అంతే! సూపర్ ఫాస్ట్ దాటి వెళ్ళిన కొద్దిక్షణాలకే_ అజ్ఞాత వ్యక్తి స్వరం వినిపించిన మరుక్షణమే_బ్రిడ్జి పేలిపోయి కుప్పకూలిపోయింది.
"వ్వాట్...." నివ్వెరపోయాడు నవీన్.
"మిస్టర్ కమాండర్! ఏమిటీ విధ్వంసం? ప్రజల ఆస్తులను, ప్రభుత్వం ఆస్తులను నష్టపెడితే ఎవ్వరూ క్షమించరు, సహించరు! సి.ఎం.గారి ఇష్టాయిష్టాలతో మీకు అనవసరం_మీ డిమాండ్లు ఏమిటో నాకు చెప్పండి_నేనే కాబినెట్ కు తెలియజేసి వెంటనే ఆమోదించేట్టు చేస్తాను...."
"దట్స్ నైస్! మీ సి.ఎం. కు బుర్రలేదు. కనీసం మీ పోలీస్ శాఖ అయినా చురుగ్గా వ్యవహరిస్తున్నందుకు అభినందించవలసిందే! బై ద బై_ట్రెయిన్ ను ఆపడానికి ప్రయత్నించినా, చెక్ చేసినా నష్టపోయేది ఎవరో తెలియజెప్పడానికే జస్ట్ _ఆ కెనాల్ బ్రిడ్జిని బ్లాస్ట్ చేశాను. ఇక మీ దర్యాప్తును కట్టిపెట్టి, రైఫిల్స్, రివాల్వర్స్, డిటెక్టర్స్ ను బయటపడేయండి. ఆ తరువాతనే మా డిమాండ్స్ ను చెబుతాను" స్థిరంగా చెప్పుకుపోయాడు అజ్ఞాత వ్యక్తి.
తన ఉత్తర్వును అమలుపరచి తీరాలి! అన్నట్టు ఉన్నది ఆ ఆజ్ఞ.
మరల ఆలోచనలో పడిపోయాడు నవీన్. ఈ పరిస్థితులలో సి.ఎం.ను రక్షించడం ఎంత కష్టసాధ్యమో అర్ధమైపోతున్నది.
అజ్ఞాతవ్యక్తి కోరినట్టు ఆయుధ సంపత్తినంతా బయటకు పారవేస్తే ఇహ చేతులు ముడుచుకుని మూల కూర్చోవడం మినహా చేసేదేమీ వుండదు.
"మిస్టర్ నవీన్!" సెట్ లో డి.ఐ.జి.
ఉలిక్కిపడి, వెంటనే తేరుకుని, రిటర్న్ సిగ్నల్ ఇచ్చాడు నవీన్.
"మిస్టర్ నవీన్! దర్యాప్తును వెనువెంటనే కట్టిపెట్టి, కమాండరు చెప్పినట్టు తు.చ.తప్పక చేయండి. ప్రస్తుతం ఎవరిది పైచేయి అనేదికాదు ఇక్కడ కావలసింది. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యతకూడా మనదేననే విషయాన్ని మరచిపోవద్దు!" ఆదేశాత్మకంగా అంటున్నారు డి.ఐ.జి.
"సార్....వాళ్ళకు సరండర్ అయితే, ఇక వి.వి.ఐ.పీ. సెక్యూరిటీ నిమిత్తం నేనేం చేయాలి? ఆయుధాలను వదులుకుంటే కేవలం వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడవలసి వస్తుంది...." ఆవేశంగా ఆవేదనగా చెప్పుకున్నాడు నవీన్.
"మిస్టర్ సెక్యూరిటీ ఆఫీసర్! ఒక్క ఈ ట్రెయిన్ లోనే కాదు. అన్ని కీలకమైన ప్రదేశాలలోను బాంబులు పెట్టాం. ఒక్క రిమోట్ కంట్రోల్ తో ఎక్కడైనా సరే ట్రెయిన్ ను బ్లాస్ట్ చేసేయగలం _జస్ట్....సీ...."
కమాండర్ అనడమే తడవు_సూపర్ ఫాస్ట్ దాటిన మరుక్షణమే రైల్వే ట్రాక్ బ్లాస్ట్ అయిపోయింది.
"మిస్టర్ నవీన్! ఫాలో మై ఇన్ స్ట్రక్షన్స్! కమాండరు చెప్పినట్టే చేయి, క్విక్!" డి.ఐ.జి. విసుక్కుంటున్నారు సెట్ లో.
డి.ఐ.జి. ఆదేశానుసారం, గాలింపు చర్యలను నిలిపివేసి వెనక్కు వచ్చేయమని సిబ్బందికి సూచన లిచ్చాడు నవీన్.
అజ్ఞాత వ్యక్తి కోరినట్టే ఆయుధాలను బయటకు గిరాటేశాడు.
నిరాశా నిస్పృహలతో సీటులో చతికిలపడిపోయాడు.
అదే క్షణంలో _ ప్రక్క కంపార్ట మెంట్ లో _
టాయిలెట్ కు వెళ్ళాలన్నట్టు చేతితో సంజ్ఞచేసింది సునంద. వెళ్ళమన్నట్టు తల తాటించాడు యువకుడు.
సునంద వడివడిగా అడుగులు వేస్తూ టాయిలెట్ రూమ్ ను దాటి, వి.వి.ఐ.పి. కోచ్ లోకి ప్రవేశించబోయింది.
అదే క్షణం _ ఆమె భుజంమీద బలంగా చేయి పడింది.
వెనుదిరిగి చూసిన సునంద కెవ్వుమన్నది. అప్పటికే సునంద గొంతుపైన కత్తిపెట్టి వుంచిన యువతి ఆమెను ఆ కోచ్ చివరి నుంచి చరచరా లాక్కువచ్చింది.
సునంద కేక విని హుటాహుటిన అక్కడకు వచ్చాడు నవీన్.
అస్త్ర సన్యాసం చేసిన నవీన్ పైకి డ్రింక్ లేజర్ గురిపెట్టి సునాయాసంగా కాల్చాడా యువకుడు.
ఆ మత్తుమందు ప్రభావానికి కొన్నిక్షణాలలోనే స్పృహ తప్పిసీటుమీద పడిపోయాడు నవీన్.
సునంద ముఖం పాలిపోయింది. మెల్లిగా వచ్చి తన సీటులో కూలబడింది.
ఆలోచనలు ఆమె అంతరంగాన్ని కుదిపివేస్తున్నాయి. ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు?
యువకుడు హుషారుగా సిగరెట్టు ముట్టించుకున్నాడు. ఉఫ్ న ఊదాడు పొగ.
* * *
అజ్ఞాత వ్యక్తి ప్రతిపాదించిన డిమాండ్లతో తల దిమ్మెక్కిపోయింది డి.ఐ.జి.కి.
యాభై కోట్ల రూకలతో సి.ఎం. ప్రాణానికి వెలకట్టారు వాళ్ళు.
అంతేకాదు. సెంట్రల్ జైళ్ళలో శిక్షలననుభవిస్తున్న జీవిత ఖైదీల నందరినీ విడుదల చేయాలి.
లోడ్ చేసిన నాలుగు కర్ బైన్స్ ను విజయవాడ ప్లాట్ ఫారంమీద వుంచాలి.
ఇరువురు డి.ఎస్.పీలు అక్కడ చేతులెత్తుకుని నిలిచి వుండాలి.