Previous Page Next Page 
ఉషోదయం పేజి 14

    శారద మొహం ఎర్రబడింది.
    సత్యవతి కల్పించుకుని "అసలేం జరిగిందో చెప్పకుండా ఈ సాధింపు లేమిటిరా.. ఏం చేశాడు రాహుల్? ముందది చెప్పు" అసహనంగా అంది.
    ఇవాళ పన్నెండుగంటలకి వీడి స్కలు ప్రిన్సిపాల్ నించి ఫోను వచ్చింది, స్కూలుకి పేరెంట్స్ ఇద్దరినీ రమ్మని. ఏమైందోనని గాభరాపడి ఈవిడకోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుందీవిడ.
    ఆఖరికి ఒక్కడినే వెళ్ళాల్సి వచ్చింది స్కూలుకి. ఆ ప్రిన్సిపాల్ పెద్దక్లాసు తీసుకుని తల వాచేట్టు చివాట్లు పెట్టింది. నాకు తలకొట్టేసినట్లయింది అన్నాడు ప్రకాష్.
    సత్యవతి, శారద నోటమాట రానట్టు వింటూ వుండిపోయారు.
    శారద ముందుగా తేరుకుని రాహుల్ వంక తీక్షణంగా చూసింది.
    "రాహుల్... డాడీ చెప్పిందంతా నిజమేనా? స్కూల్లో నీ ప్రవర్తన గురించి ప్రిన్సిపాల్ చెప్పిందంతా నిజమా?" కరుకుగా అడిగింది.
    "ఏమిటా అడగడం? నేను చెప్పింది అబద్ధం అన్నట్టు అడుగుతున్నావు"
    శారద రాహుల్ ని స్కేల్ తో వీపుమీద ఒక్కటేసింది. "రాహుల్, ఇదే మొదటి దెబ్బ. ఇదే ఆఖరిదెబ్బ కావాలి. చెప్పు, ఇంకెప్పుడూ అల్లరిపనులు చేయనని, నోటినించి తిట్లు రానీయనని" తర్జని చూపిస్తూ బెదిరించింది. రాహుల్ కి ఒంటిమీద జీవితంలో మొదటిదెబ్బ పడింది. పౌరుషం తన్నుకొచ్చింది. తల్లిచేతిలో స్కేల్ గట్టిగా పట్టుకుని "నన్ను కొడతావా" అన్నాడు పొగరుగా చూస్తూ. నన్ను కొట్టావు కదూ! సారీ చెప్పను, చచ్చినా చెప్పను" అన్నాడు పంతంగా.
    "చెప్పవూ.. ఎలా చెప్పవో చూస్తాను..." అంటూ గట్టిగా మరోదెబ్బ వీపుమీద వేసింది. కెవ్వు కెవ్వుమని అరిచాడు రాహుల్.
    "శారదా" అంటూ సత్యవతి స్కేలు లాక్కుంది.
    గదిలోంచి ప్రకాష్ బయటికి వచ్చాడు.
    "డాడీ" అంటూ రాహుల్ పరుగున వెళ్ళి తండ్రిని కావలించుకున్నాడు. "మమ్మీ స్కేలుపెట్టి కొట్టేస్తోంది డాడీ" అంటూ ఏడుపు ఆరంభించాడు.
    ప్రకాష్ కోపంగా శారదచేతిలో స్కేలు లాగేశాడు. "వాణ్ణి కొట్టి చంపుతుంది కాబోలు... బుద్ధి చెప్పడం అంటే కొట్టడం అనుకుంటోంది...." తల్లితో కంప్లయింట్ చేస్తూ తల విదిల్చి గదిలోకి వెళ్ళిపోయాడు ప్రకాష్.       
    "ఎందుకు కొట్టి చంపుతుంది... తను వాడి తల్లి... తల్లిగా తనకి తెలుసు ఏం చేసి పిల్లాడిని దారికి తీసుకురావాలో" సత్యవతి గట్టిగానే అని వంటింట్లోకి వెళ్ళిపోయింది.
    అరగంట తర్వాత తల్లీకొడుకు గదిలోంచి బయటికి వచ్చారు. రాహుల్ ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బివున్నాయి. శారద అన్నం కలిపి తీసుకొచ్చి రాహుల్ కి తినిపించసాగింది.
    సత్యవతి ఏం జరగనట్టే లోపల్నించి వచ్చి "ఇవాళ రాహుల్ కి ఇష్టమని బంగాళాదుంపల వేపుడు చేశాను" అంది.
    రాహుల్ కళ్ళు వాల్చి "థ్యాంక్స్ మామ్మా..." అని, కాస్త ఆగి "సారీ అమ్మా" అన్నాడు తలదించుకుని.
