ఏదో లోకంలో ఉన్నట్లు కూర్చుంది హిమజ. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయ్. అప్పటికే ఇన్ స్పెక్టర్ ఇంట్లో అందర్నీ ఇంటరాగేట్ చేశాడు. ఆ ఇల్లంతా పోలీసుల్తో నిండివుంది.
"జరిగిన విషయం చెప్తారా?" సౌమ్యంగా అడిగాడు.
"సాయంత్రం సాగర్ వచ్చాడు నేనే రమ్మన్నాను. ఇద్దరం హాల్లో కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పుడు సోమశేఖరం వచ్చారు. చాలా దిగులుగా కనిపించారు. అక్క కోసం అడిగారు. తోటలో ఉంది - వెళ్ళమన్నాను. బహుశా అక్క పెళ్ళి విషయం యిప్పుడే తెలిసిందేమో అందుకే అలా వున్నారని మేము అనుకున్నాం. సోమశేఖరం భావకుడు. ఈ వార్తతో చాలా కదిలిపోయినట్లు కనిపించాడు.
"మీ అక్క పెళ్ళి విషయం అతనికి తెలియదా ?"
"లేదు వూళ్ళోలేరని అక్క చెప్పింది. ఇప్పుడే వచ్చినట్టున్నాడు. తోటలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు."
"తర్వాత ఏం జరిగింది?"
"అతడిని తోటలో కూర్చోబెట్టి - అక్క ఇంట్లోకి వచ్చింది. అప్పటి వరకూ నాతో మాట్లాడుతున్న సాగర్ తోటలోకి వెళ్ళాడు. అతడు అలా ఎందుకు వెళ్ళాడో నాకు తెలీదు. నేను శుభలేఖలమీద అడ్రసులు వ్రాస్తూ కూర్చున్నాను. అంతలో పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. నేను వెంటనే తోటలోకి పరుగెత్తాను. సాగర్ నిర్విణ్ణుడై చూస్తున్నాడు. అతడి కాళ్ళ దగ్గర పిస్టలు వుంది. సోమశేఖరం క్రిందపడి కొట్టుకుంటున్నాడు."
"అప్పుడక్కడ ఎవరెవరున్నారు ?"
"సాగర్ ఒక్కడే. అక్క నా వెనకే మేడమీద నుండి దిగి వచ్చింది. రామయ్య, శివయ్య తర్వాత వచ్చారు."
"హత్య ఎవరు చేసి వుంటారని మీ ఉద్దేశ్యం ?"
ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. సర్వశక్తులూ కూడగట్టుకుని నెమ్మదిగా అంది. ఒక్కొక్క అక్షరమే అంటూంటే ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. "సాగర్ ఒక్కడే అప్పుడా ప్రదేశంలో ఉన్నది. ఇంకెవరైనా ముందునుంచే వెళ్ళాలి. మిగతా అందరూ అప్పుడు యింట్లోనే వున్నారు."
ఇన్ స్పెక్టర్ ఆమె వైపు సానుభూతిగా చూశాడు. ఆ మాటల్లోనే తెలుస్తూంది ఆమె అతడిని ప్రేమిస్తూందని.
"సాగర్ ఎందుకు చేసి వుంటాడు?" అని అడిగాడు.
"నాకు తెలియదు కానీ అతనికి తప్ప వేరెవరికీ ఆవకాశం లేదు. అది మాత్రం చెప్పగలను. తోటలో మరోవైపునించీ కాల్చే ఆవకాశం లేదు."
"మీరు చూసినప్పుడు పిస్టల్ సాగర్ చేతిలో వుందా ?"
"లేదు, క్రిందపడి వుంది."
ఇన్ స్పెక్టర్ లేచి పచార్లు చేస్తూ "గుండు వీపులోంచి దూసుకుపోయింది. కాబట్టి అది ఆత్మహత్య కాదు. ఇంతకీ మీ ఉద్దేశ్యం ఈ హత్య సాగరే చేసి ఉంటాడంటారా ?" అని అడిగాడు.
అప్పటికి ఆ అమ్మాయి కాస్త తేరుకుంది. "సాగర్ కాకపోతే నా అంత సంతోషించేవాళ్ళు యింకెవరూ వుండరు."
"సాగర్ కూ మీకూ ఎలాంటి పరిచయం ?"
