Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 13


    "అనుకోవటం ఏమిటి? అసలు అనుకోవటానికి నువ్వెవడివి? జరగవు....ఏం చేస్తావ్?" రంకె వేసాడు గౌసుద్దీన్.

    "మీ దిపార్టుమెంటే  అంత....పోలీసు  డిపార్టుమెంట్ లో చేరేవరకు మీ బుర్రలో గుజ్జుంటుంది. ఒకసారి నెత్తికి టోపీ, చేతికి లాఠివస్తే బుర్ర తరిగిపోయి బొజ్జ పెరిగిపోతుంది. లాజిక్కు  తగ్గిపోయి లాలస పెరిగిపోతుంది. విచక్షణా జ్ఞానం, ఇంగితజ్ఞానం తగ్గిపోయి వీరవిహారం పెరిగిపోతుంది, అధికారం, అహంకారం, ఒళ్ళు పొగరు, ఎక్కువయిపోతాయి. మీకందరూ  దొంగల్లాగే  కనబడతారు. అసలు దొంగలు మీరు. చేనుని మేసే కంచలు మీరు. జరక్కపోతే  ఏమవుద్దాన్నావ్ చూడు. ఏమీ అవదు లంచం తీసుకోబోయినందుకు  ఇవ్వాళో రేపో  సస్పెండ్ అవుతావ్. నా తోటను నాశనం చేసినందుకు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంటావ్" తాపీగా అన్నాడు రాజర్షి.

    "అందుకు సాక్ష్యం కావాలి...." గౌసుద్దీన్ సరోక్కాస్టిగ్గా అన్నాడు. 

    "సాక్ష్యం లేకుండానే  మానెయ్యటానికి  నేనేం  తలకుమాసిన  పోలీసోణ్ని కాదు తల వున్న సివిలోణ్ని. నీ వీర విహారం  మొత్తం  పాపం ఆ వీడియో  కెమెరా  భద్రంగా  తన కడుపులో దాచుకుంది. అర్దరాత్రి పూటకూడా నా ఆశ్రమం ముందు  లైట్స్ ఎందుకు వెలిగే ఉన్నాయో ఇప్పుడర్ధమవుతుందనుకుంటాను. అదీ....సంగతి"

    రాజర్షి  ఫోన్ పెట్టేశాడు.

    నరరూప రాక్షసుడులాంటి  గౌసుద్దీన్ కు చెమటలు  పట్టేశాయి.

    అంతే....పై సంఘటనతో  రాజర్షి  ఎవరు? ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారన్నది  ఒక్కసారి  గుప్పున వెలుగులోకి  వచ్చింది.

    అదిగో అలాంటి  రాజర్షినే. ఆశ్రయించబోతున్నారిప్పుడు పట్టాభి, మధుమూర్తిలు....


                                                                   *    *    *


    "ఇప్పుడు  ముందుగా  మనం చేయాల్సింది. పరమశివం  హఠాత్తుగా  తన భాగస్వామ్యాన్ని  రద్దు చేసుకున్నందువల్ల మన ఫరమ్ దెబ్బతిందని పట్టాభి, మధుమూర్తులకు  చిప్పే గతని పేపర్స్ ని ఎక్కించాలి. ఆ పేపర్ రాజర్షి  ఆశ్రమానికెళ్ళేలా చేయాలి. ఆ తరువాత ఏం జరగవల్సింది  నేను నిర్ణయిస్తాను" పట్టాభి సీరియస్ గా చెప్పాడు దుర్గాదాసుకి.

    మధుమూర్తికి మొదటి నుంచీ ఒకటే భయం. చేతబడి తిరగబడుతుందేమోనని.

    దుర్గాదాసు పట్టాభి  అందించిన డబ్బు తీసుకొని బయలుదేరాడు.

    దుర్గాదాసు  సరాసరి  దినపత్రికల  కార్యాలయాలకు వెళ్ళి పట్టాభి ఫరమ్ దెబ్బతిందని  న్యూస్ ఇచ్చేశాడు. ఆ న్యూస్ మరుసటిరోజు పత్రికల్లో  వచ్చేసింది.

    "శభాష్....ఈపాటికి  రాజర్షి  దినపత్రికలన్నీ  తిరగేసి  వుంటాడు."

    పట్టాభి  హుషారుగా అన్నాడు దినపత్రికల్ని  తిరగేస్తూ.... 

    "నాకేమిటో  భయంగావుంది__పరమశివం, శశిభూషణ్ కి నష్టం కలిగించాలని  చూస్తున్నావ్ గాని ఈ వార్త పడిన తర్వాత  మార్కెట్ లో బిజినెస్  సర్కిల్స్ లో మన వ్యాపారం  ఎంత  దెబ్బతింటుందో  ఆలోచించడం లేదు." మధుమూర్తి దిగులుగా  అన్నాడు.

    పట్టాభి  నవ్వాడు....చిన్నగా మొదలెట్టి శృతి పెంచుతూ  నవ్వుతూనే వున్నాడు కొద్ది క్షణాల వరకు.

    ఉన్నట్టుండి  సడన్ గా ఆపేసి మధుమూర్తివేపు  చూశాడు.

    "నిండా  మునిగినవాడికి  చలేమిటి మూర్తి. దెబ్బతినాల్సినదేమన్నా మిగిలుందా?  వ్రతం చెడ్డా  ఫలితం  దక్కాలికదా? దొంగవ్యాపారాలు  చేసుకునేవాడికెప్పుడూ  ఎక్కువే  మిగులుతుంది. అలాగే అప్పుడప్పుడూ  సడన్ గా నష్టమూ వస్తుంటుంది. ముందు వాళ్ళను  సర్వనాశనం చేసి అప్పుడు మన వ్యాపారం  గురించి ఆలోచిద్దాం. మరింకేం నసపెట్టకు."

    పట్టాభిమీద భారంవేసి  మధుమూర్తి టెన్షన్ తగ్గించుకున్నాడు.

    నిజంగా  మంచివాడు మంచివాడనిపించు కొనేందుకు టైమ్ కావాలేమోగాని  కావాలని అవసరంవుండి మంచివాడనిపించుకోవాలనే చెడ్డవాడికి అంత టైం అక్కరలేదు. నటనలో ప్రావీణ్యం వుంటే చాలు.

    ఓరోజు  దుర్గాదాసు రాజర్షికి  కనిపించే స్థానంలో  కూర్చుని  విచార వదనంతో  శూన్యంలోకి  చూడసాగాడు. మరో అరగంటకల్లా  పరమశివం, శశిభూషణ్ అనే ఇద్దరు స్వార్ధపరులైన వ్యక్తులు  పట్టాభి, మధుమూర్తి అనే అమాయకుల్ని మోసంచేసి ముంచినట్లు_అందువల్లనే తనకు ఉద్యోగం ఊడిపోయి  ఆశ్రమంపంచ  చేరినట్లు అతి జాగ్రత్తగా రంగు పులిమాడు దుర్గాదాసు.

    అనుచరులకు అప్పుడు గుర్తుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం  చదివిన వార్త.

    అదే విషయాన్ని తన బాస్ కి గుర్తుచేశారు.

    అతను వెంటనే ఆ యిద్దరు  వ్యక్తుల  వివరాలు కావాలని ఆదేశించాడు.

    అదేరోజు సాయంత్రానికి పరమశివం, శశిభూషణ్ కుటుంబాల వివరాలు, వారి అలవాట్లు, అభిరుచులు, ఆస్థులు ఆశ్రమంలో రికార్డయి పోయాయి.

 Previous Page Next Page