్షమాపణలు కోరుకొని, బెదురుతూ, బెదురుచూపులు చూస్తూ అక్కడినుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు. అతణ్ని పోనిచ్చి గట్టిగా వాళ్ళిద్దరూ నవ్వి భుజాలెగురవేశారు.  

 

                                            * * *

 

    అటూ ఇటూ చూశారు. అబ్బే! భయమెందు కనుకున్నారు. సిగ్గేమిటి సింగినాదం, అని భరోసా ఇచ్చుకున్నారు. మళ్ళీ కాస్త బెదిరారు. నువ్వంటే నువ్వనుకున్నారు. చివరకు ఇద్దరూ కలిసి ఒక్కసారిగా లోపలకు అడుగుపెట్టారు. అయితే అక్కడ చాతకాదనిపించింది. వాళ్ళను చూసి నవ్వుతారేమో ననిపించింది. ఆ ఇంగ్లీషు వాడి దగ్గరకువెళ్ళి ఇంగ్లీషులో గుసగుసలాడారు. "చూడండి" అన్నాడు బ్రహ్మానందం. "మాకు కొత్త. ఎలా మొదలుపెట్టాలో, ఏమేమి చేయాలో చెపితే" ప్రక్కనవాళ్ళకు వినబడకుండా సాధ్యమైనంత రహస్యంగా అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తాము చాలా అనుభవమున్నవాళ్ళు అనిపించేలా భంగిమలు ప్రదర్శిస్తూ జాగ్రత్తపడ్డారు. ఎదురుగావున్న ఆంగ్లో ఇండియన్ లేడీ కిసుక్కుమని నవ్వనే నవ్వింది. ఆ నవ్వుని చూడనట్లుగా, తమ ధోరణిలో వున్నట్లు నటించారు. ఇంగ్లీషువాడు "లోపల గదివుంది. అక్కడ చూడకూడదూ!" అన్నాడు. "అబ్బే వద్దండీ, ఇంటికి పట్టుకుపోతాం" అన్నాడు చక్రపాణి కంగారుపడుతూ. "నేను నేర్పించనా?" అన్నదా యువతి చక్రపాణివంక నవ్వుతూ, ముద్దుగా చూస్తూ. "ఊరుకో, కుర్రాడు" అని మందలించాడామెను ఇంగ్లీషువాడు.

 

    చివరకు ఓ సీసా పధ్నాలుగు రూపాయల పైచిలుకు దర్శించుకుని, తీసుకొని జేబులో దోపేసి బయటపడ్డారు. "ఎవరూ చూడలేదు కదా" అన్నాడు. బ్రహ్మానందం "చూస్తే చూశారులే" అన్నాడు.

 

    "ఎవడ్రా మన్ననేది? వేలుపెట్టేస్తా అన్నాడు. అన్నీ అతనే అన్నాడు. పైగా చక్రపాణి ఏదో భయపడుతున్నట్లు తిడుతున్నాడు. సత్యాలు కనిపెట్టటానికి మంచి అనువైన సమయం.

 

    రాత్రి పదిగంటలకు గదితలుపులు బిడాయించుకుని మధ్యలో బల్లమీద ఆ అందమైన సీసాపెట్టి ఇద్దరూ చెరోవైపు దీర్ఘంగా చూస్తూ కూర్చున్నారు. కనురెప్పలు రెపరెపలాడిస్తున్నారు. ఒకక్షణంలో ముసిముసిగా నవ్వుకుంటున్నారు. భయంభయంగా చూసుకుంటున్నారు.

 

    ప్రక్కనే రెండు సోడాబుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చాక్ లెట్లూ పెట్టివున్నాయి. ఇంకో చిన్నబల్లమీద ఇంత రొట్టెకూడా వుంది. "పాణీ!" అన్నాడు బ్రహ్మానందం. "నీకు క్రొత్త. నీకు తెలీదు. ముందు ఏమిచేయాలంటే ఈ బాటిల్ మీద మూత తీసివెయ్యాలి. ఆ తియ్యడంకూడా మహాషోగ్గా తియ్యాలిలే. వెంటనే... వెంటనే అంటే వెంటనే అన్నమాట. ఈ సోడా గ్లాసులో పోసి అందులో ఈ పానీయం కలిపివేయాలి. అవునంతే. నాకు తెలుసు. నాకు బాగా తెలుసు. అలా చేయాలి. అప్పుడు ఇద్దరం ఒకరిగ్లాసు ఒకరు తాకించుకొని మెల్లిమెల్లిగా పుచ్చుకుంటాం. ఒక్కొక్క గుక్కా లోపలకి పోతున్న కొద్దీ భగ్గు భగ్గుమంటుంది. పాణీ! అప్పుడు చూసుకో. ఒక ఆకలివేస్తుందీ, అప్పుడు బలమైన ఆహారం పడాలి. గబగబ ఈ కోడిగ్రుడ్లు మింగేయటమే, తప్పదు. ఆ కార్పణ్యాలన్నీ పెట్టుకుంటే కుదరదు. ఇహ అవన్నీ మరిచిపోవాలి. భయపడుతున్నావా పాణీ! భయపడకు. భయపడకు."

 Previous Page Next Page