"ప్రేమించుకున్నాం. అక్క పెళ్ళి తర్వాత మా పెళ్ళి కూడా త్వరలోనే జరుగుతుందనుకున్నాం. కానీ
ఇనస్పెక్టర్ - దీనికీ దానికీ సంబంధంలేదు. సోమశేఖరం చాలా మంచివాడు. అతడి హత్యకు నిజంగా సాగరే కారణమైతే, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి కూడా నేను సిద్ధమే."
"మీరు చూసేటప్పటికి శేఖరం క్రిందపడి కొట్టుకుంటున్నాడన్నారు, ఏమయినా మాట్లాడాడా ?"
"ఆ, అక్కయ్య అతని దగ్గరగా వెళ్ళింది. 'పద్మజా! ఐ లవ్ యూ! చచ్చిపోయినా ప్రేతమై నీ చుట్టే తిరుగుతుంటాను' అన్నాడు. అవే ఆఖరు మాటలు. వాటినే రెండుసార్లు రిపీట్ చేశాడు."
"సరే యిక మీరు వెళ్ళొచ్చు" అన్నాడు యినస్పెక్టర్ __ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని.
ఆ తర్వాత పద్మజతో సంభాషణ మొదలు పెట్టాడు ఇనస్పెక్టరు.
"మిస్ పద్మజా! మీ మనసు సరిగా లేదని తెలుసు. కానీ మిమ్మల్ని బాధపెట్టక తప్పడంలేదు."
"ఫర్వాలేదు. అడగండి" అంది పద్మజ.
సోమశేఖరం చావు ఆమెను ఉన్నట్లుంది కృంగదీసింది. పెళ్ళి గురించిన ఆలోచనలతో, ఊహలతో మరో లోకంలో తేలిపోతూన్న దాన్ని ఒక్కసారిగా అంతెత్తునుంచీ క్రిందకు తోసివేసినట్లుగా ఫీలవుతూంది. తనకు పెళ్ళి చేసుకోవాలని బుద్ది పుట్టడం, అంతలోనే తనింట్లోనే హత్య జరగడం ఏదో శాపంలా అనిపిస్తోంది.
"సోమశేఖరం వచ్చాక ఏం జరిగిందో చెప్తారా?" అడిగాడు ఇనస్పెక్టరు.
"ముందుగా సాగర్ వచ్చాడు. హిమజా తనూ మాట్లాడుకుంటుంటే నేను తోటలోకి వెళ్ళిపోయాను. కాస్సేపటికి శేఖరం వచ్చాడు తోటలోకి ఈ మధ్య ఊళ్ళోలేడు. ఆఫీసు పని మీద బాంబే వెళ్ళాడు. మనిషి చాలా దిగులుగా కనిపించాడు. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య ఆరోగ్యం సరిగాలేదు. దాని గురించే అలా ఉన్నాడేమోననుకున్నాను. కానీ అతడు ముందు నా పెళ్ళి గురించి అడిగాడు. పెళ్ళి నిశ్చయమైందని చెప్పాను. అతని ముఖంలో చాలా మార్పువచ్చింది. గిరిధర్ ని చేసుకొంటున్నారటగా' అన్నాడు. అవును అన్నాను. 'అతని గురించి నీకేమీ తెలియదుగా' అన్నాడు. అన్నీ తెలుసుకునే చేసుకుంటున్నానని సమాధానం చెప్పాను. అతను చాలా ఆందోళనగా కనిపించాడు. తనలో తనే ఏదో గొణుక్కున్నాడు. మనసు....వెల్లడించటం....లాంటి పదాలు వినిపించాయి. ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టు అనిపించింది. 'మీతో కాస్త సీరియస్ గా మాట్లాడాలి' అన్నాడు. 'సరే ముందు కాఫీ తీసుకొస్తా ఇక్కడే వుండండి' అని చెప్పి నేను లోపలకు వచ్చాను. కాసేపటికి పిస్టల్ పేల్చిన శబ్దం వినిపించింది. నేను పరుగెత్తుకు వెళ్ళాను. అప్పటికే అతను చివరి క్షణాల్లో ఉన్నాడు. సాగర్, హిమజ అక్కడే ఉన్నారు."
"మీ సిస్టర్ ఈ హత్య సాగర్ చేశాడేమో అంటోంది. మీ అభిప్రాయం ?"