                                                                       * * *
    'ఉషోదయం' పత్రికలో పడిన బ్యాంక్ స్కాముల గురించిన ఆర్టికల్, డిపాజిటర్ల ఇంటర్వ్యూలు జనాన్ని బాగా ఆకర్షించగలిగాయి. ఆరోజు పత్రికా ఆఫీసుకి అభినందనలు తెలుపుతూ కొందరు డిపాజిటర్లు తమ తమ బాధలు చెప్పుకుంటూ తమకి పత్రికద్వారా న్యాయం జరిగేట్టు చూడాలని వేడుకుంటూ వందలకొద్దీ ఫోనులు చేశారు.
    ఆ బ్యాంక్ స్టాఫ్ లో కొందరు అపాయింట్ మెంట్ తీసుకుని నారాయణమూర్తిగారిని కలిసి సాక్ష్యాధారాలు కావాల్సి వస్తే బడాబాబులు తీసుకున్న రుణాల తాలూకు కాగితాలు, జిరాక్సులు, వారికి ఎన్ని రిమైండర్లు పంపినా లెక్కచేయని వైనం అన్నీ ఏ కాగితాలు కావాల్సి వస్తే ఆఫీసు కాగితాలు ఋజువులుగా అందచేస్తామని ఆ బ్యాంక్ మునగడానికి, దివాలా తీయడానికి కారణాలు అన్నీ ప్రజలముందు బయట పెట్టాలనీ... డిపాజిటర్లకి న్యాయం జరగాలని... తిరిగి బ్యాంక్ ని తెరిపించి తమ ఉద్యోగాలు తమకిప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించి వెళ్ళారు. పత్రిక ఎడిటర్ గా నిజానిజాలని ప్రజలముందు నిర్భయంగా వుంచుతానని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోజు పాఠకులనించి దొరికిన రెస్పాన్స్ కి నీరద ఉబ్బితబ్బిబ్బు అయిపొయింది.
    శ్రీనివాస్, నీరద ఒకరినొకరు అభినందించుకున్నారు. వారిద్దరి సంతోషం చూసి "మీ శ్రమ, పరిశ్రమ వృధా పోదని ఆశిద్దాం" అన్నారు నారాయణమూర్తిగారు.
    డిపాజిటర్ల ఇంటర్వ్యూలు ఒక్కొక్క ఆదివారం రెండేసి చొప్పున ప్రచురించడానికి నిర్ణయించారు. దానితో బ్యాంక్ స్టాఫ్ అందించిన రుణాలు తీసుకున్నవారి వివరాలు, తీసుకున్న మొత్తాలు, వారి ఆస్తిపాస్తుల వివరాల పట్టిక తయారు చేసి ప్రచురించి ప్రజలముందు తలదించుకునేటట్టు చెయ్యాలని నీరద, శ్రీనివాస్ లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. వారానికి రెండురోజులు డిపాజిటర్ల దగ్గరికి వెళ్ళి కష్టపడి దాచుకున్న వారి సొమ్ము వివరాలు, ఆ డబ్బు పోగొట్టుకుని ఆగిపోయిన కూతుళ్ళ పెళ్ళిళ్ళు కొడుకుల చదువులు, ఇల్లు కట్టుకోవాలన్న వారి స్వప్నాలు అన్నీ నేలమట్టమయ్యాయన్న వారి వ్యధాభరిత కథలు తయారుచేయడం ఆరంభించారు.
    నారాయణమూర్తిగారు "మనం కేవలం ఒకవైపు కథలే ప్రచురించద్దు. అప్పులు తీసుకున్న వారు ఏ కారణంగా రుణాలు తీర్చలేదో కూడా వారినోట చప్పిస్తే మంచిది. అలా రుణాలు తీసుకున్నవారి ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి" అని సలహా ఇచ్చారు.
    "డబ్బులు ఎగ్గొట్టినవారు అసలే కోపంతో వుంటారు. మన పేపరులో రాసిన వార్తలు చదివి వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు ఇస్తారా... డబ్బులు ఎగ్గొట్టినవారు నిజాయితీగా నిజం ఒప్పుకుంటారా మనముందు" నీరద సందేహం వెలబుచ్చింది.
    "అవును సార్! ఇప్పటికే జనంచేత తిట్లు, శాపనార్థాలు తింటున్నవారు ఏ మొహం పెట్టుకుని ఇంటర్వ్యులు ఇస్తారు?" శ్రీనివాస్ అన్నాడు.
    "మన ప్రయత్నం మనం చేద్దాం... అంగీకరించకపోతే ఆ విషయమూ మనం పత్రికాముఖంగా ప్రజలకి తెలియపరుద్దాం..."
    "ఒ.కే. డాడీ. ఇవాళే వాళ్ళ అపాయింట్ మెంట్ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాం."
                                               * * *

 Previous Page Next Page