Previous Page
ఆడపడుచు పేజి 13

                                       పెంపుడు కుక్క
       
                                                         --వెల్లంకి సతీష్
   
   

రత్తాలు గింజుకుంటోంది...ప్రాణం కన్నా మానం విలువైనదని భావించే, ఓతెలుగింటి ఆడపడుచు నాలుగు జతల చేతుల మధ్య పెనుగులాడుతోంది.   
    ఆ నాలుగు జతల చేతులు ఆమె ప్రయత్నాన్ని పడనివ్వడం లేదు.   
    ఆమె ఏడుస్తోంది.....   
    ప్రాధేయ పడుతోంది.....దణ్ణం పెడ్తోంది...   
    'ఉఁహు...'   
    ఆ చేతులు వినిపించుకోవడం లేదు. తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నాయి.   
    ఆమె గాజులు పగిలాయి.   
    వొంటి మీద బట్టలు తొలిగాయి-   
    వొంట్లో ఓపిక క్రమంగా సన్నగిల్లింది-   
    జరుగుతున్నదాన్ని పూర్తిగా ప్రతిఘటించకుండానే ఆమె సొమ్మసిల్లి పడిపోయింది.       
    దాంతో ఆ చేతులు విజ్రుంభించాయి. ఒకరి తర్వాత ఒకరిగా, ఆ చేతుల యజమానులు ఆమెను ఆక్రమించుకోసాగారు.   
    దూరంగా...సాయంత్రపు వెలుగు నెమ్మదిగా కరిగిపోసాగింది, ఆమె శీలంలా సిగ్గుతో కుంచించుకు పోయినట్లు, ఆ దృశ్యం చూడలేక నెమ్మదిగా కృంగిపోయాడు పడమటి సూర్యుడు.   
    కానీ ఆ గదిలో మాత్రం నవ్వులు  ప్రతిధ్వనిస్తున్నాయి....వాళ్ళ నిజయానికి గుర్తుగా, వాళ్ళ ఆనందానికి దూరంగా, నిస్తేజంగా పడి ఉంది రత్తాలు శరీరం చలనం లేకుండా.  
    రత్తాలు....మరణించింది.   
                                              *    *    *   
    "పిలిచావా దొరా?" చేతులు కట్టుకుంటూ అడిగాడు రంగడు.   
    "ఆఁ!" ముక్తసరిగా జవాబిస్తూ, కాలుస్తున్న చుట్ట పొగలోంచి రంగన్ని చూశాడు భుజంగరావు.   
    రంగడు ఆ ఇంటి ఆస్థాన నౌకరు. దూరంగా విసిరేసినట్టుండీ వాడి పాక, చిన్నపిల్లలు కట్టుకునే ఇసుక గూడు లాగుంది.   
    భుజంగరావు కార్య నిర్వహణలో, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టగలిగేంత విశ్వాసం ఉన్న నమ్మినబంటు వాడు.   
    భుజంగరావు!   
    సార్ధక నామధీయుడే-   
    ఎప్పుడూ- నల్లత్రాచులా ఖరీదైన బట్టల మధ్య నిగ నిగలాడుతుంటాడు. ఆయన జీవితాన్ని పంచుకోడానికి వచ్చిన భార్య, ఆయన క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని పంచుకోలేక కొద్దికాలంలోనే దేవుణ్ని చేరుకుంది.   
    పట్నంలోని రాజకీయనాయకులు కొందరితో భుజంగరావుకి సన్నిహిత సంబంధాలున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల గురించి చర్చించడానికి, పట్నం నుంచి కొంతమంది రాజకీయ ప్రముఖుల్ని, పల్లెకు ఆహ్వానించాడు ఆ ఊరికి మకుటంలేని ప్రెసిడెంటుగా ఉండాలని ఆయన అభిలాష.   
    "నువ్వొకసారి పట్నం వెళ్ళిరావాల్రా!"   
    ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది భుజంగరావు కంఠం.   
