Previous Page Next Page 
రుధిర మందారం పేజి 14

    "మరి ఎలాపట్టావ్?"
    "వాడు ఈమధ్యనే పోలీస్టేషన్ దగ్గరగా పళ్ళు అమ్ముతున్నాడు. ఏదో కొత్తవాడు అనుకున్నాను. అనుమానించలేదు. మొన్న నీవు చెప్పింతరువాత అందరినీ అనుమానంగా చూడటం మొదలుపెట్టాను."
    "నీ వైఫ్ ని కూడా!"
    "ఛత్. నాకింకా పెళ్ళికాందే."
    "యసెస్ మర్చిపోయాను. కధ కానియ్యి."
    "ఈ కొత్తవాడిమీద ఓ కన్నేసి వుంచాను. మొన్న వాడిదగ్గర పళ్ళు బేరం ఆడుతూ రెండుమాటలు మాట్లాడాను. తనపేరు జహంగీర్ అన్నాడు. మాటకుముందు యా అల్లాఅనటం అంతా అల్లాదయ అనటంతో అతను ముస్లిం అనుకున్నాను. నిన్ననే వస్తుండగా ఎవరితోనో అతను మాట్లాడుతున్నాడు. మాటలమధ్యలో హేరామ్ అనటం విన్నాను. అల్లా పలికిననోటితో హరేరామ్ పలకదని ఎక్కడా లేదు. అయినా అనుమానించి చిన్న పధకం పన్నాను. సరాసరి వాడొచ్చి వలలో చిక్కాడు. అదీ విషయం. ఈ గుడ్ న్యూస్ నీకు వినిపిద్దామని అర్దరాత్రి ముహూర్తం పెట్టాను" అర్జున్ సంతోషంగా విషయం చెప్పాడు.
    "ఆగలేకపోయావన్నమాట!"
    "నే ఆగినా నీవు ఆగవుకదా! పైనుంచి వార్త వచ్చిందంటే చాలు. అరనిమిషంలో అంతరార్ధమైపోతావ్."
    అర్జున్ అన్నది నిజమే గాబట్టి నవ్వి వూరుకున్నాను.
    "తెల్లారి అన్ని దినపత్రికలలో ఈ వార్త వస్తుంది. రాగేశ్వర్ ని పట్టుకుంది నేనే. ఆ కీర్తి నాకే దక్కుతుంది. కాని... వాడు పట్టుబడడానికి నిజమైన కారకుడివి నీవు"...
    "సరేలే ఇంక పొగడ్తల సంచి మూతవిప్పకు."
    "రేపు సాయంత్రం అయిదుగంటలకి మా యింటికి రా."
    "ఎందుకు?"
    "అన్నీ బొట్టుపెట్టి చెప్పాలా!"
    "నేను ఆడదాన్ని కాను."
    "పోనీ తిలకందిద్ది చెప్పాలా!"
    "అదీ అక్కరలేదు. ఎందుకు అన్నది చెప్పుచాలు."
    "అమ్మకూడా ఓసారి నిన్ను చూడాలంటున్నది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ టిఫిన్ మేద్దాం. నైట్ కి భోజనం కూడా."
    "విందుభోజనం ఎంత పసందైనమాట వినిపించావ్! విందుతోపాటు మందు కూడా!"
    "మందు లేకుండా విందు ఏమిటి! ఇచ్చేవాడికికూడా బాగుండదు. ఈ విషయం అమ్మతో చెపుతాను. మిరియాల కషాయమో, కరక్కాయ కషాయమోకాచి రెడీగా వుంచుతుంది" అర్జున్ నవ్వుతూ చెప్పాడు.
    "ఓకే" అన్నాను నేనూ నవ్వుతూ.
    "కక్కుకుంటున్నావా, సరే కషాయం ఇంకా ఘాటుగా కాయమంటాను."
    "మంచిది. అయితే ఇంక వుంటాను."
    "ఉండునాయనా, ఇక్కడ నిన్నెవ్వరూ బలవంతం చెయ్యటం లేదు" అంటూ శలవుతీసుకున్నాడు అర్జున్.
    రిసీవర్ క్రెడిల్ పై వుంచి బెడ్ మీద చార్లగిల బడ్డాను...
    మాంచి నిద్రలో లేచానేమో మళ్ళీ నిద్రపట్టలేదు.
    "ఎంతహాయి యీరేయి. నిద్రపట్టని ఈహాయి." అంటూ చిన్నగా యీలపాట పాడుతూ కళ్ళు మూసుకున్నాను.
                                        12
    "ఈ జన్మకి మీరు పెళ్ళిమాట తలపెట్టరా?" సేమ్యా హల్వా మారు వడ్డిస్తూ అడిగింది ఆంటీ.
    "ఆంటీ! హాయిగా తింటుంటే మధ్యలో ఇలా చేదు తినిపించటం ఎంతమాత్రం బాగుండలేదు" హల్వాలో జీడిపప్పుని ఏరుకుని తింటూ అన్నాను.
    "హల్వాతింటూ చేదు అంటావేమిటి?" అర్జున్ అన్నాడు.
    "నేను హల్వా చేదుగా వుందని చెప్పానా. బేవ్ కూఫ్ బేటా!"
    "చెప్పలేదు భాయీసాహెబ్!"
    "ఇద్దరూ ఇద్దరే సరిపోయారు. పెళ్ళిమాట ఎత్తంగానే కావాలని మాట మార్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆమాత్రం నాకు తీసుసర్రా! నువ్వెంత సి.ఐ.డి. వైనా, వీడెంత ఇన్ స్పెక్టర్ అయినా నా కళ్ళు గప్పి నాముందర్రా కుప్పిగంతులు? పెళ్ళిమాట నా నోట్లోంచి రాకుండా వుండటానికి మీ ఎత్తుగడలు అవునా?" ఆంటీ చేతిలోకి గరిట తీసుకుని అడిగింది. 
    "గరిట తీసుకున్నావ్ కొడతావా ఆంటీ!" భయం నటిస్తూ అడిగాను.
    "ఇది వడ్డించటానికి లే" కోపంగా జవాబిచ్చింది ఆంటీ.
    "అమ్మయ్య రెండుగరిటెలు సాంబారు వడ్డించు ఆంటీ!"
    ఆంటీ సాంబారు వేసింది.
    "ఆంటీ! సాంబారు ఎలావుందో తెలుసా! అమృతం లాగా వుంది. ఈ సాంబారుసాక్షిగా చెపుతున్నాను. పెళ్ళి చేసుకోటం తప్పని నేనెప్పుడూ అనలేదు. జీవితంలో ప్రతివారికీ వకసారి పెళ్ళిజరగాల్సిందే మంచిపిల్లను చూడు ఆంటీ!" అన్నాను.
    "హుర్రే!" అంటూ పక్కకేక పెట్టాడు అర్జున్.
    "ఎంత మంచిమాట ఇన్నాళ్ళకు వినిపించావయ్యా!" అంది ఆంటీ.
    "యీడు జోడు చదువుసంధ్య రంగు రూపము అన్నీ చక్కగా వుండాలి." అర్జున్ అన్నాడు.
    "ఆంటీ పిచ్చిపిచ్చి పిల్లలను చూడదులే. నీవేం గాభరాపడకు. ముందు ఆంటీ చూస్తుంది. ఆ తర్వాత నేను చూస్తాను. మా ఇద్దరికీ పిల్ల నచ్చింతరువాత నీకు నచ్చకపోవటం అంటూ వుండదులేవోయ్ పెళ్ళికొడుకా!" నవ్వుతూ అన్నాను.

 Previous Page Next Page