"మీ ఇంటికి చుట్టాలొచ్చారా?"
"లేదే. ఏం?"
"అర్ధరాత్రి ఎవరో మీ ఇంట్లో ఏడ్చినట్టు ఉంటేనూ!"
ఆ అమ్మాయి ముఖం ఎర్రగా కందిపోయింది. పచ్చటి చెక్కిళ్ళల్లోకి రక్తం చిమ్మింది. నేను ఆమె ముఖంలో కదలె భావాలను పరిశీలిస్తున్నాను.
"మా ఇంట్లో రాత్రి ఏడుపు విన్పించడమేమిటి?"
"అవును! వినిపించింది."
ఆ అమ్మాయి కోపంగా నా ముఖంలోకి చూసింది.
"అవును వినిపించింది. దాదాపు ఈమధ్య రోజూ విన్పిస్తూనే ఉన్నది. ఆ ఏడ్చేది మీరేననికూడా నాకు తెలుసు."
ఆ అమ్మాయి బిత్తరపోయింది.
చివ్వున లేచి నిల్చుంది.
"బహుశా మీకు... డాక్టర్ని చూడండి" అంటూ వెళ్ళిపోయింది.
నేను నవ్వుకున్నాను.
అబ్బ ఎంత రోషమో.
ఈ పెళ్ళాలంతా ఇంతే.
ఎన్ని బాధలైనా భరిస్తారు కానీ భర్తమీద ఈగ వాలనివ్వరు.
అందుకే ఈ దేశంలో ఆడవాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయ్.
భర్త ఎలాంటివాడైనా ప్రత్యక్షదైవం.
ఆడదానికి ప్రాతివ్రత్యంకంటే కావాల్సిందీ, కోరుకొనేదీ జీవితంలో మరొకటి లేదు. ఉండకూడదు.
ఆలోచిస్తూ నిద్రపోయాను.
నిద్రలేచేసరికి సాయంత్రం ఆరు అయింది. అమ్మ నిద్రలేపింది.
కాఫీ తాగాక "సావీ..." ఏదో అడగాలని అమ్మ సందేహించి ఊరుకుంది.
"ఏమిటమ్మా?"
"అమ్మాయిని పట్టుకొని ఏవేవో ప్రశ్నలు వేశావట."
"ఉన్నది అడిగాను..."
"తప్పమ్మా అలా అడగకూడదు."
"నేను అమ్మాయిని తప్పు మాటలేం అనలేదే?"
"భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. పెళ్ళి కావాల్సినదానివి. నీ చెవులన్నీ వాళ్ళ మాటలమీదే అంటుంది ఆ అమ్మాయి... పైగా మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి చెయ్యండని కూడా అన్నది. నాకు ఎలాగో అనిపించింది సావీ... వాళ్ళ సంగతులు నీకెందుకు చెప్పు! ఎవరైనా విన్నా ఏమనుకుంటారు?"
నాకు అమ్మ మీద చిరాకువేసింది. అక్కడ్నుంచి లేచి వచ్చేశాను.
నా మనసు భగ్గుమంటోంది. ఆ అమ్మాయి అమ్మకు ఏమి చెప్పింది? అమ్మకూడా ఆ అమ్మాయి మాటలేనమ్మింది.
పుస్తకం తెరిచాను... చదవలేకపోయాను.
బట్టలు మార్చుకొని లైబ్రరీకి వెళ్ళాను. ఏడుగంటలకు వచ్చాను.
అమ్మా నాన్నా ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూసి సంభాషణ ఆపారు.
"ఏమిటి మాట్లాడుతున్నారు? నా గురించేనా..." అన్నాను.
"అవునమ్మా మీ అమ్మ నీకు త్వరగా వివాహం చెయ్యమంటోంది..." అన్నారు నాన్నగారు.
నేను నాన్న ముఖంలోకి చూశాను.
"ఇంత అకస్మాత్తుగా మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చినట్టు?"
"రోజూ అనుకుంటూనే వున్నాం... పరీక్షలు కాగానే చేద్దామనుకున్నాం. పరీక్ష లయిపోయాయిగా..." నాన్న అన్నారు.
* * *
అంతవరకూ చెప్పి సావిత్రి ఆగి అనసూయ ముఖంలోకి చూసింది.
అనసూయ చాలా శ్రద్ధగా వింటోంది.
"డాక్టర్ రామం గుర్తున్నాడా అనూ?"
ఆమె గుర్తుతెచ్చుకొంటూ "రాయ వెల్లూర్ లో హౌస్ సర్జన్సీ పూర్తిచేసి కౌలాలంపూర్ వెళ్ళి పరీక్ష రాసివచ్చాడు. మీ మేనత్త కొడుకు కదూ? అతడేనా?"
"ఔను..."
"పొట్టిగా నల్లగా..."
"అంతేకాదు... చప్పిముక్కు... లావు పెదవులు" వాక్యం పూర్తిచేసింది సావిత్రి.
"అతనే మా బావ రామం. నేను పుట్టినప్పటినుంచీ అతడి పెళ్ళాన్ని అనేవారట. పెద్ద పిచ్చి" సావిత్రి గలగల నవ్వింది.
"అమ్మకూ, నాన్నకూ అతన్ని చస్తే చేసుకోనని ఖచ్చితంగా చెప్పాను...
"రామకృష్ణ గురించి చెప్పావా?"
"అప్పుడు చెప్పలేదు. తర్వాత తెలిసిందిలే."
"నాన్న సాధారణంగా నా పెళ్ళి గురించి తొందరపడేవారు కాదు. ఆ రాత్రి అలాగనేసరికి నాకు చర్రున కోపం వచ్చేసింది.
నేను పి.హెచ్.డి చేస్తాను. ఇప్పుడే పెళ్ళి చేసుకోను. ఆ తర్వాతైనా నాకు నచ్చినవాడిని చేసుకుంటాను" అని తెగేసి చెప్పాను.
అనసూయ కుతూహలంగా వినసాగింది.
"నేన చివ్వున లేచాను. వెనకనుంచి అమ్మ మాటలు వినిపించాయి."
"ఏమని?"
"పెళ్ళంటే ఇష్టములేనిదానివి పక్కవాటా దంపతుల గురించి అంత కుతూహలం ఎందుకో" అని అమ్మ అంటే "చాల్లే ఊరుకో" మందలించాడు నాన్న. నేను ఓ క్షణం స్థాణువులా నిలబడిపోయాను. అమ్మ మాటలు నా మనసుని గాయపరిచాయి.
"తర్వాత?" అనసూయ అడిగింది.
"నా మనసదోలా ఐంది. గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాను. అమ్మమీద కోపంగా వుంది. ఆమె గొంతు పిసకాలనిపించింది."