    "చిత్తం దొరా!"   
    "లాయర్ హరిహరరావుగారిని నువ్వెరుగుదువుగా! ఆయన్ని రేపు మన ఇంటికి తీసుకురావాలి!"   
    హరిహరరావుగారు ఆయన ప్రాణ స్నేహితుడు. భుజంగరావు దుర్మార్గానికి దేవుడు శిక్షిస్తే...హరిహరరావు కూడా సగం అనుభవించాల్సి ఉంటుంది.   
    "అట్టాగే దొరా! ఇయ్యాలే బండి కడతా!" వెను దిరిగాడు రంగడు.   
    జాగ్రత్తగా వెళ్ళిరా!" వాడి క్షేమం పట్ల శ్రద్దన్నవాడిలా అన్నాడు భుజంగరావు.   
    రంగడు నెమ్మదిగా అడుగులేస్తూతన పాక వైపు వెళ్ళిపోయాడు   
                                          *    *    *   
    తుఫాను ముందుకొచ్చినట్లు, వచ్చి ఆ యింటి ముందాగింది ఓ తెల్లటి కారు. దాంట్లోంచి, కాళ్ళు బయట పెట్టాకు తెల్లదుస్తులు ధరించినవారు.   
    "రండి! రండి" సాదరంగా ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాడు భుజంగరావు.   
    పరస్పర యోగక్షేమాలనంతరం, వాళ్ళంతా విశాలమైన హాలులో సమావేశమయ్యారు.   
    గ్లాసులు ఖాళీ అవుతున్నాయి.   
    చర్చలు ముగింపు దశలోకి వచ్చాయి. వాళ్ళంతా, ఏకగ్రీవంగా ఒక ఒప్పందానికి వచ్చినట్లు తలలూపారు.   
    వాళ్ళు నలుగురూ లేచి నిలబడ్డారు. ఇంతలో....ఓ దృశ్యం వారినాకర్షించింది. దూరంగా- రంగడి భార్య రత్తాలు స్నానంచేసి, తడి వొంటిపై బట్టలు చుట్టుకుని పాకలోకి వెళ్తోంది.   
    అరక్షణం! వాళ్ళదృష్టి ఆమె కండపట్టిన వొంపులమీదున్నాయి. నలుగురూ ఓ నిశ్చయానికొచ్చినట్లు, తడారిపోయిన పెదాలను నాలుకలతో తడుపుకున్నారు ఫలితం...   
                                             *    *    *   
    రత్తాలు గింజుకుంటోంది...
    ప్రాణంకన్నా మానం విలువైనదని భావించే, ఓ తెలిగింటి ఆడబడుచు నాలుగు బతల చేతులమధ్య పెనుగులాడుతోంది.   
                                          *    *    *        
    రంగడు పట్నం చేసుకునే సరికి, హరిహరరావుగారు అప్పటికే ఎవరితోనో కలిసి పల్లెకు బయల్దేరారని తెల్సింది. వెంటనే రంగడు, పట్నంలో తన భార్యకు గాజులు కొని, పల్లె ముఖం పట్టాడు.   
    అప్పుడే రాత్రి మూడుఝాములు గడిచిపోయాయి.   
    రంగడు పల్లె ప్రవేశించాడు. పట్నంనుంచి తను రత్తాలుకు తెస్తున్న గాజులను చూపించి, తర్వాత దొరగారికి విషయము చెబుదామని పాకలోకి వెళ్ళాడు.   
    వెళ్ళినవాడువెళ్ళినట్లే ఉండిపోయాడు. ఎదురుగా - అతని రాకకోసమే ఎదురుచూస్తున్నట్లు, నిట్టాడుకు వ్రేలాడుతోంది రత్తాలు శవం మెడలో త్రాడుతో.   
    క్షణంసేపు జరిగిందేమిటో అర్ధం కాలేదు వాడికి. అర్ధం అయ్యేసరికి వాడు దుఃఖంతో రోదిస్తూ ఉండిపోయాడు. రత్తాలు ఆపని ఎందుకు చేసిందో ఊహించ లేక పోతున్నాడు. వాడు వాడి రోదనతో శృతికలుపుదామని కాబోలు, గుంజకు కట్టుబడి ఉన్న వాడి పెంపుడుకుక్క అదే పనిగా మెరుగుతోంది.   
    భుజంగరావు రాత్రి కాపలాకు వాడికి సహాయంగా ఇచ్చిందది.   
    రంగడు జరిగిందేమిటో ఊహించసాగాడు మూగగా రోదిస్తూ...   
    అంతలో - వాడికి గుర్తుకొచ్చింది__   
    ఒకరోజున తాను పాకలో లేననుకుని, దొర దొడ్లో స్నానం చేస్తున్న రత్తాలు మీద పడటం-ఇంతలో తనటు రావడంతో ఏమీ జరగనట్టు దొర తప్పుకోటం రత్తాలు తనకు విషయం చెప్పి ఏడ్వడం ఒక్కొక్కటిగా కళ్ళముందు కొచ్చాయి.   
    రంగడికి దాంతో జరిగిందేమిటో వాడికి బోధ పడింది. వాడి ఆలోచన నిజమేనని దూరంగా హాల్లోంచి వినపడుతున్న నవ్వులు ధృవపరిచాయి. ఏమీ చేయలేని ఆశక్తితో చేతులు రుద్దుకుంటూ ఉండిపోయాడు రంగడు.   
    తానెదుటపడి జరిగింది ప్రశ్నిస తనను చంపడానికికూడా వెనుకాడరువాళ్ళు. ఏమి చెయ్యాలో పాలుపోవడంలేదు అతనికి.   
    ఉక్రోషం పట్టలేక, అదేపనిగామెరుగు తున్నా కుక్కని బలంగా, కాలితో డొక్కలో ఓ తన్ను తన్నాడు. కసికొద్దీ అలా తంతూనే ఉన్నాడు. అతని మూగరోదనాకు కుక్క మరణవేదన తోడయ్యింది.  
    అది పెంపుడుకుక్క!
    డానికి రోజూ ఆహారం వేసేది రంగడే ఆ విశ్వాసంతోనే అంతసేపు భరించింది. రెచ్చిపోతున్న యజమానిని చూసి, ఇక భరించలేక పోయిందది.
    అదేపనిగా తంతున్న రంగడి కాలిని దొరక బుచ్చుకుని, ఒక్కసారిగా బలంగా కరిచింది.
    అదిరిపాటుతో ఏడుపొచ్చినంత పనయ్యింది రంగడికి. కాలిమీద చర్మం ఊడివచ్చింది. పిచ్చికోపంతో దాన్ని పీకనొక్కి చంపబోయాడు.
    వాడికున్నట్టుండి మెరుపులాంటి ఆలోచానా వచ్చింది. కసితో మీదపడి చంపబోయిన యజమాని ఆ ప్రయత్నాన్ని ఎందుకు విరమించుకున్నాడో అర్ధంకాలేదా పెంపుడు కుక్కకి.
    రంగడి కళ్ళు ఎరుపెక్కాయి. తన కర్తవ్యమేమిటో బోధపడింది. విసురుగా లేచి చూరులోనున్న గొడ్డలిని అందుకున్నాడు. రెట్టించిన బలంతో ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు.
                                                         *    *    *

    "అమ్మా!" అనే హృదయ విదారకమైన కేకలతో ఆ గది ప్రతిధ్వనించింది. ఎర్రటి రక్తం, వాళ్ళు తాగి వదిలేసిన ఎర్రటి మద్యంతో కలిసి ఏరులై పారింది.
    ఆ శవాల మధ్య నిస్తేజంగా రక్తపు మరకలతో నిలబడి ఉన్నాడు రంగడు.
    అప్పుడే తూర్పున తొలి రేఖలు విచ్చుకుంటున్నాయి. దూరంగా కోడి కూసింది. అప్పటికి రంగడు ఆ పల్లె వొదిలి క్రొత్తజీవితం కోసం తన భార్య శవంతో బండిలో వెళ్ళిపోతున్నాడు సుదూరంగా. తనకు జీవిత సత్యాన్ని నేర్పిన పెంపుడు కుక్కను తన కూడా తీసుకెళ్ళడం మరచిపోలేదు.
    తూర్పు కొండల మధ్య నుంచి ఎర్రగా పైకి వచ్చాడు క్రొత్త రోజుకు స్వాగతమిస్తూ సూర్యుడు...
                                                             *      *      *

                                               --అయిపోయింది--

 

 Previous Page